‘ఆమె’ను  వస్తువు చేసిందెవరు?

-1-

ఇది ఇప్పటి మాట కాదు.

తొంభై ఐదు రెండువేలు సంవత్సరాల మధ్య 

అది ఎప్పుడైనా కావొచ్చు.

అలా, పాతికేళ్ల ప్రస్తానమిది…

ఉన్నట్టుండి, వొకరోజు  ధైర్యం తెచ్చుకుని, 

పళ్ళ బిగువన రోడ్డు మీదికొచ్చింది  

ఆ సైన్ బోర్డ్.

ఏముంది దాని మీద?

‘సినీ తారల మేనిమి ఛాయ కోసం…’

మా కంపెనీ స్కిన్ క్రీం వాడండి… 

అవుట్ డోర్ ప్రకటన!

దాన్ని పెట్టింది ఎక్కడ?

బెజవాడ బందరు రోడ్డు మీద ఉన్న 

సిద్దార్ధ మహిళా కళాశాల బస్ స్టాప్ ఎదురుగా!

ఉదయం తొమ్మిదప్పుడు లోపలికి 

సాయంత్రం నాలుగప్పుడు బయటికి 

వొక అల మాదిరిగా… తరంగాలుగా కాస్సేపు అక్కడ 

కౌమార దశ దాటిన ఆడపిల్లలు సీతాకోక చిలకల్లా  

బిలబిల మంటూ కదిలి… కనుమరుగవుతుంటారు.

రైతు కుటుంబాలు, మధ్యతరగతి ఉద్యోగుల 

ఆడ పిల్లలు కాలేజి చదువులు చదివే చోట 

పాతికేళ్ళ క్రితం 

సినీ తారల మేనిమి ఛాయ కోరుకునే 

ఆడ పిల్లలు ఎవరుంటారు?

ఆ ‘వైట్ స్కిన్’ పబ్లిసిటీ హోర్డింగ్ చూసినప్పుడు 

కలిగిన అనుమానమిది….

కొన్నాళ్ళకే మీ అనుమానం అదే కనుక ఐతే…  

మేము వాళ్ళను అందుకు ‘రెడీ’ చేస్తాం…

అంటూ ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చింది  

అదే రోడ్డులోకి ‘ఫ్యాషన్ డిజైన్ కాలేజ్’!

మీరు అక్కడ డిగ్రీ చదివాక ఇక్కడ చేరవచ్చు!!  

అంతే… 

తరుచూ సంస్థ ‘హెడ్’ ఇంటర్యులూ

సంస్థ కార్యకలాపాల ఫొటోలు 

ఆంగ్ల పత్రికల్లో రంగుల్లో ఉండేవి.

అలా వొకప్పటి రైతు నగరం బెజవాడ

 “పేజ్ త్రీ” వార్తల్లోకి చేరింది! 

-2-

అప్పడే నెమ్మదిగా అన్ని కాలేజీల్లో 

‘ఫ్రెషర్స్ డే’ ల్లో  

‘క్యాట్ వాక్’ లు మొదలయ్యాయి.

అవి జరిగిన మర్నాడు సిటీ ఎడిషన్లలో

‘అదరహో’ …’కేక’… ‘జయహో’… క్యాప్షన్లతో వార్తలు!

అయిందా… 

కాలేజి ఫ్రెషర్స్ డేలు, యానివర్సరీల్లో 

కల్చరల్ ఈవెంట్స్ 

సిటీ డ్యాన్స్ స్కూల్ మాస్టర్ల చేతుల్లోకి  

అవి ఎప్పుడు వెళ్లిందో… 

ఇప్పుడు ఎవరికీ గుర్తులేదు! 

‘లిరిక్కు’ దగ్గర్నుంచి ‘కోరియోగ్రఫీ’ వరకు 

అంతా వాళ్ళదే చాయిస్! 

అవి మన కళాశాలల స్టేజీల మీదికి 

ఎందుకు వచ్చింది?

జవాబు చెప్పడానికి ఇప్పుడు ఎవ్వరూ లేరు.

ప్రోగ్రాం జరుగుతూ ఉండగా…

“డ్యాన్స్… మన స్టూడెంట్స్ 

చక్కగా వేస్తున్నారు కదా…

“అవునుగానీ, ఆ పాట 

ఎలా ‘సెలక్ట్’ చేసారండీ?”

ఎవరో కాస్త సున్నితం తెలిసిన టీచర్స్ అడిగేవారు,

స్టేజి మీద దాన్ని చూస్తూ వింటూ … 

“అంతా ఈవెంట్ మేనేజర్ కు అప్పగించాముగా…”

స్టేజి ఇంచార్జిగా ఉన్న ఏ ఆటల మాష్ట్రారిదో జవాబు!

ఇలా… అంతా అప్పట్లోనే

 ‘బోర్న్ టఫ్’ కాకపోయినా –

అందరం క్రమంగా ‘సియట్’ టైర్లం’ అయిపోయాం! 

‘సెన్సార్’ వాళ్ళు కత్తిరించమన్న పాటల్లోని పదాలు, 

‘మ్యూట్’ లో ఉంచి, సినిమా తెర మీద ప్రదర్శిస్తే…

ఎటువంటి ‘కట్’ లేని అవే పాటలకు  

కళాశాల వేదికల మీద ‘కోరియోగ్రఫీ’ …

చాప క్రింద నీళ్ళలా 

అవి ప్రవహించుకుంటూ వచ్చి 

కాలేజి హల్లో 

డ్యాన్స్ రిహార్సిల్స్ జరిగినన్నాళ్ళు

పిల్లల పెదవుల మీద అది ఆరని తడి! అవునా…. 

మరి అప్పట్లో మన టీచర్స్ ది 

ప్రేక్షక పాత్ర ఎలా అయింది?!

కేంపస్ లో ‘ఈవెంట్’ మేనేజ్ చేసే వాడికి 

మనం ఇచ్చే డబ్బు ముఖ్యం కానీ…

అది కాలేజి డబ్బా? 

కాన్వెంట్ డబ్బా? 

అని రంగు తేడా ఎందుకు ఉంటుంది?!

ఏటా అందరి నోళ్ళలో నానే పాటలే 

స్టేజ్ కోసం ’కోరియోగ్రఫీ’ చేసి

‘డ్యాన్స్ మాస్టర్’ కాలేజీ స్టేజి పైకి తెస్తే…

సీజన్స్ ‘లేటెస్ట్ ట్రెండీ’ సాంగ్స్ అంటూ 

కాన్వెంట్ స్కూళ్ళ స్టేజి మీద అవే!

స్టేజి క్రింద పిల్లల పెదవుల పైన అవే…

‘పదహారేళ్ళకే నా మీద చేతులు వేస్తూ చుట్టూ కుర్రాళ్ళు’  

అంటూ ‘ఆమె’ వాపోతుంటే…

‘అలా వొద్దులే’ అని, 

ఆమెను వారించిన వారు లేరు. 

తన బిజినెస్ ప్రమోషన్ లో భాగంగా –

స్టేజ్ పక్కన ఉన్నవాళ్ళ చెవిలో జోరీగయ్యాడు…

డ్యాన్స్ మాస్టర్!

“సీ… బ్రో…ఈ ముమైత్ ఖాన్ 

గ్రూప్ డ్యాన్స్ ఐటం మా స్పెషల్ బ్రో…

చివరి దాకా మా షో చూసి వెళ్ళండి, 

లాస్ట్ లో ‘ఫీల్ గుడ్ ఐటం’ ఉంది, 

అది సూపర్!

 ‘కార్గిల్ వార్ సీన్’

దాని ఎండింగ్లో ఏ.ఆర్. రెహమాన్ 

వందేమాతరం …విత్ నేషనల్ ఫ్లాగ్”

అది మిస్సు కావొద్దు”

‘ఈవెంట్ మేనేజర్’ ను 

తమ కాలేజ్ ఫంక్షన్ కు బుక్ చేయడానికి 

వచ్చిన మరో కాలేజి స్టూడెంట్స్ తో…

డ్యాన్స్ మాస్టర్ 

తన ‘రెస్యుమే’ చెబుతున్నాడు…

 “ఈ ‘జబర్దస్త్’ టైప్ స్కిట్స్ కూడా మీరే చేయించారా?”

మరో కాలేజీ స్టూడెంట్స్ కుతూహలం  

“య్హ బ్రో …వాళ్ళు  ఫైనల్ ఎం.బి.ఏ. స్టూడెంట్స్” 

డ్యాన్స్ మాస్టర్ జవాబు

-3-

‘వో.ఆర్.ఆర్’ అనబడు 

‘అవుటర్ రింగ్ రోడ్’ 

అప్పట్లో మనకు అదొక జాతీయ వార్త! 

 ‘నగర శివారుల్లో తరుచూ బందిపోటు దొంగతనాలు’

‘సైబరాబాద్ ఫార్మ్ హవుజ్ లకు భద్రత కరువు’

‘ఉత్తరాది నేరస్త ముఠాలపై నిఘా కన్ను’

 ఇవీ కూడా కోస్తాకు ‘స్కిన్ క్రీం’ కాలంలో 

మనం చూసిన తెలుగు వార్తలే !

మన మధ్య తరగతి అప్పడే 

‘గేటెడ్ కమ్యూనిటీ’ కావడం మొదలయింది…

 అప్పటికి ఆ ఏరియాను ‘ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్’ అనలేదు.

క్రమంగా అక్కడ కాలనీలకు 

సెక్యురిటీ గార్డులు, విజిటర్స్ రిజిస్టర్లు, 

సి.సి. కెమెరాలు, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, 

వొకటి తర్వాత వొకటి వరసగా…

చిత్రంగా 

మనం కూడా అప్పట్లోనే  

‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’

‘వరల్డ్ సోషల్ ఫోరం’

అంటూ రెండుగా చీలాము!

‘మీరు ఎన్.జీ.వో.నా’ 

‘వో మేము కూడా…’ 

ఎవరు ఎవరికోసం పనిచేస్తున్నారో 

ఎవరికీ అర్ధమయ్యేది కాదు!

ఈ ‘కన్ఫ్యూజన్’ కు ‘హాబ్’  

హైదరాబాద్. 

అప్పటి ముఖ్యమంత్రి గెస్టులు

బిల్ క్లింటన్, బిల్ గేట్స్ 

 ‘సత్యం’ ఆన్ లైన్ అయింది అప్పుడే…

హైదరాబాద్ బయట వాళ్లకు

 అక్కడ… ఏదో జరిగిపోతున్నది, 

మనం దాన్ని ‘మిస్సు’ అవుతున్నామా?  

అప్పుడే 2004  ఫిబ్రవరిలో 

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడు 

క్లావ్ శ్వాబ్ హైదరాబాద్ లో –

 “మనం ఉన్నది చిన్నవాణ్ణి 

పెద్దవాడు మింగే ప్రపంచంలో కాదు’

అన్నాడు… 

అదేంటి అంటే!

“ ఇది నెమ్మదిగా మింగేవాణ్ణి  

వేగంగా మింగేవాడు ఉన్న ప్రపంచం ” 

అతడు కొత్త బాంబు బద్దలు కొట్టాడు!

మనకు ఏమి కావాలి అనేదానికంటే, 

మనకు ఏమి అక్కరలేదు, 

అర్ధం కావడం సమస్యయింది. 

పరుగు సరే, 

ఆగడం ఎక్కడ? 

ఎక్కువ మందికి 

అర్ధం కానిది అదే!

-4-

“ ఆ ఏజెన్సీ ఏరియాలో త్రీ వీక్స్ ఫీల్డ్ ట్రిప్ అంటే… 

వీళ్ళతో ఎలా నెట్టుకు రావాలి?”

యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్ లో ‘టెన్స్’ అవుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్

“ స్టూడెంట్స్ మధ్య ఉండే ‘రిలేషన్ షిప్స్’ నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. 

వాళ్ళకవి మామూలే… 

బయట నుంచి మన గాళ్స్ కు ఉండే 

‘త్రెట్’ వొక్కటే మనం చూసుకోవాల్సింది ” 

సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ హెచ్చరిక.

“డ్రెస్ కోడ్…” నసుగుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ 

“అదయ్యేది కాదులే గానీ…” 

“ అయినా వీళ్ళు క్యాంపస్ లో 

ఉన్నట్టు ఫీల్డ్ లో ఉంటే కుదరదు ” 

“ డ్రెస్ కోడ్ అంటున్నావ్ … 

అదొక ‘డిఫెన్స్ మెకానిజం’ అని, 

ముందు ఫ్యాకల్టీ మనం కన్విన్స్ అవ్వాలిగా? ” 

“అది వొప్పుకోవడానికి మనకే బోల్డు అభ్యంతరాలు, 

అయినా దాన్ని మనం హక్కుల్లో చేర్చాం కదా? ”   

“ చూడు…ఇప్పుడు మనం 

అంగీకరించిన ‘లెగ్గింగ్స్’ ఉన్నాయి, 

మీ ‘కంఫర్ట్’ మీరు చూసుకున్నారు. 

వేసుకున్నారు 

మరవి ఎవడికి ఎలా కనిపిస్తున్నాయో మనకు తెలిసేదెలా? 

రోజు నువ్వు వచ్చి పోయే దారిలో 

ఎవడు నిన్ను ఎలా ‘స్కాన్’ చేస్తున్నాడో నీ కెలా తెలిసేది? “  

“ నిజమే నడుం నుంచి క్రింది భాగం

ఇంతకు ముందు చీర లోపల ఉంటూ, 

బయటకు మొత్తం వొక్కటిగా కనిపించేది. 

‘లెగ్గింగ్స్’ వచ్చాక … 

మునుపటికి భిన్నంగా ‘లైన్’ గీసినట్టుగా కాళ్ళు   

రెండుగా కనిపించడం మనకు ‘వొకే’ అయింది “

“ ఏదీ నడుం నుంచి క్రిందికి 

పాదాలు దాకా టైట్ స్కిన్ కవర్ తో… వొకే… “

“ య్హా ”

“ చూడు, 

ఇప్పుడూ…

అది లీగలా ఇల్లీగలా అనేది వదిలెయ్, 

ఏదో ఈక్వేషన్ తో అవి నడుస్తుంటాయి…

ఎవడి ఏడుపు వాడిది 

వాటిని పట్టించుకునే స్టేజి దాటిపోయి మనకూ చానాళ్లు అయింది.

అది చాలదు అన్నట్టుగా…  

మళ్ళీ గ్యాలరీకి ఈ ‘బాడీ షోకేసింగ్ ’ ఎందుకు? “

“ ఇంటి చుట్టూ ఏడు ఆడుగుల ప్రహరీ గోడ కట్టి, 

దాని మీద ముళ్ళ తీగ… దానికి కరెంట్ పెట్టి, 

లోపల ఏముందో తొంగి చూడొద్దు అంటే, 

ఎవడైనా ఆగుతాడా?

అది కుదరదు!

లోపల ఏముందో… 

అనే కుతూహలం మానవ సహజాతం

అదొక ‘ఇనిస్టింక్ట్’.

చివరికి ఏమైంది?

 దాన్ని చూడ్డానికి గోడ దూకిన వాడు నీకు నేరస్తుడు

జీవితకాలమంతా ఆ గోడను 

చూస్తూ ఉన్నవాడు ఏమీ కాదు.  

-5-

చిత్రం…

‘2020 – జెనరేషన్’ కోసం 

మీరు ‘దొరసాని’ సినిమా తీస్తారు!

మిమ్మల్ని ఇంకా మేము

 ‘దొరసాని’ అనుకోవాలని 

మీకు అదొక దుగ్ధ. 

ఎక్కడో పై అంతస్తులో కిటికీ వద్ద 

గుండెల మీద చెంగు లేకుండా 

తత్తర చూపులతో – ‘ఆమె’

క్రింద ఎక్కడో ఆ కిటికీ వైపు 

దొంగ చూపులు చూస్తూ ‘వాడు’ 

మార్కెట్లో ‘ప్రోడక్టు’ పెట్టి 

దాని ఖరీదు అలా పెంచి, 

వినియోగదారున్ని 

ఎప్పుడూ దానికి అందనంత 

దూరంలోనే ఉంచాలి. 

ఆ ‘ఆట’ కు ఉండే కొలతలవి.  

ఇద్దర్లో ఎవరు అడుగు ముందుకేసినా,

పోయేది ‘వాడి’ ప్రాణమే!

చెరకు పొలాల మధ్య 

వొక మోటార్ ఇంజన్ ఉంది.

మనకు డబ్బు అవసరం వుంది.  

దరిదాపుల్లో ఎవ్వరూ లేరు 

ఉన్నది మనం ముగ్గురం  

అంతే, దాన్ని ఎక్కడికో తీసుకు వెళ్లాలి  

చిందర వందరగా దాన్ని విప్పాలి… 

అందులో ఉన్నది విలువైన రాగి తీగ

ముగ్గురికీ సమానంగా…. 

కాలం 2014  

స్థలం

కృష్ణా జిల్లా కంకిపాడు పరిసరాలు  

ఖరీఫ్ సీజన్ పొలం పన్లు అయిపోయాయి.

చెరకు తోటల్లో ఉండే యాభై పైగా మోటార్ ఇంజన్లు 

దొంగిలించ బడినట్టు పోలీస్ రికార్డ్!

శిధిలావస్థలో దొరికిన 

మోటారు శకలాలు

వీర్య పరీక్షల కోసం  

‘ఫోర్నిసిక్ ల్యాబ్’ బీకరులో

నిస్తేజంగా…  

‘ఆమె’ ను వస్తువు చేసిందెవరు?

జాన్సన్ చోరగుడి

జాన్సన్ చోరగుడి... ఆయన మాటల్లోనే చెప్పాలంటే గత మూడు దశాబ్దాలుగా తెలుగునాట ఏ గుంపు రంగు ‘ఐడెంటి’ అంటించుకోకుండా,  తన స్వంత స్వరంతో మాట్లాడుతూ కూడా... పాఠకుల గౌరవం పొందిన రచయిత. కృష్ణాజిల్లా, కోలవెన్నులో 1956 లో జన్మించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్ గా రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం విజయవాడలో నివాసం. 'సిటీ ప్రొఫైల్', 'మన విజయవాడ', 'స్వంత సంతకం', 'ఇండియన్ ఇంక్', 'చివరి చర్మ కారుడూ లేడు'-పుస్తకాలు ప్రచురించారు.                                 

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.