జగన్! నీ గమనమిలాగే కొనసాగనీ!

‘మూడు రాజధానులుంటే తప్పేంటి?’ అని శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన సంచలనమైంది. మిగతా అన్నీ పక్కనపెట్టి, తెలుగు దేశం, దాని బాకా మీడియా  ఈ వొక్క అంశాన్నే భుజాలకెత్తుకున్నాయి. స్థానిక సమస్య కూడా కాదు. ఒక స్థానికాంశాన్ని అదేదో దేశాన్ని ఊపేసే అంశమైనట్లు ప్రచారం కల్పిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షం, విద్యార్ధి సంఘాలు జరిపిన పోరాటానికి కూడా ఇంతటి ప్రచారాన్ని కల్పించని బాకా మీడియా ఇవాళ ఒక పది, పదిహేను గ్రామాల జనాల నిరసనను రాష్ట్రాన్ని అట్టుడికించే ఆందోళనగా ఎందుకు ప్రొజెక్టు చేస్తోంది? (ప్రతిపాదిత రాజధాని 29 గ్రామాల ప్రాంతంలో విస్తరించినదిగా చెప్పబడినప్పటికీ, ఆందోళన వ్యక్తమవుతున్నది మాత్రం కేవలం 9 లేదా 10 గ్రామాలలోనే అని వార్తలు). మిగిలిన పన్నెండున్నర జిల్లాల్లో వ్యతిరేకత వ్యక్తం కాని ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎందుకింత ఆందోళన? ఇంతా చేసి ప్రభుత్వం ఇంకా అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఒక ఫీలర్ వదిలారు. వ్యతిరేకత కొన్ని గ్రామాలకు పరిమితం కావడం వల్ల, ఇక అధికారిక ప్రకటనే తరువాయి కావచ్చు. 

అసలు అమరావతి నుండి రాజధానిని మార్చవలసిన ఆవశ్యకత ఉందా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. రాజధాని ఎంపిక, నిర్మాణంలో సహకరిస్తామన్న హామీతో రాష్ట్ర విభజన జరిపిన కేంద్రప్రభుత్వం – అందుకు తగినట్టుగా పదేళ్ళపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఇది కేవలం భావోద్వేగాలను తృప్తి పరచటం కోసం చేసింది కాదు. విడిపోయాక ఆర్థికలోటుతో ఉండే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రం రాజధానిని నిర్మించుకోవటానికి సమయం పడుతుందని భావించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అనేక అంశాలను పరిశీలించి ప్రాధమ్యాల క్రమంలో ఇచ్చిన వేటినీ కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అనుభవం, నైపుణ్యం లేని నారాయణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎవరి ప్రయోజనాల కోసమో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా హడావుడిగా ప్రకటించింది. దీనికి ఓటు కు నోటు ప్రధాన కారణం కాదనలేం. ఆ ఘటన జరిగిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన తరలింపు జరిగింది. అప్పటినుండి చంద్రబాబు ప్రపంచస్థాయి రాజధాని మాయలు మొదలయ్యాయి – ఐదేళ్ళపాటు జనాలను ప్రపంచస్థాయి భ్రమల్లో ఉంచి, అది పూర్తి కావాలంటే మళ్ళీ తానే రావాలని జనాలు అనుకోవాలని పన్నిన వ్యూహం వికటించింది. అమరావతి నిర్మాణం అన్నది స్థాయికి మించిన భారంగా పరిణమించింది.

ఇపుడు జగన్ ప్రభుత్వం అమరావతికి న్యాయం చేయాలని డిమాండ్ చేసేముందు చంద్రబాబు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి – అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఎందుకు గెజిట్ రిలీజ్ చెయ్యలేదు? వేలాది కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నప్పటికీ కేవలం కొన్ని తాత్కాలిక నిర్మాణాలు తప్పించి, నాలుగేళ్లలో కనీసం ఒక్కటైనా  పూర్తిస్థాయి నిర్మాణం ఎందుకు చేయలేకపోయారెందుకు? ప్రతిపక్షనేతకు అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు లేదు కాబట్టి స్థానికేతరుడు అంటూ హేళన చేసిన చంద్రబాబు ఐదేళ్ళ కాలంలో అమరావతి ప్రాంతంలో సొంతంగా తాను ఒక ఇంటిని ఎందుకు నిర్మించుకోలేకపోయారు? చంద్రబాబు గారి ఆర్భాటాల వల్ల ఇపుడు అమరావతి ఒక గుదిబండగా మారిందన్నది నిజం కాదా? అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడానికి ప్రధాన కారణం హైదరాబాద్ అని, గతంలో హైదరాబాద్ లో అభివృద్ధి కేంద్రీకరణ కారణమని తెలియదా? మళ్ళీ అదే తప్పు అమరావతి ద్వారా చేయబోవడం తప్పే కదా. ఇక మూడు రాజధానులు అన్నది కేవలం ఒక పద ప్రయోగమే కానీ – అడ్మినిస్ట్రేటివ్ లేదా ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ఏదైతే ఉంటుందో అదే రాజధానిగా చలామణి అవుతుందన్నది నిజం – అంటే ఇకమీదట వైజాగ్ రాజధాని. ఒక నగరంగా వైజాగ్ అభివృద్ధి చెందిన నగరమే అయినప్పటికీ, వైజాగ్ పరిసర ప్రాంతాలు అభివృద్ధికి దూరం అన్నది వాస్తవం. వైజాగ్ రాజధాని అయితే, చుట్టుపక్కల కనీసం ఒక 100 లేదా 50 కిలోమీటర్ల రేడియస్ లో ప్రభుత్వం ఖర్చు పెట్టనవసరం లేని అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అదే విధంగా కర్నూలు విషయంలో హై కోర్ట్ ఏర్పాటు అన్నది శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం ఎపుడో దశాబ్దాల క్రితమే చేయవలసిన పని. ఇన్నాళ్ళూ పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఆ అంశం ఇన్నాళ్ళకి ఒక కొలిక్కి వచ్చినట్టైంది. మూడు రాజధానులు అన్నది వాస్తంగా కేవలం ఒక పద ప్రయోగమే అయినప్పటికీ, దీనివల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుతుందని ప్రభుత్వం  ఒక ఆశ కల్పించింది. ఇక మీదట కూడా కీలకమైన ప్రాజెక్టులు, సంస్థలు కూడా ఒకే చోట కాకుండా, ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పడే విధంగా చర్యలు తీసుకుంటారనే భావన కలిగింది ఈ చర్య ద్వారా. ఒక రకంగా ప్రతిపక్షం, ఇతరులు కూడా సమర్థించక తప్పని నిర్ణయమయ్యింది. ఎక్కువగా విమర్శిస్తే ప్రతిపక్షాలు ఆ అర జిల్లాకు పరిమితమయ్యే ప్రమాదం ఉంది. 

మరొక ముఖ్యమైన అంశం – అమరావతి ప్రాంతం అంటే కేవలం ఒక కులమా? తెలిసి చేస్తున్నారో లేక తెలియక చేస్తున్నారో లేక ఇంకేం చెయ్యాలో అర్థం కాక చేస్తున్నారో కానీ తెదేపా వర్గాలు మరియు తెదేపా బాకాలైన మీడియా అమరావతి అంటే ‘కమ్మ రాజధాని’ అన్న భావనను వ్యాప్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తన ‘కొత్త పలుకు’ వ్యాసాలలోనూ, పత్రికా వార్తల్లోనూ అమరావతిని కేవలం కమ్మ కులానికి పరిమితం చేసే స్థాయిలో రాతలు రాస్తున్నారు. తద్వారా రాజధానిని అమరావతి ప్రాంతం నుండి తరలించడం కేవలం ఒక కులానికి నచ్చట్లేదు, అది వారికి మాత్రమే నష్టం అన్న భావన మిగతా పన్నెండున్నర జిల్లాల్లో కలిగేలా చేస్తున్నారు. అంతేకాక తనకు తాను జాతీయ స్థాయి నేతగా ప్రొజెక్టు చేసుకునే చంద్రబాబును ఒక కులనేత స్థాయికి పరిమితం చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుండి మార్చడమంటే భూముల విలువ పడిపోవటం ద్వారా రైతులు నష్టపోవడం మాత్రమేనా? మరింకేమీ లేదా? అసలు అమరావతినే రాజధానిగా ఎందుకు ఉంచాలి? అమరావతి రాజధాని కావడం వల్ల ప్రత్యేక లాభాలేంటి లేదా నష్టాలేంటి? ఈ విషయాలచెప్పడం లేదు? రైతులు నష్టపోతారని, కమ్మవారు నష్టపోతారని, చంద్రబాబు చేసిన/నిర్మించిన రాజధాని కాబట్టి మారుస్తున్నారని చేస్తున్న శుష్కవాదనలు ఎంతవరకూ నిలబడతాయి? తెదేపా, దాని బాకా మీడియా అమరావతి రాజధానిగా ఎందుకు మంచిదో సాంకేతిక, ఆర్ధిక కారణాల ద్వారా సహేతుకంగా వాదించడం లేదు.రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోణంలో చేసే ప్రచ్ఆరం వల్ల భవిష్యత్తులో మీడియాకు పెద్ద ఇబ్బంది ఉండదేమో కానీ, ప్రతిపక్షాలు అర జిల్లాకు పరిమితం అయ్యే అవకాశం వుంది. 

రాజధాని విషయంలో గత ప్రభుత్వపు తొందరపాటుతనాన్ని, తప్పులను, దుబారాను సరిచేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాజధానిని మూడు భాగాలు చెయ్యడం మంచి చర్య, అది మూడు ప్రాంతాలకూ ప్రాతినిధ్యం ఉండేలా ఉండటం ప్రజల భావోద్వేగాలకు విలువ ఇవ్వడమే అవుతుంది. ఖర్చులు ఒక్క అమరావతి నిర్మాణానికి అయ్యేదానికంటే ఇపుడు ఈ కమిటీ సూచనలను అమలు చెయ్యటానికి తక్కువే కావచ్చు. అధికారికంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని, కార్యాచరణ ప్రణాళికనూ ప్రకటించాక వీరు స్పందించి ఉంటే బావుండేది. మూడు రాజధానుల ప్రకటన ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది ఇంకా అమలులోకి రాలేదు, రాష్ట్రం సమగ్ర అభివృద్ధిని సాధించాలంటే ఇది ఒక్కటి సరిపోదు, రాబోవు రోజుల్లో మరిన్ని చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి ఫలాలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి. గత అయిదేళ్ళుగా దశా, దిశా లేకుండా సాగిన పాలన ఇపుడిపుడే దారిన పడుతోంది. సంక్షేమం,, సమగ్రాభివృద్ధి సమతూకంతో పాలన కొనసాగాలి.

వంశీ కలుగొట్ల

వృత్తి: సాఫ్ట్వేర్ ఇంజనీర్; వ్యావృత్తి: రచనలు, కవిత్వం; నివాసం: బెంగుళూరు; పుట్టిన ఊరు: గని, కర్నూలు జిల్లా; తల్లిదండ్రులు: కలుగోట్ల విజయాత్రేయ, విజయలక్ష్మి. రచయిత/కవిగా : బృందావన చరితం - విద్వత్ ఖని కథనం, భారతీయం, సుప్రసిద్ధ భారతీయ కళాకారులు, సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారులు, భారతీయం, భారతరత్నాలు, ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జి తదితర పది పుస్తకాలు (మొదటిది మినహా మిగతావి ఆదెళ్ళ శివకుమార్ గారితో కలిసి). ఇవి కాక జాగృతి మాసపత్రికలో సంవత్సరం పాటు అసోసియేట్ సబ్ ఎడిటర్ గా, శ్రీ దత్త ఉపాసన మాసపత్రికకు ఆరు నెలలపాటు సబ్ ఎడిటర్ గా పని చేశాను. దాదాపు 500 కవితలు; 120 కు పైగా రాజకీయ, సినీ, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాలు; 20 కి పైగా కథలు; రెండు బుర్రకథలు రాశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.