“క్రియా’శీలమైన పిల్లల పండుగ!

అది 2007. రాత్రి పది గంటలు. ఫ్రెండ్ శివతో కలిసి, వాళ్ళ డాబా మీద కూర్చొని  మాట్లాడుకుంటున్నాం. 

“ఆకాశంలో మనకు కనిపించే ఆ నక్షత్రాల కాంతి కొన్ని వందల సంవత్సరాల క్రితంది అయి ఉండొచ్చు. మనం చూసేది పాత దృశ్యం. ఇప్పుడు ఆ నక్షత్రం రంగు మారిపోయి ఉండొచ్చు. అంటే మనం భూతకాలాన్ని చూస్తున్నాం. అలాగే వేల సంవత్సరాల క్రితం దృశ్యాన్ని కూడా చూస్తూ ఉండొచ్చు”  అంటూ శివ ఏదో చెబుతున్నాడు. 

“అయితే పేద్ద సూపర్ టెలీస్కోప్ ఏదైనా డిజైన్ చేసి, కోట్ల సంవత్సరాల వెనక్కి చూస్తే, బిగ్ బ్యాంగ్ కనిపిస్తే బాగుణ్ణు” అన్నాను. మళ్లీ నాకే అనిపించింది. ఆ కాంతి ఇప్పటివరకూ ఇక్కడ ఉండదు కదా? అని. నా ఆలోచనను బ్రేక్ చేస్తూ శివ మొబైల్ మోగింది. కాసేపు మాట్లాడిన తరువాత “నా ఫ్రెండ్ రాంబాబు కూడా వస్తాడు ఓకే కదా?” అని ఫోన్ పెట్టేశాడు.

“ఎక్కడికి?” అని అడిగాను. “కాల్ చేసింది నాని. నాని అంటే జగన్నాథరాజు అని ఈ పక్క వీధిలో ఉండే ఫ్రెండ్. కాకినాడలో పదిమంది ఫ్రెండ్స్ కలిసి బైనాక్స్ లో నక్షత్రాల్ని చూసే ప్రోగ్రామ్ పెట్టుకున్నారట. వాళ్ళు రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నువ్వు కూడా వస్తావ్ అని చెప్పాను. వెళదాం పద” అన్నాడు. “మన ఊర్లో ఇలాంటి హాబీస్ ఉన్నవాళ్ళు ఉన్నారా?” అని అడిగా. ఇవే కాదు, ఈ జగన్నాధరాజు, మా జగన్నాథం మాస్టారు ఇద్దరూ కలిసి,  దేశంలో చాలా ఊళ్ళు తిరిగి వచ్చేసారు. ఎప్పుడూ ఏదో ఒక టూర్ కి వెళుతూ ఉంటారు. బుక్స్ కూడా చాలా చదువుతారు.” అన్నాడు. తిమ్మాపురంలో, నేను పెరిగిన ఈ చిన్న గ్రామంలో ఇలాంటి అభిరుచులున్న మనుషులు కూడా ఉన్నారా అని మనసులోనే అనుకున్నాను.

సర్పవరం జంక్షన్ నుంచి కుడి వైపు తిరిగి రెండు కిలోమీటర్లు దాటాక అప్పుడే కొత్తగా కడుతున్న ఒక ఆరంతస్తుల అపార్ట్మెంట్ ముందు బైక్ పార్క్ చేసి, పైకి ఎక్కాం. ఆరంతస్తుల పైన ఓపెన్ టెర్రస్ మీద  అప్పటికే వాళ్ళంతా చేరుకున్నారు. నాని వచ్చి పలకరించాడు. ఆరడగుల పొడవున్న చిన్న పిల్లాడిలా ఉన్నాడు. ఫ్రెండ్లీ గై. రెండు నిమిషాల్లో ఎప్పటి నుండో పరిచయం ఉన్నవాళ్ళలా మాట్లాడుకున్నాం. ఒకరు లాప్టాప్ లో చూస్తూ ఎక్కడ ఏ గ్రహం ఉంటుందో, ఎక్కడ ఏ constellation ఉంటుందో చూసి చెబుతున్నారు. బైనాక్స్ లో ఇద్దరు చూస్తూ ఉన్నారు. ఆ ఏరియా ఇంకా డెవలప్ అవ్వకపోవడం వల్ల, లైట్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది కాబట్టి నక్షత్రాలు బాగా కనిపిస్తాయని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసాం అని చెప్పారు. 

బైనాక్స్ తీసుకొని చూస్తే, నేను రోజూ చూసే ఆకాశంలో ఇన్ని చుక్కలు ఉంటాయా? అనిపించింది. వీటిలో వందో వంతు కూడా రోజూ కనిపించవేమో. ఆ రాత్రి నక్షత్రాలను చూసిన అనుభవం ఇప్పటికీ మరచిపోలేను. పిల్లల కోడి అని ఒక నక్షత్రాల గుంపును చూపించారు. బైనాక్స్ ఎవ్వరికీ ఇవ్వాలి అనిపించలేదు. అద్భుతమైన ఫీలింగ్. పాతకాలంలో అవన్నీ నేరుగా కనిపించేవట. అలా రెండు గంటలపాటు చూస్తూనే ఉన్నాం. వెళ్లిపోవడానికి కిందకు దిగుతుండగా “జగన్నాథం మాస్టారు మీటింగ్ ఉందన్నారు. ఉందామా వెళ్ళిపోదామా?” అడిగాడు శివ. 

“మీటింగ్ దేని గురించి?” 

“జగన్నాథం మాస్టారు, నాని ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కలిసి, చుట్టుపక్కల ఊళ్లలో స్కూల్స్ కి వెళ్లి బొమ్మలు వేయడం, కథలు రాయడం, సైన్స్ ప్రయోగాలు చేయడం మొదలైన వాటిల్లో పోటీలు పెట్టి బహుమతులు ఇస్తూ ఉంటారు”

“ఈ కాన్సెప్ట్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది” అని మీటింగ్ కోసం రౌండ్ షేప్ లో వేసిన కుర్చీల్లో కూర్చున్నాం.

ఆయనే మా జగన్నాథం మాస్టర్ అని ఒక వ్యక్తి ని చూపించాడు. మాస్టారు అనగానే చాలా పెద్దగా ఊహించుకున్నాను. మాకంటే ఆరు లేదా ఏడు సంవత్సరాలు పెద్ద వాడై ఉండొచ్చు.  అందరూ కూర్చున్న తర్వాత, కొత్తగా వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని పరిచయం చేయడం మొదలుపెట్టాడు. నా వైపు చూసి,మీ పేరు, ఏం చేస్తుంటారు చెప్పండి అని అడిగాడు. నాగార్జున ఫెర్టిలైజర్స్ లో DCS ఆపరేటర్ అని చెప్పాను.  

“కొత్త వాళ్ళ కోసం, ఇప్పటివరకు మనం ఏం చేసామో ఒకసారి చెప్పేసి ఈ రోజు టాపిక్  లో కి వెళ్దాం. ఏడేళ్ల క్రితం రకరకాల ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయిన మిత్రులంతా కలిసి, మేం చదివిన  స్కూల్ కి ఏదైనా చేద్దాం అనుకున్నాం. స్కూల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్లకి బహుమతులు ఇద్దాం అని ఒకరు సలహా ఇచ్చారు. కానీ మనం ఏమిచ్చినా ఇవ్వకపోయినా టాప్ ర్యాంకర్స్ ఎలాగూ చదువుతారు. సో  అది వేస్ట్. బడిలో ఎక్కువ మంది పిల్లలకు ఉపయోగపడేలా, వెనుకబడిన పిల్లలు కూడా పాల్గొనేలా ఏవైనా చేద్దాం అనుకొన్నాం. చిన్నచిన్న లెక్కలు, ఇంగ్లీష్ స్పెల్లింగులతో పాటు, బొమ్మలు గీయడం, కథలు రాయడం, మట్టితో బొమ్మలు చేయడం వంటి వాటిలో పోటీలు పెట్టడం మొదలు పెట్టాము.  ప్రతి స్టూడెంట్ ఉత్సాహంగా పాల్గొనేవారు. స్కూల్ అంతా బోలెడంత సందడిగా ఉండేది. స్కూల్ స్టాండర్డ్ ఎలా ఉందో పిల్లల వల్ల మాకు తెలిసేది. మాకు తెలుస్తుంది కాబట్టి టీచర్లు ఇంకాస్త శ్రద్ధ తీసుకునేవారు. తర్వాత ఇంకా ఏం చేయాలి ఆలోచించాం. ” 

“ప్రతి స్కూలుకి  సర్వ శిక్ష అభియాన్ లైబ్రరీ ఇస్తుంది. ప్రతి స్కూల్లో ల్యాబ్ కూడా ఉంటుంది. కానీ పుస్తకాలు చిరిగిపోతాయని, లైబ్రరీ బీరువాలకు తాళం వేసి ఉంచుతున్నారు. అందుకని  స్కూల్లో ఉన్న లైబ్రరీ పుస్తకాల నుంచి వ్యాసం రాయాలని, వాటినుంచి ప్రసంగం(ఎలక్యూషన్) చెప్పాలని పోటీలు నిర్వహించాం. ఈ పోటీల కోసం పుస్తకాలు అడగడం మొదలు పెట్టారు. లైబ్రరీ తాళాలు తెరుచుకున్నాయి. పుస్తకాలు చదవడం ఒకసారి అలవాటు అయిన తర్వాత, పిల్లలు లైబ్రరీ వాడుతూనే ఉన్నారు. అలాగే సైన్స్ ప్రయోగాలు మీద ఒక పోటీ పెట్టాం. అప్పటివరకు బ్యూరెట్ పగిలిపోతుంది, పిపెట్ విరిగిపోతుంది అనుకుంటూ భద్రంగా దాచిన లాబ్ ఎక్విప్మెంట్ అంతా బయటకు వచ్చింది. పిల్లల ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. 

“ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించాం. ఊరి మ్యాప్ గీసుకు రండి అని కాంపిటేషన్ పెట్టాం. పిల్లలంతా ఊరంతా తిరుగుతూ ఎక్కడ బడి ఉంది, ఎక్కడ గుడి ఉంది, ఎక్కడ పంచాయతీ ఆఫీస్ ఉంది, ఎక్కడ చెరువు, కాలువ, పొలాలు ఉన్నాయి. ఎక్కడ దళితవాడ ఉంది. ఇవన్నీ చూడటం మొదలుపెట్టారు. అప్పటివరకు స్కూల్ నుండి ఇంటికి, ఇంటి నుండి స్కూల్ కి, లేదా వాళ్ళ బంధువుల ఇంటికి మాత్రమే వెళ్లే పిల్లలకు ఊరు ఎలా ఉందో తెలిసింది. భౌగోళిక అమరికతో పాటు, ఊర్లో ఉన్న సాంఘిక అసమానతలు కూడా తెలిసాయి. ఊరితో మరింత పరిచయం పెరిగింది.”

“మేము పెట్టిన పోటీల గురించి తెలుసుకున్న ఇతర గ్రామాల్లో టీచర్స్ గా చేస్తున్న ఫ్రెండ్స్ మా స్కూల్లో కూడా ఈ పోటీలు పెట్టండి అని అడిగారు. అలా ఇతర గ్రామాలకు కూడా పాకింది. సంవత్సరాలు గడిచే కొలదీ పోటీలు పెరిగాయి. ప్రాజెక్ట్ వర్క్, నాటికలు వేయడం, పాటలు పాడటం, స్టాంప్స్ మరియు నాణాల సేకరణ వంటివి చేర్చాము. ఎలిమెంటరీ స్కూల్ కయితే మూడు వేలు, హై స్కూల్ కి ఐదు వేలతో పిల్లలందరూ పాల్గొనే ప్రోగ్రామ్ మెల్లిగా తయారైంది.”

“ఇక ఈరోజు మీటింగ్ విషయానికి వద్దాం. ఇప్పటివరకు చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని స్కూల్స్ మాత్రమే చేశాం. తక్కువ స్కూల్స్ కాబట్టి మన ఫ్రెండ్స్ వేసుకున్న డబ్బులు సరిపోయాయి. ముందు ముందు ఎక్కువ స్కూల్స్ చేయాల్సి వస్తుంది. మనం వేసుకునే డబ్బులు సరిపోవు. డబ్బుల కారణంగా ఇంత మంచి కార్యక్రమాన్ని  కొన్ని స్కూల్ కి మాత్రమే పరిమితం చేయడం సరైంది కాదు. మంచి పని చేస్తామంటే ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్ గా మా ఆఫీస్ లో ఒక అటెండర్ కి ఆపరేషన్ కోసం లక్ష రూపాయలు అవసరమైతే, ఫోన్ల ద్వారా మాట్లాడుకుని ఒక్క రోజులో పోగు చేయగలిగాం. కాబట్టి మన మాటల్లో, చేతల్లో నిజాయితీ ఉన్నంతవరకూ, చేసే పని వల్ల సమాజానికి ప్రయోజనం ఉంటే, డొనేషన్ సంపాదించడం పెద్ద విషయం కాదు. కాకపోతే ఇలా వ్యక్తులుగా అడిగితే పరిచయం లేనివారికి మనం ఆ డబ్బులు ఏం చేస్తామో నమ్మకం ఏమిటి?  అందుకే ఒక NGO గా రిజిస్ట్రేషన్ చేయిద్దాం. ఎప్పటిలాగే మన సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకుని మన బైక్ మీద వెళుతూ కార్యక్రమాలు చేద్దాం. డోనర్ నుండి వచ్చిన ప్రతి పైసా పిల్లలకే ఉపయోగిద్దాం. ఖర్చులన్నీ ఎప్పటికప్పుడు స్పష్టంగా ఆడిట్ చేయించి, ఆన్లైన్ లో పెట్టేద్దాం. కార్యక్రమాలను చూడటానికి డోనర్స్ ని కూడా ఆహ్వానిద్దాం. రాలేకపోతే ఏం చేశామో ఫోటోలతో సహా వివరాలు పంపుదాం.”

“ఎడ్యుకేషన్ బాగు అవ్వాలంటే ఏం చేయాలి అనే థియరీలు పుస్తకాల్లో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం చేయాల్సింది ప్రసంగాలు ఇవ్వడం కాదు. పని చెయ్యడం. అందుకే దాన్ని సూచించేలా, మన సంస్థకు క్రియ అనే పేరు పెడుతున్నాం” అని ముగించాడు. 

మళ్లీ ఏదో గుర్తొచ్చినట్టుంది “ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కార్పస్ ఫండ్ పేరుతో మూలధనాన్ని నిల్వ ఉంచితే, ఆ డబ్బుల్ని ఎలా వాడుకోవాలి? ఎవరు వాడుకోవాలి? ఎవరికి ఇవ్వాలి? ఇలాంటివన్నీ ఆలోచిస్తూ సంస్థలో రాజకీయాలు మొదలవుతాయి. చాలా NGOs దీనివల్ల ఫెయిల్ అవుతున్నాయి. అందుకే, ఒక సంవత్సరంలో ఎంత అమౌంట్ కలెక్ట్ అవుతుందో, ఆ మొత్తాన్ని అదే సంవత్సరం పిల్లల కోసం వాడేద్దాం. ఇక్కడ పేరుకి ప్రెసిడెంట్, సెక్రెటరీ అని పెట్టుకున్నా అందరూ సమానమే. ఎవరు నిర్వహించగలిగిన బాధ్యతలు వారు నిర్వహిస్తారు. పిల్లల గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి, ఎవరు వస్తే వాళ్ళంతా ఎవరైనా సభ్యులు అవుతారు. నేను చెప్పడం అయిపోయింది. డౌట్స్ ఉంటే అడగండి. 

“మీరు చెబుతున్న క్రియ పిల్లల పండుగ చూడటానికి నేను వస్తాను. నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుంది?”అని అడిగాను. 

జగన్నాధం పక్కనే కూర్చున్న నాని “పది రోజుల తరువాత రాయవరం స్కూల్లో ఉంది. నిన్ననే ఆ స్కూల్ కి వెళ్లి, పోటీల గురించి పిల్లలకు వివరించి, ప్రిపేర్ అయి ఉండమని చెప్పాం. పదిరోజుల తరువాత వస్తాం అని చెప్పి వచ్చాం” అని సమాధానం ఇచ్చాడు. మీటింగ్ అయిపోయింది. 

పది రోజుల తరువాత ఉదయాన్నే రాయవరం స్కూల్ కి వెళ్ళాను. పిల్లలు అట్టలతో తయారు చేసిన ఇళ్ళు, వాటర్ ట్యాంక్, డ్యామ్, పువ్వులు, బొమ్మలు, క్రేన్లు, ఏవేవో పట్టుకొని వస్తున్నారు. అక్కడో పండగ వాతావరణం ఉంది. పిల్లలు అందరి ముఖాల్లో నవ్వు,  బోలెడంత ఉత్సాహం తెలుస్తున్నాయి. ఉదయం అంతా రాత పరీక్షలు, కథలు చెప్పడం, బొమ్మలు గీయడం జరిగాయి. మధ్యాహ్నం నేను సైన్స్ ఎక్స్పరిమెంట్స్, ప్రాజెక్ట్ వర్క్స్ చూశాను. ఒక స్టూడెంట్ పాత సిరంజీలు, సన్నని ప్లాస్టిక్ ట్యూబ్స్ తీసుకొని, హైడ్రాలిక్ టెక్నిక్ ఉపయోగించి క్రేన్ తయారుచేసాడు. It’s a working model. ఆపరేట్ చేసి చూపించాడు కూడా. తీరా చూస్తే, ఆ అబ్బాయి లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్. ఈ పిల్లలపండగ జరగకపోతే కనుక, ఆ అబ్బాయికి అంత టాలెంట్ ఉందని టీచర్స్ కి తెలిసేదే కాదు. 

సాయంత్రం అయ్యేసరికి వాతావరణం అంతా కలర్ఫుల్ గా మారిపోయింది. అందరూ పౌడర్లు అద్దుకొని, రంగు రంగుల బట్టలు వేసుకొని నాటికలు వేయడానికి రెడీ అయిపోయారు. కొందరు శాస్త్రీయ, జానపద పాటలకు డాన్స్ చేసారు. పండగ పీక్ కి చేరుకొంది. అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. ఉత్సాహంగా చప్పట్లు కొడుతున్నారు. తరువాత బహుమతి ప్రధానోత్సవం. ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో బహుమతి వస్తూనే ఉంది. పెన్నో, పెన్సిలో, ఏది అందుకున్నా నోబెల్ బహుమతి తీసుకున్న ఉత్సాహం ఒకొక్కరిలో. పిల్లలకు, టీచర్లకు, నిర్వాహకులకు, అందరికీ ఆ రోజు పండుగలా గడిచిపోయింది. 

ఇలా రెండు మూడు స్కూల్స్ చూసాక, ఈ విషయాన్ని, నాగార్జున ఫెర్టిలైజర్స్ లో తోటి ఉద్యోగులకు కథలు కథలుగా చెప్పాను. ఒకొక్కరు క్రియ పిల్లల పండుగ నిర్వహణకు వాలంటీర్లుగా రావడం మొదలు పెట్టారు. నెల రోజులు గడిచేసరికి నాగార్జున ఫెర్టిలైజర్స్ లో ఎవరు క్రియ పిల్లల పండుగకు వెళుతున్నారో చూసుకొని, దాని ప్రకారం షిఫ్ట్ డ్యూటీలు అడ్జస్ట్ చేసేవారు. 

తర్వాత కొత్తగూడెంలో బాలోత్సవం జరుగుతుందని తెలిసి, క్రియ టీమ్ తో పాటు అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఇవే కార్యక్రమాలు. కాకపోతే చాలా భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదా కలిపి పదివేల మంది పిల్లలు పాల్గొన్నారు.  మూడు సంవత్సరాలు చూసిన తర్వాత మనం కాకినాడలో ఎందుకు చేయకూడదు అని ఎవరో అన్నారు. కొత్తగూడెం క్లబ్ దగ్గర రెడీగా వసతులు, ఆర్థిక వనరులు ఉన్నాయి. అదే 20 ఏళ్లుగా చేస్తున్నారు కాబట్టి వాళ్లకు కుదిరింది కాబట్టి చేస్తున్నారు. కానీ అంత ఖర్చు, అన్ని వసతులు మనం సమకూర్చగలమా? అనే డౌట్ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ఒక్కటే చేద్దాం అనుకున్నారు. అయినా కూడా సుమారు 4 లక్షలు డోనేషన్ పోగు చేయడం సాధ్యమైన పనేనా? అనుకున్నారు. ఏదైతే అదే అయింది. ఒకేసారి ట్రై చేద్దాం. ఒక వేళ డోనేషన్ కలెక్ట్ అవ్వకపోతే, పదివేలో, ఇరవై వేలో సర్దుతాం అని ఎంతమంది ప్రామిస్ చేస్తారు అని అడిగితే, ఇరవైమంది ముందుకు వచ్చారు. చేతిలోకి డబ్బులు రాకపోయినా సుమారుగా మూడు లక్షలకు ప్రామిస్ లు వచ్చేసాయి. డిబేట్, spell bee వంటి కొత్త పోటీలు చేర్చి మొత్తం 20 అంశాలతో బ్రోషర్ తయారు చేసి, తూర్పుగోదావరి మొత్తం పంచి పెట్టారు. ప్రవేశ రుసుము లేకుండా, పిల్లలతో పాటు, పేరెంట్స్ & టీచర్స్ కి ఉచితంగా టిఫిన్ మరియు భోజన సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. మూడు వేల మంది పిల్లలు వస్తే సక్సస్ అనుకున్నారు. అలా 2013 సంవత్సరం కాకినాడ PR కాలేజీలో నిర్వహించిన మొదటి జిల్లాస్థాయి పిల్లల పండుగకి దాదాపు 5వేల మంది పిల్లలు వచ్చి, పెద్ద పండుగ చేశారు. 

రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రస్థాయిలో నిర్వహించారు. ఎక్కువ స్పేస్ అవసరమయ్యి JNTU కేంపస్ లోకి మార్చడం జరిగింది. పిల్లల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఐదు వేల నుండి ఏడు వేలు, తర్వాత పదివేలు. ప్రస్తుతం 15 వేల మంది పిల్లలు వస్తున్నారు. 

క్రియా పిల్లల పండుగలో నాకు బాగా నచ్చే విషయం ఏమిటంటే, ఇక్కడ పెద్దవాళ్ళ స్పీచ్ లు ఉండవు. భారీ డైలాగులతో కూడిన ప్రసంగాలు ఉండవు. చీఫ్ గెస్టులు ఎవరు వచ్చినా, పిల్లల టేలెంట్ చూసి మెచ్చుకొని ఎంకరేజ్ చేస్తారు. బహుమతులు ఇచ్చి పిల్లలతో ఫోటోలు దిగుతారు. 

ఇక్కడ పిల్లలే కేంద్రంగా, పిల్లలే పండగ చేసుకుంటూ, ఆడటం, పాడటం, నేర్చుకోవడం, బహుమతులు తీసుకోవడం తప్పించి, పిల్లలకు బరువు అనిపించే ఏ పనీ జరగదు.  

క్రియ సభ్యులు ఎవరికి అప్పజెప్పిన పనిని వాళ్ళు own చేసుకొని చేస్తారు.  మమ్మల్ని పొగడాలి, గుర్తించాలి అనే మాట ఉండదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎవరినీ స్టేజ్ ఎక్కించి ప్రశంసించింది లేదు. నచ్చిన టాస్క్ తీసుకొని, ఆ పనిని ఇష్టపడి ప్రేమతో చేస్తారు. విదేశాల్లో పని చేస్తున్న సభ్యులైతే, క్రియ పండుగ కోసమే ప్లాన్ చేసుకొని లీవ్ పెట్టి వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తారు. పిల్లల పండుగకు ముందు రెండు రోజులైతే, నిద్రపోవడానికి రెండు గంటలు కూడా కేటాయించలేనంత పని ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా ఆర్గనైజర్స్ మధ్య మనస్పర్థలు రాలేదు. ఎందుకంటే, సంస్థలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేదే లేదు. అందరినీ కలిపే ఒకే ఒక తాడు పిల్లల మీద ఉన్న ప్రేమ. 

నిజానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రతీ జిల్లాలో, ప్రతీ మండలంలో జరగాలి. 15 వేల మంది పిల్లలు అంటే ఒక్కో జిల్లా నుంచి వెయ్యి మంది కూడా కానట్టే కదా! ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన నో బ్యాగ్ డే ని ఈ కార్యక్రమానికి కేటాయిస్తే, పిల్లలందరి దగ్గరకూ ఈ పిల్లలపండుగ చేరుతుంది. పిల్లల పూర్తి స్థాయి వికాసానికి వీలు కలుగుతుంది .

(ఈ సంవత్సరం ఫిబ్రవరి 29 మార్చి 1వ తేదీలో పదిహేను వేల మంది పిల్లలు పాల్గొనే క్రియా పిల్లల పండుగ, కాకినాడ JNTU క్యాంపస్లో జరుగుతున్న సందర్భంగా. 

వివరాలకు : http://kriyaonline.org/ )

రాంబాబు తోట

6 comments

  • చాలా నచ్చింది, ‘క్రియ’ గురించి ఎవరికైనా చెప్పాలనుకున్న వాళ్లం – ఈ ఆర్టికల్ ని share చేస్తే చాలు, దాని స్పిరిట్, గోల్, పనితీరు, విశిష్టత అన్నీ కవర్ అయ్యాయి

  • రాము గారు చాలా మంచి స్వచ్చంద సంస్థ ను పరిచయం చేశారు 👍🙏. దీనిలో మేము పాల్గొనాలని అనుకుకుంటున్నాము. మేము హైదరాబాద్ లో రామంతాపూర్ లో ఉంటాము.

  • చాలా బాగా వ్రాసారు…క్రియ ఉద్దేశం,పనితీరును చక్క గా వివరించారు..అభినందనలు

  • Thank you. ఈసారి పిల్లల పండుగకు వచ్చిన తరువాత మీరు కూడా విమర్శనాత్మక విశ్లేషణ రాయండి.

  • ఎవ్వరైనా వచ్చి పిల్లల పండుగ చూడవచ్చు. అందరకీ ఆహ్వానం ఉంది.వచ్చి చూస్తే, ఇటువంటి పండుగ, మీకు తెలిసిన స్కూల్స్ లో ఎలా చేయాలో ఒక అవగాహన వస్తుంది

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.