టోరీ బ్రిటన్ వాస్తవాన్ని చిత్రించిన
కెన్ లోచ్ సినిమాలు

“నా పేరు డేనియల్ బ్లేక్. నేను మనిషిని, కుక్కను కాదు. అందుకే, నేను నా హక్కులను అడుగుతున్నాను. మీరు నన్ను గౌరవంగా చూడాలని కోరుతున్నాను. నేను, డేనియల్ బ్లేక్ ను, ఒక పౌరుడిని, అంతకన్నా ఎక్కువ గానీ, తక్కువ గానీ కాను.’’

సుప్రసిద్ధ బ్రిటన్ దర్శకుడు కెన్ లోచ్ 2016 సినిమా ‘ఐ, డేనియల్ బ్లేక్’ లోని చివరి మాటలివి. గుండెపోటు వలన ఉద్యోగం, సాంఘిక భద్రత కోల్పోయిన ఒక శ్రమజీవి తన ఆత్మగౌరవం కోసం చేసిన అర్తనాదమది.

బ్రిటన్ దర్శకుడు కెన్ లోచ్:

రాజకీయ చలనచిత్ర నిర్మాతల్లో అరుదైన తెగకు చెందిన వాడు కెన్ లోచ్. ఇరవయ్యేళ్ళు లేబర్ పార్టీ సాహచర్యంలో గడిపినవాడు. గని కార్మికుల, పారిశ్రామిక కూలీల ట్రేడ్ యూనియన్లలో కలిసి తిరిగినవాడు. అతని సినిమాలు అతడి రాజకీయ క్రియాశీలతకు పొడిగింపే. సుమారు ఐదు దశాబ్దాలుగా బ్రిటిషు కార్మికుల కడగండ్లను కథావస్తువులుగా తీసుకుని మార్క్సిస్ట్ దృక్కోణంలో హృద్యంగా సినిమాలు తీశాడు. మన తెలుగు మెలోడ్రామా ఎరుపు సినిమాల్లా కాకుండా కార్మికుల కష్టాలను లోతైన సానుభూతితో చిత్రించి, వారి బాధలను ప్రేక్షకులు పంచుకునేలా చేస్తాడు. ‘కేథీ కం హోం’, ‘పూర్ కౌ’, ‘ది విండ్ దట్ షేక్స్ ది బార్లీ’ లాంటి ఎన్నో సినిమాలు తీశాడు. అతని ఇటీవలి సినిమాలు – ‘ఐ, డేనియల్ బ్లేక్’ (2016), ‘సారీ వుయ్ మిస్డ్ యు’ (2019) –  బ్రిటన్లో ఆస్టరిటీ చర్యలు మొదలైన తర్వాతి కాలపు కార్మికవర్గ పరిస్థితులకు అద్దం పడతాయి.

ఈ సినిమాల నేపథ్యం:

పెట్టుబడిదారి వ్యవస్థ తన సంక్షేమ రాజ్య ముసుగు ఎంతో కాలం ధరించలేదు. 2008లో యూరోప్ ను గడగడ లాడించిన గ్రేట్ డిప్రెషన్ తర్వాత బ్రిటన్లో ఆస్టరిటీ చర్యలు (మితవ్యయ చర్యలు) మొదలయ్యాయి. ప్రజలపై పన్నులు పెంచేస్తూ, పబ్లిక్ స్పెండింగ్, సోషల్ సెక్యూరిటీ నిధులపై భారీగా కోతలు విధించారు. 2010-2019 మధ్య కాలంలో ౩౦ బిలియన్ పౌండ్ల సంక్షేమ పథకాల నిధుల్ని ఉపసంహరించారు. వాటి ప్రభావాలు బ్రిటన్ కార్మిక వర్గంపై భయంకరంగా కనిపించాయి. ఎందరో గృహచ్యుతులయ్యారు, వ్యభిచారం పెరిగింది. ఆకలిబాధ తట్టుకోలేక పోతున్న వారికోసం స్వచ్చంద సంస్థలు నడిపే ఫుడ్ బ్యాంకులపై ఆశ్రితులు పెరిగారు. భీమా పథకాలు, పెన్షన్ చెల్లింపులు ప్రభావిత మయ్యాయి. ఈ నేపథ్యంలోనే పై రెండు సినిమాల్ని అర్ధం చేసుకోవచ్చు.

సంక్షేమ వ్యవస్థపై సెటైర్ ‘ఐ, డేనియల్ బ్లేక్’ (2016):

బ్రిటన్లోని న్యూకాజిల్‌ నగరంలో ఒక విడోవర్ డేనియల్ బ్లేక్ (డేవ్ జాన్స్). వయసు 59. కార్పెంటర్ గా పనిచేసేవాడు.  గుండెపోటు వచ్చి ఉద్యోగం పోయింది. అతని కార్డియాలజిస్ట్ అతన్ని పనిలో చేరొచ్చని అనుమతించలేదు. కానీ వర్క్ కేపబిలిటి అసెస్మెంట్ (పని సామర్థ్యాన్ని అంచనా వేసే) విభాగం వారి రిపోర్టు మరోలా వుంది. అందుకని అతడికి ఎంప్లాయిమెంట్ అండ్ సపోర్ట్ అల్లోవన్సు (ఈ ఎస్ ఏ) (ఉపాధి, మద్దతు) భత్యానికి అర్హత దొరకలేదు. తన డాక్టర్ ను సంప్రదించకుండానే ఇలా చేశారని అతడికి విసుగు, కోపం పెరుగుతుంది. ఆర్జీల మీద అర్జీలు పంపుతాడు. కంప్యూటర్ విషయంలో అతడు నిరక్షరాస్యుడు. అంచేత ఆన్‌లైన్ ఫారమ్‌లను పూర్తి చేయడం అతనికి కష్టంగా వుంటుంది.

డేనియల్ కు కేటీ (హేలీ స్క్వేర్స్) తో స్నేహం కుదురుతుంది. కేటీ ఇద్దరు పిల్లలున్న సింగల్ మదర్. లండన్ హోంలెస్ షెల్టర్ నుండి ఉద్యోగం కోసం న్యూకాజిల్‌కు వస్తుంది. జాబ్ సెంటర్ అపాయింట్‌మెంట్ కోసం కాస్త ఆలస్యంగా వచ్చినందుకు ఉద్యోగం దొరకదు. డేనియల్ కేటీని, ఆమె పిల్లల్ని ఆదుకుంటాడు. ఒక రోజు ఫుడ్ బ్యాంక్ సందర్శించినప్పుడు, కేటీ ఆకలి తట్టుకోలేక, తన వంతు వచ్చే వరకు ఆగలేక, అక్కడ పడివున్న పచ్చి బీన్స్ నమిలేస్తుంది. మరోసారి  సూపర్ మార్కెట్లో సరుకులు దొంగిలిస్తూ పట్టుబడిన తరువాత, ఒక సెక్యూరిటీ గార్డు ఆమెకు వేశ్యగా పని కల్పిస్తాడు. వేశ్యాగృహం వద్ద ఆమెను చూసిన డేనియల్ ఆ పని మానుకోమని వేడుకుంటాడు. కాని తన పిల్లలను పోషించడానికి వేరే మార్గం లేదని ఆమె కన్నీటిపర్యంతం అవుతుంది.

ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే నిరుద్యోగ భృతి అయినా దొరుకుతుందని ఆ ప్రయత్నమూ చేస్తాడు. అందులో కూడా విఫలమై ఆ కార్యాలయం గోడపై “నేను, డేనియల్ బ్లేక్ ను, నేను ఆకలితో చావడానికి ముందే నా  అప్పీల్ తేదీని డిమాండ్ చేస్తున్నాను” – అంటూ స్ప్రే పెయింట్ చేస్తాడు. అతడిలాంటి బాధితులు అతడిని సమర్ధిస్తారు. కాని అతన్ని పోలీసులు అరెస్టు చేసి హెచ్చరిస్తారు. డేనియల్ తన ఇంటి వస్తువులు ఒక్కొక్కటీ అమ్ముకుంటూ నెట్టుకొస్తుంటాడు.

బాగా విసిగివేసారిన సమయానికి డేనియల్ కు అప్పీల్ తేదీ దొరుకుతుంది. కేటీ అతనితో పాటు కోర్టుకు వెళ్తుంది. డేనియల్‌ కేసు బలంగానే వుందని ఒక సంక్షేమ సలహాదారుడు చెబుతాడు. తన కేసును నిర్ణయించే న్యాయమూర్తిని, వైద్యుడిని చూసి ఆందోళన చెంది డేనియల్ లావటరీకి వెళతాడు. అక్కడ గుండెపోటుతో మరణిస్తాడు. ప్రజారోగ్య అంత్యక్రియల్లో అనాథకు మల్లే ఖననం జరిగాక, డేనియల్ తనే వినిపించాలని రాసిపెట్టుకున్న ప్రసంగాన్ని కేటీ చదివి వినిపిస్తుంది.

“నేను క్లయింట్నో, కస్టమర్నో లేదా సేవా వినియోగదారుడినో కాను. బాధ్యతలేని వాడినో, బిక్షగాడినో, దొంగనో కాదు. నేను జాతీయ భీమా నెంబర్నో, తెరపై మెరిసే బ్లిప్పునో కాదు. ఒక్క పైసా తక్కువ చేయకుండా సగర్వంగా సకాలంలో బకాయిలు చెల్లించిన వాణ్ణి …. పొరుగువారి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి, వీలైతే వారికి సహాయం అందించిన వాణ్ణి. నేను దాతృత్వాన్ని ఆశించను, అంగీకరించను. నా పేరు డేనియల్ బ్లేక్. నేను మనిషిని, కుక్కను కాదు. అందుకే, నేను నా హక్కులనే కోరుతున్నాను. మీరు నన్ను గౌరవంగా చూడాలని కోరుతున్నాను. నేను, డేనియల్ బ్లేక్ ను, ఒక పౌరుడిని, అంతకన్నా ఏ మాత్రం ఎక్కువ గానీ, తక్కువ గానీ కాను.’’

ఒక మనిషి కేవలం ఆధార్ నంబర్ గా, సోషల్ సెక్యూరిటీ నంబర్ గా మారిపోవడం ఆధునిక సమాజ విషాదం. మన దేశంలో మనిషిని ఒక కాగితం ముక్కగా మార్చే దైన్య పరిస్థితి తీసుకొస్తున్నారు పాలకులు. అటువంటి విషాదమే డేనియల్ ను కృంగదీసింది. సంక్షేమ వ్యవస్థపై సెటైర్ లాంటి ఈ సినిమా విజయవంతమైన తర్వాత బ్రిటన్ లో #ఐ, డేనియల్ బ్లేక్# ఉద్యమం కొనసాగింది. ప్రధాన మంత్రి తెరెసా మే ఈ సినిమా చూడాలని లేబర్ పార్టీ లీడర్ జెరెమీ కార్బిన్ పార్లమెంట్ లో ప్రసంగించాడు.

ఈ చిత్రం 2016 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పామ్ డియోర్, 2016 లోకర్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రిక్స్ డు పబ్లిక్, అత్యుత్తమ బ్రిటిష్ ఫిల్మ్ గా 2017 బాఫ్టా అవార్డులను గెలుచుకుంది.

గిగ్ ఎకానమీ గుట్టు విప్పిన ‘సారీ వుయ్ మిస్డ్ యు’ (2019):

ఎనిమిది  గంటల పనిదినాన్ని తొమ్మిది గంటలకు పెంచింది భారత ప్రభుత్వం. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి శ్రామికవర్గ అణిచివేతకు మార్గం సుగమం చేస్తున్నారు కాషాయ పాలకులు. ప్రైవేటు రంగంలో గానీ, ప్రభుత్వ రంగంలో గానీ, శాశ్వత ఉద్యోగాలకు స్వస్తి పలికే బిల్లు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతున్నట్టు ఇటీవల వార్తల్లో చూశాం. ఇప్పటికే ఉద్యోగ భద్రత గానీ, భవిష్య నిధి గానీ లేని డెలివరీ బాయ్స్ ఉద్యోగాలు మనదేశంలో ఎక్కువవుతున్నాయి. అభివృద్ధి చెందిన బ్రిటన్ లాంటి దేశాలలో ‘గిగ్ ఎకానమీ’ పేర ఇటువంటి కార్మిక జనాల సంఖ్యే ఎక్కువగా వుంది. ఈ ‘గిగ్ ఎకానమీ’ చీకటి కోణాన్ని బహిర్గతం చేసే సినిమా ‘మిమ్మల్ని చేరుకోలేందుకు సారీ’. పార్సెల్ డెలివరీ వ్యాన్ డ్రైవర్ బాధామయ జీవిత చిత్రణ కన్పిస్తుంది ఈ సినిమాలో.

2008 ఆర్ధిక పతనంలో తమ ఇంటిని కోల్పోయాడు రికీ (క్రిస్ హిచెన్). డజను మంది వృద్ధులకూ, వికలాంగులకూ సేవలందించే అటెండెంట్ గా  ఒకచోటి నుండి మరో చోటికి దౌడుతీస్తూ ఎలాగోలా ఇంటిని నెట్టుకొస్తోంది భార్య అబ్బీ (డెబ్బీ హనోవుడ్). తనకు సంపాదన లేదని నిరాశగా వున్న రికీకి పిడిఎస్ (పార్సల్స్ డెలివర్డ్ ఫాస్ట్) అనే కంపెనీలో డెలివరీ డ్రైవర్ గా, తన పనికి తనే యజమాని(!)గా పనిచేసే అవకాశం వస్తుంది. సొంత వ్యాను కొనుక్కోవాలి లేదా కంపెనీ దగ్గర దినసరిగా పెద్ద రెంటుకు అద్దెకు తీసుకోవాలి. సరిగ్గా, ‘బైసికల్ థీవ్స్’లోని రికీకి వచ్చిన సంకటావస్థే ఈయనకూ వస్తుంది. వారికున్న ఒకే ఆస్థి అబ్బీ నడిపే కారు. అబ్బీ పని స్వభావాన్ని బట్టి ఆ కారామెకు చాలా అవసరం. అయినా సరే బస్సులో కష్టపడి పోవొచ్చులే అని అబ్బీ త్యాగం చేసి, కారు అమ్మేసి, తెల్లగా మెరిసే కొత్త వ్యాన్ కొంటారు. గిగ్ ఎకానమీ సృష్టించిన అందమైన బూటకం ‘స్వయం ఉపాది’. 365 రోజలు రోజుకు 14 గంటలు పని చేసినా సరే అది కంపెనీ కోసం వెట్టి చాకిరి అన్పించుకోదు, స్వయం ఉపాదే! ‘మా కోసం’ కాదు, ‘మాతో’ డ్రైవ్ చేస్తావు నువ్వు. మేము నీకు జీతం ఇవ్వడం కాదు, నీ ‘ఫీజు’ నువ్వు సంపాదిస్తావు’ అని చెబుతాడు కర్కశంగా వుండే మేనేజర్ మేలోనీ.

వ్యాన్ లోకి సరుకు లోడ్ అయింది మొదలు దౌడు తీయాలి. ఏ పార్సిల్ ఎక్కడికి ఎంతకు చేర్చాలి అన్నది తెలియజెప్పే యంత్రం నగరంలోని ఓ మూల నుండి మరో మూలకు పరుగులు పెట్టిస్తుంది. క్లయింట్ ఇంటిని ఎంత చాకచక్యంగా ఎంత త్వరగా పట్టుకోగలిగితే అంత మంచిది. మిస్సయితే ‘మిమ్మల్ని చేరుకోలేందుకు సారీ’ కార్డు లెటర్ బాక్సులో వేయాలి. ఉచ్చపోయడానికి కూడా టైము ఉండదు. అందుకని ఒక ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ దగ్గరుంటుంది. రికీ తన ఆర్ధిక స్థితిని మెరుగుదిద్దుకోవాలని తాపత్రయ పడుతుంటాడు. భార్యాభర్తలిద్దరూ నిత్యం పనిలో బిజీగా వుండే సరికి పిల్లలపైన మరీ ముఖ్యంగా పెద్దాడిపై శ్రద్ధ చూపలేకపోతారు. స్కూలు నుండి వచ్చే కంప్లైంట్ ను అటెండ్ కావడానికి కూడా వారికి సమయం చిక్కదు. ఏ బంధమైనా కొంత తీరిక వ్యవధి కోరుతుంది. కష్టసుఖాలు పంచుకోడానికి, ఒకర్నొకరు అర్ధం చేసుకోడానికి! కానీ తరగని పనిగంటలు కష్టజీవుల కుటుంబాలకు ఈ వెసులుబాటు కల్పించవు. అందుచేత కుటుంబ సంబంధాలు తీవ్ర వత్తిడికి లోనౌతాయి. ఒక అప్రమత్తత లేని సమయాన రికీ దారిదోపిడిగాళ్ళ బారిన పడతాడు. డెలివరీ చేయాల్సిన వస్తువులు పోయి, దెబ్బలుతిని ఇంటికి వస్తాడు. కానీ ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే, కంపెనీ తనకు కోత వేయబోయే ఫీజుల గురించి కలవరపడి భయాందోళనకు గురౌతాడు. రెండో రోజు ఉదయానికి కుటుంబమంతా వారిస్తున్నా వినకుండా, విరిగిన ఎముకల్ని కూడా లెక్కచేయకుండా వ్యాన్ని తీసుకుని పనికి బయలుదేరుతాడు రికీ. మనం ఆర్డర్ చేసిన డెలివరీ ఇంకా రాలేదని కోపగించుకుంటుంటాం. కానీ ఈ ఫాస్ట్ డెలివరీ వెనుక నలుగుతున్న జీవితాల గాధలు తెలీవు మనకు! ఎలాంటి దురవస్థలోనైనా బతకాలని నిర్ణయించుకున్న జీవుల మొండితనపు గాధలు తెలీవు మనకు!

ఈ సినిమా కూడా ఈ సంవత్సరం కాన్స్ పామ్ డియోర్ కోసం పోటీ పడింది. సాన్ సెబాస్టియన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ యూరోపియన్ అవార్డు గెల్చుకుంది. కోల్కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ సినిమా చూసే అవకాశం లభించింది.

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.