తాను లేడు తన కథ ఉంది

అవును, ఆయన ఎప్పుడో వెళ్ళాడు. నా కవిత్వం అందమైన ఆడపిల్ల అన్నాడు. కొత్త  ఊహలతో

కవితలు కట్టుకున్నాడు. అమృతం కురిపించాడు. కానీ కథల్లో మాత్రం ఆకాశం వైపు చూడలేదు. అద్భుతాలు కలగన లేదు. నేల మీదే ఉండి, మధ్య తరగతి గతిని రాశాడు. వాస్తవాలు కురిపించాడు. ఊరి చివర ఇల్లు, నల్లజర్లరోడ్డు, ఆశాకిరణం, దేవున్ని చూసినవాడు, పరివర్తన లాంటి కథలు మైలురాళ్లు. ప్రపంచ సాహిత్యంతో ఏ మాత్రం తీసిపోనివి. తిలక్ తన సాహిత్య హితాన్ని,కోరుకున్న మార్పుని కథల్లో పెట్టాడు. కవిత్వం ఆయన సౌందర్య హృదయం. కథ అసౌందర్య చిత్రణ. ఇక్కడే ఆయన ఆశించిన లక్ష్యాలు కనబడతాయి. ఈ కథలు సాక్ష్యాలు. గొప్ప ఋజువులు.

కథ అంటూనే మనకు ఓ సాధారణ అభిప్రాయం చివరిలో చెడు, మంచి ఐపోవాలి. ఓ నీతి ఉండాలి.

ఈ మూస లో లక్షల కథలుంటాయ్. ఎన్ని గుర్తున్నాయ్. ఎన్ని వెంటబడుతున్నాయ్. ఎన్ని తిరుగుతున్నాయ్ అంటే జవాబు లేని ప్రశ్న.

మనం చదవడం మానేశాం కాని, నిర్లక్ష్యం చేశాం గాని  వారానికి ఒక కథ బలవంతం గా చదివినా ఓ సంవత్సరం యాభై రెండు మీ గుండెల్లో ఉంటాయ్. గమ్మున కూర్చోవ్. అవి కెలుకుతాయ్. నువ్వు వాటిని

చెట్టు పండ్లను రాల్చుకున్నట్టు రాలుస్తావ్. కొందరు ఏరుకుంటారు. పంపకం మొదలౌతుంది. ఊర్లు ఊర్లు దాటుతాయ్. రైళ్లలో ప్రయాణిస్తాయ్.

కథా శిల్పం రాసిన వల్లంపాటి తిలక్ కథల్ని  గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

ఓ చోట మాత్రం తిలక్ “దేవుడ్ని చూసిన మనిషి”కథ  పేరు ను ప్రస్తావించాడు. అమృతం కురిసిన రాత్రి మాయలో ఆయన కథలు విస్మరింప బడ్డాయ్. తిలక్ రాసిన పరివర్తన కథకు, ఇటీవల వచ్చిన  నిను కోరి సినిమా కథకు కొన్ని పోలికలు ఉన్నాయ్. ఇప్పుడు ఓ కథను చూద్దాం.

” ఆ పెద్ద పెంకుటిల్లు వర్షంలో మరీ ఒంటరిగా ,నిస్సహాయంగా ఉన్నట్లుంది.” ఇదిగో ఆ ఇంట్లోనే కథ మొదలు అవుతుంది. వర్షం హోరుగా కురుస్తూనే ఉంది. ఇంటి చుట్టూ నీళ్లు. ఆ ఇంటిలో ఓ యువతి ఉంది. వయస్సులో ఉంది. గొప్ప అందంతో ఉంది. ఓ ముసలిది ఉంది. తెల్లని పురుగుల్లాగా కదిలే కళ్ళున్న ముసలిది. కేవలం బతకడం మాత్రమే తెలిసిన ముసలిది. వికృత మైన ముఖం ఉన్న ముసలిది.

తిలక్ కథ గొప్పతనం కథలో ఉన్న వాతావరణం తోనే తెలిసిపోతుంది. ఈ కథలో వర్షం లేకుంటే, చీకటి లేకుంటే పేలవం గా ఉండేది. ఈ కథ మాంచి ఎండల్లో ఐతే కుదరదు.  తొలకరి వాన ఐనా కుదరదు.

ముసలి దాని పాత్ర ను పరిచయం చేయడంలో నే  ఆయన, ఆ పాత్ర స్వభావం చెప్పేసాడు.

ఆ వర్షాన్ని చూస్తూ మండువాలో ముక్కాలి పీట మీద కూర్చుని ఆ యువతి దిగులుగా ఉంది. వయస్సు ఇరవై మూడు. తెల్లని చీర కట్టు. ఆమె చూపులు  విరక్తంగా ఉన్నాయి. ముసల్ది రమను లోపలికి రమ్మని పిలుస్తూ ఉంది. రమను ఆడిపోసుకుంటు ఉంది. మూడు నెలల పసివాడి కోసం నువ్వు సచ్చిపోతావా, ఇదిగో పిల్ల అసలు ఈ ఇంట్లో పుట్టిన ఏ బిడ్డా బ్రతకలేదు. వేలెడు అంత వెధవ కోసం బెంగ వద్దు. లోపలికి రా నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నీకు ఏది ఐనా ఐతే నా బతుకు ఏంటి అంటూ ముసల్ది “మాటల్ని  చేపల్ని కత్తి పీట మీద తరిగినట్టు మాట్లాడుతూ ఉంది. రమ ముసలి దాన్ని తిరిగి తిడుతూ ఉంది.

ఈ వయస్సులో నాలుగు రాళ్లు వెనుక వేసుకోకుంటే, ఇక అంతే పిల్ల, నువ్వు వచ్చిన ప్రతీ వాణ్ణి వెల్లగొడుతున్నావ్. నీకు రాజ కుమారులు కావాలంటే ఎలా, అప్పుడు నేను నిన్ను ఆదుకోక పోతే నీ గతి ఏంటి? ఆ మూడు నెలల ముంగి వెధవ పోయాడు. పీడ వదిలింది. ఇక నువ్వు తేరుకోవాలి. సంపాదించాలి.

ఇలా ముసలిది దయా దాక్షిణ్యాలు లేకుండా అరుస్తోంది.

రమ “కొండ చిలువ లాగా మెలికలు తిరిగి చీకట్లో కలిసిపోయిన రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది.”ఎవరో ఒక వ్యక్తి ఒక చేత్తో గొడుగు, మరో చేత్తో  సూట్ కేసు పట్టుకుని రోడ్డు మీద వెళ్లడం చూస్తుంది . అతన్ని పిలుస్తుంది. ఈ సమయంలో ప్రయాణం కుదరదు అని చెబుతుంది. ఉదయం రైలు కి వెళ్ళవచ్చు అని చెబుతుంది. దీప కాంతి లో అతని ముఖాన్ని చూసి రమ ఉలిక్కి పడుతుంది.

ఈ ఉలిక్కి పడటం ఎందుకు? ఇక్కడ మనకు కథకుడు కథలో ఎదో రహస్యం ఉన్నట్టు తెలియచేస్తున్నాడు.

అతను నా పేరు జగన్నాథం. బహుశా మీరు అనుకునే వ్యక్తి నేను కాదేమో, వెళ్తాను అంటాడు.

అతనికి భోజనం పెట్టి, పక్క ఏర్పాటు చేస్తుంది. ముసల్ది లోపల సంతోష పడుతుంటుంది. పిల్ల  మాములు ఐపోయింది అనుకుంటుంది. అతను నిద్ర పోతాడు. రమ ఆ గదిలోనే తిరుగుతూ, లాంతరు పెట్టి అతని ముఖం లోకి పరీక్ష గా చూస్తుంది. అతను గమనిస్తాడు.

ఆమె వైపు అతను నిమిష నిమిషానికి దగ్గర కావడం మొదలౌతుంది. ఆమె కళ్ళల్లో ఎదో కథ ఉంది. జాలి, దయతో కూడిన కథ. ఇక అప్పుడు ఇద్దరి కథలు చెప్పుకుంటారు. నువ్వు నా విజయుడివి అంటుంది.

ముఖం మీద మచ్చ ఆధారం అంటుంది. ఉలిక్కిపాటు కి ఇది కారణం.

విజయుణ్ణి కాదు నా పేరు జగన్నాథం అంటాడు. ఒకరి కొకరు గత జీవితాన్ని లాంతరు కాంతిలో దృశ్యమానం చేసుకుంటారు.

ఆ వ్యక్తి రమ నువ్వు నాకు కావాలి అంటాడు. జీవితాంతం కలసి ఉందాం అంటాడు.

పెళ్లి పక్కా అంటాడు. రమ అతని గుండెల పై చేయి వేసి హాయి గా నిద్రలోకి జారుకుంటుంది.

ఈ మాటలన్నీ ముసల్ది చాటు గా వింటుతుంది. ఈ పిల్ల వెళ్తే నా గతి ఏంటి అని దిగులు పడుతుంది.

ఐతే  ఈ సంగతి మనకు రచయిత చెప్పడు.

అతగాడ్ని ముసల్ది పిల్చి ఇది అబద్దం అంటుంది. ఇదే కథ ఎంతో మందికి చెప్పింది. అది డబ్బు కోసం ఆడే నాటకం అని అతని మనస్సును చిటికె లో విరిచిపారేస్తుంది. అతనికి రమను చంపేయాలన్న కోపం వస్తుంది. అంతే తన పర్సు విసిరి, మంచం మీద కొట్టి, చీకట్లోనే బయిలుదేరుతాడు.

ముసల్ది వికృతమైన నవ్వు నవ్వుతుంది. రమ లేచి చూస్తే అతను లేడు. ముసల్ది ఏమి చెప్పిందో రమకు చెబుతుంది. రమకు తీవ్రమైన, దుఃఖం, కోపం, ముసలిదాని పై పీట విసిరి స్టేషన్ కు బయులుదేరుతుంది.

ఒక్కటే పరుగు.చేతిలో పర్సు.జీవితంలో ఎలాంటి మగాడి కోసం ఎదురు చూసిందో అతను వెళ్ళిపోయాడు.

కాదు వెళ్ల గొట్టింది. ఇప్పటి వరకు ఆమె శరీరాన్ని మాత్రమే అప్పగించింది. ఇప్పుడు మనస్సు కూడా అర్పించే మనిషి వెలుగు లా వచ్చాడు. వెళ్లిపోయాడు.

రమ  రేగిన జుట్టు,అలసిన ముఖం, బురద తో నిండిన బట్టలు స్టేషన్లోకి పరుగు తీసింది. రైలు బయలు దేరింది.

జగన్నాథం చూస్తూ ఉన్నాడు. రమ గట్టిగా అరుస్తూ పర్సు విసిరేసింది. చీర అడ్డువచ్చి కింద పడిపోయింది.

అతను పర్సు అందుకున్నాడు. వెయ్యి రూపాయలు అలానే ఉన్నాయి. అతని ఫోటో మాత్రం లేదు ఏమి కథ ఇది. తిలక్ రాసిన “ఊరి చివరఇల్లు” అక్కడక్కడ తిలక్ రాసిన మాటలు అద్భుతం గా ఉంటాయి. “ఒంటరితనం అతి పెద్ద సహారా ఏడారిలా వ్యాపించి ఉంటుంది. అక్కడ నీళ్లు దొరకవు. అడుగుజాడలు కనిపించవు. బ్రతుకు వాసన ఉండదు. అక్కడ  కాలే ఇసుక మాత్రం అనంతం గా పరుచుకుని ఉంటుంది. ఎవరూ ఆ ఎడారిలో ఉండలేరు. బ్రతుకలేరు. తనల, రమలో ఆఖరికి అవ్వలో కూడా ఎడారి. ఈ ఇసుకలో కాళ్ళు మాడుతూ బ్రతుకునీడ్చుకుంటూ నాలుక పిడచకట్టుకు పోతుంటే ఒయా సిస్సుల కోసం కోన ఊపిరితో కూడా వెతుక్కుంటూ ఉంటారు.”  

తిలక్ కి కవితా రహస్యం తో పాటు కథా రహస్యం తెలుసు. ఐతే అక్కడక్కడ మనకు కథ ఏంటో తెలిసిపోతూ ఉంటుంది. బహుశా ఇది ఆయన బల హీనత కావొచ్చు. ఈ కథలో కూడా ముసల్ది తచ్చాడుతూ ఉంది. అని చెప్పగానే మనం కాస్త ఏమి జరుగుతుందో ఊహించవచ్చు. ఆయన తీసుకున్న వస్తువు గొప్పది. నేపధ్యం గొప్పది. సర్వసాక్షి కోణంలో చెప్పిన కథ. ముగింపు కూడా తీసిపారేసిది  కాదు.

పర్సులో ఫోటో లేకపోవడం చూసి జగన్నాథం మళ్ళీ వచ్చి ఉంటాడా.

రమ ఎడారి బతుక్కి ఓదార్పు దొరికి ఉంటుందా

అడగడానికి ఆయన లేడు.

వస్తే ఎలా ఉండును.

రాకపోతే ఎలా ఉంటుంది

మనమే తేల్చుకోవాలి.

సుంకర‍ గోపాలయ్య

సుంకర గోపాలయ్య: కాకినాడ, పిఠాపురం రాజా కళాశాలో తెలుగు శాఖాధిప‍తి. సొంత ఊరు నెల్లూరు. రాధేయ కవిత పురస్కార నిర్వాహకులు. కొన్ని పిల్లల కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.

1 comment

  • బాగుంది.. ఇలాంటి కథలు ఎందుకు చదవకుండా ఉన్నానా అని బాధ kaligindi. నీవు తడిసిన అమృత వర్షంలోకి అందర్నీ ఆహ్వానిస్తున్న నీకు అభినందనలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.