దైనందిన జీవితానికి అద్దం పట్టిన కవులు

ఇదివరకే  అనేక మంది ప్రాచీన కవులు తమ కవిత్వం లో ప్రదర్శించిన చైతన్య ధోరణులను చూశాం. చైతన్యం…అది సామాజిక పరమైనా, భాషా పరమైనా, మరే ఇతర అంశాల్లోనయినా కవులు ఎలా స్పందిస్తున్నారనే అంశం మీద దృష్టి సారిస్తున్నాము.

ఈ క్రమం లో 13 వ శతాబ్దానికి చెందిన “మూల ఘటిక కేతన’ పేరు కూడా చెప్పుకోవాలి. కేతన గొప్ప కవి.. అనువాదకుడు. “అభినవ దండి” అని పిలువబడిన మూల ఘటిక కేతన తెలుగు లో మొదటి గద్య కావ్యం రాశాడు. తెలుగు భాషలో సరళత్వాన్ని తీసుకు వచ్చి,  భాషా పరమైన చైతన్యం తో పాటు, సామాజిక చైతన్యం కూడా ప్రదర్శించాడు. దండి రచించిన దశకుమార చరిత్రలో ఆనాటి సమకాలిక సమాజాన్ని, అందలి వెలుగు నీడల్ని చిత్రించాడు.  దొంగ సన్యాసులు, కపట బ్రాహ్మణులూ, మోసకారులైన వేశ్యలు, గజ దొంగలు దండి దృష్టి నుండి తప్పించుకోలేదు. దండి తన పుస్తకం నిండా ప్రజాసామాన్యం సుఖదుఃఖాలు, ఉత్సాహోద్వేగాలు, రాగద్వేషాలను స్పృశించాడు. అలాంటి దశకుమార చరిత్రను కేతన తెలుగు లోకి “అంచిత భావరసోదయాభిరామం” అనే పేరు తో అద్భుతంగా అనువదించాడు. తెలుగులో మొట్ట మొదటి తెలుగు వ్యాకరణం, ‘ఆంధ్ర భాషా భూషణం’ రచించాడు. తాను రాసిన గ్రంథాన్ని గురించి చెపుతూ,. “ఇందులో ఒప్పులుంటే మెచ్చుకోండి. తప్పులుంటే తగినట్టు దిద్దండి. అంతే గానీ, తప్పును ఒప్పు అనకండి. ఒప్పును తప్పు అనకండి. ఓ కవులారా! మిమ్మల్ని ప్రార్థిస్తాను. గుణదోషాలు తెలిసి ఇది గుణం. ఇది దోషం అని సుకవులు పూజలు పొందుతారు. గుణదోషాలు తెలియకుండా దోషాలనే గుణాలని కుకవులు పొగడుతారు.  మీరు నన్ను నిందిస్తే మీకు ఎదురాడి జవాబు చెప్పడం దుస్సాహసికమవుతుంది. కవులార! మీకు నమస్కారం చేస్తాను. మనసులో నన్ను అన్యధా భావించకండి. కాళిదాసు మయూరాది మహానుభావులలో తప్పులుంటాయి. ఇతరులకు ఉండవా? సారమతులైన సుకవుల కారుణ్యమే కవి జనాలికి కలిమి, నేర్పు. గంగానదికి త్రోవ చెప్పమంటే కంచి, నెల్లోరు, ఓరుగల్లు, అయోధ్య అనే పురాల మీదుగా వెళ్ళు అని బోలెడన్ని త్రోవలలో ఒకటి చూపినట్లు ఎన్నో మార్గాలున్న తెలుగు భాషకు ఒక దారి చెప్పాను“ అని నిష్కర్షగా అంటాడు. అనేక రకాలైన ‘గ్రామ్య’ పదాలను వెలికి తీసాడు. ఈయన కృతులను చాలామంది తెలుగు కవులు అనుకరించారు. ఆధునిక కాలం లో అనేక మంది పరిశోధనలు చేసారు. ఇది స్వంత గ్రంథమైతే, యజ్ఞవల్క్య మూర్తి రచించిన ‘విజ్ఞానేశ్వరీయం’ అనే ధర్మ శాస్త్రాన్ని తన స్వంత శైలి లో అనువాదించాడు కేతన.  వ్యవహారం (సివిల్ లా ), ప్రాయశ్చిత్తం (క్రిమినల్ లా) ఇలాంటి దాని పై కేతన ఇచ్చిన నిర్వచనం….

“విచ్చలవిడి బలవంతుం
డచ్చుగా గారించుటయను నబలుండు చాలన్
నొచ్చి మహీపతి సభకున్!

సమాజం లో బలవంతుడు ఎవరినైనా సభకు తెచ్చి దాన్ని వ్యవహారం చేయవచ్చును అని తన స్వంత నిర్వచనం ఇచ్చాడు. పొలాల్లో పశువులు మేస్తే ఎంత జరిమానా వేయాలో, ఊరి చుట్టూ ఎంత కంచె వేయాలో, ఊరికి చేనుకి మధ్య నూరు ఇండ్ల ఎడమ ఎలా ఉండాలో తన పద్యాల్లో చెప్పాడు. “పదుగురాడు మాట పాడియై ధరజెల్లు” అనే మాట కేతన బలంగా విశ్వసించాడు. మెజారిటీ ఏది న్యాయమని ఒక కట్టుబాటు పెట్టుకుంటే దానిని రాజు పాటించాలంటూఆ నేడే ప్రజాస్వామ్యాన్ని ఉగ్గడించాడు. భారతీయ శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ లా, సివిల్ లా గురించి 12వ శతాబ్దం లోనే ప్రస్తావించాడు.

ఆనాడు సమన్యాయం లేదు. ధనిక, పేద, ఎక్కువ, తక్కువ అనే బేధాలు బాగా వుండేవి, ఇప్పట్లాగే.గొప్పవాళ్ళ పక్కనే న్యాయం ఉండేటట్లు సంఘం లో ఉండేది.  తనకన్న ఎక్కువ వాళ్ళ భార్యలను తిడితే ఒక రేటు జరిమానా. తక్కిన వాళ్ళను తిడితే ఇంకో రేటు జరిమానా ఉండేదని….. 

“తనకంటే నధిక బరపతి
నేనికమిగుల దిట్టెనేని నేబది పణముల్
తనకంటే హీనున్ దిట్టిన
దనరింగ బండ్రెండు నరయు దండువుగలుగున్ ..”  అని బాధపడ్డాడు.

కేతన అనువదించిన విజ్ఞానేశ్వరేయంలో, ప్రాయశ్చిత్తకాండ క్రిమినల్ లా మాత్రమే కాదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని తెలిపే పద్యాలు కూడా ఉన్నాయి.  హత్య చేసి, హంతకుడు పారిపోతే ఎలా పరిశోధన చేయాలో కేతన అతి సరళంగా తెలుగులో అనువదించాడు.

ఒకని నెవ్వరుఋంగ కుండంగ జంపి తాన్ జంపినవాడు ప్రచ్ఛన్నుడైన
జచ్చిన యాతని నెచ్చలి  బృత్యుని నన్న్డంమునిబట్టి యరచియైన
నతివల వేర్వరయడిగి చచ్చినపొంత నెలసెడు వారల నేల్లనరసి,
యే, యుద్దములవెంట నెవ్వరితోడను చెనకువ గలిగెనో యనియనడిగి
చంపుటకు దగినట్టి యాశంకయెరుల! మీదధగిలిన వారల సూదిపట్టి
యరసి తెలివిని శుద్ధిలేదయ్యనేని ! తగిన దండంబు దండింపదగును బతికి.

సాంఘిక చరిత్రకు, సమాజ చైతన్యానికి అవసరమైన ఆ ధర్మశాస్త్రాన్ని తెలుగు లోకి అనువదించి, ఎన్నో విషయాలను తెలుగు వాడికికి అందజేశాడు.

13 వ శతాబ్దానికి సంబంధించి, పాల్కురికి సోమనాధుడు, చక్రపాణి రంగనాధుడు పేర్లను ప్రముఖంగా చెప్పవచ్చు, తెలుగు సాహిత్యం లో పేరు మోసిన సాహిత్య వేత్తలంటూ పాల్కురికి సొమనాధుడి వీర శైవ వాజ్మయం పైన పరిశోధనలు చేసిన బ్రౌన్ దొర 1840 లో జంగమ సాహిత్యం పైన వ్యాసం వ్రాసారు. ఈయన కవిత్వాన్ని, నిడుదవోలు సుందరం పంతులు గారు మొట్ట మొదటగా పుస్తక రూపం లో ప్రచురించారు. వేటూరి ప్రభాకర శాస్త్రి, చిలుకూరి నారాయణరావు , బాదారు తమ్మయ్య , నేలటూరు వెంకట రమణయ్య , శిష్ట, రామకృష్ణ శాస్త్రి , మల్లంపల్లి సోమశేఖర శర్మ, పరిశోధనలు చేసారు.  వర్గబేధాలను రూపుమాపకుండా వర్ణ భేదాలను తొలగించాలనుకోవడం పునాదులు లేని ఇళ్ళు కట్టడమే అని భావించిన వాడీయన. సామాజిక చైతన్యం కోసం పోరాడిన సోమనాధుడి కాలం అంతరించక ముందే, అతని సాహిత్యం తో సజీవమై, సమరశీలమై సమానతలను సాధించడానికి లేచిన ఉద్యమం కుప్పకూలి చప్పనై సమసి పోయింది. భగవంతుడి కంటె భక్తుడు గొప్పవాడు, అతడు ఏది అడిగినా అది మారు మాట్లాడకుండా చెల్లించడమే విధి,  అని భావిస్తున్న ఆ రోజుల్లో _ తన కొడుకును చంపి వండి పెట్టమని ఒక జంగం అడిగితే, వెంటనే, సిరియాలుడు ఆ కోరికను చెల్లించాడు. అంటే, శివుడే ఆ తండ్రి రూపం లో వచ్చి అడిగినాడని భావించాడు. సిరియాలుడు ఒక గొప్ప భక్తుడు. సిరియాలుడు చేసిన పనికి హలాయుధుని వంటి భక్తులు ఛీ కొట్టి చీదరించుకొన్నారు. దీన్ని నిలదీసిన హలయాధుడు అలాంటి వారిని వెలి వేయాలని

“సెట్టికి గర్మంబు దిట్టు దేవరకు
గట్టిల్లేనింతయ కాదె కావునను
భక్తుని మింగిన పచ్చి రక్కసుడు
భక్తుని జంప బాల్చాడు నూనె కాడు
నిధియొక్క కథయగా నిలరచియించి
చదువు మూఢులకు సంభ్రాతులకును
వెలియ జుండో……… అని వెలి వేస్తారు.

ఇలాంటి వెలి కథను సోమనాధుడు కథనం చేసి, తెలుగు సాహిత్యం లో ఒక మార్పు తీసుకు రావాలని ప్రయత్నించాడు. తీవ్రమైన ఛాందసమైన భక్తి రాజ్య మేలుతున్న రోజులల్లో, సోమనాధుడు ఈ వెలి కథను తెలుగు లోకి కథనం చేసినాడు. వర్గ, వర్ణ సమానతలను తీసుకు రావడం లో ఎంతటి చిత్త శుద్ధి ఉన్నిందో మనం చూడవచ్చు.  ఇదంతా, సోమనాధుడు సాహిత్యం తో సమాజాన్ని చైతన్యం తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలే. వర్ణాశ్రమ ధర్మాలను వ్యతిరేకిస్తూ తెచ్చిన శైవం ను ఎంత బ్రతికించు కోవాలన్నా వీలు కాలేదు. వైదిక ధర్మ ప్రాబల్యం సోమనాథుడి కాలం లోనే తిరిగి తల ఎత్తింది. సోమనాధుడు ఆచరించిన వీర శైవము, కులాల మధ్య తేడాలు తొలగించే గొప్ప మతమైనా దీన్ని నిర్జీవం చేశారు.

సి వి సురేష్

సి.వి. సురేష్: కడప జిల్లా ప్రొద్దుటూరు స్వగ్రామం. పూర్తి పేరు చెన్నూరు వంకదార సురేష్, వృత్తి రీత్యా న్యాయవాది, కవిత్వం, అనువాదాలు, విశ్లేషణలు రాస్తున్నారు. సాహిత్యాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం ఉన్న ఈయన తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లం లోకి అనువాదం చేస్తున్నారు సురేష్ ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్ పత్రిక కు స్టాఫ్ రిపోర్టర్ గా కూడా పని చేసారు.

5 comments

 • అబ్బా ఎలారా స్తున్నారండీ ఇంత అద్భు తంగా ఎంతో నిబద్ధత వుంటే తప్ప ఈ రకమైన సేకరణ సాధ్యం కాదు. మీ కృషికి అభినందనలు 💐💐💐💐💐

 • అభినవ దండి”కేతన”పాల్కురికి సోమనాధుడు, గురించి, వివరంగా, విపులంగా, రాసిన,Cv సర్,ధన్యవాదాలు మీకు..జీవితానికి అద్దం పట్టిన కవులు గురించి తెలుసుకోవడం. వారి పుస్తకాలును,చదవడం,.. మాకుఎంతో ఉపయోగముగా ఉంది.అభివందనలు, Cvsir&Hrksir!🙏

 • మరో ఆసక్తికరమైన వ్యాసం మీనుండి..ఎక్కడసేకరిస్తారో కానీ సామాజిక చైతన్యం కేంద్రంగా ప్రాచీన కవుల దృక్పధాన్ని ఒక చోట చూడడం మంచి అధ్యయనాంశం….
  వర్గబేధాలను రూపుమాపకుండా వర్ణ భేదాలను తొలగించాలనుకోవడం పునాదులు లేని ఇళ్ళు కట్టడమే అని భావించిన వాడీయన. పాల్కురికి పలుకులు ఇప్పటికీ నిజం..
  అంటే భక్తి చైతన్య త పెరుగుతున్న రోజుల్లో సిరియలుని కథ తిరోగమనం అనుకోవచ్చా.. భక్త సిరియాల కన్నడ నేల లో జరిగిన వృతాంతం…నేను ఇన్నిరోజులూ ఇది గ్రామ్య/ జానపద సాహిత్యం అనుకున్నాను.

  కేతన గురించిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి సర్..వ్యాకరణం మాత్రమే కాక న్యాయ శాస్త్రం ..నేర పరిశోధన ,శిక్షకూడా పద్యాలు గా..👌👌
  కేతన పద్యాలలో ఈ కోణం ఓ లాయర్ గా కూడా మిమ్ముల్ని ఆకర్షించి ఉంటుంది కదా..ఇంకా కేతన సూచనలు అసలైతే రచయితగా విమర్శకులకు చేసిన సూచన కూడా ఇప్పటికీ ఆచరణీయ సూత్రమే కదా…మంచి విషయాలు చర్చకు తీసుకొస్తున్నారు..ధన్యవాదాలు.. మీ కృషి కి అభినందనలు…
  చాలా బాగుంది సర్..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.