పదాల మౌనాన్ని అనువదించే కవి!

అటు చూస్తే నార్మా షేరర్ ఇటు చూస్తే కాంచనమాల అనే సందేహంలాంటిది అటు చూస్తే శివారెడ్డి ఇటు చూస్తే అజంతా ఇంకోవైపు చూస్తే మో మరింకో వైపు

చూస్తే శివసాగర్ …ఎవరిలా రాయాలో అనే కవిత్వ సంధ్యా సమస్య దేశరాజుకి వచ్చి ఉండాలి . ఎటు మొగ్గాలో తేలక తనదైన శైలిని నిర్మాణాన్ని స్రుష్టించుకోవడమే

సంధ్యాసమస్యకు పరిష్కారం అని ఓ ఫైన్ ఈవినింగ్ అనుకుని ఉండాలి. అందుకే అంతకు ముందు లేని ఓ కవిత్వనిర్మాణాన్ని

దేశరాజు మనముందుంచగలిగాడు . అదే దుర్గాపురం రోడ్.

అయితే కవితను పేనుకుంటూ పోయే శివారెడ్డి లక్షణం, కవితలో మార్మికతను నింపే అజంతా తత్వం

ఫెమినైజేషన్ అఫ్ సబ్జెక్ట్ అనే మో తీరు, శివసాగర్ లో ఉండే ఉద్యమ లాలిత్యం అన్నీ పెనవేసుకుని వీళ్లెవరూ కనపడకుండానే

దేశరాజులో కనపడతాయి. దేశరాజు కవిత్వంలో మంచి లక్షణం అతనికి కవితా ఇతివ్రుత్తాల కొరత లేకపోవడం.

అతను దేన్నయినా కవిత్వం చేయగలడు. మంచి కవిత్వం చేయగలడు. ఇది కవిత్వం కాదు అనిపించినదాన్ని కూడా

కచ్చితమైన మంచి కవిత చేయగల ద్రుష్టి దేశరాజుకుంది. అది దుర్గాపురం రోడ్ లో కనపడుతుంది. కవిత్వంలో

ప్రాసలు అనుప్రాసలు యతులు శబ్దాలంకారాలు అనవసరమని దేశరాజు నమ్మిక . విషయాన్ని మనసుతో వివరిస్తే

అదే కవిత్వం అనే విశ్వాసం కూడా దేశరాజుది. సంకలనం లోని చాలా కవితల్లో ఇది స్పష్టంగా వినపడుతుంటుంది.

కవిత్వమంటే పదాల నిఘంటు అర్దం కాదని దేశరాజు చెప్తాడు. కవిత్వమంటే భావాల తాత్పర్యం మాత్రమేనని నిర్దేశిస్తాడు.

కొంచెం మ్రుదుత్వముంటే కంకర రోడ్డు మీదైనా సులువుగా జారొచ్చు నిజమే. తప్పును సాహసవంతంగా చేయడమే హీరోయిజమ్ కదూ అవును అబద్దమే. జీవితం జనరేటర్తోనైనా నడపాల్సిన

రోలర్ కోస్టర్ కదూ. పవర్ కట్ కు పోరాటమే షార్ట్ కట్ సరే.

దుర్గాపురం రోడ్ దేశరాజు రెండవ సంకలనమే కావచ్చు కానీ నాకయితే అన్ని కవితలనూ కలిపి చూస్తే నిజానికిది

ఓ రెండు దశాబ్దాలపాటు అతని చలనం గమనం చైతన్యం. ఓ ఇరవైయేళ్ల అతని ఆత్మకథాత్మక కవిత. మొదటి కవితా సంకలనంతో పోలిస్తే

దేశరాజు దుర్గాపురం రోడ్ లో మోర్ అర్బనైజ్ అయినట్టు తెలుస్తోంది. పల్లెనుంచి వయా పట్నం ఇతను విదేశాలకూ ప్రవహించాడు.

అతనలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఓ అమ్మాయిని చూసాడు ఆ అమ్మాయిని ఆమె ప్రేమికుడినీ

చంపేసిన పరువులనూ చూసాడు. అదే అమ్మాయితో కలిసి పారిస్ నూ ఇజీనగరాన్నీ యానాంనూ ఎర్రెర్రటి కళ్లతో పర్యటించాడు…ద్వేషంగానో అప్రేమగానో..

టాంక్ బండ్ తో మాత్రం చెట్టాపట్టాలేసుకున్నాడు. రకరకాల సందర్బాలలో ఆ అమ్మాయి తల్లయింది. ప్రేయసయింది.

అబలయింది. బలయింది. విప్లవి అయింది. ఇది దేశరాజు కవిత్వంలోని ప్రధాన లక్షణం. తను ప్రతి భావననూ స్ర్తీని ఊనికగా చేసుకుని అల్లుకుంటాడు. ఆమెను ప్రతీక చేసి ఆమెకు సంబంధం లేని విషయాన్ని కూడా

పద్యం చేస్తాడు. బహుశా దేశరాజుకు ప్రేమ రాహిత్యమైనా ఉండి ఉండాలి లేదా మితిమీరిన స్త్రీ ప్రేమయినా దక్కి ఉండాలి.

ఏదయినా పాఠకుడిగా మనకనవసరం, మనకు కావల్సిన కవిత్వాన్ని దేశరాజు స్వచ్చంగా మనకందించాడు. అందుకే ప్రేమకోసం గాయపడాల్సిందేనంటాడు. ఆమె వేళ్లను తాకిన వేళ ఒళ్లు

ఏనుగులు తొక్కిన నేలలా తొణికిపోతుందంటాడు. ఆమె ఎన్నడో విడిచిన తలదిండుకింది మల్లెచెండు గరుకుదనాన్నీ

గురుతుగానే మిగుల్చుకుంటాడు. ఇతనికి ఆమె విషయంలో పసితనం చిన్నతనం కుర్రతనం పెద్దరికం అన్నీ ఒకటే.

సందర్బాలు మాత్రం ఒకటొకటే. ఆమె కేంద్రకంగా కవిత్వం రాసే చాలా మందికి ఉన్న సెక్జువల్ ఇమేజరీ పైత్యం దేశరాజుకు లేదు. దేశరాజు ఆమె పట్ల చాలా మర్యాదగా ఉంటాడు.

ప్రేమగా ఉంటాడు. ఆత్మీయంగా ఉంటాడు. మోహించినా ప్లటోనిక్ గానే.

కుర్రాళ్లు మందుకొట్టడాన్ని సమర్దిస్తాడు. మిత్రుడి మరణానికి కారణమైన సిగరెట్ ను నిందిస్తాడు.

మతరాజ్య ఆనవాళ్లని తిట్టినపుడో డాలర్ ప్రభావాలను ద్వేషించినపుడో ఎర్రజెండా మమకారాలను చంపుకోలేనపుడో కంటే

దేశరాజు ఆత్మిక భావనలను ప్రకటించినపుడు మనిషి నైఛ్యాన్ని అసహ్యీకరించినపుడు చాలా భిన్నంగా వ్యక్తమవుతాడు. అవి కొన్ని అతని సౌందర్యాన్ని చెప్పేవయితే

మిగిలినవి అతని చైతన్యాన్ని చెప్పేవి కావచ్చు బహుశా. ఇతనికి కవితా నిర్మాణ రహస్యాలన్నీ తెలుసు. ఇతివ్రుత్తాలను దొరకపుచ్చుకోవడం తెలుసు. దొరికిన దాన్ని

కవిత్వంగా మలచడం తెలుసు. వెరశి తెలుగు పాఠకులకు మంచి కవిత్వాన్ని అందించడం తెలుసు. సమర్దుడైన కవి మరీ ఇరవై యేళ్ల కోసారి సంకలనం వదలకూడదనీ

కనీసం పదేళ్లకోసారైనా సంపుటాన్ని బహుకరించి ఉంటే బాగుండేదని మాత్రం తెలియదు.

పదాల మౌనాన్ని చప్పుడుగా అనువదించే కవి దేశరాజు. ఎవరికి వినిపించింది వాళ్లే ఎక్స్ క్లూజివ్ గా శ్రధ్దగా వినేయొచ్చు మరొకరి వినికిడితో పనిలేకుండా.

ప్రసేన్ బెల్లంకొండ

ప్రసేన్ సుప్రసిద్ధ కవి, విమర్శకులు, పాత్రికేయులు. నివాసం: ఖమ్మం. ఉద్యోగం టీవీ5 లో స్పెషల్ కరెస్పాండెంత్. పుస్తకాలు చాల వచ్చాయి. అన్నీ కలిపి, 'ప్రసేన్ సర్వస్వం' పేరుతో ఒకే పుస్తకంగా కూడా వచ్చింది.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.