సీమకు న్యాయం కావాలి!

వాదం అనే మాటకు తాత్విక చట్రమని, వివాదమని రెండర్థాలున్నాయి. చాల మంది ఒక దాని కోసం మరొక దాన్ని వుపయోగించి గందరగోళపడుతుంటారు. గందరగోళపెడుతుంటారు. 

ఈ నెల సంపాదకీయం తక్షణ విషయంలోకి వెళ్ళే ముందు కాస్త సిద్ధాంత భూమిక, ఎప్పట్లాగే. 

ప్రాంతీయత, దళితత్వం, స్త్రీత్వం మొదలైనవి బతుకు అస్తిత్వ (ఉనికి) రూపాలు. ఈ అస్తిత్వాలను ఇరుసు చేసుకునే తిరిగే వాదాలు మొదట్లో కొందరి సాంఘిక ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడం దగ్గర ఆగిపోయేవి. తదనంతర కృషితో అవి తాత్వికవాదాలుగా అభివృద్ధి చెందాయి. చారిత్రకంగా చాల మంచి పని చేశాయి. ‘వర్గపోరాటవాదం’ స్పృశించలేని పలు కోణాల్ని అవి స్పృశించాయి. ఈ చైతన్యంతో వెనుకబడిన ప్రాంతాలు, దళితులు, స్త్రీలు… సాగించిన ఆత్మగౌరవ పోరాటాలు సాంఘిక చలనానికి దోహదం చేశాయి. ప్రాంతాలు, దళితులు, స్త్రీలు తమ మీద ఆధిపత్యం చెలాయించే శక్తులను భౌతికంగానే గాక, సైద్ధాంతికంగా కూడా ఎదిరించడానికి ఈ చైతన్యం చక్కని పనిముట్టయ్యింది. పనిముట్టుకు మరింత సాన పెట్టి, చెడుగు మీద పోరాటానికి వుపయోగించాలి. 

చెడ్డవాళ్ళు తాత్వికవాదాలను కూడా స్వార్థానికి వాడేస్తుంటారు, జాగర్త. ‘సిద్ధాంతం వుండాలండీ, సిద్ధాంతం’ అంటో కొందరు బుకాయిస్తుంటారు. దానికి మనం వెంటనే పడిపోగూడదు. ‘ఏ సిద్ధాంతం, దానికీ నీకు ఏమి సంబంధం?’ అని అడగాలి. ఉదాహరణకు: ఫ్రెడరిక్ నీషే ఆలోచనలు చాల ఆలోచింపజేసే డిస్కోర్స్. తాత్విక చింతనలో పెద్ద మైలు రాయి. కాని, హిట్లరు గారి నాజీలు తమ దుర్మార్గాలకు నీషే ‘సూపర్ మ్యాన్’ థీరీని వుపయోగించుకున్నారు. అలాంటి ప్రమాదాలు వున్నా… తాత్వికవాదాలు లోకాన్ని తెలుసుకోడానికి, విశ్లేషించడానికి, ఆచరణకు ఉపయోగపడతాయి. లేకుంటే గుడ్డెద్దు చేలో పడిన చందమవుతుంది. ఎద్దు పచ్చగడ్డి మేస్తుందో, నాముకర్రలు తిని చస్తుందో చెప్పలేం.. 

తాత్వికవాదాలుగా అభివృద్ధి చెందిన అస్తిత్వ చైతన్యాలలో ప్రాంతీయత ఒకటి. దీనికి ఆ పరిణతి ఇవ్వడంలో పాలస్తీనియన్- అమెరికన్ ప్రొఫెసర్ ఎడువర్డ్ సయీద్ కృషి ఎన్నదగినది. తన సిద్ధాంతానికి ఆయన పెట్టిన పేరు ‘ఓరియెంటలిజం’. ఓరియెంట్  అంటే ప్రపంచంలో తూర్పు భాగం. ఐరోపాకు తూర్పున వున్న అరబ్బు దేశాలు, ఇండియా, చైనా వంటి ఆసియా దేశాలు. ఒక్క మాటలో మనం.

మన గురించి పడమటి (ఆక్సిడెంటల్) ప్రపంచం ఎలా వర్ణించిందో మనకు తెలుసు. మనం ఆధ్యాత్మికజీవులం, భోగలాలసులం, మూర్ఖులం, చెట్టు పుట్టలను, జంతువులను పూజించే వాళ్లం, సోమరులం, కొత్తదనం అంటే విముఖులం, మనల్ని మనం పాలించుకోలేని అసమర్థులం, పాశ్చాత్యులే మనను పాలించి పెట్టాలి. ఈ అభిప్రాయం వాళ్లు కలిగివుండడమే కాదు. ఇదే ప్రాచ్య (ఓరియెంటల్) స్వభావమని, ఇదే మన వ్యక్తిత్వమని వాళ్ళు మనకు పాఠాలు చెప్పారు. మనకు మన చరిత్ర అంటే ఇక అదే అయిపోయింది. మన వాళ్లు కూడా ఆ చరిత్ర గొడుగు కిందనే నిలబడి, పాండిత్యం ప్రదర్శించి, అంతర్జాతీయ కీర్తి కొట్టేస్టుంటారు. ఆ వైఖరి పుచ్చుకోకపోతే, పెద్ద పెద్ద విద్యా పీఠాలున్న పాశ్చాత్య లోకం మనకు కీర్తి, డబ్బులు ఇవ్వదు. కమ్యూనిస్టు పరిభాషలో చెప్పాలంటే, దీని వల్ల ఒక కాంప్రడోర్ (దళారీ) మనస్తత్వం ఏర్పడుతుంది. ‘ఉన్నతుడి’ని మెప్పించి పెటీ ఫేవర్స్ పొందే మనస్తత్వం ఏర్పడుతుంది. మనం ఇదీ అని ‘అధికులు’ చెప్పిందే మన గురించి మన అవగాహన కూడా అయిపోవడమే ఓరియెంటలిజం. ఏ ‘ఆధిక్య’ ప్రాంతమైనా తన ‘అధీన’ ప్రాంతంతో వ్యవహరించే వైఖరి ‘ఓరియెంటలిజం’.

పేద రాయలసీమ గురించి సంపన్న కోస్తాంధ్ర వైఖరి ఓరియెంటలిస్టు వైఖరే. సీమ గురించి కోస్తాంధ్ర మేధావుల ప్రచారం ఏమిటో వాళ్లు నిర్మించిన సినిమాలు, వారు నడిపించే పత్రికల కథనాలు చూస్తే తెలుస్తుంది. చారిత్రకంగా సీమ పాలెగాళ్ల గురించి, ఫాక్షనిజం గురించి సినిమాల, పత్రికల ప్రచారంలో నిజమెంత? ఒక కాలంలో అలాంటి హింస ఒక్క సీమలో మాత్రమే లేదు. అన్ని ప్రాంతాల్లో వుంది. మొరటు హింస స్థల వాచికం కాదు, కాల వాచికం. అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలు దాన్నుంచి బయటపడ్డానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాయి. అంతే తేడా. 

ఓరియెంటలిస్టు వైఖరిని గౌరవించడమంటే… ఒక ప్రాంతపు వెనుకబాటుతనం ఆ ప్రాంతానికి స్వాభావికమని, కనుక, విధికి తలవంచి ఆధిక్య ప్రాంతానికి పెరడు (బ్యాక్ యార్డ్) గా బతకడం సహజమని భావించడం అవుతుంది. వెనుకబడిన ప్రాంతాలను సజలం, సఫలం చేసి మిగత ప్రాంతాలలో ఐక్యం చేయడమే నిజమైన పరిష్కారం. వెనుక బడిన ప్రాంతాల నాయకులు, భావుకులు దానికి దోహదం చేయాలి. పురోగామి ప్రాంతాలలోని భావుకులు, ప్రగతిశీలురు బాసటగా నిలబడాలి.

బలవంతుల లోని ‘ఓరియెంటలిస్టు వైఖరి’ దానికి అంగీకరించదు. అసమానతలను అలాగే కొనసాగించాలని ప్రయత్నిస్తుంది. దానికి తగిన ప్రచార సామగ్రిని వినియోగిస్తుంది. వెనుకబడిన ప్రాంతం నుంచి మొదట కాస్త హంబుల్ గా రాను రాను పదునుగా ప్రతిఘటన వుంటుంది. అలాంటి ఘర్షణను ఇటీవల పదే పదే చూస్తున్నాం. మిగులు తెలుగు రాష్ట్రం రాజధాని ఎక్కడ వుండాలనే విషయంలో చెలరేగిన తీవ్ర చర్చ మరీ ఇటీవలిది. 

‘సారూ! మీ ప్రాంతానికి ఏమైనా అన్యాయం జరిగిందా చెప్పండి. మా ప్రాంతానికి జరిగిన అన్యాయం మేము చెబుతున్నాం, వినండి. ఒక మనిషిని వేరొక మనిషీ ఒక ప్రాంతాన్ని వేరొక ప్రాంతం అణిచివుంచడం ప్రజాస్వామ్యంలో (బూర్జువా ప్రజాస్వామ్యం లో కూడా) కుదరదు…’ అని సీమ ప్రజలు, రచయితలు అంటున్నారు. ‘అమర’వాదులు తమ వాదం ఇదిగో ఇదీ అని చెప్పిన పాపాన పోలేదింత వరకు. ‘పెద్దన్నలు’ చిన్న వాళ్ల మీద సాగించే ధాష్టీకం మాటలే వినిపిస్తున్నాయి.  

నాడు చంద్ర బాబు పనికిమాలిన వ్యూహానికి బలైన రైతుల సమస్యను ఇప్పుడు ఎలా పరిష్కరించాలని ఆలోచించకుండా చంద్రవ్యూహాన్ని అలాగే అమలు చేయాలని ఆందోళన. దీనికి కూడా బాబే నాయకుడు కావడం చారిత్రక ప్రహసనం. రాయలసీమకు అన్యాయం, ద్రోహం జరిగిందంటున్న ఆక్రోశం వినబడకుండా అరుస్తున్నారు. వెనుకబడిన ప్రాంతానికి కులాల కుళ్ళు పూసి హోళీలు ఆడుతున్నారు. బాబు గోరు సాగించిన అబద్ధాలు, గ్రాఫిక్ పురాణాలు అయిపోయాయి. ఇప్పుడిక బూతులు, బెదిరింపులు కూడా మొదలయ్యాయి. దీనికి తట్టుకోలేక రాయలసీమ వాళ్లు ఏ కాస్త తప్పుగా మాట్లాడినా ‘చూడు చూడు వాళ్లు. ఇన్నాళ్లు మేం చెప్పలేదా. వాళ్లు జన్మతః  ఫ్యాక్షనిస్టులు, రౌడీలు’ అంటూ తమ ఓరియంటలిస్టు ప్రచారాల్ని బయటికి తీస్తారు. 

సీమ ప్రజలు దాడులు చేయడం లేదు. అవతలి వాళ్ళ మాటలకు జవాబిస్తే ఇస్తున్నారు లేకుంటే లేదు గాని, తప్పుగా మాట్లాడ్డం లేదు. సీమ ప్రజలకు అలాంటి తీరికలు లేవు. వారిది దినదిన జీవన్మరణ సమస్య. సీమ కవులూ, రచయితలు, నాయకులు రైతులను ప్రేమిస్తారు. ఔను, రైతులందరిని… అన్ని ప్రాంతాల రైతులను.. ప్రేమిస్తారు. అమరావతిలో ఆందోళన చేసే వారికి అన్యాయం జరిగి వుంటే దాన్ని ఇప్పటి ప్రభుత్వం సరిదిద్దాలని సీమ ప్రజలు కూడా డిమాండ్ చేస్తారు.

అంతే కాదు. ప్రభుత్వ ప్రకటనలు తమకు న్యాయం చేయవని కూడా సీమ ప్రజలు భావిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు, మిగతా రెండు చోట్ల హైకోర్టు బెంచీలు, అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్ లో సెక్రటేరియట్ అన్నారు. ఇది సరి కాదు. ఇది సీమకు అన్యాయం.

బహుశా ఇవన్నీ గమనించే, ఆనాడు మన పెద్దలు కర్నూలు రాజధానిగా వుండాలని శ్రీబాగ్ సమావేశంలో నిర్ణయించారు. మన కవులు, కవయిత్రుల పాటి వాళ్లకు తెలియక కాదు. 

రాజధాని పూర్తిగా కర్నూలు లోనే పెట్టాలి. అమరావతిలో ఇప్పటివరకు కట్టిన భవనాలను ఏవైనా ప్రభుత్వాంగాలకు వినియోగించాలి. నిర్మాణాలు లేని, మిగిలిన భూములను ఏ రైతులవి వాళ్లకు ఇవ్వాలి. పెంచుకున్న పేరాశలను అర్థం చేసుకోగలం గాని, వాటిని తీర్చడం అసాధ్యం. 

చంద్రబాబు పిల్లనిచ్చిన మామకే కాదు పుటకనిచ్చిన సీమకు కూడా ద్రోహం చేశాడు. అధికారానికి రాగానే ఎవరికీ చెప్పకుండా అమరావతి అనే చోట రాజధాని అనేసి సీమకు ఎనలేని నష్టం చేశాడు. ఆనాడు వయ్యెస్సార్పీపీ దాన్ని సక్రమంగా ఎదిరించలేదు. కారణం ఏదైనా, దానికి జవాబు చెప్పుకోవలసింది జగన్ లేదా ఆయన పార్టీయే. రాయలసీమ ప్రజలు కాదు. జవాబు చెప్పుకోవలసి వస్తోంది కదా అని దయ్యాల్ని బుజ్జగించే ప్రయత్నం జగన్ చేయరని ఆశిద్దాం.

గుంటూరు కృష్ణా జిల్లల్లో చాలమంది మంచి వాళ్ళున్నారు. స్వార్థ, సంకుచిత ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర క్షేమానికి పెద్ద పీట వేసే వారున్నారు. మంచివాళ్ళు ప్రజల వెతలు గ్రహించి సీమ పక్షాన నిలబడతారు. వారికి జేజేలు చెప్పి రాయలసీమ ముందడుగు వేయాలి.

రాయలసీమకు అన్యాయం జరిగింది. కొంచెం కాదు. చాల అన్యాయం జరిగింది. చిరకాలంగా అన్యాయమే జరిగింది. ఇంటి ‘పెద్దన్న’ బాగానే ఎనకేశాడు. చంద్రబాబు ‘ఫెయిట్ అకాంప్లీ’ వ్యూహం ఒక తాజా అన్యాయం మాత్రమే.

వెనుకబడిన సీమ ‘ప్రాంతీయవాదం’ పూర్తిగా న్యాయమైనది. సీమకు వ్యతిరేకంగా సీమేతరుల వాదం… పాశ్చాత్యుల ‘ఓరియెంటలిజం’ మాదిరిగా… అదొక అప్రకటిత అన్యాయ ప్రణాళిక.

వెనుకబడిన ప్రజలకు, సీమకు న్యాయం జరిగే వరకు ఆరాటం ఆగదు, పోరాటం ఆగదు. ఆగరాదు. రాజధాని కోసం మాత్రమే కాదు, నీళ్ళ కోసం, అక్కడికి అనువైన పరిశ్రమల కోసం సీమ జనం డిమాండ్ చేయాలి. అలా కానప్పుడు పాత పెద్దన్న ధోరణి కొనసాగినప్పుడు వేరుపడి సీమ తన అభివృద్ధి తాను చూసుకోవాలి. ప్రజలను దానికి సిద్ధం చేయడానికి సీమ మేధావులు సాహిత్యం, సంస్కృతి తదితర  అన్ని రూపాల్లో ఆలోచనలకు పదును పెట్టాలి.

– కోస్తాంధ్ర నీళ్లను సీమ దోచుకోదు. ఇక ముందు సీమ నీళ్లు దోచుకుని మీరు చేపల చెరువుల కాలుష్యం పెందడానికి వీలివ్వదంతే.

–  విశాఖ మనందరి తీర నగరం గ్రేట్ సిటీ. ఆధునిక పరిశ్రమలకు అనువైన ప్రదేశం, రాజధాని వల్ల ఆ వూరికి అదనంగా వొరిగేది లేదు. ఏమీ అడగని విశాఖకన్న, అన్నీ తనకే కావాలనే గుంటూర్విజయవాడల కన్న…. రాష్ట్రోద్భవ వేళ చేసిన బాసల మేరకు కర్నూలే పూర్తి రాజధానికి అనువైనది. ఈ డిమాండ్ ఇక వొదలొద్దు.

– చంద్రబాబు మాయ కబుర్లకు, గ్రాఫిక్ పురాణాలకు మోసపోయిన రైతులకు నష్టం కలక్కుండా చూడాలి. నష్టం కలక్కుండా చూడడమంటే, స్పెక్యులేషన్ రీత్యా ‘రావలసిన భారీ లాభాలు’ వాళ్ళకు ఇవ్వడం కాదు. అంత భారీ బాధ్యతను ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. తీసుకుని మిగిలిన ప్రాంతాల మీద భారం వేయలేదు.

ఓట్ల వ్యాకరణానికి లొంగి సీమకు అన్యాయం చేస్తే దాని ప్రభావం రాష్ట్రం మీద దీర్ఘకాలికంగా వుంటుంది.

జేజేలు రాయలసీమకు!

జేజేలు తెలుగువాడికి!

27-12-2019

హెచ్చార్కె

8 comments

  • సీమకు జరుగుతున్న అన్యాయాన్ని సైద్ధాంతికంగా పూర్వాపరాలు ఆధారం చేసుకుని గాఢంగా చర్చించిన వ్యాసం ,ఆలోచింపజేసే ది కూడా……

  • ఇంత క్లారిటీని ప్రజల్లోకి ఎవరు ప్రవహింప చేస్తారు? పిల్లి మెళ్లో గంటెవరు కడతారు? ప్రజల ప్రయారిటీ రాజధానులా? రాజధానా? ఈ మార్పు కోసం పోరాడే సమయం, తీరిక ప్రజలకున్నాయా? ఇప్పుడు మాత్రం ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగదని గ్యారంటీ ఏమిటి? మీ అనుభవంతో పాలకుల్ని నమ్మే స్థాయిలో ఉన్నారా? ప్రతిపాదించిన మూడు రాజధానులు అమల్లోకొస్తే ఆంధ్ర ప్రజలకు అద్భుత న్యాయం జరిగిపోతుందా? తదనంతర పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రాజధాని మార్పు ప్రక్రియ అందరికీ సమాన న్యాయం జరుగుతుందా? అమరావతి బాధిత రైతులకు ఏదో ఆకర్షణీయమైన ప్యాకేజీ ఇచ్చి నోరు మూయించేస్తారా? ఇవన్నీ మిలియన్ డాలర్ ప్రశ్నలు! తేల్చనివ్వని శక్తులెన్నో ఉన్నాయ్! Plebiscite నిర్వహించాలి. చూడాలి జగన్ పాలనా పటిమ! అసలు సమస్యలను పక్కదోవ పట్టించి ఫలితమెప్పటికీ తేలని సమస్యలతో ప్రజలను పక్క దోవ పట్టించడంలో మన రాజకీయులు ఘటికులు. ఆంధ్ర రాజకీయం మ్త్రం ప్రస్తుతానికి ఆసక్తికరంగా మార్చి, జనాలతో అంతా ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.

    • థాంక్సెలాట్ రామఫణి గారు, ప్లెబిసైట్ నిర్వహించాలనే సూచన చాల సరైనది. దానికి రైతులు వొప్పుకుంటారు గాని రియాల్టార్లు ఒప్పుకుంటారా?

  • సార్! వెనుకబాటుతనానికి పరిష్కారం రాజధాని ఐతే 60 సం.లు రాజధాని కలిగి ఉన్న తెలంగాణ వెనుకబాటుకు కారణణమేమై ఉండచ్చునంటారు ఆ రాజధానిలో సీమ,కోస్తా నాయకుల నిర్వాకాలు చూసాం కదా అంతెందుకు విభజన అనంతరం సామాన్యులకు తెలంగాణ లో ఒరిగిందేవిటి చెప్పండి,నిజంగా అలా జరిగే అవకాశమేమాత్రమున్నా సీమకు రాజధాని కోసం లేదంటే రాష్ట్రం కోసం పోరాడుదాం.

    • చంద్రశేఖర్ గారు, హైదరాబాద్ చూడమన్నారు. హైదరాబాద్, ఆ చుట్టుపక్కలజల్లాలు రాజధాని కారణంగానే ఆభివృద్ధి చెందాయి. అందుకే వెనుకబడిన ప్రాంతంలోని కర్నూలు రాజధాని కావాలంటున్నాం.రాష్ట్ర విభజన మరింత పెద్దది. జరిగితే సీమ తన అవసరాలు తాను చూసుకోగలుతుంది. తన నీళ్ళు తను వాడుకోగలుతుంది. కనుక సహృదయులైన మీరు మాకు చేయూత ఇవ్వాలని మనవి,

  • టెక్నికల్ అంశాలతో సాగిన మీ ఆలోచన తీరు బాగుంది.అయితే నాయకుల, పాలకుల తీరు మారందే, సామాన్యుడికి బతుకు గండమే.

    • రామారావు గారు, చాల థాంక్సండీ. సీమ సామాన్యుడి మీద రెండు బరువులు. 1. తన పేదరికం, 2. తన ప్రాంత పేదరికం. సీమ సామాన్యుడు తన కోసం తన ప్రాంతం కోసం కూడా పోరాడాలి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.