సీమ‌వాసుల ‘గ్రేట‌ర్’ ఆకాంక్ష‌

మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు కొంద‌రు గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ‌ను తెర‌పైకి తెస్తున్నారు. రాయ‌ల‌సీమ‌లోనే రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఇటీవ‌ల‌ సీఎం జ‌గ‌న్‌కు గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ నేత‌లు లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ అంశం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఇప్పుడు మ‌రోసారి సీఎం మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించార‌ని, వికేంద్రీక‌ర‌ణ‌ను స‌మ‌ర్థిస్తున్నామ‌ని రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌నాయ‌కుడు మైసూరారెడ్డి అన్నారు. అయితే గ‌తంలో క‌ర్నూలు రాజ‌ధానిని త్యాగం చేశామ‌ని, దాన్ని తిరిగి రాయ‌ల‌సీమ‌కే ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.

భాషా ప్రాతిప‌దిక‌న త‌మిళ‌నాడు నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్ప‌డింది. అయితే స్వాతంత్ర్యం రాక ముందు నుంచి కూడా త‌మిళ‌నాడు నుంచి వేరుప‌డాల‌ని ముఖ్యంగా కోస్తాంధ్ర నాయ‌కులు ఉండేవారు. రాయ‌ల‌సీమ ప్రాంత వాసుల స‌మ్మ‌తి లేకుండా త‌మిళ‌నాడు నుంచి వేరుప‌డ‌డం సాధ్యం కాద‌ని వారికి తెలుసు. అందుకే త‌మ డిమాండ్‌ను రాయ‌ల‌సీమ వాసుల‌తో పంచుకున్నారు. అయితే కోస్తా వాసుల‌తో క‌లిసి ఉండ‌లేమ‌ని, ఉంటే త‌మిళుల‌తో లేదంటే రాయ‌ల‌సీమ రాష్ట్రంగా వేరుప‌డ‌డం మంచిద‌ని నాడు రాయ‌ల‌సీమ నాయ‌కులు పప్పూరి రామాచార్యులు, క‌డ‌ప కోటిరెడ్డి త‌దిత‌ర పెద్ద‌లు భావించారు.

ఈ నేప‌థ్యంలో ఎలాగైనా రాయ‌ల‌సీమ వాసుల‌ను ఒప్పించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌ట్టాభి త‌దిత‌ర కోస్తా నాయ‌కులు ఒత్తిడి తెచ్చారు. ఆ ప‌రిస్థితులు, అవ‌స‌రాల రీత్యాల ఆవిర్భ‌వించిందే శ్రీ‌బాగ్ ఒడంబ‌డిక‌. 1937, న‌వంబ‌ర్ 16న మ‌ద్రాస్‌లో కాశీనాథుని నాగేశ్వ‌ర‌రావు నివాస‌మైన శ్రీ‌బాగ్‌లో రాయ‌ల‌సీమ‌, కోస్తా నాయ‌కులు స‌మావేశ‌మై ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్ర‌కారం రాయ‌ల‌సీమ‌కు రాజ‌ధాని లేదంటే హైకోర్టు…ఈ రెండింటిలో సీమ వాసులు ఏది కోరితే దాన్ని ఆ ప్రాంతంలో పెట్టాలి. అలాగే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, విద్యాసంస్థ‌ల ఏర్పాటు త‌దిత‌ర అంశాల్లో సీమ వాసుల‌కు ప్రాధాన్యం క‌ల్పిస్తూ చేసుకున్న ఒప్పందానికి శ్రీ‌బాగ్ ఒడంబ‌డిక అని పేరు.

భాషా ప్రాతిప‌దిక‌న ఆంధ్ర రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత 1937లో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారమే క‌ర్నూల్‌లో రాజ‌ధాని ఏర్పాటు చేశారు. మొట్ట‌మొద‌టి ముఖ్య‌మంత్రి టంగుటూరి ప్ర‌కాశంపంతులు. ఆ త‌ర్వాత మూడేళ్ల‌కు తిరిగి తెలుగు వారంతా ఒక రాష్ట్రంగా ఏర్ప‌డాల‌నే ఉద్దేశంతో 1956లో తెలంగాణ‌తో క‌ల‌సి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆవిర్భ‌వించింది. దీనికి హైద‌రాబాద్ రాజ‌ధానిగా ఏర్పాటు చేసుకున్నారు.

హైద‌రాబాద్ కేంద్రంగానే అభివృద్ధినంతా కేంద్రీక‌రించారు. పేరుకు రాయ‌ల‌సీమ, కోస్తా పాల‌కులు ఉన్న‌ప్ప‌టికీ అభివృద్ధి అంతా హైద‌రాబాద్‌లోనే జ‌రిగింది. రాయ‌ల‌సీమ‌కు చెందిన నీలం సంజీవ‌రెడ్డి, కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, దామోద‌ర్ సంజీవ‌య్య‌, నంద‌మూరి తార‌క‌రామారావు (హిందూపురం ఎమ్మెల్యే), చంద్ర‌బాబునాయుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి , న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వ‌ర‌కు రాయ‌ల‌సీమ నుంచి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిథ్యం వ‌హించారు. అయినా రాయ‌ల‌సీమ‌కు ఒరిగిందేమీ లేదు.

ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంతో తెలంగాణ ఉద్య‌మం ఊపందుకొంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో  తెలంగాణ ఉద్య‌మాన్ని అడ్డుకునే పాల‌కులు లేక‌పోయారు. ఎట్ట‌కేల‌కు 2014లో ప‌ది జిల్లాల‌తో ప్ర‌త్యేక తెలంగాణ , 13 జిల్లాల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌రించాయి. అయితే ఈ 13 జిల్లాల ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త‌దేమీ కాదు. 1956లో క‌ల‌యిక‌కు ముందున్న‌దే.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ కూట‌మి గెలుపొందింది. దీంతో నారా చంద్ర‌బాబునాయుడు నేతృత్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేశారు. రాజ‌ధాని నిర్మాణానికి రైతుల నుంచి 33 వేల ఎక‌రాలు, ప్ర‌భుత్వ భూమి 20 వేల ఎక‌రాలు సేక‌రించారు. అయితే రాజ‌ధాని నిర్మాణానికి ల‌క్ష కోట్ల రూపాయ‌లు కావాల‌ని చంద్ర‌బాబు అడ‌గ‌డం, మోడీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ కేవ‌లం రూ.1500 కోట్లు ఇవ్వ‌డం తెలిసిందే. కేవ‌లం తాత్కాలిక భ‌వ‌నాల‌ను నిర్మించిన చంద్ర‌బాబు ప్ర‌పంచాన్ని త‌ల‌ద‌న్నే రాజ‌ధాని నిర్మించ‌డం త‌న క‌ల అంటూ వ‌చ్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంతో పాటు రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో కేంద్రం నుంచి టీడీపీ వైదొలిగింది. అప్ప‌టికి ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది మాత్ర‌మే మిగిలి ఉంది.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోని వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల‌తో తిరుగులేని విజ‌యాన్ని వైసీపీ సొంతం చేసుకొంది. ఇప్ప‌టికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌ల‌వుతోంది. ఈ నెల 17న అసెంబ్లీలో జ‌గ‌న్ చేసిన మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. అమ‌రావ‌తిలో అసెంబ్లీ, విశాఖ‌లో ప‌రిపాల‌నా రాజ‌ధాని, క‌ర్నూల్‌లో న్యాయాల‌య రాజ‌ధాని కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యించింది.

దీంతో త‌మ‌కు  రాజ‌ధాని ఇవ్వాల‌ని లేదంటే రాయ‌ల‌సీమ జిల్లాల‌తో పాటు నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌ను క‌లుపుకుని రాయ‌ల‌సీమ రాష్ట్రంగా ఏర్ప‌డుతామ‌ని గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ క‌మిటీ నాయ‌కులు డాక్ట‌ర్ ఎంపీ మైసూరారెడ్డి, మాజీ డీజీపీలు దినేష్‌రెడ్డి, ఆంజ‌నేయ‌రెడ్డి, చెంగారెడ్డి త‌దిత‌రులు డిమాండ్ చేస్తున్నారు.

గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ‌ను రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే దేశంలోనే నెంబ‌ర్ ఒన్ రాష్ట్రంగా అభివృద్ధి సాధిస్తామ‌ని వారు చెబుతున్నారు. రాయ‌ల‌సీమ‌ను అభివృద్ధి చేసుకునేందుకు అన్ని ర‌కాల వ‌న‌రులు అందుబాటులో ఉన్నాయ‌ని వారు చెబుతున్నారు. ఇనుప ఖ‌నిజం, మంగంపేట బెరైటీస్‌, శేషాచ‌లం కొండ‌ల్లో ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన , నాణ్య‌మైన ఎర్ర‌చంద‌నం, విస్తార‌మైన ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూమి, తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి, శ్రీ‌శైలం మ‌ల్ల‌న్న‌, శ్రీ‌శైలం ప్రాజెక్టు, సోమ‌శిల‌, కండ‌లేరు జ‌లాశ‌యాలు, ఇత‌రత్రా అనేక వ‌న‌రులున్నాయ‌ని వారు వెల్ల‌డిస్తున్నారు.

అమ‌రావ‌తి కేంద్రంగా అభివృద్ధి కేంద్రీక‌ర‌ణ చేప‌డితే మాత్రం మ‌రోమారు రాయ‌ల‌సీమ ఉద్య‌మం కొన్నేళ్ల‌కైనా త‌ప్ప‌క పోయి ఉండేది. అయితే సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న మంచో, చెడో…ఇప్పుడే ఆ ప‌రిస్థితులు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. ఇప్పుడు ఏదో ఒక తేలాల్సిన అనివార్యం….విడ‌వ‌మంటే క‌ప్ప‌కు, క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం అనే చందంగా మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌పై ప్ర‌భుత్వం ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గినా ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాలు ఊరికే ఉండే ప‌రిస్థితి లేదు. ఒక‌వేళ ఏవైనా కార‌ణాల‌ను సాకుగా చూపి చంద్ర‌బాబు అడ్డుకున్నా అత‌ని రాజ‌కీయ జీవితానికి చ‌ర‌మ‌గీతం పాడేందుకు ఆ రెండు వెనుక‌బ‌డిన ప్రాంతాలు త‌గిన స‌మ‌యంలో వాత పెట్ట‌క త‌ప్ప‌దు.

రాయ‌ల‌సీమ వాసులు మాత్రం ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల‌ను క‌లుపుకుని గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ‌గా ఒక ప్ర‌త్యేక రాష్ట్ర‌మే కావాల‌నే డిమాండ్ చేస్తున్నారు. అయితే సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా అలాంటి బ‌ల‌మైన ఆకాంక్ష ఈ ప్రాంత ప్ర‌జ‌ల్లో ఉండ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం.

సొదుం రమణా రెడ్డి

సొదుం ర‌మ‌ణారెడ్డి:  స్వస్థలం క‌డ‌ప జిల్లా వీర‌పునాయునిప‌ల్లె మండలం ఉరటూరు గ్రామం. జ‌ర్న‌లిస్టుగా 17 ఏళ్ల అనుభ‌వం. రాయ‌ల‌సీమ‌కు సాగు, తాగునీటిని సాధించే మ‌హ‌త్త‌ర కార్యానికి చాతనైన సాయం చేయాల‌ని ఆకాంక్ష.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.