ఒక నిద్రలు…

సారీ…

నాకిప్పుడు కూడా నిద్రొస్తోంది…

నాకు నిద్రపోవాలని వుంది. బడికి వెళ్ళకుండా బజ్జోవాలని వుంది. ప్లీజ్…

ప్చ్… రోజూ యింతే!

తలచుకుంటే నాకేడుపొస్తోంది.

మాంచి నిద్రలో వుంటానా? అప్పుడే తెల్లవారిందని నిద్ర లేపేస్తారు. మామూలుగా కాదు. దుప్పటి లాగేస్తారు. ఫేను ఆపేస్తారు. జుట్టు చెరిపేస్తారు. గాట్టిగా బుగ్గ కొరికేస్తారు. నీళ్ళు తెచ్చి మీద చల్లేస్తారు. పైగా వర్షం పడుతోందని చెపుతారు. అమ్మో అంటారు. అయ్యో అంటారు. టైం అయిపోయింది అంటారు. కొంప ములిగిపోయింది అంటారు. ఉలిక్కి పడేలా అరుస్తారు. చేతి మీద వాచీ పడేలా కరుస్తారు. ఒక్కోసారి లేపినా లేవలేదని వేడి టీ నో, వేడి అట్లకాడనో తగిలిస్తారు. ఒక్కోరోజు వొక్కోటి చేస్తారు. కాని రోజూ ఆపకుండా నా నిద్ర ఆపడానికి చేస్తూనే వుంటారు.

ఏమైనా అంటే బడికి టైం అయిపోయిందని అంటారు.

అమ్మకీ నాన్నకీ నాయనమ్మకీ తాతయ్యకీ లేని బడి నాకే యెందుకు వుంటుందో తెలీదు?

కళ్ళు తెరవకముందే నోరు తెరవమని అమ్మ నా నోట్లో బ్రష్ పెట్టేస్తుంది. మళ్ళీ పేస్టు పడిపోయిందని- దేనికో అంటుకుందని- తిట్లు తిట్టేస్తుంది. నేను పల్లు తోముకోకముందే వాళ్ళే తోమేస్తారు. గుగ్గుగ్గా చెయ్యమంటారు. నోట్లో నీళ్ళు పోసి నా వొళ్ళంతా తడిపేస్తారు. మింగేసిన నీళ్ళని వుయ్యమంటారు. ఉమ్ముని వూస్తాను. నా షర్టు వొకరూ నిక్కరొకరూ లాగేస్తారు. ఏడ్చినా ఆగరు. నిద్రొచ్చినా ఆపరు. వాష్ రూమ్లోకి తోసేస్తారు. కూర్చోక ముందే అయ్యిందా అంటారు. ఇంకా అవలేదా అంటారు. అక్కడే ముసలైపో అంటుంది నానమ్మ. వాడిని వెళ్ళనీ అంటారు తాతయ్య. వెళ్తున్న వాడ్ని ఆపి, నువ్వు కూల్ గా వెళ్ళు.. మీ అమ్మకి నే చెప్తా అంటారు నాన్న. అలా నాన్న మాట్లాడడమో యెవరో వొకరు మాట్లాడడంతో ఆగిపోతుంది. నిజం చెప్పాలంటే నిద్రకి ఆవలింత వస్తుంది కాని అది రాదు…

దాచడమెందుకు చాలా సార్లు నిద్రకు కునికిపాట్లు పడి పడ్డాను. అప్పటి నుండి చెయ్యి పట్టుకొని షిట్ కు వెళ్ళమంటారు. లేదంటే డోర్ దగ్గర వుంటారు. వెళ్ళో వెళ్ళకో బయల్దేరాలి. అవతల యే హారన్ మోగినా అమ్మ అంతకన్నా హర్రీ బర్రీ గా అరుస్తుంది. నా వర్రీ నీకేం అర్థమవుతుంది అంటుంది. బస్సు తప్పిపోతే యింక స్కూలుకు దిగబెట్టాలి. ఇల్లు తల్లక్రిందులై పోతుంది. తాతయ్య యిన్నాళ్ళలా స్కూటర్ నడపలేరని అమ్మే వద్దనేస్తుంది. అసలు విషయం చెప్పనా నాకు స్కూటరు మీద కూడా నిద్ర వచ్చేస్తుంది. ఎక్కడైనా వచ్చేస్తుంది.

అమ్మ అన్నం తినిపిస్తుందా? ముద్ద నోట్లో పెట్టుకుంటానా? అప్పుడు కూడా నిద్ర వచ్చేస్తుంది. అమ్మ వొక్క కేక వేస్తుందా? ఉలిక్కిపడి మింగుతాను. మింగక ముందే మరో ముద్ద. ముద్దముద్దకూ నిద్ర.

బట్టలు వేసినా నిద్రే… తల దువ్వినా నిద్రే… పౌడరు రాసినా నిద్రే… టై కట్టినా నిద్రే… సాక్సులు వేసేలోపల కూడా నిద్రే… బూట్లు వేసేలోపల కూడా నిద్రే…

నిద్రపోతున్నా వొదలకుండా తీసుకువెళ్ళి స్కూలు బస్సులో పడేస్తారు.

వీడు కడుపులో వున్నప్పుడు నువ్వు సరిగ్గా నిద్రపోలేదే- అంటుంది నానమ్మ. అమ్మకి ఆన్సరు  యిచ్చే తీరికుండదు.

బస్సులో కూడా నిద్రపోతున్నాడని నాన్న అమ్మకి చెప్పడం…

క్లాసులో కూడా నిద్రపోతున్నాడని అమ్మ చెప్పడం…

ట్యూషన్లో కూడా నిద్రపోతున్నాడని తాతయ్య చెప్పడం…

నిద్రొస్తోంది అని నేను చెప్పడం…

వినే వాళ్ళేరి?

అత్తయ్యా మావయ్యా వాళ్ళు వచ్చినప్పుడు అడిగారు. ‘పెద్దయ్యాక యేమవుతావు?’ అని.

‘నేను పెద్దయ్యాక మంచిగ నిద్రపోతా’

అందరూ యెందుకు నవ్వారో నాకు తెలీదు.

క్లాసులో నాకు లాగే నిద్రపోయే వాళ్ళున్నారు. ఒకరికి నిద్ర వస్తే అందరికీ నిద్ర వస్తుంది- అని ఆవలింత తీస్తూ టీచరు లేపేస్తుంది. కాని అందరూ వూగి తూగి డింగ్ డిచక్ మని తలలు తగులుతూ కొట్టుకుంటూ చక్కగా నిద్రపోతాం.

స్నాక్స్ అని నిద్ర లేపేస్తారు.

లంచ్ అని నిద్ర లేపేస్తారు. డ్రాయింగ్ అని, ప్లేయింగ్ అని, సింగింగ్ అని… యేదో వొకటని నిద్ర లేపేస్తారు. ఈ పెద్దాళ్ళు నిద్రపోరు. నిద్ర పోనివ్వరు.

మూడేళ్ళకు పిల్లల్ని స్కూల్లో వెయ్యడం తెలుసును గానీ వాళ్ళకి పద్దెనిమిది గంటలు నిద్ర వుండాలని తెలీదు. టీవీలో నిద్ర గురించి చెప్పారు కాబట్టి నాకు గుర్తుంది. స్కూలూ ట్యూషనూ యింట్లో స్టడీ… అబ్బా అలసిపోతున్నానబ్బా… ఒరే నీయబ్బా నాకు నిద్రపోవాలని వుందొరే- అని అరవాలని వుంది. డీసెంట్ కాదని నోర్మూసుకు వుంటున్నా.

అప్పుడెప్పుడో మా స్కూల్లో పిల్లలందరూ ‘ఉయ్ వాంట్ జస్టిస్’ అని అరిచారట. పొద్దున్న ఆరున్నర నుండి రాత్రి యేడున్నర వరకూ స్కూల్లో చస్తే, ట్యూషన్నుండి యింటికి వచ్చేసరికి రాత్రి పదకుండు అవుతుందని పెద్దక్లాసుల వాళ్ళు గోలగోల చేశారట. కంప్లైంట్ కలెక్టరు దాక వెళ్ళిందట. అమ్మా నానమ్మా మాట్లాడుకుంటే విన్నా. పెద్ద పిల్లల సంగతి సరే, మా చిన్న పిల్లల సంగతి యెవరికీ పట్టదా? అమ్మనాన్నలకీ పట్టదు. స్కూలు టీచర్లకూ పట్టదు. ఎవరికీ పట్టదు.

మా పిల్లలకి నిద్రలేకుండా చేసేదాక యీ పెద్దాళ్ళకి నిద్ర పట్టదు.

అబ్బా… చెప్పి చెప్పి అలసిపోయాను…

సారీ…

నాకిప్పుడు కూడా నిద్రొస్తోంది…

నాకు నిద్రపోవాలని వుంది. బడికి వెళ్ళకుండా బజ్జోవాలని వుంది. ప్లీజ్…

– రాహుల్,

ఒకటో తరవతి, 

గౌతమ్ మోడల్ స్కూల్.

 

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.