జులుం&జబర్దస్తీ

రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఏదో నవల. ఒక లోకల్ పోలీసాయన లోకల్ పౌరుడి వద్ద లంచం డిమాండ్ చేస్తాడు. లంచం ఇవ్వకుంటే కేసు తప్పదంటాడు. ఏం కేసు, ఏ నేరం? అడుగుతాడు పౌరుడు. జె అండ్ జె సెక్షన్ కింద కేసు అంటాడు పోలీసాయన. అదేంటి, అదేం సెక్షన్? పౌరుని హాచ్చెర్యం. జులుం&జబర్దస్తీ సెక్షన్ అని పోలీస్ వివరణ.

ఆ మాత్రానికి పోలీసే కానక్కర్లేదు. పోలీసేతరులు కూడా చాల సార్లు ఈ సెక్షన్ ను ప్రయోగిస్తుంటారు. 

ఎక్కడ మాటలు వుండి, చర్చ వుండదో అక్కడ జులుం, జబర్దస్తీ వుండును. 

జులుం, జబర్దస్తీ అంటే మాటలు మానేసి, బాహాబాహీకి దిగడం కాదు.

అచ్చం బాహాబాహీకి దిగడం బాగానే వుంటుంది. అందులో ఒక సౌలభ్యం వుంది. దైహిక బలహీనుడు, వాడి బుర్రలో ఏమాత్రం గుంజు వున్నా, అలాంటి పేచీకి దిగడు. పేచీ పెట్టుకున్నది అవతలోడయినా, బలహీనుడు నమస్తే అన్నా తప్పు కాయి అని సాష్టాంగపడతాడు, లేదా చెప్పా పెట్టకుండా జారుకుంటాడు. అంతే, ఖేల్ ఖతం దుకాన్ బంద్. పేచీలో తన ప్రయోజనాలు ఏమైనా వుంటే, అప్పటికి వెళిపోయి, బలం కూడగట్టుకుని వచ్చి అప్పుడు గాదు, ఇప్పడు రారా అని సవాలు చేస్తాడు.

బాహాబాహీ కి ప్రజాస్వామ్యంలో స్థలం లేదు. ప్రతిదీ చర్చ ద్వారా పరిష్కారం కావాలి. చర్చ దీర్ఘకాలం సాగినా సరే, చర్చకు బయట పరిష్కారం ప్రజాస్వామ్యం కాదు.  

చర్చలో ఒకరు మరొకరి తర్క బుద్ధికి, నైతిక దృష్టికి అప్పీల్ చేస్తారు. తర్కబద్దంగా చెప్పి వొప్పించడం ద్వారా, అవతలి వారిలో మంచితనాన్ని నిద్ర లేపడం ద్వారా తమ వాదం నెగ్గించుకుంటారు. స్వీయ ప్రయోజనాలు సాధించుకుంటారు.

అవతలి వాడి తర్కబుద్దిని, మంచితనాన్ని నిద్రలేపలేనప్పుడు? అప్పుడేం జరుగుతుంది? 

అప్పడు మరొకరి ప్రమేయం అవసరమవుతుంది, మూడో మనిషి ప్రమేయం. మూడో మనిషి మొదటి ఇద్దరి వివాదంలో మంచి సెబ్బర చూసి తన అభిప్రాయం చెబుతాడు. ప్రత్యేకించి చెప్పకపోయినా, మూడో వాడి ప్రవర్తనలో అది తెలుస్తుంది.  

ఆ మూడో మనిషి ఒక పంచాయతీ పెద్దమనిషి కావొచ్చు. కోర్టులో న్యాయమూర్తి కావొచ్చు. అలాంటి స్థాయిఏదీ లేని పొరుగు మనిషి కావొచ్చు. ఈ చివరి వాడు, ఈ వీధి మానిసి, ఆమ్ ఆద్మీ చాల కీలకం. వాడు మూడో కన్ను లాంటి వాడు. వాడికి కోపం వొచ్చినా కరుణ కలిగినా అది అపరిమితం. అది కాల్చేస్తుంది. లేదా చిరంజీవిని చేస్తుంది. 

ఎందుకంటే, మూడో వాడు/ఆమె ఒక్కరు కాదు. ఒక్కోసారి ఒక్కొక్కరుగా కనిపిస్తారు గాని ఒక్కరు కాదు, పదుగురు. పదుగురాడు మాట పాటియై ధర జెల్లుఅన్న వేమన్న మాట లోని పదుగురు ఆతడే/ఆమే. ఎందుకంటే  వివాదం, దాని మీద మూడో మనిషి మాట అక్కడితో ఆగవు. గాలి మాదిరి కనిపించీ కనిపించకుండా కమ్యూనిటీలో విస్తరిస్తాయి. తదనంతర పరిణామాల మీద ప్రభావం చూపిస్తాయి. సమాజ చేతనలో ఇంకిపోతాయి.

రామ, రావణ యుద్దం లంకలో ముగియలేదు. అక్కడితో సీతమ్మ చెర వదలలేదు. అయోధ్యలో ఒక పేదవాడి మాటకు…. అంటే, ఒక ‘పదుగురాడిన మాట’ కు జడిసి… మన మర్యాదా పురుషోత్తముడు… పెళ్లాన్ని వొదిలేసి… తన మర్యాదను, పురుషత్వాన్ని, అందులో ఉత్తమత్వాన్ని కాపాడుకుంటాడు. 

రామచంద్రుని తప్పొప్పుల విచికిత్స అక్కర్లేదు. సమాజంలో వూరూరికి, వీధి వీధికి, ఇంటింటికీ ఒక మర్యాదా పురుషోత్తముడున్నాడు. ఇంకా చాల కాలం వుంటాడు. ఇంటింటా ఒక  సీతమ్మ కూడా వుంది. ఉంటుంది, చాలా కాలం. ఇది లోక రీతి. లోకం పని చేసే విధం. 

సో దేర్ఫోర్, వివాదం ఏదయినా, 

మనుషులు తమ ప్రయోజనాల్ని కాపాడుకోడానికి 

లేదా

అవతలి వాళ్ల ప్రయోజనాల్ని దెబ్బతీసి లాభం పొందడానికి

ఈ మూడు పద్దతుల్నీ వినియోగిస్తారు. అవతలి వారికి తార్కికంగా నచ్చజెప్పడానికి, లేదా అవతలి వారి మంచి తనాన్ని నిద్రలేపి వాడుకోడానికి, లేదా మూడో పార్టీ అయిన పదుగురి అభిప్రాయాన్ని తమకు అనుకూలం చేసుకోడానికి ఎవరికి వారు ప్రయత్నిస్తారు. 

మనం నిత్యం ప్రజాస్వామ్యం అని చెప్పుకునే దానికి మూలకందం చర్చ. 

చర్చలో పాల్గొనే వాళ్లకు ఈ మూడూ కత్తీ, డాలు, కవచం లాంటి ఆయుధాలు.

ఇందులో బాహాబాహీ వుండదు. బాహాబాహీ వుంటే అది ప్రజాస్వామ్యం కాదు. అది ఎటు వైపు నుంచి వున్నా, ఆ మేరకు అది నియంతృత్వమే.  

చర్చా-చర్యలో మాటలే కత్తులు, డాళ్లు, కవచాలు, రథాలు, రయ విచల త్తురంగాలు.

మరి ఇందులో జులుం ఎక్కడుంది? జబర్దస్తీ ఎక్కుడుంది సార్? 

ఓర్నాయినో, ఉంది. బోలెడంత వుంది. అది మన చుట్టూరా వుంది. మనల్ని ముంచెత్తేంతగా వుంది. దాన్నే మనం పీలుస్తున్నాం. నిశ్వసిస్తున్నాం. 

చిన్న ఉదాహరణ.

మిగులు తెలుగు రాష్ట్రం రాజధానిగా అమరావతి ఒక్కటే వుండాలా, లేక మూడు రాజధానులు వుండాలా అనే చర్చ ఇప్పటికీ మన మెదళ్లను తినేస్తోంది. ఒక చర్యగా ఇది ఒక కొలిక్కి వచ్చినట్లే వుంది గాని, ఇందులో రావిశాస్త్రి నవలలోని పోలీసాయన కూల్ గా ప్రకటించిన జె&జె సెక్షన్ నేరుగా, అనేరుగా… పలు విధాలుగా దర్శనమిచ్చింది. 

దీనివల్ల తెలుగు సమాజానికి తగిలిన గాయాలు ఇప్పుడిప్పడే మానవు. మానినా మచ్చలు చిరకాలం వుంటాయి. కాస్త చెడుగాలి సోకితే గాయాలు తిరిగి తిరిగి రేగుతుంటాయి. ఎవరూ ఎవర్నీ నమ్మరు. అపనమ్మకమే అతి పెద్ద గాయం, ఏ జాతికైనా.

తెలుగు జాతీయతఅనేది ఏమైనా వుంటే, దాని మీద ఈ గాయాలు ప్రభావం చూపిస్తాయి. 

రాజధాని వికేంద్రీకరణే కాదు, ప్రాథమిక విద్యా మాధ్యమం, గ్రామ సచివాలయాలు. వలంటీర్ వుద్యోగాలు, విద్యుత్ ఒప్పందాలు… అన్నిటిలో వాదోపవాదాలు జులుం జబర్దస్తీ సెక్షన్ పట్టాల మీదనే నడిచాయి. 

జె&జె సెక్షన్ వుపయోగించే వాళ్లు చర్చను అసలు విషయం దగ్గర వుంచరు. విషయాల్ని విషయేతరాలతో కలగాపులగం చేస్తారు. చర్చలో భాష బురద బురద అవుతుంది. 

మనకు వీలుంటే, మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కోసం ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నామా లేక ప్రభుత్వ/ప్రైవేటు బడులలో తెలుగు మీడియంలో చదివిస్తున్నామా అనే సింపుల్ ప్రశ్నకు జవాబు చెప్పం. మనం వాస్తవంగా ఏం చేస్తున్నాం, అలా ఎందుకు చేస్తున్నాం… అని విశ్లేషించుకోం. చిన్నపిల్లలు ఇంట్లో మాట్లాడని భాషలో సైన్సూ అవీ (ప్రాథమిక స్థాయిలో కూడా) చదువుకోడం సాధ్యమా, కాదా? అది అసాధ్యమయితే, మరి కాన్వెంట్లలో ఎలా సాధ్యమవుతోంది? దాని వల్ల పిల్లలకు జరుగుతున్న నష్టం ఏమిటి? ఆని మన జీవితానుభవాల్ని మనం బేరిజు వేసుకోం. అనుభవాల నుంచి పాఠాలు తీసుకోం. 

‘శేషం కోపేన పూరయేత్’ అన్నట్లు… మాతృభాష, సంస్కృతి, పరభాషా దాస్యం, బానిసత్వం వంటి సెంటిమెంట్ల గులకరాళ్లతో వడిసెలలు తిప్పుతాం. అమ్ములు సారిస్తాం. అలాంటి చర్చలో గాయాలు తప్ప ఏమీ మిగలవు.  

అమరావతి’ యవ్వారానిది కూడా అదే దారి. అక్కడ రైతులకు నష్టం కలక్కుండా ఎలా చూడాలనేది తప్పక జరగాల్సిన చర్చ. దాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే కాలర్ పట్టుకుని నిలదీయాలి.

రాజధాని అనేది ఒక రాష్ట్రం సమస్య. కొన్ని గ్రామాల సమస్య కాదు. 

వేరుగా, కొన్ని గ్రామాల రైతులది కూడా తప్పక సమస్యే. 

ఒక సమస్య కోసం ఇంకో సమస్య ఆగదు. ఆగకూడదు. ఆపడానికి చేసే కృత్రిమ ప్రయత్నం ‘జులుం&జబర్దస్తీ సెక్షన్’ కాక తప్పదు. అదే జరిగింది. 

రద్దవుతున్న శాసన మండలి చివరి రోజుల్లో ఎవరో… బెజవాడ రౌడీయిజం చూపిస్తామని కూడా అనేశారు. రాయలసీమ ఫ్యాక్షనిజం అనే వాగుడుకు బెజవాడ రౌడీయిజం వదురుడు తోడు కావడం బానే వుంది. రెండు నకారాలు ఒక సకారం కావడమూ మంచిదే. కాని, ఇది జులుం&జబర్దస్తీయే. అటు ఇటు మిగిలిపోయేవి గాయాలే.   

ఈ పాటకు కొన్ని పత్రికలు పక్క వాద్యాలయ్యాయి. అమరావతి అనే స్థలం ఎంత గొప్ప బౌద్ధక్షేత్రమో, ఈ బౌధ్ధక్షేత్రం అభివృద్ధి అయితే చైనాఇండియా సంబంధాలు ఎంత గొప్పగా మెరుగుపడతాయో… అంటో అదనపు సెంటిమెంట్లు పండించాయి. ఆ పని చేసింది చిన్నా చితక టాబ్లాయిడ్ లు కాదు. తెలుగు మర్యాదా పురుషోత్తముల పత్రికలు. 

‘అంతర్జాలం’ రచ్చబండ మీద జె&జె సెక్షన్ మరింత పదునెక్కింది. తమను కాదన్న వారి మీద పాలక, ప్రతిపక్ష పార్టీల ముద్ర వేశారు, ఆ పార్టీ నేతల కులాల ముద్ర వేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే, రుజువు సాధ్యం కాని సెంటిమెంటల్ బురద చల్లి, మానసికంగా హింసించి, నోరు మూయించే హైన్యానికి ఇరువాగుల వారు వొడిగట్టారు.

నిజానికీ హీనత్వాన్ని పాలక ప్రచార యంత్రాలు ఒక కొత్త కళగా అభివృద్ధి చేశాయి. దానికి ఆడవారి ఆభిజాత్యాలపై దాడికి సైతం వొడిగట్టాయి. 

ఇదంతా నాలుగు కాసుల లంచం కోసం రావిశాస్త్రి నవలలో పోలీసాయన అనుసరించిన జె&జె సెక్షన్ విశ్వ రూపమే. 

ఇలాంటివి ఎంతోకాలం కొనసాగవు. ప్రజలు స్వార్థపరులుఏ గుడి కాడో దేవుడి కాడో దేశభక్తి జెండా కాడో… సెంటిమెంట్లు పని చేస్తాయి. రోజువారీ జీవితాల్ని తాకే సమస్యల్లో తమకు ఏం కావాలో అదే ప్రజలు చూసుకుంటారు.  

అది నిజమే గాని, ఒక సమూహంగా తెలుగు వాళ్ల ఐక్యత మీద. తెలుగు భాషోన్నతి మీద ఈ కశ్మలం చూపించే ప్రభావం అనన్యం.

బడిలో పేద పిల్లల మీద బలవంతంగా తెలుగు మీడియం రుద్దితే తెలుగు బతకదు. తెలుగువాళ్లమంతా ఒకటి, ఒకరి కోసం పదుగురం, పదుగురి కోసం ఒకరం అనే భావన నిత్యజీవితంలో వేరూనితే… మనం మాట్లాడే భాష బతికి బట్టకడుతుంది. లేకుంటే విద్వేష, వైషమ్యాలు మిగుల్తాయి. తెలుగువాళ్ళం ఇప్పటికే చెదిరాం. మరింత చెదిరి, చెట్టుకొకరు పుట్టకొకరు అవుతాం. 

ముందుగా తెలుగు జాతి, తరువాత తెలుగు భాష అంతరిస్తాయి.

ఆలోచిస్తారా?! 

జులుం&జబర్దస్తీ ఆపేసి, చర్చిస్తారా?!

చర్చలో వెనుకబడిన ప్రాంతాల/ప్రజల అవసరాల్ని గుర్తించి, వారిని కలుపుకుని పోవలసిన అవసరాన్ని ఒకింత పరిగణిస్తారా?

30-1-2020

హెచ్చార్కె

4 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.