దుఃఖంలో ఉన్నప్పుడు…

దుఃఖంలో ఉన్నప్పుడంతే!
ఏమీ కనపడదు,
ఏమీ వినపడదు,
ఏమీ గుర్తుండదు.
 
దుఃఖంలో ఉన్నప్పుడంతే!
దగ్గర వాళ్ళు పరాయివాళ్ళయిపోతారు.
పరాయి వాళ్ళు -దగ్గర వాళ్ళయిపోతారు.
దూరమైన వాళ్ళు ఇంకా దూరమై పోతారు.
దూరమై దూరమై దగ్గరైపోతారు.
 
మనుషులు వదులు కావడం, మనుషులు పట్టు బిగించడం,  మనసుకు దగ్గర కావడం ,
మనుషులు కలవటం;
కలగలసి పోవటం,
విడిపోవడం; దాక్కోవడం,
స్నేహం పోగొట్టుకోవటం,
దయని, ఔన్నత్యాన్ని, పిరికితనాన్ని, లోభత్వాన్ని, కఠినత్వాన్ని, మెతకదనాన్ని
దుఃఖిస్తున్నప్పుడే తెలుసుకుంటాం!
 
మనం ఎవరో తెలుసుకుంటాం 
మనతో ఎవరో తెలుసుకుంటాం
 
అర్థమైనవి,
అంగీకరించలేనివి,
ఉల్లిపొరలా కప్పబడినవన్నీ
గ్రహింపులోకి రావడమే దుఃఖం
 
జీవావరణం కాదు
దుఃఖావరణమే మనిషికి
అసలైన ఆసరా!
 
దుఃఖంలో ఉన్నప్పుడంతే!
దుఃఖం తప్ప ఏదీ పట్టదు,
దుఃఖం తప్ప ఏది రుచించదు.
 
ఒక్కో దుఃఖం తర్వాత
మనిషి-
ఒక్కోలా పునర్జన్మిస్తాడు.
ఒక్కోసారి ఏకాకి అవుతాడు
ఒక్కోసారి సమూహమవుతాడు.
 
దుఃఖం అంటే మరేమిటో కాదు
ఒక నిదుర,
ఒక మెలకువ
 లేదా 
సగం నిద్రా, 
సగం మెలకువ.
ఒక మైమరపు 
లేదా
ఒక మేల్కొలుపు!
 
ఒక్క మాట
ఒకే మాట..
దుఃఖిస్తున్నప్పుడే...
మనిషి ఖాళీ అవుతాడు, మనిషి పరిపూర్ణుడవుతాడు,
మనిషి మనిషవుతాడు!
 
( రచన:08.01.2019 ఉదయం మూడు గంటలు )

పలమనేర్ బాలాజి

పలమనేర్ బాలాజి: పుట్టిన ఊరిని ఇంటి పేరుగా మార్చుకొని 1991 నుండి కథ, కవిత ,నవల , విమర్శా రంగంలో కృషి.. "గది లోపలి గోడ, చిగురించే మనుషులు, ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు "మూడు కథా సంపుటాలు ;" మాటల్లేని వేళ,ఇద్దరి మధ్య" రెండు కవితా సంపుటాలు; "నేల నవ్వింది"నవల ప్రచురితం. చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య వ్యవస్థాపక సమన్వయకర్త.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.