పంజరం 

స్టీల్ పంజరంలో ఉన్న మాట్లాడే చిలక, బంగారు పంజరంలో ఉన్న పక్కింటి చిలకని చూసి జెలసీ ఫీలయ్యింది. కాసేపటి తరువాత తుప్పుపట్టిన ఇనుప పంజరంలో ఉంటున్న వెనకింటి చిలకను చూడటంతో   “హమ్మయ్య” అనుకుంది.

కొన్నాళ్ళకు తుప్పట్టిన పంజరం తలుపూడిపోవడంతో  వెనకింటి చిలక తప్పించుకుపోయింది. ఇప్పుడు సడన్గా బాధ రెట్టింపయిపోయింది. తన యజమాని చదివే ఫిలాసఫీ పుస్తకాలలో మాటలు విని, నాకూ  ఫ్రీడం కావాలంది. “నాకూ ముక్తి కావాలి, స్వేచ్చ కావాలి, ఫ్రీడం కావాలి” అంటూ నాన్ స్టాప్ గా అరుస్తూనే ఉంది.

ఈ గోల భరించలేక దాని యజమాని పంజరం తలుపుతెరిచి బయటకు  పొమ్మన్నాడు. పండగచేసుకుంటూ బయటకు ఎగిరిపోయింది. కానీ చాన్నళ్ళుగా ఎగరడం అలవాటు లేక ఆహారం వెతుక్కోవడానికి చాలా అలసట అనిపించింది. పంజరంలో ఉంటే ఈపాటికి తినేసి కుదురుగా కూర్చొనే దానినిగా అనుకుంటుండగా, ఎక్కడినుండి వచ్చిందో డేగ ఒకటి వచ్చి, తరమడం మొదలెట్టింది. నానా తంటాలు పడి తప్పించుకొని, స్వేచ్చ అంత ఈజీ కాదు అని ఆలోచనలో మునిగిపోయింది.

తానే స్వయంగా  ఆహారం వెతుక్కోవడం, వేట పక్షులనుండి తప్పించుకు తిరగడం ఇవన్నీ మనవల్లకాదు,  “తొక్కలో స్వేచ్చ ఎవడిక్కావాలి” అనుకుంటూ మళ్ళీ పంజరానికే వచ్చేసింది. యజమాని వచ్చి పంజరం తలుపు వేసేస్తుంటే, మళ్ళీ “నాకు స్వేచ్చ కావాలి” అని పాత పాట మొదలెట్టింది.

యజమానికి ఒళ్ళు మండి “నీకు కావలసింది అనంతాకాశం కాదు. డోర్ తెరిచి ఉన్న పంజరం మాత్రమే. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, ఏ పనీ చేయకుండా ఫ్రీగా దొరికే ఫుడ్డు మాత్రమే. నిన్ను ఊరికే మేపే సరదా నాకు లేదు. కావాలంటే చెప్పు. పంజరం డోర్ ఓపెన్ చేసి, నీ కాలికి ఒక తాడు కడతాను. కాస్త పొడవయిన తాడే కడతాను. ప్రహారీ గోడ వరకూ తిరగొచ్చు. అలా  నీకు నేను కొంత లిమిటెడ్ “స్వేచ్చ”ను ఇస్తాను. డీల్ నచ్చితే ఉండు. లేదంటే పో. ఆలోచించుకోవడానికి నీకు ఒక్కరోజు టైం మాత్రమే ఇస్తున్నాను.” అని చెప్పి వెళ్ళిపోయాడు. మాట్లాడే చిలక ఆలోచిస్తూ కూర్చుంది

ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. బుర్ర కాదు ముఖం. ఆలోచిస్తే ఫేస్ వేడెక్కుతుందేమిటీ? అని అసంకల్పితంగా చెయ్యి( కాదు కాలా?) మండుతున్న తన ఫేస్ పై వేయడంతో మెలకువ వచ్చేసింది. ఎదురుగా కళ్ళల్లోకి కొడుతున్న మే నెల సూర్యుడు. తాను డాబాపై పడుకొని ఉంది. కాదు, కాదు పడుకొని ఉన్నాడు.  బాగా పొద్దెక్కిన వేసవి సూర్యుని దెబ్బకు. డాబాపై పడుకున్న సుబ్బారావు, అప్పటి వరకూ తాను చిలకగా జీవించిన కలనుండి బయటకొచ్చేసాడు.

ఇదేం పిచ్చి కల? దెయ్యాలు, కోబ్రాలు లేని  పీడకల. కలలో కనపడ్డవన్నీ ఊహలే కావచ్చు. కానీ కలలో పడ్డ  భయం మాత్రం ఊహగాదు. అదంతా నిజమే. ఎంత భయపడ్డానో కదా! అనుకున్నాడు, ఒంటిలోని, మెదడులోని తెలుస్తున్న అలసటను ఫీలవుతూ. 

డాబా మీద నుండి కిందకు వెళ్లి సంధ్య ఇచ్చిన కాఫీ తాగుతూ రాత్రి వచ్చిన కలకు ఏదయినా అర్ధం ఉందా? అని ఆలోచనలో పడ్డాడు.ఎదురుగా ఉన్న సంధ్యను చూసి తనేనా కలలో యజమాని ???!! అనుకున్నాడు. కాదు కాదు తనెప్పుడూ నన్ను రీస్ట్రిక్ట్ చేయలేదే. చేయలేదా లేక చేస్తుందేమో అని ముందే  నన్ను నేనే రిస్త్రిక్ట్ చెసుకుంటున్నానా? ఏదీ క్లియర్ గా తెలియడం లేదు.

బంగారు పంజరమేమిటో? డబ్బున్న వాళ్ళ పై  నాకు జెలసీలాంటిదేమీ లేదే! అయినా బంగారందయినా ఇనుముదయినా పంజరం పంజరమే కదా? మంచి ఉద్యోగం చేసుకుంటున్న నేను  ఫుడ్ వెతుక్కోవడానికి అలసిపోవడం ఏమిటి? ఈ డేగ, కాలుకు తాడు కట్టడం, డీల్ మాట్లాడటం ….. ఏంటో ఇదంతా? సబ్ టైటిల్స్ లేని చైనీస్ మూవీ చూసినట్టుంది సుబ్బారావు పరిస్థితి. కల యొక్క భావం అర్ధం అయ్యిందో లేదో కూడా అర్ధం కావట్లేదు.  తొక్కలో కలలు, తొక్కలో మీనింగులు. ఎందుకొచ్చిన జుట్టుపీక్కోవడం అనిపించి, సుఖంగా టీవీ న్యూస్ చూసుకుంటూ ప్రపంచ కష్టాల కింద తన కష్టాల్ని కప్పెట్టేద్దామని రిమోట్ బటన్ ప్రెస్ చేశాడు. న్యూస్లో ఇషాక్ అన్న ఎవరో రిపోర్టర్ పేరు వినబడి, ఇంజినీరింగ్ డిగ్రీని పక్కన పడేసి సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ మొదలెట్టిన కాలేజ్ ఫ్రెండ్ ఇషాక్ మదని గుర్తొచ్చాడు. ఆర్థొడాక్స్ ముస్లిం ఫేమిలీలో పుట్టి కూడా వాడెలా ప్రీచింగ్ దాడినుండి  తప్పించుకున్నాడో అర్దమయ్యేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. అది పక్కవాళ్ళను ఫన్ చేయడమా? వాడి మూడే అంతనా తెలిసేది కాదు తనకు. కలను డీకోడ్ చేయడం కోసం అయినా వాడిని కలుద్దాం అని నిర్ణయించుకున్నాడు.

సాయంత్రం ఇషాక్ ఇంటిపైనున్న  పెంట్ హవుస్ కు బయట ఓపన్ ప్లేస్లో వేసి ఉన్న చైర్లలో కూర్చున్నారిద్దరూ. డైరెక్ట్ టాపిక్ మొదలెట్టకుండా “సైకలాజికల్ ఎనాలిసిస్  అంటే?” అడిగాడు సుబ్బారావ్.

“జనాలు వాళ్ళ సోది వాళ్ళే చెప్పుకొని, వాళ్ళే సొల్యుషన్లు వెతుక్కొని,  నాకు ఫీజు ఇచ్చి, నన్ను పోషించే అవకాశం, నేను వాళ్లకు కల్పించడం అన్నమాట” నవ్వుతూ చెప్పాడు ఇషాక్

“ఆ సోది చెప్పుకోవడానికి నీదాకా రావడం ఎందుకు, తెలిసిన వాళ్ళుంటారుగా?”

“తెలిసిన వాళ్ళంటే స్పౌజ్, ఫ్రెండ్స్, ఇంకా పేరెంట్స్. వీళ్ళతో చెప్పుకోలేని విషయాలు ఉండొచ్చు. చెప్పుకున్నా ఇలా చెయ్యి, అలా చెయ్యి అని సజెషన్ స్కీం మొదలెట్టడం తప్పించి, పూర్తిగా వినరు. కొన్ని సందర్బాలలో  సమస్యకు కారణమే వాళ్ళవుతారు.

అవన్నీ సరే గానీ  ఏదో మాట్లాడాలన్నావ్. అది చెప్పు”

రాత్రి వచ్చిన కలతో పాటు, ఉదయం తనకొచ్చిన ఆలోచనలను మొత్తం చెప్పేసి  “అసలేంటిదంతా?” అన్నాడు సుబ్బారావు

“హహహ బావుంది నీకల. బేసిక్ అవుట్ లైన్ పరంగా ప్రతీ వ్యక్తికీ కనెక్ట్ అయ్యే కల ఇది. డీటెయిల్స్  లోకి వెళితే మనిషి మనిషికి సంఘటనలు మారిపోతాయి. ఖచ్చితంగా దీని అర్ధం ఇదే అని నేను గానీ ఇంకొకరు గానీ చెప్పలేరు. ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. డబ్బులిచ్చి నాకు సోది చెబుతూ, నా సమక్షంలో   తెలుసుకున్నా. ఏకాంతంగా కూర్చొని వాళ్ళ మనసును వాళ్ళు చదువుకుంటూ తెలుసుకున్నా. ఏదయినా గోల్ ఒకటే to know the unmasked self.”

“అది కాదు. రిచ్ పీపుల్ పై నాకు ఎటువంటి జెలసీ లేదు. బంగారందయినా పంజరం పంజరమే కదా? అయినా కలలో  ఎందుకలా వచ్చిందో?”

“సుబ్బూ!  బంగారం అంటే డబ్బే కానవసరం లేదు. బంగారం అంటే సమాజం ఇచ్చే వేల్యూ. నీ కంటే సూపర్ పూర్ అయిన వారెవరికయినా సమాజం ఎక్కువ విలువ ఇస్తుంటే అతని పై కూడా నీకు జెలసీ ఉండొచ్చు.

ఇక బంగారందయినా పంజరం పంజరమే కదా? అనడం, మాటలు నేర్చిన  చిలక పలుకుల వంటివి. చిలక పదాలు పలుకుతుందంతే. ఆయా పలుకుల్ని స్పృహతో పలకదు.  బిక్షగాడు, రాజు ఒకేలా నిద్రపోతారూ, ఒకేలా చనిపోతారూ, ఇద్దరి రక్తం ఎర్రగానే ఉంటుందీ, ఒకటే ఆత్మా లాంటి కథలు వినేవాళ్ళు, చెప్పేవాళ్ళూ కూడా ఏ ఫ్యానో, ఏసీనో వేసుకొని, ఆలవుట్ పెట్టుకోకుండా పడుకోలేరు. అలాగే  సెక్స్ తుచ్చం, క్షణికం అని చెప్పేవాళ్ళూ, వినేవారూ కూడా, “ఈరోజు మూడ్ లేదు” అన్న మాటను పార్టనర్ నుండి వినడానికి ఇష్టపడరు. నో అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్లు ఎలా ఉంటాయి అంటే, కొందరు వెంటనే ఇమీడియేట్ గా అరుస్తారు. కొందరు  మర్నాడు బాడీ లాంగ్వేజ్ తో, ఇంట్లో ఉన్న వస్తువులు, తలుపులను కాస్త గట్టిగా బాదడం ద్వారా వ్యక్తపరుస్తారు.

బంగారందయినా పంజరం పంజరమే అన్నది నిజమే. కాదనను. అయినా కానీ , సమాజంలో ఆల్మోస్ట్  అందరూ పవర్, పాపులారిటీ, రిచ్నెస్ లాంటి ఆ బంగారు పంజరాల్ని కోరుకుంటున్నారన్నది కూడా అంతే నిజం. నువ్వు తెలుసుకోవలసింది నిజ్జంగా నువ్వేంటో అని గానీ, నీ గురించి నువ్వు క్రియేట్  చేసుకున్న ఇమేజ్ కాదు. నీకు రిచ్ జనాలపై జెలసీ ఉండి ఉండొచ్చు. నీ మనసుపైనున్న ఆదర్శాల పూతలన్నింటినీ తొలగించుకొని చూస్తే అప్పుడర్దం అవుతాయి నీలోపలున్న అసలు కోరికలు. అలాగని ఆ హిడెన్ డిజైర్స్ ని తెలుసుకొని, వాటిని తీర్చుకోమనో, వద్దనో నేను చెప్పడం లేదు. నీ ఆదర్శాలకు, ఆలోచనలకూ, చేతలకు అసలు పొంతనే లేదని, అర్ధం చేసుకోవడం వలన స్పష్టత వస్తుంది. జుట్టు పీక్కోవడం తగ్గుతుంది.  అప్పుడు కదా నువ్వు బంగారు పంజరాన్ని మాటల్లోనే కాక చేతల్లో కూడా వద్దనుకోగలవు. అయినా సుబ్బూ ఒకటి చెప్పు. ఏది ముఖ్యం? కన్ఫ్యూజన్ తో కూడిన ఆదర్శాలా? లేక నేను కన్ఫ్యూజన్లో ఉన్నానన్న క్లారిటీనా?”

“సరే… క్లారిటీనే.  మరి ఆహారం వెతకడానికి అలసిపోవడం, డేగ, ఇదంతా ఏమిటి?”

“ఎవరికోసం నటించకుండా, లోపల ఏదనిపిస్తే అది మాట్లాడేయాలి. నచ్చినట్టు బ్రతకాలి అని ఉండి కూడా  స్వేచ్చ తో పాటు వచ్చే భాద్యతలను, సమస్యలను ఎదుర్కోగలనా అన్న భయం ఉండి ఉండొచ్చు. ఇక్కడ నువ్వు భయపడటం వరకూ  నిజమే. కానీ నిజంగా భయపడాల్సినంత డేంజర్ ఉందా? ఆ డేగ ఏమిటీ? సమాజమా? సమాజమే డేగ అనుకుంటే, ఆ డేగకు కూడా నువ్వు డేగవే కదా? భయపెట్టింది డేగ అయితే పంజరంలోదీ డేగే కదా? పోనీ ఇంకోలా ఆలోచిద్దాం. పంజరంలోని  చిలక గతంలో తాను అప్పుడప్పుడూ స్వేచ్చగా ఉన్న చిలకని డేగలా తరిమింది కాబట్టి, ఇప్పుడు తాను స్వేచ్చ కోరుకుంటే, మిగిలిన పంజరంలో చిలకలు డేగలై తరుముతాయని భయం కావొచ్చు. ఈ భయమంతా ఊహేనా లేక నిజమా? నిజంగా దాడి జరిగినా అది భౌతికమా లేక మాటలతో కేవలం మనసుపై జరిగే దాడా? కేవలం మనసుపై దాడి అయితే  నీ participation లేకుండా ఎవరయినా నీమనసుపై దాడి చేయగలరా?”

“ఒరేయ్ ఇషాక్. నువ్వేదో చెబుతావని నాలుగు ప్రశ్నలు పట్టుకొస్తే, సమాధానాల బదులు వాటిని నలభై ప్రశ్నలు చేస్తున్నావేంట్రా?”

“హహహ… పక్కోళ్ళు చెప్పిన సమాధానాలు, నీకు నువ్వు జీవితంలో వాటిని అనుభవపూర్వకంగా చూసేవరకూ ప్రశ్నలే. ప్రతీ సమాధానాన్ని ప్రశ్నగా మార్చుకొని,  కొత్తగా శోదించాలి. అందుకే వాటిని ప్రశ్నలుగా మార్చుకొనే శ్రమ నీకు తగ్గించడం కోసం, నేనే ఆపని చేస్తున్నాను. సరేలే, చివరి ప్రశ్న ముగించుకొని అదిగో ఆ కనబడే చెరువు దగ్గరకు వెళదాం. అక్కడ కూర్చొని సన్ సెట్ చూస్తుంటే, అవే జీవితానికి  చివరి క్షణాలని తెలిసినా కూడా ” ఈ జీవితానికీ క్షణాలు చాలు” అనిపించేంతగా ఉంటుంది.

కాలికి తాడు కట్టడం అంటే అర్దం లెక్కగా కొంత లిమిటెడ్  స్వేచ్చను ఇవ్వడం అని అర్దం. కొంతమంది గేదెలకు, ఆవులకూ బాగా పొడవయిన తాడు కడతారు. అంటే అక్కడ గేదెకు స్వేచ్చ ఇచ్చామనా? అసలు స్వేచ్చ ఒకరు ఇచ్చేదా? నేను నీకు ఎంత స్వేచ్చను ఇచ్చానో, అనేవారందరిలోనూ  ఆ యజమాని ఉంటాడు. నీలో కూడా. నువ్వెప్పుడూ అలా ప్రేమ పేరుతో బిజినెస్ డీల్ మాట్లాడలేదా? మాటలలో కాకపోయినా నీ ఎక్స్ప్రెషన్స్ తో, నీ ఎమోషన్స్ తో. నీకు నచ్చినట్టు నడుచుకున్నప్పుడు స్మైల్ విసిరి, నచ్చనట్టు బిహేవ్ చేస్తే ముఖం మాడ్చుకొని ఆ ఇమాజినరీ తాడు కట్టి ఉంటావు. 

ఫైనల్ గా నువ్వు అడగని ప్రశ్న. అసలా పంజరం ఏమిటీ? ఎక్కడుంది? బయటా , నీ మనసులోనా? మనసులో అయితే దాన్ని ఎవరు తయారు చేశారు? పోనీ నువ్వు  చిన్న కూచిలా ఉన్నప్పుడు నీ బుర్రలో దాన్ని పెట్టేశారా? అయితే దానిని ఇంకా ఎందుకు మోస్తున్నావ్?. ఇవన్నీ ఇంటికెళ్ళి కుదురుగా ఆలోచించుకో. ప్రస్తుతానికి సన్ సెట్ కాంతిలో  ఎగురుదాం. స్వేచ్చగా” 

ఇషాక్ మాటల ప్రభావమో, గొప్ప సౌందర్యాన్ని ఒకేసారి చూసేసరికి మనసు ఉక్కిరిబిక్కిరై ఆలోచనారహిత స్థితికి చేరి పోయిందో గానీ, జీవితంలో మొదటిసారి సూర్యాస్తమయాన్ని చూస్తున్న చిన్నపిల్లాడిలా చూస్తూ సుబ్బారావు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, బుర్రలో మోస్తున్న తనదైన వ్యక్తిగత ప్రపంచాన్నీ కొంత సేపు వదిలేసుకొని స్వేచ్ఛగా నిలబడ్డాడు. 

రాంబాబు తోట

3 comments

  • చాలా బాగా రాశావు…. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో సుబ్బారావు పాత్రకి కనెక్ట్ అయి ఉంటారు … నాకు నా 14 -20 ఏళ్ల వయసులో ఇలాంటి రోజుకో రకంగా లెక్కలేనన్ని అర్ధం కానీ కలలు వస్తుండేవి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.