మీ అవకాశాల అయస్కాంతం మీరే!

నిరంతరం అవకాశాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. కానీ అవి పరిష్కరించలేని సమస్యల ముసుగులో ఉంటాయి.  

                                                                                                                                          -జాన్ గార్డ్ నర్

విజయాలకు కారణాలేమిటి? వైఫల్యాలకు విరుగుడేమిటి? ప్రాచీన కాలం నుండి ఈ సమస్య మానవ జాతిని వేధిస్తూనే ఉంది. ఈ సమస్య భావి తరాలను కూడా వేధిస్తూనే ఉంటుంది. అందుకే విజయాన్వేషణకు అంతం లేదు. అది అనంతాన్వేషణ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి విజయం అంటే ఇష్టమే. విజయాన్ని అప్పు తెచ్చుకోలేము. కొనలేము. దొంగిలించలేము. విజయం మనలోనే నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని తవ్వి వెలికితీసుకు వచ్చే ప్రయత్నాల్లోనే  మనిషి ప్రతిభ వెలుగులోకొస్తుంది. మనిషిలోని అంతర్గత నైపుణ్యాలు వెలుగులోకొస్తాయి. మనలోని బలాలను తెలుసుకుని అవకాశాలను వాసనపట్టే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. తమలో ఉన్న అంతర్గత శక్తులతోనే ఎందరో ఈ ప్రపంచాన్ని జయించారు. కొంతమంది దురదృష్టవంతులు అపజయాల వైకుంఠపాళీలో చిక్కి శల్యమవుతారు. అంతా మన దృక్పథంలోనే ఉంటుంది. ఈ ఆందోళన భావి తరాల్లో కూడా ఆగ్రహం రేకెత్తిస్తుంది. విజయానికి ప్రారంభం ఉంటుంది కానీ అంతం ఉండదు. ప్రతి ఒక్కరూ విజయాల నిచ్చెనపై మరో మెట్టు ఎక్కాలని అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు.   

కొందరు వ్యక్తులు, కంపెనీలు మాత్రమే ఎందువల్ల నిరంతరం విజయాల హైవేలో ఉంటారు? మరికొందరు వ్యక్తులు, కంపెనీలు విజయాల రహదారిలో పాకుతూ ఉంటారు. విజయమెప్పుడూ వారికి అందనంత అనంత దూరంలో ఉంటుంది. వారి దృక్పథమే దానికి కారణం. నేను గెలుస్తాను‘  అని చెప్పేవారెప్పుడూ గెలుస్తారు. నేను గెలిచినా గెలవకపోయినాఅని డోలాందోళనలో ఉండేవారు ఎప్పుడూ విజయానికి ఆమడ దూరంలో ఉంటారు. మనమెక్కడున్నా, ఏ పదవిలో ఉన్నా మన సానుకూల వైఖరే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఎందరో మహానుభావులు తమ పట్టు సడలని పట్టుదలతో ఈ విషయాన్ని నిరూపించారు.

విజయ సాధనా దృక్పథంతో, చిత్తశుద్ధితో చేసే ప్రయత్నాలు, నిరంతర కృషి మాత్రమే  ప్రతి ఒక్కరిని విజయం వైపు నడిపిస్తాయి. ప్రతికూల దృక్పథంతో చేసే కృషి ప్రతికూల ఫలితాలనే ఆకర్షించి అపజయాల మందుపాతరవైపు నడిపిస్తుంది.

ఎటువంటి వ్యక్తులు ఉద్యోగాలు సాధిస్తున్నారో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒక సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 85 శాతం నిరుద్యోగులు తమ సానుకూల దృక్పథంతోనే ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. తక్కిన 15 శాతం స్మార్ట్ గా ఉండటం వలన, విషయ పరిజ్ఞానం వలన, గణితంలో ప్రతిభ వలన, సంభాషణా నైపుణ్యం వలన ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఈ కీలకమైన విజయ సూత్రాన్ని ఆకళింపు చేసుకున్నవారు విజయంవైపు దూసుకు పోతుంటే, తక్కినవారు నత్తలా విజయంవైపు పాకుతున్నారు. ‘Opportunities are usually disguised as hard work, so most people don’t recognize them.’  అంటారు  Ann Landers.  

‘విజయాన్ని సాధించాలనే పట్టుదల నీలో ఉంటే నిన్నెవ్వరూ ఆపలేరు ‘ అంటారు అబ్రహాం లింకన్. నీ చుట్టు ఉన్న ప్రపంచం పట్ల సరైన దృక్కోణం, దృక్పథం ఉంటే అది నీలో సానుకూల వైఖరిని రేకెత్తిస్తుంది. ఈ దృక్పథం లోపిస్తే సరైన సమయానికి సరైన సమయంలో, సరైన వ్యక్తులతో ఉండకుండా సరైన అవకాశాలను దూరం చేసుకుని విజయ పథానికి కూడా దూరమవుతారు. సరైన అవకాశాలను ఆకర్షించే సామర్ధ్యమే మిమ్మల్ని నలుగురిలోనూ విశిష్ట వ్యక్తులుగా నిలబెడుతుంది. అవకాశాలెప్పుడూ మీ తలుపు తట్టవు. మీరే ఈ విశాల విశ్వంలో మీకు నచ్చిన అవకాశాలను శోధించి సాధించాలి. అందుకే ‘శోధించి సాధించాలి ; అదియే ధీరగుణం’ అంటారు శ్రీ శ్రీ! అనంత అవకాశాల ప్రాప్తిరస్తు! 

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.