రాజధానుల రగడ
ఇకనైనా ముగిసేనా!

ప్రస్తుతం జరుగుతున్న మూడు రాజధానుల రగడకు తెర పడే లోపు రాష్ట్రంలోని వివిధ సంక్షేమ పధకాల అమలూ,  సాధారణ పాలనా వ్యవస్థ ఎంత కుంటు పడాల్సి వుందో అని ఆందోళన కలుగుతుంది.  రాజధానిపై జగన్ కృత నిశ్చయంతో వున్నట్టే కనబడుతోంది కనుక దీనిపై రాద్దాంతంకన్న, రైతులకు న్యాయం చేయమని అడిగితే సమస్య పరిష్కారానికి వస్తుంది. న్యాయం అడగమన్నారు కదా అని “రాజధానికి మేం భూములిచ్చాం” కాబట్టి రాజధాని ఇక్కడే వుంచండి అని అడగడం సరికాదు. ఇది అన్ని సమస్యల్లాంటి సమస్య కానే కాదు .  తెలంగాణ వలె భౌగోలికంగా అవశేషాంధ్ర కూడా అంతో ఇంతో గుండ్రటి ఆకృతిని కలిగి వుంటేనో లేక ఒకే యాస, సంస్కృతి, జీవన శైలీ కలిగివుంటేనో ఈ రాజధాని అంశం గురించి చర్చ మరో పద్దతిలో వుండేది. మనకు అటువంటి వెసలుబాటు లేకనెపాయే. కనుక అమరావతి అని అనధికారంగా అనబడే 29 గ్రామాల సమూహాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ కు గంపగుత్తగా లింకు పెట్టకూడదు. మూడు విభిన్న యాసలు, సంస్కృతులు కల్గిన మూడు ప్రాంతాల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని వుండి తీరాల్సిందే. అలా లేనప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న కతుకు పుడుతుంది. అది ఇప్పుడు పిడికెడో జానెడో వున్నా ఏదో ఒకనాడు దావానలంలా వ్యాపించి మరో వేర్పాటుకు ఊపిరి పోస్తుంది. అలా జరగదు అని మనకు అనిపిస్తే మనం చరిత్రను మరిచిపోయినట్లే. మళ్లీ అలా జరగకూడదు అంటే మూడు ప్రాంతాల సమ్మతి కోసం చూడాలి తప్ప వేరే లొల్లాయి కబుర్లు చెప్పకూడదు. కాదు కూడదు.

వెనుక బాటుకు పరిష్కారం వెదకాలి

మీరు వేర్పాటువాదులు, తెలుగుజాతిని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకున్నారూ అని అంటారా అయితే మీరు కూడా వెనుకబడిన ప్రాంతాలకు జరిగిన అన్యాయాలకు, ఆ వెనుకబాటుతనానికి కారణమైన పరిస్థితులకు బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సి వుంటుంది. అస్తవ్యస్తమైన నీటి పంపకాలను పునః సమీక్షించడానికి ముందుకు రావాల్సివుంటది. చివరికి వ్యవసాయ భూమి యొక్క విలువ, భూమి కౌలులలో కూడా ఊహించలేనంత తేడాలు ఎందుకున్నాయో చెప్పాలి. అవన్నీ వదిలేసి ఆంధ్రా ఐకాన్ అమరావతి అంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. రాజధాని మార్పు గురించి మాట్లాడకుండా వుండి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాడు అంటారా? దానికి కూడా ఆయనే సమాధానం చెప్పుకోవాలి. ఆయన తరుపున ఎవరూ సమాధానం చెప్పలేరు. మన వరకూ మనమైతే అభిప్రాయం చెప్పుకోవాలి కదా. ఒకే. అవునూ జగన్ అమరావతిని మారుస్తాను , రాజధానిని వికేంద్రీకరిస్తాను అని చెప్పలేదు. ఎలా చెబుతాడు. జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయ లక్ష్యం రాష్ట్ర రాజకీయాల్లో అధికారంలోకి రావడం. తండ్రి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలనుంచి అంచెలంచెలుగా పార్టీ ప్రస్థానం అందరికీ తెలిసిందే. అటువంటివాడు, 2014 లో అధికారం కోసం తీవ్రంగా శ్రమించి నిరుత్సాహపడినవాడు ఎవడైనా రెండవ పర్యాయం ఎన్నికలకు ముందు అటువంటి రాజకీయ సంభందిత నిర్ణయాల గురించి మాట్లాడతాడా? ఒకవేళ అలా మాట్లాడినా అపుడు చంద్రబాబాదుల విష ప్రచారం ఏ స్థాయిలో వుంటుందో మనం వూహించలేమా . “జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి కర్నూలుకు మారుస్తాడు” అని టి‌డి‌పి శ్రేణులు ప్రచారం చేసేవి. రాజకీయంగా అది జగన్ కు నష్టం కలిగిస్తుంది కనుక నాడే తన మనస్సులో వికేంద్రీకరణ ఆలోచన వున్నా కూడా బైట పెట్టుకోవడం తెలివిలేని చర్యనే అవుతుంది. మరి ఇది 29 గ్రామాల ప్రజలను మోసం చేయడం కాదా అంటారా? అసలు అమరావతే ఒక బూటకం. దాన్ని అపుడు సరైన రీతిలో ప్రతిఘటించబడటం, వ్యతిరేకించబడటం జరగలేదు కాబట్టి  ఇప్పుడు యావత్ ఆంధ్ర దేశమూ ఆ బూటకాన్ని నిజం చేసి తీరాలనడం అదేమీ న్యాయం? రాజకీయ పరిణామాల పుణ్యమా అని ఇపుడు సమన్యాయం జరిగే అవకాశం వచ్చింది. కనుక రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు ఈ వికేంద్రీకరణను హర్షిస్తారు. 

అమరావతి పేరుతో అతి మూల్యం

ఇప్పుడు మరొకసారి, అమరావతి ఎందుకు బూటకమో మాట్లాడుకుందాం. అమరావతికి సేకరించిన భూమి మొత్తం 50 వేల ఎకరాలు. అందులో 33 వేల ఎకరాలు రైతులదైతే మిగిలిన భూమి ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, శ్మశానాలు వాగులు వంకలు చెరువులు రోడ్లు మొదలైనవి. రాష్ట్ర విభజన నేపధ్యంలో అప్పులను విడదీస్తే 13 జిల్లాల ఏపికి రూ.96 వేల కోట్ల భారం పడింది. తాజా లెక్కల ప్రకారం చూస్తే ఏపి అప్పులు ఏకంగా రూ 2.05 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే 60 సంవత్సరాల సమైక్య రాష్ట్ర చరిత్రలో విభజన నాటికి 13 జిల్లాల వాటాగా ఏపికి రూ. 96 వేలు కోట్లు వస్తే ఇప్పుడా  అప్పులు 2.45 లక్షల కోట్లు అయ్యాయి. రాజధాని పేరిట 29 గ్రామాల్లో తాత్కాలిక కట్టడాలకు ఖర్చు చేసిన ఐదు వేల కోట్లకు ఏడాదికి 700 కోట్లు వడ్డీలు కడుతున్నామని సి ఆర్ డి ఏ లెక్కలే చెబుతున్నాయి. కనుక ఇప్పుడు లక్ష కోట్ల రాజధాని పూర్తయ్యేదెన్నడు వాటి ఫలితాలు రాష్ట్రం మొత్తం అనుభవించేదెప్పుడు ? అధికార వికేంద్రీకరణ కాదు అభివృద్ది వికేంద్రీకరణ జరగాలంటూ చెబుతున్నామే మరి ఆ అభివృద్ది వికేంద్రీకరణకైనా డబ్బెక్కడి నుంచి వస్తుంది. అదంతా రాష్ట్రంలోని అన్నీ జిల్లాల ప్రజల సొమ్మే . ఒకవేళ అప్పుదెచ్చి కట్టినా ఆ అప్పులు బరించాల్సింది రాష్ట్ర ప్రజలే. అప్పులు తెచ్చి మరీ డబ్బంతా అక్కడ గుమ్మరిస్తే వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్రలలో నెలకొల్పాల్సిన పరిశ్రమలు సంస్థలకు నిదులు మిగులుతాయా అనేది ప్రశ్నార్థకం. ఆ ప్రాంతాల్లో పూర్తి చేయాల్సిన సాగునీటి ప్రాజెక్టుల గతి ఏమవుతుంది. అంతేగాక పూర్తయ్యి, సగం మధ్యలోనూ వున్న సాగునీటి ప్రాజెక్టుల కింద నష్టపోయిన రైతాంగానికి చెల్లించవల్సిన పరిహారం బకాయిలు ముప్పై ఏళ్లుగా పెండింగులో వున్నాయి. అక్కడే రాజధాని వుండాలని డిమాండు చేస్తున్న వారిలో సమన్యాయం చేయండి అనే కనీస వాదన ఎక్కడా వినిపించట్లేదు. వారి డిమాండు మొత్తం రాజధాని అంతా అక్కడే కట్టాలని. కాబట్టి అమరావతి రాష్ట్ర ప్రజలందరి మనోభీష్టం ఎన్నటికీ కాదు . ఇప్పుడు ఏ ప్రాంతం వారైనా  కోరవల్సిందల్లా సమన్యాయమే. అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా వెనుకబాటుతనానికి గురైన ప్రాంత ప్రజలకు తమకు సమన్యాయం కంటే ఇంకా ఎక్కువే న్యాయం జరగాలని కోరుకునే అవకాశం వుంటుంది కానీ మధ్య కోస్తా ప్రాంతానికి ఆ వెసలుబాటు కచ్చితంగా వుండదు. ఎందుకంటే వారు అంతిమంగా ఘన లబ్దిదారులు అని డెబ్బై ఏళ్ల చరిత్ర చెబుతోంది.

మండలికి ముప్పు తెచ్చిన చంద్ర జూదం

చంద్రబాబు పంతానికి పోయి ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టాడు. వికేంద్రీకరణ బిల్లు పట్ల తన సభ్యులను సరైన రీతిలో వ్యవహరించేలా చేసి ఉండొచ్చు. కానీ ఆయన నలభై ఏళ్ల రాజకీయ అనుభవం నేర్పిన పాఠం వ్యర్థమయ్యింది. నాడు సొంత మామ మండలిని రద్దు చేసినప్పటినుంచే చంద్రబాబు రాజకీయాల్లో వున్నాడు. పైగా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసన మండలిని పునరుద్దరించడానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి 2007 లో తిరిగి ప్రారంభించినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మండలి అవసరం లేదు, దండగ అన్నాడు. 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్టీలోని వ్యాపారవేత్తలకు, జనంలో నిలిచి గెలిచే సత్తా లేని వారికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టుకున్నాడు. స్వయంగా తన కొడుకునే ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయించే సాహసం చేయలేక ఎమ్మెల్సీ పదవితో మంత్రి పదవి కట్టబెట్టాడు. మళ్లీ షరా మామూలే. ఇప్పుడు ప్రజాస్వామ్యం , పెద్దల సభ ప్రాముఖ్యం అంటూ మాట్లాడితే విలువేముంటుంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని ఇప్పుడు ఆయన 2007లో పాడిన పాటను ఆయనకు వినిపించారు. ఒక్కసారి బిల్లును వెనక్కి పంపించామని చెప్పుకోవడానికి తప్ప మండలిలో వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి పంపడం దేనికి పనికొస్తుంది. మహా అయితే మరో మూడు నెలలు జాప్యం చేయగలుగుతారు కానీ ఆపడం కుదరదని సీనియర్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబుకూ తెలుసు. రద్దు చేయడం వల్ల ఎక్కువ నష్టపోయేది  తెలుగుదేశం పార్టీనే. ప్రజలు ఎంత మాత్రమూ కాదు . ఎందుకంటే తెలుగుదేశం తరుపున ఎన్నికైన ఆ ఎమ్మెల్సీలు ప్రజాప్రయోజన పరిరక్షకులేమీ కాదు. ప్రజలు బాధ పడాల్సింది అంతో ఇంతో ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో జనవాణి వినిపించే పిడిఎఫ్ సభ్యుల గురించే. మొత్తానికైతే ఇప్పటి ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా నష్టపోయేది తెలుగుదేశమే. వారికి 28 మంది ఎమ్మెల్సీలు ఉండగా మరో ఆరు మంది పార్టీ వారిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలను చేశారు. వెరసి టీడీపీకి 34 మంది బలం ఉంది. వైసీపీకి ఉన్నది కేవలం 10 మంది సభ్యులే. అందులో ఒకరు కన్తేటి సత్యనారాయణ రాజు గారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికై ప్రస్తుతం వైసీపీ అనుకూల సభ్యునిగా కొనసాగుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీల్లో ఇద్దరు మంత్రులుగా కూడా ఉన్నారు. వారు మౌనంగా పదవి వదులుకోవడం మినహా ప్రస్తుత పరిస్థితుల్లో చేసేదేమీ వుండదు. పిడిఎఫ్ సభ్యులు, ఇంకా ఇండిపెండెంట్ గా ఎన్నికైన వారు 8 మంది ఉన్నారు . 

మండలి రద్దు జగన్ తొందరపాటే

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలిని రద్దు చేసి వుండవలసింది కాదు. తన వికేంద్రీకరణ ఫార్ములాను తక్షణ అమలు కోసం ఆయన ఉభయ సభలను సమావేశపరిచి ఓటింగ్ జరిపో లేక గవర్నర్ చేత ఆర్డినెన్స్ ఇప్పించో చేయవచ్చు. లేదా ఓ మూణ్ణెళ్ల ఆలస్యం అనుకుంటే మళ్ళీ మండలికి బిల్లు వచ్చి ఏకపక్ష ఆమోదం పొందే అవకాశం కూడా ఉండేది. ముఖ్యమంత్రి అంతటి ఆలస్యం కోరుకున్నట్టు లేదు. 23 మంది సభ్యులున్న ప్రతిపక్షం  చర్యలకు గుణపాఠం చెప్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. ఇది జగన్ తొందరపాటే.

 

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.