లాస్ట్ మినిట్

వన్ రూపీ కాయిన్, డబ్బా ఫోను మనకోసమే కనిపెట్టి వుంటరు. ఏమీ మాట్లాడలేక నీళ్ళల్లో ఇసిరేసిన రాళ్ల లెక్క అలలు అలలుగా తాకే మాటలకోసం కుప్పలు తెప్పలుగా రూపాయి బిళ్ళల ప్రేమ. 

వొడవని ముచ్చట్లలో అన్నీ పెగలని మాటలే. నిశ్శబ్దం మనమధ్య రాయభారం నడిపినపుడు మాటలకందనివేవో తర్జుమా అయినట్టు గాలిలో వేలితో రాసుకోవడం గమ్మత్తుగా అనిపిత్తది. ఏం మాట్లాడాలో తెలీకుండానే ఏవేవో మాట్లాడేసుకునే రోజులు ఎంత అద్భుతంగా గడిచిపోయాయో తల్సుకుంటే మనసు పులకరించిపోతది.

 తొంభైసెకన్ల వ్యవధిని నా ఆత్రం చూసే అరవైకి కుదించినపుడు, చిన్నప్పటినుండి దాసిపెట్టుకున్న గల్లగురిగి ఖాళీ అయిపోయి, భారంగా పడుతున్న అడుగుల్ని ఇప్పటికీ  మోయలేకపోతున్న.

 నీకోసం తాజ్ మహల్ కట్టలేదు. కడుతానని కనీసం మాట సుత  ఇవ్వలేకపోయిన. ఆఖరి నిమిషంలో వూరిన ప్రేమను ఎన్నిసార్లు అనుభవించామో, ఎన్నెన్ని పొట్లాలు కట్టి అరలు అరలుగా దాసిపెట్టుకున్నామో, ఒక్కొక్కటీ  తీసి ప్రేమగా నిమిరినప్పుడల్లా బతికున్న క్షణాలు అలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలా కదిలిపోతుంటయి.

 ఆఖరి గడియల్లో ఆ అరవై సెకన్లు చాలు.. మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని శాశ్వత నిద్రలోకి జారిపోవటానికి !  

  

బండారి రాజకుమార్‍

బండారి రాజకుమార్: వరంగల్ రూరల్ జిల్లా పాతమగ్ధుంపురం స్వస్థలం.గరికపోస, నిప్పుమెరికెలు, గోస , వెలుతురు గబ్బిలం అనే 4 వచన కవితా సంపుటాలు ప్రచురించారు.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.