జీవిత పరీచ్చ

అది నా డిగ్రీ పూర్తయిన సమత్సరం. సరా మామూలుగానే కరువుతో కటకటలాడిన కాలమది. డిగ్రీ పట్టా అయితే ఎట్లనోకట్ల సంపాయిచ్చి గానీ , ఇంగ అవతల పట్టుకోనీకి యా గట్టూ కాన్రాల్య. మా గరుగు సేన్లో సెనిక్కాయ పైరొచ్చినట్లు నా సదువంతా అరకొరగ మార్కులతోనే ఒడపకచ్చి. 

డిగ్రీలో పల్టీ కొట్టింటే గనక నన్ను మాంచి సేద్యగాన్ని సేచ్చామనుకుండ్య మా నాయన. కానీ మా నాయన ఆశలకు గండి కొడ్తి. ‘మనమంటే ఎట్లా కుల్లిపోతనాం ఈ సేండ్లలో. పిల్లోల్లన్నా గడ్డన పడ్తే సాల్ ఎట్టనోకట్ల’ని మాయమ్మ తాపత్ర్య పడ్తాండ్య. ఎట్లా పాసాయ గదా, యా పుట్టలో యా పాముందోనని మా నాయన కూడా ఇంగేం అనక పోతాండ్య. సదువైపొయ్నాక ఇంటికాడుంటే సెడు సవాసాలు పట్టి, తరంగాని తిరుగుల్లు తిరిగి అబాపురు పడ్తామని మాయమ్మ పోరు పెట్టబట్య. ఇంగ సేసేది ల్యాక మళ్లా కడపకే మకాం మారిచ్చి. యాదో ఒక పన్జేసుకుంటా దేనికో ఒక పరీచ్చకు కట్టుకుందామని. అనుకున్నెట్లే ఒక సిన్న స్కూల్లో రూ.1000  జీతానికి టీచరుగా కుదురుకుంటి.

పిల్లోల్లకు సదువు సెప్పాలంటే నల్లేరు నడక కాదని బల్లో సేర్న్య రెన్నాల్లకే అర్థమైపాయ. వంకలో జాలుగా పారే నీళ్ల మాదిరి, ఒకపక్క ఒకరికి కటవేస్యాలకు, ఇంగోపక్క ఇంగో కటవ తెగిపోతాండ్య. ఇట్లా ‘రెడ్డొచ్చ మొదలెట్టు’ అని ఒక పిల్లోన్ని సముదాయిచ్చాలకు ఇంగో పిల్లోని తులవ మొదలైతాండ్య. పిల్లోల్లనర్థం సేసుకోనీకే నాకింగో నెలా రెన్నెల్లు పట్య. 

అయితే ఒగ సంగతి మాత్రం ఒప్పుకోవాల. వాళ్లకు తలకెక్కేలా యాదైనా సెప్పాల్నంటే ముందది నా తలకెక్కాల గదా. నా తలలో అది బాగ నలగాల. నీళ్లలో నానిన ఎదురు బొంగు మాదిరి కావాల. మళ్లా ఆ బొంగులను దబ్బలుగా జిగిరి, దాంట్లను వాటంగా వంచుతా బుట్టలుగా అల్లాల. పిల్లోల్లకు సదువు సెప్పాలంటే అంత కతుండాదని కనుక్కోని బల్లో మెల్లెగ సాలుకు పడ్తి.

‘అట్ల సెప్పే ఐవార్లు ల్యాకనే గదా నా సదువు ఇట్ల ఏర్సింది. ఎట్లన్న గాని, నేను అర్థం సేసుకోని పిల్లోల్లకర్థమయ్యేలా సెప్పాలని’ నేను మా సిన్నెద్దు పట్టు పడ్తాంటి. యాదీ సెప్పలేనప్పుడు ఒక్కోతూరి పుస్తకాలు పక్కన పెట్టి ‘పిల్లలు, ఈ పూటకి మనం కతలు సెప్పుకుందామా’ అని నేనడగ్గానే, క్లాసంతా కాకొరొత్తులు, సిచ్చుబుడ్లు, లచ్చిమి టపాసులు పేలినట్లు టపటప పేల్తాండ్య.  పిల్లల మొగాల్లో దీపాలు పెట్నెట్లు తెల్లగ ఎలిగి పోతాండ్య. ‘అనగనగనగా ఒక అడవిలో…..’ అట్ల కత మొదలైతాదో లేదో క్లాసంతా మళ్లా ‘గప్…చిప్…’అయిపోయి ఏ అలికిడి లేని అడవై పోతాండ్య. 

ఇంత జేసినా గానీ ఎప్పుడన్నా నాలో నిద్రపోయే మృగం ఒకటి అప్పుడప్పుడు బుసలు కొడ్తాండ్య. అప్పుడు మళ్లా ఒక్కరవ్వ నిమ్మలపడి , ‘అబ్బీ…ఇది రాల్ల సేండ్లో దుక్కికంటే తూకమైందేం కాదబ్బీ’ అని నాలోనే నేను నచ్చజెప్పుకుంటాంటి. దాంతో నాకోపం సల్లారి పోతాండ్య. 

అప్పుడే నేను పుస్తకాలు బాగా సదవడం నేర్సుకుంటి. దుబ్బల మీద పిల్లకోడి సిదిగినట్లు యా పుస్తకం కానచ్చినా దాన్ని సిదగకుండా ఇర్సకుంటి. ‘పిల్లలకే నా హృదయం అంకితం’ లాంటి పుస్తకాలు అప్పుడు సదివిందే. బడికి దగ్గర్లో ఉన్య మా రూమ్ కు అప్పుడప్పడు పిల్లోల్లు రాబడ్తిరి. మళ్ల ఇన్నాల్లకంతా మా రూమ్ లో రెక్కలు కట్టుకుని పిసికెల మాదిరి వాళ్లు ఎగరబడ్తిరి. వాళ్లకేమైనా అనుమానాలుంటే ‘అదెట్ల సార్…ఇదెట్ల సార్…’ అని కిచకిచ మంటా అడుగుతాంటిరి. అట్లా పిల్లలకు నా మీద బాగ గురి కుదిర్య. 

ఆ బల్లో అట్ల ఆర్నెల్లు దొర్లిపాయ. అప్పుడప్పుడే నా అయ్యవారు జీవితం గాటిన పడ్తాండ్య. ఆ పొద్దు బడి నుంచి రూమ్ కు వచ్చాలకు పొద్దు గునికిండ్య. కిరసనాయిల్ స్టవ్ మీద బువ్వకు బియ్యం కడిగి పెట్టి ఆర్టీసి బస్టాండు కాడ హోటల్ లో కూరలు తెచ్చుకుందామని పోతి. అనుకోకుండా నా డిగ్రీ సవాసగాడు సుధాకర్ అదే హోటల్లో అదాటు పడ్య. ఆయబ్బిది యర్రగుంట్ల పక్కన పందిర్లపల్య. ఆయబ్బి గూడా పెద్ద ఉన్నోడేం కాదు. అట్లని నా అంత అద్వాన్నమైన పరిస్థితైతే గాదు. వాళ్లింట్లో ఆయబ్బి ఒక్కడే కొడుకు. అట్లైందాన యాడన్నా అప్పో సప్పో తెచ్చైనా ఆయబ్బి సదువుకు ఎగదొబ్బుతాండ్రి. అప్పటికే ఆయబ్బి ఐసెట్ ( integrated common entrance test ) కోసరమని విజయవాడలో కోచింగ్ కు సేరిండ్య. పండక్కో దేనికో ఊరికొచ్చి ఆ పొద్దు విజయవాడకు తిరుగు ప్రయాణంలో ఉండ్య.

వాళ్లది మెట్ట పొలమే. మాది మెట్టనే. అట్లైందాన మా ఇద్దరి కాడ ఉండే కతలు ఇంచు మించు ఒకే సుంచు తూముల మాదిరుండ్య. మేమిద్దరం ఎప్పుడు అదాటు పన్యా ‘మీ ఊర్లో వాన పన్యాదా బ్బీ’ అంటే ‘మీ ఊర్లో పన్యాదా బ్బీ’ అని అని ఒకర్నొకరం పలకరిచ్చుకుంటాటిమి. ఆయబ్బి వాళ్ల అప్పుల తిప్పలు సెప్తాంటే నాకు మా తిప్పలు కండ్ల ముందర కదలాడ్తాండ్య. నేను మా ఎండుతున్న తూర్పు సేను గురించి సెప్తాంటే ఆయబ్బి మొహమంతా వాడతగిల్నెట్లైతాండ్య. అందుకే ఆయబ్బి నేను ఒకే కాడి ఎద్దుల జత మాదిరి డిగ్రీలో భుజాల రాసుకుంటా తిరిగింటిమి.

ఆయబ్బి బూ తిన్ను కూకుంటా నన్ను కూడా తినమని బంగపాయ. నాకూ ఆయబ్బితో కల్సి తినబుద్దాయనే గానీ నా జేబులో తడి మట్టగ ఆరిపోయుండ్య. ‘పొయ్ మీద బియ్యం నానబెట్టి కూరలకని వచ్చినా బ్యా. ల్యాకుంటే  నీ కాడ మొగమాటం ఏముండాది’ అన్జెప్పి తప్పిచ్చుకుంటి. అట్లా ఆ మాట ఈ మాట మాట్లాడ్తండగానే ఆయబ్బి బూ తిని సేతులు కడుక్కుని మూతి తుర్సుకుండ్య. కౌంటర్లో లెక్కిచ్చి ఇద్దరం కల్సి మాట్లాడుకుంటా బస్టాండు తట్టు నడిచ్చిమి.

మేమిద్దరం మళ్లా మా పాత కతల్లోకి జారుకుంటిమి. ఊరు, పైరు, ఎద్దులు, ఎనుములు, వానలు, వంకలు ఇట్లా మళ్లా మళ్లా అయ్యే మాటలు. యాడ మొదలు పెట్న్యా గానీ ఆఖరికి ఇద్దరి మనసుల గమ్యమదే. అట్లా మాట్లాడ్త బస్టాండులోకి పోయి బస్సులు నిలబడే కాడ నిలబడ్తిమి. ఆయబ్బి బ్యాగు కింద పెట్టి నా సెయ్యిలో సెయ్యి కలిపి మాట్లాడబట్య ‘ ఇంగేం అబ్బీ…’ అనుకుంటా. అప్పుడు మా సేతులు కూడా ఏదో మాట్లాడ్తన్యట్లు అనిపిచ్చ. దాంట్ల భాష దాంట్లది. 

నేనుండి ‘కోచింగు ఎట్లుండాది బ్బీ?’ అని మాటల్ను ఒగరవ్వ పక్కకు మల్లిచ్చి.‘బాగుంది బ్బీ. బాగ సెప్తనారు’ అని మళ్లా ‘మనవాళ్లు ఐదారు మంది దాకా ఉండారు బ్బీ. నువ్వూ రాగుడ్తా. బాగుంటాది. ఒకరికొగరం తోడుగా’ అన్య అప్పుడు ఆయబ్బి సేతులు నా సేతిని అదిమి పట్ట్య. ఆ మాటలు యాన్నో వాడు బట్న్య సెట్టుకు నీళ్లు పోసినట్లాయ. మళ్లా శాన్నాల్లకు నా సదువు కొమ్మ కొత్త సిగురేసినట్లనిపిచ్చ.

కోచింగ్ కు పోయి సదువుకుంటే బాగుంటాదని ఆశ కలిగ్య. ఐతే లెక్క లేనితనం, అప్పుల ఊబి, మళ్లా కొత్త అప్పులు అన్నీ మతికొచ్చి నా ఆశల మీద మిడుతలు మూకుమ్మడిగా దాడిసేసినట్లు దాడిసేస్య. అంతలోకే ఆయబ్బి ఎక్కాల్సిన బస్సొచ్చి మాకటు పక్కగా నిలబడ్య.  ఆయబ్బి నా సెయ్యి ఇర్సి బ్యాగును తీసుకుని బస్సెక్కను కదిలిపాయ. అట్లా ఆయబ్బి నాకు దూరమై పోతాంటే అప్పుడే సిగురించిన సెట్టు మళ్లా వాడుమొగం బేసినట్లాయ. లోన పానం రోంత గిలగిల తన్నుకలాడ్య. 

ఆయబ్బి బస్సులో బ్యాగు పెట్టి మళ్లా దిగొచ్చ. అడుగుదామా వొద్దా, అడుగుదామా వొద్దా అని సంశయ పడ్తా ఆఖరికి తెంపు జేసి ‘అబ్బీ… అది నేను కూడా తగలొచ్చా అబ్బీ…? నా గురించి నీకు తెల్సు గదా. గొప్పలు జెప్పుకోను ఏముండాది. నాది అంత ఉషారైన బుర్ర గాదు. మొద్దు బుర్ర. అయితే సల్లుకోను, ఒల్లు దాసుకోకుండా యాడికైనా యంపలాడ్త. నేను ఏమైనా ఆశ పెట్టుకోవచ్చా బ్బీ’ అనడిగితి.

ఆయబ్బి మరో మాట మాట్లాడకుండా….’రాబ్బి బాగుంటాది రా. పిచ్చిరెడ్డి కూడా ఉండాడు. నాగూరు ప్రవీనుండాడు. యాంపల్లె హరి, నారేపల్లె ఆయబ్బి జయసింహ, పులిందలోల్లు ఇంగో ఇద్దరుండారు. అందరం రూమ్ తీసుకోనుండాము. నువ్వొచ్చే బాగుంటాదిబ్బీ… అందరం కల్సి బాగ సదువుకోవచ్చు’ అన్య. 

ఆయబ్బి మాటలు నాకు కొండంత బలమిచ్చ. అట్ల ఆ మాటలు పూర్తాయనో  లేదో బస్సులో డ్రైవర్ ఎక్కి హారన్ కొట్టబట్య. ఆయబ్బి పొయ్ బస్సెక్కి కిటికీ వార కూచ్చుండ్య. నా ఆశల బండి ఆన్నుంచి కదిలి నాకు దూరంగా పోబట్య. నేను ఆయబ్బి కూకున్య కిటికీకి నా సూపులు కట్టేసినట్లు నా కండ్లు అట్లనే సూడబట్య. అట్లా ఆ బస్సు నా సూపుల దరిదాపుల నుంచి తప్పించుక పోయే వరకు అట్లనే సూచ్చా నిలబడ్తి. 

ఆయబ్బికి నా సంగతి బాగ తెల్సు. ‘ఈ మంచి దుబార మనిసి గాద’ని,  ‘ఒళ్లు బరువు మనిషి అసలు గాద’ని, ‘లెక్క కాడ బక్క పానమైనా పట్టుబడ్తే బండకోడె మాదిరి ఇర్సిపెట్టే రకం గాద’ని కూడా తెలుసు.

బస్టాండు నుంచి హోటల్ కు పోయి కూరలు కట్టిచ్చుకోని తిరిగి రూముకు దావపడ్తి. మనసు లోపల కవ్వమేసి మజ్జిగ సిలికినట్లుండాది. 

రచ్చబండ కాడ రగడ మొదలైనట్లు, ఒకడేమో ‘కోచింగుకు పోతే బాగుంటాది. ర్యాంకు తెచ్చుకుంటే MBA నో MCA నో సదవచ్చు. దాంట్లకిప్పుడు మార్కెట్లో మాంచి గిరాకి ఉండాది. ఆ సదువు సదువుతే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలొచ్చి, పెద్ద పెద్ద జీతాలొచ్చాయంట. మీ అప్పులు బెరీన తీరిపోతాయి. మీ నాయన నలగర్లో అప్పు ల్యాకుండా తలెత్తుకోని తిరగొచ్చు’ అనంటే,  ఇంగొకడేమో ‘కోచింగుకు పోవాలంటే మళ్లా అప్పు సెయ్యక తప్పదు. మీ నాయన మళ్లా ఎవని ముందరో ఒకని ముందర సెయ్యి జాంచక తప్పదు. ఐనా నెలకు 1000 రూపాయలు వచ్చే లచ్చనమైన ఉద్యోగం ఇర్సిపెట్టి ఒట్టి న్యాలలో ఇత్తనమేసి వాన కోసరం మోరెత్తి సూసినట్లు వచ్చాదో రాదో తెలియని ర్యాంకు కోసరమని ఆంత దూరం ఎగేసుకోని పోతాడంట ఈ పాలెగాడు’ అంటా ఇద్దరు పాలెగాల్లు ఎల్లకోరా అని ఒకడంటే, ఏయ్ సల్లోకోన్రా నేను అని ఇంగోడంటా గలాటకు దిగి ఒకటేమైన రంపు జెయ్యబట్య. 

‘ఐనా ఇన్నాల్లూ నగదుండే సదివితిమ్యా! మళ్లా సదువుకుంటే బాగుంటాదేమో! ఇప్పుడు పిల్లోల్లతో బాగున్యా ఈ 1000 రూపాయల జీతం యా మూలకూ సరిపోడంల్యా, ఇట్లా ఎన్నాల్లని సేచ్చాం!’ అని ఒక పక్షం, ‘తీరా ఇప్పుడు మధ్యలో బడి ఇర్సిపోతే పిల్లోల్ల గతేంగాను! వాళ్లతో ఇన్నాల్ల సవ్వాసం ఏంగాను! ప్రిన్సిపల్ మేడం ఏమనుకుంటాదో ఏమో…’ అంటా ఇంగో పక్షం మొహరించ్య. ఏ పక్క పొవ్వాల్నో నాకు దిక్కు తెల్య. 

‘కానీ ఈ డిగ్రీతోనే బతుకు బండి లాగడం మాత్రం బక్కటెద్దు సేద్యం మాదిరే అబ్బి. ఏం సదివినా ఈ వయసులోనే. ఇప్పుడు ఎల్లకోక ఇంగెప్పుడు ఎల్లుకునేది. ఇర్సు తక్య యేమైతే అదైతాది’ ఇట్లా తేనెటీగెల లెక్కన నా తలకాయ నిండా పరిపరి తలంపులు సుట్టుకుండ్య.

ఆపొద్దు రాత్రంతా లోపల ఒకటే రగడ. దానేటుకు నిద్ర కూడా పట్టక మల్లగుల్లాలు పడ్తి. మల్ల ఎప్పుడో సైరపొద్దునంగా నిద్రపోతి. ‘నేను బడిర్సి పోతన్యట్లు, నా ఎనకల పిల్లోల్లు ఏర్సుకుంటా ఎంట పన్నెట్లు’ ఆ రాత్రంతా ఒకటే కల. 

పద్దన్నే లేసి ఆ వచ్చే ఆదివారం ఊరికి పొయ్ రావాల అని నిచ్చయించుకుంటి. 

శనివారం మాయ్టాల సీకటి పడ్యాలకంతా ఊరు సేరికుంటి. నేను ఇండ్లు సేర్యాలకు మా నాయన దొడ్లో జాలాట్లో నీళ్లు పోసుకుంటాండ్య. నేను దొడ్లోకి పోతానే నన్ను జూసి ‘బాగుండావ్ బ్బీ’ అని పలకరిచ్చ. ‘బాగుండా..నాయ్నా’ అంటి. అప్పుడే ‘నాయ్నా నాకు కోచింగు కు పోవాలనుంది. లెక్క సూడు’ అని తెగేసి సెప్దామనుకుంటి. ఐనా తీరామారా ఇంటికొచ్చి కాల్లన్నా కడుక్కోక తలికే అంత తొక్కులాడ్డం దేనికని గమ్ముగైతి. ఐతే ఎప్పుడెప్పుడు మా నాయన్ను అడుగుదామా, అడిగితే ఏమంటాడో ఏమో! లెక్క లేదుబ్బీ అని సేతులెత్తేచ్చే మొత్తానికే మోసమొచ్చాదే అని మనసు మనసులో ల్యాకుండ్య. నేను కాల్లు, మొగం కడుక్కోని ఇంట్లోకొచ్చి టవల్ తో తుర్సుకుంటి. 

మాయమ్మ, నేను, మా పెద్దన్న మా నాయన అందరం కల్సి ఆ రాత్రి బువ్వకు కూకుంటిమి. ఇంగ అందరూ ఉండారు,  అదే మంచి అదుననుకుని బూ తింటా ‘నేను కోచింగుకు విజయవాడకు పోతానని, సీటొచ్చే మంచి సదువు సదవచ్చని, ఆ సదువుకు ఇప్పుడు గిరాకీ బాగుందని’ సెప్పకచ్చి. మాయన్న కూడా నాకు వంత పాడ్య. మాయమ్మ ఆ అనక ఊ అనక మా నాయన ఏమంటాడో అని ఎదుర్జూడబట్య. మా నాయన ఇన్నెంత సేపిని ‘ఎంత కావాలబ్బి’ అని అడిగ్య. నేనుండి ‘ఏడు వేలు నాయ్నా’ అంటి ఆశగా. దానికి మా నాయన ఉండి  ‘బ్బీ…నాకాడ మాత్రం లెక్క లేదబ్బి. లేదు. బయట అడిగినా అప్పిచ్చే నాదుడే లేడు. ఈసారి తెచ్చినకాడ వడ్డీనే తెంచల్యాక పోతిమి. నయాపైసా మాసూలు రాల్య. మళ్లా యాడ పుడ్తాది కొత్తగా అప్పు!’ అని కరాఖండిగా సెప్య. ఇంగ నాకు ముద్ద నోట్లోకి దిగల్య. సరే అట్లనే ఇంగో రెండు ముద్దలు బలవంతాన తిని సగం కడుపుతోనే సెయ్యి కడుక్కుంటి. నేను టవల్తో మూతి తుర్సుకుని ఇంట్లో నుంచి ఇసురుగా బైటికి నడిచ్చి. 

రాత్రి అందరం నడవలో పండుకుంటిమి.

పద్దన్నే నేను,  మా నాయన, మాయన్న మా తూర్పు సేనికాడ గట్టు సగెయ్యడానికని బండి కట్టుకోని పోతిమి. వానల కాలం పెద్ద వానొచ్చే గట్టు కోసక పోతాదేమోనని గుల్లరాయి అడ్డం పోసి,  దాని పైకి వంకలో నుంచి ఇసిక్య తోలి ఎత్తు సేచ్చాంటిమి. నేను మా నాయన మీద అప్పటికే అలిగి గుర్రున గూటం కొట్నోని మాదిరుంటి. అది మా నాయన పసిగట్య. వంకలో బండికి ఇసిక్య పోచ్చాంటే మా నాయన మొదులు పెట్య. ‘అబ్బీ…అబ్రహం లింకన్ వీధి దీపాల కింద సదువుకుని అమెరికా ప్రసిడెంటు ఐనాడంట. మనసుంటే మార్గముంటాది బ్బీ’ అని నాతిక్కు జూసి నగుతా ఎత్తిపొడిస్య. ఆ మాటలు నాకు రేనిగంప గుచ్చుకున్నెట్లాయ. ఐనా గానీ నేనేమనకుండా మూతి బిగిచ్చుకుంటి. 

ఆఖరి తడవ ఇసిక్య పోసుకుని సేనికాడికి పోతాంటిమి. దావలో మా ఊరి సిన్నెంకట్రెడ్డి కనపచ్చ. ఆయప్ప ఇప్పుడు మా ఊరిర్సి కడపలో సేరిండ్య. ఆ యప్పను సూచ్చానే నాకో తాయం మతికొచ్చినట్లాయ. అంతలోకే బండి సేనికాడికి సేర్య. ఇసిక్య గట్టునిర్సి కువ్వను పార తీసుకుని అటు ఇటు నెరపబడ్తిమి. అప్పుడు నేను మొదులు పెడ్తి.

‘నాయ్నా…నేను సదువుకుంటా అంటే, లెక్క లేదబ్బి, సదివియ్యలేనబ్బి అంటివి. ఆ… అంటే ఆయప్ప ఎవ్రో అబ్రహం లింకను వీధి దీపాల కింద సదువుకోని అంతటోడైనాడంటివి.  అమెరికా అంత దూరమెందుకు నాయ్నా, మనూర్లో ఆయప్ప సిన్నెంకట్రెడ్డి సూడు వాళ్లమ్మా వాళ్ల నాయ్నా ఏమియ్యకున్యా అంతంత భూమి సంపాయిచ్చ. అంత లెక్క సంపాయిచ్చి కడపలో అన్ని మిద్దెలు కట్య. మరి నీకు జేజి 10, 15 ఎకరాలు భూమినిచ్చే 4 లచ్చలు అప్పు పండిచ్చివి గానీ దమ్మిడి మిగిలిచ్చి మాకేమన్నా పెడ్తివ్యా’ అని అడిగితి, మా నాయన ఈ పొద్దు దొరికినాడ్లే నాకని లోపల సంబరపడ్తి. 

ఇసిక్య నెరుపుతన్య మా నాయన ఒగరవ్వ ఆని నిలబడి

‘అబ్బీ…నువ్వు సెప్పింది నిజమే. ఏం జెయ్యాలబ్బి, నాకు మాయమ్మ మాటతప్పడం నేర్పియ్యల్య. మనసల మోసం జెయ్యడం నేర్పియ్యల్య. ఉన్నెంతలో తింటా బతకమని సెప్పిండ్య మాయమ్మ. మీరూ సూచ్చనారు గదా పిల్చకనే పలికే కరువులతో మనమెట్లా సతమతమైతనామో! వానొచ్చే పండాల ల్యాకుంటే ఎండాల. అట్ల వచ్చే ఒట్టి కరువన్నా వచ్చాది, ల్యాకుంటే పచ్చి కరువన్నా వచ్చాది. యా కరువూ ల్యాకుండా పరపాట్న పంట పండితే కాలబడి రేటుండదు. ఇట్లైతే అప్పులు గాక ఇంగేందిబ్బీ మిగిలేది?’ అన్య.

మళ్లా మా నాయ్నే ఎత్తుకుని ‘అబ్బి..ఐతే నేను నా జీవితంలో ఒగటి మాత్రం సంపాయిచ్చినా బ్బీ… ఊర్లో యాడికన్నా పొయ్ ఇదో పలానా మనిసి పలాన మాటిచ్చినాడని సెప్పు, అదే మాట నువ్విందాకా సావకారి అంటివి సూడు ఆ సిన్నెంకట్రెడ్డి  సెప్పినాడని సెప్పు. ఎవరి మాట నమ్ముతారో, ఎవురి మట నమ్మరో సూచ్చాం. ఇలువంటే లెక్కకు, మిద్దెలకు, బంగలాలకే కాదబ్బి. మనసలగ్గూడా ఒక ఇలువనేది ఉంటాది. మాటగ్గూడా ఇలువనేది ఉంటాది. నేను ఆయప్ప మాదిరి మోసాలు సచ్చినా సెయ్యలేను. నేను మీకియ్యగలిగిన ఆస్తిపాస్తులు మాట ఇలువ, మంచితనం. లెక్కదేముండాదిబ్బీ లెక్క. ఈపొద్దు గాకపోతే రేపొచ్చాది. దేవుడు సల్లగ జూసి రెండు మూడేండ్లు పండుతే మనం కండ్ల సూడమా లెక్క! కానీ పోగొట్టుకుంటే సంపాయిచ్చ లేనిది మాట, మంచి తనమబ్బి. నేను మీకు లెక్కియ్య ల్యాక పోయుండచ్చు, సదివియ్యల్యాక పోయుండచ్చు. సుఖ పెట్టల్యాక పోయుండచ్చు. కానీ ఎంత లెక్కిచ్చినా కొన లేని మాట విలువ, గౌరవం ఇచ్చినా అబ్బి. అదే నేను మీకు నా జీవితాంతం కష్టపడి సంపాయిచ్చి పెట్టిన ఆస్తిపాస్తులు.’ అని సెప్య. 

మా నాయన సెప్పిందాంట్లో ఒక్క మాట అబద్ధముంటే ఒట్టు. మా నాయన ఒక్క దుబారా మాట మాట్లాడంగా ఇనింటే ఒట్టు. అట్లాడ్ది మా నాయన్ను పట్టుకుని నేను పెద్ద పెద్ద మాటలే అన్యాననిపిచ్య. అప్పుడు ‘అబ్బీ నువ్వు నాయన్ను పట్టుకోని పెద్దంతరం, సిన్నంతరం ల్యాకుండా అంతంత మాటలు మాట్లాడ్డం తప్పుగదూ…’ అని నన్ను లోపల బోనులో దోషిగా తేల్చేస్య. 

ఇంగప్పుడు నా కండ్లల్లో నీళ్లు సుడులు తిరిగ్య. నేను మా నాయన కాడికి పొయ్ గట్టిగ కర్సుకుంటి. ‘పరపాటైంది’ అనే మాటతో పాటు, అన్ని మాటలు ఆ కన్నీళ్లలో కొట్టకపాయ. అట్లనే గుక్కపట్టి ఏడిచ్చి. మా నాయ్నా కూడా నన్నట్లనే అదిమి పట్టుకుండ్య. మా నాయన కండ్లల్లోకి తిరిగి సూసే దైర్నెం నాకు ల్యాకపాయ. 

కాడిగట్టుకోని అందరం ఇంటి దావ పడ్తిమి. ఆ పొద్దు మాయ్టాల మళ్లా కడపకు బయల్దేర్తి. నన్ను రోడ్డుకాడ బస్సెక్కియ్యను మా నాయ్నే తోడొచ్చ. వచ్చే ట‌ప్పుడు దావలో సెప్య. ‘ఒక నెల ఎట్లనోకట్ల ఓపిక పట్టబ్బి. వేరేసాట లెక్కడిగి పెట్న్యా. అదొచ్చానే నువ్వు విజయవాడకు పోవచ్చు’ అన్జెప్య. అప్పుడు మళ్లా వాడిన సదువుల సెట్టు కొత్త సిగుర్లేస్య. మా నాయన మాట సెప్పి తప్పిందిల్యా. నేను కూడా మా నాయనకు ఒక మాటియ్యాలనుకుంటి. ‘నాయ్నా కచ్చితంగా ర్యాంకు కొడ్తా నాయ్నా’ . అంటి.

అన్నెట్లుగానే మా నాయన నాకిచ్చిన మాట తప్పల్య. మళ్ల నేను కూడా అంతే. అదేందో గానీ ఆపొద్దు నాకు ర్యాంకొచ్చినాదని మాయన్న పరిగెత్తుకుంటా వచ్చి సెప్పినాపొద్దు కూడా నేను, మాయమ్మ, మా నాయన అందరం అదే తూర్పు సేండ్లోనే యాదో పన్జేచ్చా ఉంటిమి. అప్పుడు నేను మా నాయనకిచ్చిన మాట నిలబెట్టుకున్యట్లు, నా తొట్ట తొలి జీవిత పరీచ్చ పాసయినట్లుండ్య. మళ్లా ఒగతూరి నా సదువుల సెట్టు తట్టు సూచ్చి. అదప్పుడు ఓ పువ్వు పూసిండ్య , ఆ పువ్వు మమ్మల్ను సూసి సిక్కెగ నగుతన్యట్లు అనిపిచ్చ.

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

13 comments

  • Thank you so much అన్న. మరిన్ని మంచి కతలతో తప్పక మీ ముందుకు వచ్చాను.

 • శానా బాగా సెప్పినావప్పో! అందరిదీ ఇదేకతానువ్వన్నయం. మావి ఇంకా సెప్పుకోలేనికట్టాలు. కాని సదువుతుంటే కండ్లల్ల నీళ్ళొచె అప్పా!

  • నిజమన్నా. నా కండ్ల ముందరే లెక్క ల్యాక రాలిపోయిన మెరికెవెన్నతో…తలచుకుంటే ఏడుపొచ్చాది న్నా..

 • కన్నీళ్లు తెప్పిచ్చినవున్నో! అనుభవపూర్వక భావాలు బాధనే కాదు భావోద్వేగాన్ని కూడా రగులుస్తాయ్😍😍❤️

 • అప్పా నీకు సేతులెత్తి మొక్కి గౌరవిస్తాండా🙏🙏 నువ్వు రాసిండే కత గొప్పదనం గురించి సెప్పేదానికి నాకు స్యాత కాకుండ వుండాది స్వామి. దానికే ముందుగాల్నే సేతులెత్తి మొక్కినా!
  వూర్లో యందురో రైతులు సేద్యము జేచ్చా వుంటారు స్వామి… కానీ అందులో కొందురే మంచి రైతు అని పేరు పొందింటారు. వాళ్లలో నువ్వూ(మీరూ) ఒకరని నాకు తోస్తానది స్వామి. అంతే స్వామీ.. అంతే..🙏🙏🙏

  • అయ్యో అన్నా…రాయలసీమలో పిల్లోల్లు మంచి సదువులు సదువుకోవాలంటే ఎంత ఇబ్బందులు పడాల్నో నా అనుభవం రాచ్చిని.

   ఇక రైతుగా ఎన్ని తూర్లు ఎద్దల్ను, ఎనమల్ను పట్టుకోని ఏడిచ్చిమో లెక్క లేదన్నా. అయ్యి సల్లిన తడే ఇంగా గుండెలలో ఆరిపోకుండా ఉండాది.

   మిమ్మల్ను తాకగలిగానంటే అది నా అదృష్టం గా భవిటచ్చనా అన్నా

 • ఉరు దాటెళ్ళినోడికి
  సొంతూరు మనిషి తగిలినట్లనిపించినాది..

  బంధూ…
  మళ్ళోసారి..మా నాయన గుర్తొచ్చినాడు..మర్సిపోయిన పల్లె..గుర్తొచ్చినాది..

  ఉన్నారయ్యా..
  నా కాలపు మనుషులు..నీ రూపున…
  ఓ అచ్చమైన మనిషిని కలిసినందుకు
  ఆనందంగా వుండాది..మనసుని తడిచేసావు..బంధూ…ధన్యవాదాలయ్యా..

  • అన్నా, ధన్యవాదాలు. మీ మనసును తాకినందుకు శానా సంబరంగా ఉండాది.

   మీలాంటి వాళ్లకు దగ్గరవుతున్నందుకు కాసింత గర్వంగా కూడా..

  • ధన్యవాదాలు అన్న. కరువు ప్రాంతాలలో చాలా మంది పరిస్థితి ఇదే.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.