ఒక నీటి గంట…

ఔను…

నిజంగా నిజం!

మొత్తానికి పిల్లి మెడలో గంట కట్టేశారు!

ఎవరు?

ఇంకెవరు? కేరళ మాస్టారు జనీల్ జాన్!

పిల్లి వస్తే ప్రాణం మీదికి వస్తుంది! దాహమేస్తే నీళ్ళు తాగకుండా వుంటే కూడా ప్రాణం మీదికి వస్తుంది! పిల్లి రావడాన్ని గుర్తు చేయడానికి దాని మెడలో గంట కట్టాలి! అప్పుడు ఆ గంట శబ్దం విని ఎలుకలు ఎలర్టయి దాక్కుంటాయి! ప్రమాదం తప్పుతుంది! లేదంటే పిల్లి ఎలుకల్ని తినేస్తుంది!

అలాగే దాహమేస్తే గుర్తు చేయడానికి మన బడిలో నీటి గంట కట్టాలి! అప్పుడు ఆ గంట శబ్దం విని పిల్లలు ఎలర్టయి నీళ్ళు తాగి దాహం తీర్చుకుంటారు! ప్రమాదం తప్పుతుంది! లేదంటే అనారోగ్యంతో అవస్తలు పడాల్సివస్తుంది!

మరి పిల్లి మెడలో గంట కట్టడంతో పనయిపోయినట్టేనా? నీటి గంట కట్టగానే ఆరోగ్యం అరచేతిలోకి వొచ్చేసి వున్నట్టేనా?

మీ బళ్ళో యేమో గాని మా బళ్ళో తాగునీటి సౌకర్యం లేదు!

కడవలో నీళ్ళు పోసి పెడతారు! ఆయా నీళ్ళు మోసి అందులో పోస్తుంది! అల్యూమినియం మూత! మూత మీద ప్లాస్టిక్ గ్లాసు! మూత తెరిస్తే అందులోంచి పైకెగురుతూ దోమలు! ఒక్క ఆయా అన్ని తరగతులకి నీళ్ళు మొయ్యడానికి వోపిక లేక రోజూ నీళ్ళు మార్చక పోగా ‘నీళ్ళేమయినా కుళ్ళిపోతాయా?’ అంటుంది! ఆ నీళ్ళు తాగితే గొంతునొప్పి జలుబూ దగ్గూ అప్పుడప్పుడూ జ్వరమున్నూ!

‘ఎవరి నీళ్ళు వాళ్ళు తెచ్చుకోండి…’ అని మా టీచర్లు చెప్పేశారు!

అలాగే తెచ్చేసుకున్నాం!

ప్లాస్టిక్ బాటిల్స్ పనికిరావని అన్నారు! అయినా అవే వాడుతున్నాం! గాజు సీసాలయితే చెయ్యి జారిందా ఢమాల్! మా హెల్త్ చెయ్యి జారినా ఢమాల్ అయినా పరవాలేదు! ప్చ్!

స్కూలు పుస్తకాల బరువుకి తోడు నీళ్ళ బాటిల్ బరువు ఇంకా క్యారేజ్ బాక్సులు! మొయ్యడమే!

మోస్తే మాత్రం? ఇప్పుడు నీళ్ళు తాగుతున్నాం! అందరూ తాగుతున్నారు కాబట్టి మనమూ తాగుదాం- అని ధైర్యంగా తాగేస్తున్నాం! ఒకప్పుడయితే నీళ్ళు తాగితే పాసుకి వొస్తుందని పొద్దుట యింట్లో తాగివస్తే సాయంత్రం తిరిగి యింటికి వెళ్ళాక తాగడమే! ఇప్పుడు పరిస్థితిలో మార్పు వొచ్చింది! నీళ్ళ గంట కొట్టంగానే అందరితో తాగి అందరితో గోడ చాటుకు పోయేది! పాత టాయిలెట్స్ కు రిపేర్లు చేశారు! మళ్ళీ రిపేరు వొచ్చింది! మీరే పాడు చేశారు, మీరే పడండి… అని తేల్చేశారు!

కాని యిప్పుడు నీళ్ళు తాగుతున్నాం! మాకు మేమే గోడలవుతున్నాం! ఒకరిపక్కన వొకరు దగ్గరగా నిలబడి! కుడిపక్కన చివరన వున్న ఆమె మొదట పోతుంది! పోయివచ్చి యెడమ పక్క చివరన చేరి నిలబడుతుంది! అలా వరుసగా అందరమూ! మాకు సిగ్గులేదు! సిగ్గుపడితే పనవదు! ఆట అనుకుంటాం! ఆడుకుంటాం! ఆ పని చేసి వొస్తాం!

ఎన్ని యిబ్బందులు వున్నా, నీటి గంట కొట్టడం బాగుంది! రోజుకు బడి టైంలో లీటరున్నర నుండి రెండు లీటర్లు తాగాలి! కాని బాటిల్ పట్టినన్ని (తొమ్మిది వందల యాభై మిల్లీ లీటర్లు) తాగుతున్నాం! సరే గుడ్డి కన్నా మెల్ల నయం కదా? ఇప్పుడు యెంతో కొంత యేకాగ్రత వుంది! అప్పుడు వొకపక్క గొంతు దాహంతో యెండి ఆర్చుకుపోయేది! మరోపక్క యెప్పుడు యిళ్ళకు వెళ్తామా అని పొత్తి కడుపు నొప్పితో తిన్నగా నిలబడలేకపోయేది! ఇంక యేకాగ్రత యేమిటి? తలనొప్పి కూడా వుండేది! ఇప్పుడు తగ్గింది! అలసటా అజీర్తి మాత్రమే కాదు, యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా ముఖ్యంగా మా ఆడపిల్లలకి! ఇప్పటికిన్నూ! టాయిలెట్స్ లేక శుభ్రం లేక! ఉన్న వొక్కటీ టీచర్స్ వాడుకుంటున్నారు! ఇంతమంది పిల్లలకి చాలదు అంటారు! పాడవుతుంది అంటారు! మేమెక్కడికి వెళ్ళాలంటారు! అందుకే మేం సిగ్గు విడిచాం! మొదట సంకోచించాం! తరువాత పెద్దలకీ ప్రభుత్వాలకీ లేని సిగ్గు మనం పడితే బాగోదు- అనుకున్నాం!

ఏదయితేనేం వొకసారి కాదు, రోజుకు నాలుగు సార్లు నీళ్ళు తాగే అవకాశం వచ్చింది! వనజక్కకి అప్పట్లో కిడ్నీలో రాళ్ళు కూడా వచ్చాయి! ఇప్పుడిక యే అక్కకీ చెల్లికీ ఆ సమస్య రాకూడదు! నీళ్ళ గంట మోగుతుంది! నీళ్ళు తాగుతాం! చదువుకుంటాం! పాసు పోస్తాం! మగ పిల్లల్లా భరితెగించారు- అని అనుకున్నా బాధ లేదు! ఆరుబైట మలమూత్రాలు పోయవొద్దని అడ్వర్టైజ్ చేసే బదులు ఆ డబ్బుతో మా బడుల్లో టాయిలెట్స్ కట్టించండి! కాదంటే నిలబడి పాసు పోసుకొనే ఇన్స్ట్రుమెంట్స్ అయినా మా ఆడపిల్లలకి యివ్వండి!

మేం అదృష్టవంతులమట… మాకు నీటి గంట వచ్చింది! అన్ని బడుల్లో యింకా అమలు చేయడం లేదు! క్రమేనా విస్తరిస్తారట! దీనికి కూడా ప్రభుత్వానికి టైం పడుతుంది?!

సరే, పిల్లి దగ్గరికి మళ్ళీ వొస్తే- పిల్లి మెడలో గంట కట్టడంతో ఎలుక ప్రాణాలకి భారోసా లేదు! నీటి గంట కొట్టగానే కాదు, యింకా చాలా చెయ్యాల్సినవీ చెయ్యాలి! లేదంటే నీటి గంటకూ గంట కొట్టినట్టే!!

– రాజ్యలక్ష్మి,

ఆరవ తరవతి, 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.