ధనస్వామ్యం రుగ్మతకు సినీ దర్పణం

‘పేరసైట్’ (గిసాంగ్‌చుంగ్) అనే దక్షిణ కొరియా సినిమా మొన్నటి 92 వ అకాడమీ అవార్డులలో పెద్ద సంచలనం సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం – ఇలా ప్రముఖమైన  నాలుగు అవార్డులను గెలుచుకుంది. గత ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పామ్ డి ఓర్‌ను గెలుచుకున్న ప్రథమ దక్షిణ కొరియా చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. ఇంగ్లండు బాఫ్టా అవార్డును కూడా కైవసం చేసుకొంది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు బాంగ్ జూన్-హో కథ, స్క్రీన్ ప్లే రాసి తెరకెక్కించిన సినిమా ఇది.

‘పేరసైట్’ అంటే కూర్చుని తినే పరాన్నజీవి. పరస్పరం సహకరించుకునే ‘సహజీవన జీవుల’ (symbiotic organisms) గురించి కూడా జీవశాస్త్రంలో చదువుకుంటాం. కానీ వేరోకరి మీద పడి బతికే ‘పేరసైట్’ అనేది ఒక తిట్టులాంటి మాట. ఈ సినిమా నులిపురుగులాంటి పరాన్న జీవి గురించి కాదు. స్పష్టమైన సామాజిక సందర్భంలో – తారా స్థాయికి చేరిన పెట్టుబడిదారీ వ్యవస్థలోని ధనిక, పేద సామాజిక వర్గాలకు సంబంధించినది. 2015 రిపోర్ట్ ప్రకారం దక్షిణ కొరియాలో అతి సంపన్నులైన 10% ధనికుల వద్ద దేశ సంపదలోని 66 % వుంది. (మనదేశంలోనైతే 70-80 %) సమాజం అడుగున వున్న 50 శాతం పేద ప్రజల వద్ద సంపదలోని 2 శాతం మాత్రమే వుంది. ఈ విషమ ఆర్ధిక నేపథ్యంలో ఈ సినిమా కథను చూడాలి.

సినిమా కథ:

కిమ్ కుటుంబం

తండ్రి కి-టేక్, తల్లి చుంగ్-సూక్, కుమార్తె కి-జంగ్, కుమారుడు కి-వూ కలిపి నలుగురు సభ్యులతో ఒక  పేద కిమ్ కుటుంబం. (కొరియన్ పేర్లు పాఠకులకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు). సియోల్ లోని పేదల బస్తీలో ఒక చిన్న సెమీ-బేస్మెంట్ ఇంట్లో వుంటున్నారు. ఆ ఇంటి కిటికీ తను రోడ్డు కంటే ఎత్తులో వున్నాను అని చెప్పుకోడానికి కష్టపడుతున్నట్టుంటుంది. ఆ కిటికీ బయట అందమైన దృశ్యాలేమీ కనిపించవు. తాగుబోతుల వాంతులూ, వుచ్చలు తప్ప! పిజ్జా బాక్స్ ఫోల్డర్లుగా చాలీచాలని రాబడితో తాత్కాలిక ఉద్యోగాలు వారివి. ఫ్రీ వైఫై కనెక్షన్ కోసం డైరెక్షన్లు గాలించాల్సిన బతుకులు వారివి.

ఒక రోజు కి-వూ స్నేహితుడు మిన్-హ్యూక్ వారింటికి వస్తాడు. తను విదేశాలలో చదువుకోవడానికి వెళ్తున్నట్టూ, అంతవరకూ తన స్టూడెంట్ అయిన సంపన్న పార్క్ పరివారం కుమార్తె డా-హేకు ఇంగ్లీష్ ట్యూటర్‌గా పనిచేయాలనీ కి-వూకు చెబుతాడు. ఫోర్జరీ చేసిన డిగ్రీతో కి-వూ ఆ ధనికుల ఇంటి ఉద్యోగాన్ని చేపడతాడు. అది స్వర్గం లాంటి విశాలమైన భవనం. అందమైన పచ్చిక బయళ్లు, విశాలాకాశం. ఎల్లప్పుడూ సూర్యరశ్మి వచ్చేలా విశాలమైన అద్దపు కిటికీతో ఆర్కిటెక్ట్ నిర్మించిన రాచభవనం. ఆ లగ్జరీకి పరవశుడౌతాడు కి-వూ. ఆ కుటుంబ పెద్ద బిజీగా వుండే ఐటీ కంపెనీ యజమాని. భార్య ఇంటి వ్యవహారాలు చూస్తుంది. కి-వూ తన స్టుడెంటుకు పాఠాలు చెబుతూ ప్రేమలోకి దింపుతాడు. తన వాళ్ళందరినీ ఈ ఇంటి ఉద్యోగాల్లో పెట్టాలని ప్లాను వేస్తాడు. డా-హే తమ్ముడికి ఆర్ట్ థెరపిస్ట్ గా తన చెల్లాయిని తెస్తాడు! మోసకారి పద్ధతిలో డ్రైవర్ పోస్ట్ లోకి తండ్రి, ఇంటిలో 24 గంటలు వుండే పనిమనిషి స్థానంలోకి తల్లి చేరుతారు. వీరంతా అపరిచితులుగా వేరొకరి రెఫెరెన్సు ద్వారానే వచ్చినట్టు ఆ ఇంటి ఉద్యోగాల్లో సెటిలౌతారు.  

ఒకరోజు పార్కర్ ఫ్యామిలీ తమ కొడుకు పుట్టిన రోజు పార్టీ కోసం క్యాంపుకు వెళతారు. వారి అనుపస్థితిలో కిమ్ కుటుంబం ఆ ఇంటి విలాసాలతో, విందు, మందులతో ఆనందిస్తున్న సమయానికి పాత పని మనిషి మూన్-గ్వాంగ్ హఠాత్తుగా ఊడిపడుతుంది. కిచెన్ వెనకాల ఏదో మరిచిపోయాననీ, పది నిమిషాలలో తీసుకుని వెలిపోతాననీ చెబుతుంది. సరే నంటారు. తీరాచూస్తే ఆ కిచెన్ వెనకాల ఒక బంకర్లో ఆవిడ తన భర్త జియున్-సే ను రహస్యంగా దాచివుంచి తిండిపెడుతోందని తెలుస్తుంది. ఆ బంకర్ గురించి దాన్ని కట్టిన మునుపటి ఓనర్కీ, తనకూ మాత్రమే తెలుసు. అందుకని అలా అప్పులవాళ్ళ నుండి భర్తను కాపాడే ఏర్పాటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ కిమ్ కుటుంబ రహస్యం పాత పనిమనిషికి తెలిసిపోతుంది. దాంతో తన భర్తను అక్కడ వుండనివ్వాలనీ, లేదంటే తను రికార్డు చేసిన వీడియోను యజమానురాలికి పంపుతాననీ బెదిరిస్తుంది.

పార్క్ ఫ్యామిలీ

ఈ గొడవ జరుగుతుండగా భారీ వర్షం వలన క్యాంపుకు వెళ్ళిన వారు తిరిగి వస్తున్నట్టు ఫోన్ వస్తుంది. బంకర్ లోని వారిని అక్కడే కొట్టి కట్టేస్తారు కిమ్ కుటుంబం వారు.  పాత పనిమనిషి తలకు పెద్ద గాయమై ఆమె ఆ తర్వాత చనిపోతుంది. తండ్రీ, కొడుకు, కుమార్తె ఎలాగోలా తప్పించుకుని వచ్చేసరికి భారీ వర్షం వలన వారి ఇల్లు సర్వనాశనమై కన్పిస్తుంది. ఆ రాత్రికి వారు జిమ్ లో మిగతా బాధితులతో పాటు తలదాచుకుంటారు.  

మరుసటి రోజు, పార్క్ పరివారం కొడుకు పుట్టినరోజును ఏర్పాటు చేస్తారు. ట్యూటర్‌లు ఇద్దరినీ ఆహ్వానిస్తారు. డ్రైవర్ తండ్రి, సేవకురాలు తల్లీ ఎలానూ వున్నారు. ఒక వైపు పార్టీ నడుస్తోంది. బంకర్లోకి వెళ్ళిన  కి-వూపై రివర్స్ దాడి చేస్తాడు జియున్-సీ. తలకి పెద్ద గాయమై కి-వూ నేలకూలుతాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన జియున్-సీ తన భార్య చావుకు కారణమైన వారిపై కత్తితో విరుచుకు పడతాడు. కి-జంగ్ ను బలంగా పొడుస్తాడు. ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళిపోతుంది. కొన్నేళ్ళ క్రితం వంట గదిలో చూసిన దెయ్యాన్ని (జియున్-సీ) మళ్ళీ చూసిన బర్త్ డే బాయ్ మూర్చపోతాడు.  అతడ్ని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళమని కి-టేక్ ను ఆదేశిస్తాడు ఇంటి యజమాని. కన్న కూతురు పరిస్థితి చూసి నిశ్చేష్టుడై ఉన్నాడాయన. అటువంటి సమయంలో కూడా జియున్-సా వొంటి దుర్వాసనను అసహ్యించుకున్న మిస్టర్ పార్క్ ను కత్తితో పొడిచి పారిపోతాడు. పేదలను చులకనగా చూడడంతో అతడి కోపం రెట్టింపైందన్నమాట!    

కొన్నాళ్ళ తర్వాత:

కి-జంగ్ మరణించింది. బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకున్నాడు కి-వూ. అతడిపై, అతడి తల్లిపై మోసానికి సంబంధించిన కేసులు పెట్టారు కానీ ప్రోబేషన్ పై విడుదల చేశారు. హత్యలు ఎందుకు జరిగాయో పోలీసులు కనుక్కోలేకపోయారు. ఇప్పుడొక జర్మన్ కుటుంబం ఆ ఇంటిలో వుంటున్నారు. ఒక మంచు కురిసిన రాత్రి ఆ ఇంటి నుండి వస్తున్న మెరిసే బల్బు సందేశాన్ని మోర్స్ కోడ్ తో అనువదిస్తాడు కి-వూ. ఆ ఇంటి రహస్య బంకర్లో ప్రస్తుతం తన తండ్రి ఉంటున్నాడని తెలుసుకుంటాడు. తండ్రికి ఒక పోస్టు చేయని ఉత్తరం రాస్తాడు. చదువు పూర్తిచేసి, పెద్ద ఉద్యోగం సంపాదించి, చాలా డబ్బు గడించి ఆ ఇల్లు కొని, తండ్రిని నేలమాలిగలోంచి సూర్యకాంతిలోకి ఆహ్వానించి కావలించుకుంటున్నట్టు అందులో కలగంటాడు. కానీ అది సాధ్యంకాని పని అని దర్శకుడికీ, మనకూ తెలుసు. గబ్బుకంపు గొట్టే బేస్మెంట్ ఇంటి కిటికీ దగ్గర మొదలైన సినిమా అక్కడే ముగుస్తుంది. ఎండ్ క్రెడిట్లో వచ్చే పాట ఆ భవనం కొనడానికి కి-వూ పడే వ్యర్ధ ప్రయత్నాన్ని వివరిస్తుంది.

దర్శకుని ప్రతిభను చూపే సన్నివేశాలు:                                                                              

ఊసరవెల్లి మాదిరిగా ముదిరిన పెట్టుబడిదారీ వ్యవస్థను, దాని ధనిక పేద వైరుధ్యాలను కొన్ని బండ గుర్తులతో చిత్రించాడు దర్శకుడు. కొన్నింటి వివరాలు చూద్దాం.

  1.       పేదల బేస్మెంట్ కిటికీ, ధనికుల అద్దాల  కిటికీలు వారి పరిసరాల కాంట్రాస్ట్ ను చూపుతాయని ఇదివరకే చెప్పుకున్నాం. కిమ్ కుటుంబం నివాసమున్న కొంప సూర్యరశ్మి రాక, సదా తేమ, క్రిములు, దుర్గంధాలతో రోగాలకు నిలయంగా వుంటుంది. మునిసిపాలిటీ వారు క్రిమి సంహారక పొగను స్ప్రే చేస్తున్నప్పుడు ఇబ్బందిగా వున్నా, కిటికీలు వేయకుండా దాన్ని ఇంట్లోకి రానిస్తారు. అదే పార్క్ భవనంలో అయితే పగలంతా వెలుతురు వచ్చేలా వుంటుంది.
  2.       కిమ్ కుటుంబపు టాయిలెట్ కమోడ్ చాలా అసహజమైనంత ఎత్తులో వుంటుంది. ఎందుకంటే అది అతి పల్లపు ప్రాంతం కనుక ఆ ఏర్పాటు అవసరం. వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తినపుడు బురద నీరు ఆ కమోడ్ లోంచి ఎగదోసుకు రావడం చూస్తాం.
  3.       వర్షం కురిసిన రాత్రి పేదల వాడలో బీభత్సం తాండవిస్తుంది. వారు అన్నీ పోగొట్టుకుని తలదాచుకోడానికి వేరే చోటికి వెళతారు. అదే ధనికులకైతే వర్షం తర్వాతి పగలు ప్రకాశవంతంగా ఉండటాన పార్టీ పెట్టుకోవాలన్న ఆలోచన వస్తుంది.
  4.       ఇక పేదల శరీరాల దుర్వాసన సంగతి! ‘వీరందరి నుండీ ఒకే రకం వాసన వస్తోంది’ అని పార్క్ ఫ్యామిలీ పిల్లాడు మొదటి సారి అన్నప్పుడు అది ఒకే రకం సబ్బు వాడకం వలన వచ్చినదేమో అని మనమూ అనుకుంటాము. కిమ్ పరివారమూ అనుకుంటారు. అందుకే వేర్వేరు సబ్బులు వాడాలని అనుకుంటారు. ‘సబ్వేలో బ్రతికే మనుషుల శరీరాలనుంచి ఒక దుర్వాసన వస్తుంటుంది’ అని మిస్టర్ పార్క్ తన డ్రైవర్ కి-టేక్తో అన్నప్పుడు ఇది పేదరికానికి ఆపాదించిన వాసన అని అర్ధమౌతుంది. అందుకే ఆ వాసనకు సంబంధిన ఏహ్యభావం మరోసారి కనబరిచినపుడు కత్తితో పొడిచి చంపేస్తాడు.
  5.       మెట్ల వరసను కూడా సమాజంలోని హెచ్చుతగ్గులకు ప్రతీకగా వాడాడు దర్శకుడు. కిమ్ బేస్మెంట్ ఇంటికి వెళ్ళాలంటే మెట్లు దిగాలి. పార్క్ ఇంటిలోకి, గదుల్లోకి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలి. కిచెన్ వెనకాల రహస్య బంకర్ మెట్లు దిగడమంటే పేదలు మరింత దిగజారి తమలో తాము కొట్లాడుకోడానికే. అరుదైన అవకాశాల కోసం పేదలు తమలో తాము కుమ్ములాడుకోవడమన్నమాట!
  6.       ధనికులకు ఏ బాదరబందీ లేకుండా జీవితం హంసనావలా సాగుతున్నట్టు వుంటుంది. పేదలకు ప్లానింగ్ చేసుకునే అవకాశమూ లేదు, చేసుకున్నా లాభం లేదు. ‘గొప్ప ప్లాన్ ఏమిటంటే ప్లాన్ చేసుకోక పోవడం’ అని కొడుకుతో తండ్రి అంటాడు జిమ్ లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు.  
  7.       పేదవారు మంచిపేరు సంపాదించడం కష్టమైన పని. కానీ ధనికులు చిన్న చర్యతో దయార్ద హృదయులు  అనిపించుకోగలరు. ‘ఆమె ధనికురాలైనా చాలా మంచిది’ అనంటాడు భర్త భార్యతో. ‘ధనికురాలు కాబట్టే మంచిది’ అని జవాబిస్తుంది భార్య. 
మంత్రశిల

8.      కొరియాలో దొరికే ఒకరకం రాయిని మేధావుల రాయి లేక మేజిక్ రాయిగా భావిస్తారు. అది తన వెంట సంపద తెస్తుందట. అటువంటి రాయిని ట్యూషన్ ప్రస్తావన పట్టుకొచ్చిన మిత్రుడు కిమ్ ఫ్యామిలీకి  బహూకరిస్తాడు. ఆ రాయిది సినిమాలో చిన్న పాత్ర . చివరికి ఆ రాయితోనే కి-వూపై దాడి జరుగుతుంది.

9.       ఆంగ్ల భాష వాడకం, అమెరికా నుండి తెప్పించిన వస్తువులు నాణ్యమైనవి అని నమ్మడం కొరియా మనస్తత్వంలోని వలసవాద అవశేషాలే.

10.  అమెరికాలో నేటివ్ అమెరికన్ల తుడిచివేత అన్నది చరిత్రలో అతిపెద్ద జాతి సంహారం. ఆ మూలవాసుల్ని నిశ్శేషం చేసి, వారి చరిత్రను మ్యూజియంలో పెట్టిన ఘనత అమెరికాది. పార్క్ ఇంటి పిల్లాడికి కూడా ఇండియన్లా  తయారవడం, బాణాలు వేయడం, వారి టెంట్లలో గడపడమంటే ఇష్టం.

ఉత్తర కొరియాపై దక్షిణ కొరియాకున్న అక్కసు ఈ సినిమాలోనూ కనిపించింది. చుంగ్-సూక్ ఉత్తర కొరియా టివి యాంకర్లను వేళాకోళం చేస్తూ అనుకరిస్తుంది. ఉత్తర కొరియా అణుదాడి నుంచి తప్పించుకోడానికే ఇంటాయన బంకర్ను కట్టాడట! నిరస్త్రీకరణ విషయంలో పాశ్చాత్య ప్రపంచపు ద్వంద్వ వైఖరే ఈ పాత్రల్లోనూ కనిపించింది.

సాంకేతికంగా ….

       నటీనటులు చాలా బాగా రాణించారు. ముఖ్యంగా కి-టేక్ పాత్రలో సాంగ్-కాంగ్ హో అద్భుతంగా నటించాడు. జంగ్ జాయిల్ నేపథ్య సంగీతం సినిమా మూడ్ ను కొనసాగించేలా వుంది. ఈ సినిమాను హారర్, థ్రిల్లర్ తో కూడిన బ్లాక్ కామెడీ అని చెప్పొచ్చు. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు తీసుకున్న ఈ సినిమా ప్రధానమైన ప్లాట్ ను తమిళ సినిమా ‘మిన్సార కన్న’ (1999) నుంచి కాపీకొట్టారని ఆరోపణ వచ్చింది. కానీ ఆ మసాలా  సినిమాకూ, దీనికీ ఏ మాత్రం పోలిక లేదు. తన నిజజీవిత సంఘటనతో ఈ సినిమా ఐడియా వచ్చిందని దర్శకుడు చెప్పాడు.

ఇంతకీ పరాన్నజీవులెవరు?

            సినిమాను పైపైన చూస్తే ధనికుల సంపదను అనుభవిస్తున్న రెండు పేద పరివారాలు (కిమ్ పరివారం, అంతకు ముందు పనిమనిషిగా వున్నావిడ పరివారం) పేరసైట్లుగా కనిపించవచ్చు. కానీ, తరచి చూస్తే జీతం పొందడానికి వారు ఎంతో శ్రమ చేస్తున్న వారే! ఎక్కువ గానో, తక్కువ గానో తమ అదనపు శ్రమను ధారపోస్తున్న వారే! వర్గ సమాజంలో శ్రమ దోపిడీ లేనిదే ధనికుల సంపద పెరగదు అని మార్క్సిజం చెబుతోంది. ప్రకృతి సంపదలపై అధికారం అన్నది మరో సంగతి. సినిమాలోని పార్క్ పరివారం పెద్దగా కష్టపడుతున్నట్టు ఎక్కడా కనిపించదు. ట్యూషన్ సంగతి వదిలేసినా, వారి వంట వారు చేసుకోలేరు, వారి గిన్నెలు వారు కడుక్కోలేరు, వారి ఇల్లు వాళ్ళు తుడుచుకోలేరు, వారి కారు వారు నడుపుకోలేరు. అన్నిటికీ ఇంకొకరి మీద ఆధారపడే ఆ ధనికులే నిజమైన పరాన్నజీవులు. దోపిడీ ద్వారా తనను తాను సంపన్నం చేసుకుంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థ, బూర్జువా వర్గమే నిజమైన పరాన్నజీవులు. ఈ పరాన్న జీవులు పేదల మజ్జను పీల్చేస్తున్నాయి. అందుకే పేదలు పరస్పరం సహకరించుకుంటూ, తామైక్యమై వ్యవస్థపై తిరగాబడాలి గానీ, కొన్ని ఎంగిలి మెతుకుల కోసం (సినిమాలో చూసినట్టు) తమలో తాము కొట్లాడకూడదు. అలా చేస్తే అది వారికే నష్టం!

అవార్డ్ ఫంక్షన్

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

2 comments

  • బాలాజీ నా చిరకాల మిత్రుడు 30 సంవత్సరాల క్రితం మేము ఇద్దరం బీహార్ లో ఉండేవాళ్ళం అద్భుతమైన సినిమాల కలెక్షన్లు ఆరోజుల్లోనే అతని దగ్గర ఉండేవి .వాటి గురించి అతను చెబుతుంటే ఆ సినిమాలు చూసి నా ఆనందం రెట్టింపయ్యేది.
    బాలాజీ అభినందనలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.