ప్రపంచాన్ని చుట్టి వచ్చిన పంచతంత్రం

తెలుగు సమాజాన్నే గాక, ప్రపంచం మొత్తాన్ని చైతన్య పరుస్తూ, భారతీయ సాహిత్యాన్ని సంపన్నం చేసిన నీతి కథల సంపుటి మన దేశం లో అతి ప్రాచీన కాలం లోనే ప్రభవించింది. ఈ నీతి కథల సంపుటి 50 పై చిలుకు భాషల్లోకి అనువాదం చేయబడి ఎన్నో సమాజాలకు, రాజరికాలకు, మార్గదర్శకం, లక్షణ గ్రంథం అయ్యింది. క్రీ.శ.మూడవ శతాబ్దం లోనే విష్ణు శర్మ తన కాలం నాటికి ప్రచారం లో ఉన్న నీతి బోధకమైన పిట్ట కథలు, సమాజ చైతన్య కథనాలు, రసవత్తరంగా ఉండటానికి ‘రంకు’ కథలను కూడా తీసుకొని, కొన్ని కల్పించి, ‘పంచతంత్రం’ రాశారు. ఈ గ్రంథం సమాజాన్ని ఎంతగా చైతన్య పరిచిందంటే, క్రీ. 531 -597 మధ్య పారసీ దేశాన్ని పాలించిన ససానియన్ రాజు, ఖుమ్రా అమాషల్వాన్ కోరికపై బర్జో అనే రాజ వైద్యుడు పంచతంత్రాన్ని పహ్లావీ భాష లోకి అనువదించాడు. ఆరవ శతాబ్దంలో దీన్ని సిరియన్ భాష లోకి అనువదించారు. ఈ గ్రంథం నేటికీ సిరియన్ భాష లో ప్రచారం లో ఉంది. బర్జో చేసిన అనువాదాన్ని అనుసరిస్తూ, క్రీ. శ. 725 ప్రాంతం లో అబ్దుల్లా ఇబిన్ అల్ముకఫ్సా అనే కవి , అరేబియన్ భాషలోకి పంచతంత్రాన్ని పరివర్తనం చేసాడు. ఈ గ్రంథం ‘కలీలా-వా-దిన్ను’ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. మిత్రబేధం మొదటి తంత్రం లోని కరటకదమనకుల పేర్లను యధాతధంగా అరేబియన్ గ్రంధం లో ఉపయోగించారు. బహుమూద్ (షావాన్) అనే రచయత ఒక అరేబియన్ ప్రతికి ఉపోద్ఘాతం రాస్తూ, భారతీయ పంచతంత్రాన్ని ‘బీద్బా’ అనే రుషి రాసినట్లు చెప్పాడు. విదేశీ సాహితీ ప్రపంచం లో ఇది బీద్బా నీతి కథ అనే ప్రచారం లో ఉంది. ఈ గ్రంథం పర్షియన్, తుర్కి, మంగోల్, మలే, ఇథియోపియా భాషల లోకి అనువాదం చేసారు. 12 శతాబ్దం లో హిబ్రూ భాషలోకి, దానినుండి లాటిన్ భాష లోకి 13 వ శతాబ్దం మూడవ పాదం లో అనువాదం జరిగింది. ఇక లాటిన్ లో నుండి అనేక భాషల్లోకి ఈ గ్రంథం తర్జుమా అయ్యింది. వివిధ దేశాల వాళ్ళు ఈ గ్రంథాన్ని తమ మాతృ భాషల లోనికి తర్జుమా చేశారు. ప్రొఫెసర్ జోహన్నేన్ హరటిల్ జర్మన్ భాషలో రాసిన ఒక పుస్తకంలో ఈ పంచతంత్రం ఏఏ భాషల్లోకి తర్జుమా అయ్యిందో వివరంగా చెప్పారు.
13 శతాబ్దం లో పంచతంత్రం తెలుగు భాష లోకి పరివర్తనం చెందింది. ఆ గ్రంథం అందుబాటులో లేక పోయినా, మడికి సింగన్న నాటికి ఒక ‘పంచతంత్రం’ కనిపించింది. అయితే అది పూర్తిగా అందుబాటులో లేదు. అందులోని 189 పద్యాలు మడికి సింగన్న తన ‘సకల నీతి సమ్మతం’ అనే గ్రంథం లో చేర్చుకోవడం తో, తెలుగులో మొదటగా పంచతంత్రం ఉనికి మనకు తెలుస్తోంది.
సంపూర్ణ పంచతంత్రం తెలుగు భాషలో మొట్ట మొదటి రాసిన కవి దూబగుంట నారాయణ కవి. ఈయన 1470 ప్రాంతం లో నెల్లూరు కు చేరువలో ఉన్న ఉదయగిరి కి చెందినవాడు. ఈయన ఉదయగిరి దుర్గాన్ని పాలించిన బసవరాజు కు పంచతంత్రాన్ని అంకితమిచ్చాడు. కనిగిరి కి ఈశాన్య దిశగా తొమ్మిది మైళ్ళ దూరం లో గల దూబగుంట గ్రామమే నారాయణ కవి నివాసమని తేల్చారు.
ఈ కథలను ఉపయోగించుకొని సమాజాన్ని చైతన్య పరిచేందుకు అనేక మంది తెలుగు కవులు 12 శతాబ్దం నుండే ప్రయత్నించారు. 1256 లో మంచన, 1347 కి ముందు పేరు తెలియని తొలి ఒక అనువాదకుడు, 1480 దూబగుంట నారాయణ కవి, 1497 ప్రాంతం లో కూచిరాజు ఎర్రన, 1500-1570 లో బైచరాజు వెంకటనాధుడు, 1510 -1530 లో తిప్పయ్యగారి భానుకవి, అలాగే, 16 శతాబ్దం నుండి, రావిపాటి గురుమూర్తి శాస్త్రి, పరవస్తు చిన్నయసూరి, శిష్ణు కృష్ణమూర్తి శాస్త్రి, కందుకూరి వీరేశలింగం, కొక్కొండ వెంకట రత్నం, ఉల్లంగి రామచంద్ర రావు, విశ్వాత్ముల నరసింహమూర్తి, విద్వాన్ విశ్వం వంటి వారు రాసిన అనేక కావ్యాల్లో పంచతంత్రం ఉనికి, ఆ ప్రభావం, ఆ పద్యాలు కనిపిస్స్తాయి.
పంచ తంత్రం గ్రంథం లోని కొన్ని కథలను, శిల్పాలుగా మలిచారు. మహాబలి పురం లోన “అర్జునుని తపస్సు” అనే సుప్రసిద్ధ శిల్పం ఉంది. తగువు తీర్చిన పిల్లి కథ ను అక్కడ శిల్పంగా మలిచారు. కర్ర నోట కరచిన తాబేలు ను కొంగ ఎగరేసుకొని వెళ్ళే కథన తంజావూరు కండియార్ దేవాలయం లో ఉంది. అదే కథను ముక్తేశ్వరం శిల్పులు కూడా చెక్కినారు. కంబోడియా లోని అన్గోర్ వాట్ శిల్పాలలో పంచతంత్రం కథలున్నాయి. కోటాన్ లోని ప్రాచీన గృహ లోనూ, చివరకు చైనా నడి బొడ్డున ఉన్న ఒక గుహలో పంచతంత్ర కథలను శిల్పులు చెక్కినారు. సమాజాన్ని ఇంత చైతన్య వంతం చేసిన ఈ పంచతంత్రం తెలుగు సమాజాన్నే కాక, ప్రపంచ సమాజాన్ని చైతన్య పరిచింది.
మిత్ర భేదంలో దమనకుడు తన ప్రభువైన పింగళకునితో, సేవకులను, రాజును… వారి వారి యోగ్యతలను ఎలా వాళ్ళ వాళ్ళ స్థానాలలో నిలపాలో చెప్పే ఘట్టాలలోని పద్యాలు చూద్దాం…

సరపతి భృత్యుల దొడవుల – నొరసి తగిన నెలవులందు నునపక యున్నన్
జరణంబున చూడామణి - శిరమున నందియుము బెట్టు చెలువము గాదే
కుందనము కూర్ప నర్హమై యందపడిన
పృధ్వుల రత్నంబు వెండిలో బెట్టేనేని
రత్నమున కేమి కొరయగు రాజు బంటు
దగిన పని బెట్టకుండిన తగువు కాదే?....

అయితే ఈ గ్రంథాన్ని అనువదించడం లో కవులు కొందరు జోక్యం చేసుకున్నారు. కొందరు మూలాన్ని యధాతధంగా అనుసరించారు.
చీల పీకి, దూలం లో చిక్కి చచ్చిన కోతి కర్మ మనకెందుకు? అని కరకటకుడు చెప్పినప్పుడు ఆ నక్కతో దమనకుడు మూలం లో చెప్పిన పద్యం..

“సహృదా మహాకార కారణాత్ ద్విషతా మప్యపకారకారణాత్
నృపసంశ్రయ ఇష్యతే బుధైర్జఠరం కో నభిబర్తి కేవలం “

ఈ పద్యాన్ని తెలుగు కవులు కందం గా, చంపకమాల గా ఇలా పలు రకాలుగా అనువదించారు. ఈ పద్యాన్ని నలుగురు నాలుగు విధాలుగా అనువదించిన తీరు చూస్తే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు మనకు కనిపిస్తాయి. పంచతంత్రం లోని మూలం లో ని దంతిలుని కథ, కౌలికుని కథ లను విడిచి పెట్టారు. బహుశా ఈ రెండు కథల్లో రాజస్త్రీల అనులోమ వ్యభిచారిక విషయము వృత్తాంతం గా ఉండటం వల్లనే దీనిని వీళ్ళు వదిలి వేశారని అనుకోవచ్చు.
నీతి చెపుతూనే, సమాజాన్ని చైతన్య పరిచిన పద్యాలు కోకొల్లలు….అందులో కొన్ని..

“పరదేశమే నిజదేశము పరులే బాంధవులు ద్రవ్య పరిపాలునకున్
ధరణి నసాధ్యంబెయ్యది పరమార్థము ధనము చూవె ప్రజలకు నెల్లన్ “
..
“ కులసతి రోయును జుట్టం – బులు వాయుదు రొరులు కష్టపుం బలుకుల ని
మ్ముల వాడ దొడగుచుందురు కలియుగమున ద్రవ్యహీను కలకాలంబున్”
..
“మృతి చెందిన జనునైనను - హితుల్లెలను డాయుదురు మహీ స్థలిలోన్
మతి దలప బెద జేరరు – బ్రతిమాలిన వైన సఖులు బందులు నెపుడున్”
..
“అతి బలవంతుడైన వినయంబున వారలతోడి మైత్రి సం
తతమును నిశ్చలంబుగు జనంబునజేసి నిజ ప్రదేశసం”
..
“గతుడయు పోల్చు టొప్పు నది గాదని యొండక దేశ మేగినన్
ధృతి మొయు బారిన న్వినుము దీయత నొచ్చునతండు నేరమిన్” 

ప్రపంచ సాహిత్యాన్ని తేజోమయం చేసి, సమాజాన్ని చైతన్య పరిచిన పంచతంత్రాన్ని తర్జుమా చేసి, మన తెలుగు సాహిత్యాన్ని పెపొంధించిన అనువాద కవులలో సంపూర్ణ గ్రంథం ఇచ్చిన మొదటి వాడుగా దూబగుంట నారాయణ కవిని తెలుగు సమాజం మరిచి పోజాలదు.

సి వి సురేష్

సి.వి. సురేష్: కడప జిల్లా ప్రొద్దుటూరు స్వగ్రామం. పూర్తి పేరు చెన్నూరు వంకదార సురేష్, వృత్తి రీత్యా న్యాయవాది, కవిత్వం, అనువాదాలు, విశ్లేషణలు రాస్తున్నారు. సాహిత్యాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం ఉన్న ఈయన తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లం లోకి అనువాదం చేస్తున్నారు సురేష్ ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్ పత్రిక కు స్టాఫ్ రిపోర్టర్ గా కూడా పని చేసారు.

4 comments

 • పంచతంత్రం కథల గురించి ఇంతటి విశ్లేషణ మరెక్కడా దొరకదేమో సురేష్ గారు.
  చక్కటి అంశాన్ని పరిచయం చేసారు ధన్యవాదాలు 👏👏👏

 • పంచతంత్రం గురించి విపులంగా, నారాయణ కవిగురించి.. బాగరాశారు.Cv సర్..ధన్యవాదాలు.. M..A..లో ఒకసారి, చదువు కున్నది, గుర్తు చేశారు..అభివందనలు.. మీకు💐,cv సర్.

  • ధన్యవాదాలు మీ ఆత్మీయ స్పందనకు పద్మ జీ

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.