వర్తమాన జీవితం –  తెలంగాణ కవిత్వం

ప్రపంచంలో ఏ సాహిత్యానికి కైనా మనిషి మనుగడ మూలం. మనిషి శతాబ్దాలుగా తన ఉనికి గురించి వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తూనే ఉన్నాడు. తన ఉనికిని మరింత అర్థవంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మనిషి మనుగడ మాత్రమే మనిషి సారాన్ని లేదా చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ చైతన్యాన్ని వ్యక్తిగతమైన అస్తిత్వము నిర్ణయిస్తుంది. ఏది కావాలో ఎన్నుకునే సంపూర్ణ స్వేచ్ఛ మనిషికి ఉంది. కానీ ఏది కావాలో అనేదానికి హేతుబద్ధమైన ఆధారం లేదు. అందువల్ల మనిషి నిరంతరం తాను పరాయి వాడిని అనే భావనతోనే జీవిస్తుంటాడు. ఈ మౌలిక లక్షణం నుంచే విభిన్న అస్తిత్వాలు బయలుదేరినాయి. అయితే ఈ అస్తిత్వాల వేదనలను బాహ్య శక్తులు విముక్తం చేయవచ్చు, చేయకపోవచ్చు. ప్రధానంగా తమకు తామే ప్రయత్నించి, విముక్తం కావలసిన ఆవశ్యకత ఆయా అస్తిత్వాలకు ఉంటుంది. తమ ఉనికి గల అంతర్గత, బాహ్య కారకాలను  ఛేదించుకోవలసి ఉంటుంది. నిర్దిష్టతల నుంచి సాధారణీకరణకు పరిణమించే ఇప్పటి ప్రయత్నాలు సరిపోవడం లేదు. 

“ఈ కాలానికి పనికిరాని కవిత్వం మరే కాలానికి పనికిరాదు” అన్న సార్ర్తే భావన లోంచి చూసినప్పుడు తెలంగాణ కవి ఉద్యమకాలంలో తెలంగాణ పోరాట లక్ష్యాన్ని తన స్థానిక భాషతో భావనలతో వ్యక్తీకరణ లతో నెరవేర్చుకోవడం దానికొక మంచి ఉదాహరణ అని చెప్పకతప్పదు. తెలంగాణా కవి తన చైతన్యాన్ని ప్రాంతీయ అస్తిత్వంగా ప్రకటించాడు. చైతన్యం యొక్క ముఖ్య లక్షణం ప్రశ్నించడమే. సకల అస్తిత్వ చైతన్యాలు అట్లా వచ్చినవే. ఇప్పుడు తెలంగాణ కవి చేయాల్సింది తనను తాను తిరిగి ప్రశ్నించుకోవడం.

సాంఘిక అభివృద్ధిలో ప్రతి కొత్త దశలో సంస్కృతి స్వభావం మారిపోతుంది. భాష మాత్రం విభిన్న దశల్లో పాత కొత్త సంస్కృతులు రెంటినీ అనుసంధానం చేస్తుంది. ఈ దృగ్విషయంలో తెలంగాణ భాష భాగస్వామి కావలసి ఉంది. అందుకు తెలంగాణ కవి తనదైన పాత్ర నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు  నిర్వహించడం లేదని కాదు కానీ, కవి ఘటనల వెంట, నోస్టాల్జియా వెంట నడుస్తున్నాడు. అందుకు తానే కాలపరిమితిని విధించు కోవాల్సి ఉంది. వస్తువులతో పాఠకునికి వాహకంగా భాష మారాల్సి ఉంది. వర్తమానానికి సరిపడే భాష, వస్తువులతో పాఠకునికి వాహకంగా మారాల్సి ఉంది. ఒకప్పుడు సంస్కృత పద బంధాలలో చిక్కుకుని పాఠకుడు విలవిలలాడిన పరిస్థితి. అది ఇక తెలంగాణ కవిత్వంలో కనిపించకూడదు. దాని వల్ల, కొత్తతరం విముఖతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. వస్తువుల్లో , వ్యక్తీకరణలో ఇప్పటికే మొనాటనీ వస్తున్నది. తెలంగాణ కవి ఇప్పుడు సంధి అవస్థలో ఉన్నాడు. ఒక యుద్ధం చేసి గెలిచి మరొక యుద్ధం కోసం ఎదురు చూస్తున్నాడు.  నిబద్ధతకు, నిమగ్నతకు, మధ్యలో నిలబడి ఉన్నాడు. తెలంగాణ కవిత్వం తన వస్తువును తానే మింగేసేంతలా శిల్పాలు చెక్కనవసరం లేదు గాని, తగు శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది. ఉపయోగ విలువ మారకం విలువలతోపాటు రూప విలువలు చలామణి అవుతున్న పోస్ట్ మోడర్న్ సందర్భాన్ని అర్థం చేసుకుని, అనుసరించాల్సి కూడా ఉంది. 

ఒక ప్రాంత రాజకీయ ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు మారినప్పుడల్లా అక్కడి సామాజిక స్థితి మారుతూ ఉంది. అక్కడి జీవన స్థితి గతులు, అనుభూతులు, వ్యక్తీకరణలు మారుతుంటాయి. ఈ సందర్భం తెలంగాణ కవిని మార్పు వైపు డిమాండ్ చేస్తున్నది. ఒక స్తబ్ధత నుంచి మేల్కొనాల్సిన దశలో తెలంగాణ కవి ప్రవేశించాడు. 

రాజకీయాలు సాహిత్యం వ్యాపారమై నిరుద్యోగులు ‘ఎన్జీవో’లు నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఒకవైపు రాజ్యం ప్రజల సెంటిమెంట్లను మూఢనమ్మకాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది. సోషల్ మీడియా యువతను పీల్చుకు తింటున్నది. స్థిరమైన ఆలోచనలు ఏర్పడే మానసిక స్థితులు లేవు. జీవితం సంక్లిష్టం అయిపోయింది. కింది తరగతి మాయలో ఉన్నది. మధ్యతరగతి ఊగిసలాటలో ఉన్నది. ఈ పరిస్థితులు కవిని దూరంగా భ్రాంతిమయ లోకంలోకి తీసుకెళ్తున్నవి. తద్వారా కొంతమేరకు, వ్యక్తివాద అనుభూతికి లోనవుతున్నాడు. దీనికి సోషల్ మీడియా తోడవుతోంది. ఏదో మార్పు తీసుకురావాలంటూ, ఏమీ చేయలేకపోవడం సోషల్ మీడియా నాయకత్వాలు భిన్నమైన ప్రతిపాదనలు చేయడం, కొందరు కవులు మేనిఫెస్టోలు లేని, ఏకాభిప్రాయం లేని బృందాలుగా మారడం అనేది ప్రస్తుత పరిస్థితి.

కవి భావ వికాసం భాషాభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. పాత వ్యక్తీకరణలు భాష పరిరక్షణకు  పనికొస్తాయేమోగానీ భావ వికాసానికి పనికి ఫావేమో… సరిచూసుకోవాలి. కవి ఇంకా నోస్టాల్జియాలో మునిగి తేలుతున్నాడు. అందరూ కవులు అట్లా ఉన్నారని అనలేం. పంట చేలలో నిలబడి సెల్ ఫోన్ లో రైతులు, కూలీలు ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతుంటే ఇంకా కవులు వెనుకకు ఆలోచించాలా? ఇక్కడ భాష సామాజిక ఉత్పత్తి పరిణామాల వ్యవహారాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుందని గమనార్హం.

సకల కాలాలలో లో ఉండే ఉండే రచన అంటూ ఉండదు. వర్తమానాన్ని గుర్తించిన కవి తన కాలపు సమాజాభివృద్ధినీ కాంక్షించి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి కానీ, గతంలో జీవించ కూడదు. వర్తమానంలో చైతన్యం కలిగి ఉంటూ పురోగమన సాంస్కృతిక విలువలను ప్రతిపాదించాలి. ఈస్తటి క్స్ ని ఉన్నతీకరించాలి. వర్తమానంతో సంబంధం ఉన్న గతానికి ప్రాధాన్యతనివ్వాలి. గత కాలపు పదజాలం సాధనాలు అవుతాయి కానీ సాధ్యాలు కావు. వర్తమానంలోని సంక్లిష్టతకు భయపడి గతంలోనికి పారిపోవద్దు. వ్యక్తీకరణల్లో అలా భయపడి పారిపోతే అస్తిత్వాలు గుణాత్మక పరిమితికి లోనవుతుంటాయి. ప్రపంచీకరణకు దీటుగా స్థానికీకరణ పోటీ పడాల్సిఉంది. అస్తిత్వం స్వీయ చైతన్యాన్ని ఇచ్చినంత వేగంగా యధాతధ స్థితిని కూడా కల్పిస్తుంది. ఈ వైరుధ్యాలను కవి పరిష్కరించుకోవాలి సంక్లిష్టమైన సమాజానికి సునిశితమైన చూపు నివ్వాలి 

డాక్టర్ తైదల అంజయ్య

తైదల అంజయ్య: జననం: ఉమ్మడి కరీంనగర్ జిల్లా లా కోహెడ మండలం నాగ సముద్రాల గ్రామంలో రాజయ్య మల్లవ్వ అనే పేద కూలీల ఇంట. పుట్టిన తేదీ తెలియదు గాని సంవవ్సరం 1976లో. ఎమ్మెస్సీ ఫిజిక్స్. తెలంగాణ కవిత్వం ప్రాదేశిక చైతన్యం అన్న అంశం మీద పీహెచ్డీ చేసి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. 2006లో పునాస 2012లో ఎర్రమట్టిబండి అనే కవితా సంపుటాలను వెలువరించారు. 2019లో వెదురు విల్లు అనే పేరుతో ఇతని కవిత్వం ఆంగ్లంలో వెలువడింది. చిక్కనవుతున్న పాట, పొక్కిలి, మత్తడి, దూదిపూల దుఃఖం, నూరు అలల హోరు మొదలగు సంకలనాలలో ఈయన కవితలు ప్రచురితం అయ్యాయి. ఉమ్మడిశెట్టి అవార్డు 2007, రంగినేని ట్రస్ట్ అవార్డ్ 2007, భారతీయ దళిత సాహిత్య అకాడమీ అవార్డు 2009, ఎస్ జి ఫౌండేషన్ అవార్డు 2010, సినారే అవార్డు 2014, సదాశివుడు అవార్డు 2016, మిషన్ కాకతీయ మీడియా అవార్డు 2016, సిద్దిపేట జిల్లా ఉత్తమ అవార్డు 2017 అందుకున్నారు. ఈయన ‘పునాస’ కవితా సంపుటి శ్రీకృష్ణదేవరాయలు యూనివర్సిటీలో ఎమ్మే తెలుగు సిలబస్ లో ఉంది. పాటలు పాడడం రాయడం చిత్రలేఖనం పద్య నాటకాలు ఇతని అభిరుచులు
మొబైల్ నంబర్: 9866862983.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.