ఇన్నాళ్లూ జగన్మోహన్రెడ్డిని టిడిపి వారు లక్ష కోట్ల దొంగ అంటూ విమర్శించేవారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం వాళ్ళే కాకుండా తటస్థులమని చెప్పుకునే వారు కూడా… జగన్ చంద్రబాబు దొందూ దొందే అనే వారు కూడా… జగన్మోహన్రెడ్డి అక్రమ ఆస్తుల కేసు గురించి మాట్లాడేవారు. ఇప్పుడా సంగతి అప్రస్తుతం. ఆ వివాదంలో జగన్ జైలుకు పోవడమూ మళ్ళీ బయటకొచ్చి రాజకీయంగా నిలదొక్కుకుని ముక్యమంత్రి పదవి దక్కించుకోవడం తెలిసిందే. అప్పుడెలాగైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల గురించి చర్చలు జరిగాయో ఇప్పుడు కూడా అలాగే చర్చించాలి. అది జరుగుతున్నదా అనేది సందేహాస్పదమే.
అమరావతి చర్చ ఇక చాలు?
అమరావతి గురించి మాట్లాడటం ఎంత తగ్గించుకుందామన్నా కుదరడం లేదు. దానికి కారణం వుంది. లోటు బడ్జెట్ కలిగిన రాష్టంగా ఆంధ్రప్రదేశ్ గడచిన ఐదేళ్లలో ఆర్థికంగా మరింత దిగజారింది. ఇది అమరావతితో, గత ముఖ్యమంత్రి పాలనతో ముడి పడి వున్న అంశం. అందుకే అమరావతి గురించి ప్రతిసారి మాట్లాడక తప్పడం లేదు. అందుకే కదా, జనం చంద్రబాబును ఓడించి జగన్ కు అధికారం ఇచ్చారు, ఇక జగన్ ను చేయమనండి ఎంత మంచి పాలన చేస్తాడో చూద్దాం అని అంటే అపుడు వాస్తవ పరిస్థితుల నుంచి దూరం జరిగినట్టవుతుంది. అందుకు ఒక చిన్న ఉదాహరణ: గత ప్రభుత్వం పోతూ పోతూ వేల కోట్లు వ్యయాలు పెంచిన కాట్రాక్టులకు బకాయి పెట్టి వెళ్ళిన అప్పులు నలభై వేల కోట్లు వున్నాయి. ఇపుడు గోదావరి పెన్నా అనుసంధానం ప్రాజెక్టుకు అయ్యే అంచనా ఎనభై వేల కోట్లు. అంటే ఒక ఆరు జిల్లాల వ్యవసాయ నీటి పారుదలను సమగ్రంగా తీర్చిదిద్దగలిగే ప్రాజెక్టు సగం వ్యయం. ఇది అస్తవ్యస్తంగా మిగిల్చిపోయిన గత ప్రభుత్వపు పాలన తాలూకూ ప్రతిఫలమే.
రాష్ట్రం అమరావతి పేరిట ఇప్పటికి నష్టపోయినది చాలు. అక్కడ జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారమంతా బట్టబయలై దోషులకు శిక్ష పడాలి. ప్రస్తుత పరిణామాలు ఆ దిశగానే వున్నాయి . అయితే, విచారణలో వేగం పెరగాల్సి వుంది. మొన్న ఐబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ నాడు శివాలెత్తిపోయిన చంద్ర బాబు చాల కాలం తన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిపై సోదాలు జరిగి. తప్పులు జరిగాయని తెలిసిన తర్వాత ఎందుకు మౌనం వహిస్తున్నారు? తొలుత మౌనం వహించిన టిడిపి నాయకులు, సోదాల వివరాలు బయటికి వచ్చిన తర్వాత అంత డబ్బు కాదు కొంచెం డబ్బే దొరికిందని బొంకడం ఎందుకు. ఎందుకు సమాధానం చెప్పుకోవాల్సినంత బాధ్యతగా ఫీల్ అవుతున్నారు టిడిపి వారు మరియు ఎల్లో మీడియా.
బాబుకు సిట్ గండం
చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైసీపీ సర్కార్ సిట్‌ను (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిట్‌కు ఇంటలిజెన్స్ డీఐజీ నేతృత్వం వహించనున్నారు. సిట్‌లో సభ్యులుగా పోలీసు అధికారులే ఉన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనపై త్వరగతిన దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని కీలక నిర్ణయాలపై సిట్ విచారణ జరపనుంది. ఏదేమైనా గత ప్రభుత్వపు అవినీతిపై సత్వర విచారణ జరగాలని కోరుకుందాం. తనకు తాను నిప్పుగా చెప్పుకునే చంద్రబాబు, ఆయన తనయుడు ప్రతి ఏటా ప్రకటిస్తున్న ఆస్తుల వివరాలు కూడా ఎంత మాయాజాలమూ బయటపడింది. గత ఏడాది తన పేరిట ఎటువంటి షేర్లు లేవని చెప్పుకున్న చంద్రబాబు ఈ సంవత్సరం తన మనవడి పేరిట ఏకంగా పద్నాలుగు వేల షేర్లు బహుమతిగా బదలాయించడంలోని మతలబు ఏమిటో వారికే తెలియాలి. ఒక తెల్ల కాగితంపై కొన్ని అంకెలు రాసుకొచ్చి వాటిని మీడియా ముందు చదివి తమకు తాము ఒక పెద్ద అగ్నిపరీక్షలో పునీతులైనట్టు భావించుకోవడం మానాలి. ఆస్తులు ఇవే అని చదివినంత మాత్రాన రాజకీయ నాయకుల సచ్చీలతను ప్రజలు గుడ్డిగా నమ్మే కాలం కాదిది. దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమి మినహాయింపు కాదు.
డిల్లీ నుంచి మనం నేర్చుకోవాలి
మనం చేసిన మంచి పనిని చూసి పక్కవారు పాటించినప్పుడు మనం కూడా పక్కవారి మంచి నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి, పాటించాలి. తెలంగాణలో జరిగిన దిశ ఘటనకు స్పందనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్వర న్యాయం అందేలా స్వల్ప వ్యవధిలో దోషులకు శిక్షపడేలా దిశ పేరిటనే ఒక కొత్త చట్టం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఆ చట్టం యొక్క ప్రాముఖ్యాన్ని, అవసరాన్ని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో కూడా ఇటువంటి చట్టం తెస్తామని ప్రకటించింది. అందుకోసమై ఆ రాష్ట్ర మంత్రి నేతృత్వంలో ఒక కమిటీ కూడా మన రాష్ట్రానికొచ్చి సమావేశం నిర్వహించింది. దానితో వైసీపీ నేతలు, మంత్రులు సంతోషిస్తూ ఈ వ్యవస్థీకృత మార్పు పట్ల, ఇతర రాష్ట్రాల ఆసక్తి పట్ల సగర్వ ప్రకటనలు చేస్తున్నారు. మంచిదే. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న , అమలులోవున్న మంచి పాలసీలను అమలు చేయడానికి కృషి చేయాలి. అందునా ప్రాధమిక హక్కు ఐన విద్య విషయంలో వంద శాతం మెరుగైన ఫలితాలతో ముందుకు వెళ్తున్న డిల్లీని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 26 లో రాసుకున్న ఉచిత విద్యా హక్కును మరింత బలోపేతం చేకూరుస్తూ సంస్థాగత మార్పులు చోటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో వుంది.
Add comment