ఆత్మవిశ్వాసమా? అహంకారమా? ఎంపిక మీదే!

నీ మీద, నీ సామర్ధ్యాలమీద నమ్మకం అన్నట్లు ప్రవర్తించడం అహంకారం. అహంకారం ఒక తప్పుడు విశ్వాసం. అంతర్గతంగా ఉన్న బలహీనతలను అతిగా ప్రదర్శించడమే అహంకారం

స్టేవార్ట్ స్టఫ్ఫోర్డ్  

మన మెదడు ఖాళీ గ్లాసు లాంటిది. దాన్ని అమృతంలాంటి ఆత్మవిశ్వాసంతో నింపొచ్చు. విషప్రాయమైన ఆత్మన్యూనతతో నింపొచ్చు. ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడు జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తాడు. ఆత్మన్యూనతతో బాధపడేవాడు జీవితంలో పాకుతుంటాడు. మానవ జన్మ ఎత్తినందుకు వర్తమానంలో ఉంటూ జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అద్భుత విజయాలు సాధించనక్కరలేదు. నీ జీవితాన్ని అర్ధవంతంగా జీవిస్తే చాలుజీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి ఆత్మవిశ్వాసం తోడ్పడుతుంది. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటే జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టి ముందుకు సాగచ్చు. అవకాశాల వర్షం కురుస్తున్నా ఆత్మవిశ్వాసం లేకపోతే అవి అందుకోలేము. అన్నీ వృధా అయిపోతాయ్.  

అసలు ఆత్మవిశ్వాసమెందుకు? ఆత్మవిశ్వాసం మానసిక దృఢత్వాన్నిస్తుంది. సానుకూల దృక్పథాన్నిస్తుంది. బాధ్యతాయుతంగా ప్రవర్తించే శక్తినిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడు ఎదుటివారి అవసరాలు తీర్చగల శక్తిని కలిగిఉంటాడు. ప్రతి ఒక్కరూ అతడిని ఇష్టపడతారు. సమాజంలో అతనికి మంచి అనుబంధాలేర్పడతాయి. జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధం. తమ దగ్గరున్నది ఎదుటివారితో పంచుకోడానికి వీరెప్పుడూ ఇష్టపడతారు

ఆత్మన్యూనత మెదడుని బలహీనం చేస్తుంది. మేకపోతు గాంభీర్యానికి, అనవసరమైన అహంకారానికి దారితీస్తుంది. ప్రతి విషయంలోను ఎదుటివారితో పోల్చుకుంటుంటే ఆత్మన్యూనత రెట్టింపవుతుంది. ఆత్మన్యూనతను అధిగమించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే మనలో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవరచుకోవాలి

ఆత్మవిశ్వాసం మీలో కార్యదక్షతను పెంచుతుంది. చేసే పనిలో నాణ్యత పెరుగుతుంది. నాణ్యమైన జీవితానికి పునాది వేస్తుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం అహంకారానికి దారితీస్తుంది. అహంకారం అనుత్పాదక భావోద్వేగాల్లో మొట్టమొదటిది. దీనివలన ఎటువంటి ఉపయోగం లేకపోగా అనారోగ్యానికి దారితీసి రక్తపోటును పెంచుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం మనసుకు, శరీరానికి, బుద్ధికి కూడా ప్రమాదకరం. అహంకార ప్రవర్తనలో మన లోపాలన్నీ ఎదుటివారికి అద్భుతంగా భూతద్దంలో దర్శనమిస్తాయి. అందరూ సులువుగా గుర్తుపట్టడానికి వీలు కల్పించే ఏకైక వర్తన అహంకారం. ఆత్మవిశ్వాసం అహంకారంగా రూపాంతరం చెందకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం లేని అహంకారం ఆత్మన్యూనతకు ఆనవాలు. లక్షణాలు మీలోని బలహీనతలను ఎదుటివారికి మరింత బలంగా చూపెడతాయి. అహంకారం మనలోని తార్కిక శక్తిని అణచివేస్తుంది. అదే ఆత్మవిశ్వాసమని మురిసిపోతే అది వ్యక్తిగత వికాసాన్ని దెబ్బ తీస్తుంది. తద్వారా సమాజంతో మనకున్న అనుబంధాలన్నీ విచ్ఛిన్నమవుతాయి. అసలే సామాజిక మాధ్యమాలవల్ల కృత్రిమ అనుబంధాలమయంగా తయారైన ప్రపంచంలో  అహంకారం కూడా తోడైతే అది ఒంటరితనానికి దారితీసి జీవితంలో జీవాన్ని లాగేస్తుంది

ఎప్పటికప్పుడు మీ ఆత్మవిశ్వాసానికి బలవర్ధక ఆహారం ఇవ్వాలంటే మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను గుర్తుచేసుకోండి. మీరు అద్భుత క్షణాలను గడిపిన జ్ఞాపకాల ఫొటో ఆల్బం ని ప్రేమగా చూసుకోండి. మీతో మీరు సానుకూలంగా మాట్లాడుకోండి. అంటే మీ Self Talk సానుకూలంగా ఉండాలి. నేనెందుకూ పనికిరాను. నా బతుకింతే లాంటి ప్రతికూల వాక్యాలతో మీలోకి మీరు గుంజుకోకూడదు. ఎప్పటికప్పుడు మీ బలాలను గమనించి వాటిని మరింతగా అభివృద్ధి చేసుకోడానికి అనుక్షణం ప్రయత్నించాలి. మదర్ తెరెసా చెప్పినట్టు జీవితం దేవుడిచ్చిన వరం; నువ్వు దానితో ఏమి సాధిస్తావో అది నువ్వు దేవుడికిచ్చే బహుమానం‘. జీవితం విలువైనదని భావిస్తే దానికి ప్రతి రోజూ మీరెంత విలువను ఆపాదిస్తున్నారో ఆలోచించుకోవాలి. అదే మీ ఆత్మవిశ్వాసానికి పునాది కావాలి.     

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.