సాహిత్యం సంఘర్షణ

 

‘పాజిటివ్’గా ఆలోచించాలంటారు. 

నెగటివ్ గా ఆలోచిస్తే అంతా నెగటివ్ గా వుంటుందని, నెగటివ్ ఆలోచనల వల్లనే లోకంలో ఇంత అశాంతి వుందని ప్రవచిస్తారు.

స్వాములు, బాబాలు, శాంతి-రాజకీయులు, ‘అరాజకీయ’ రచయితలు నిరతం ఊదరగొట్టే ఈ మాట నిజమేనా? ఇలాంటి శాంతి సాధ్యమేనా? అది ఎవరి శాంతి? వారి శాంతికి మూలమైన అశాంతి ఎవరిది? 

తీరిక జీవులకు రక్కసి ముళ్లై గుచ్చుకునే ఈ ‘రాజకీయ’ ప్రశ్నల్ని అలా వుంచుదాం. 

అసలు ఎవరికోసమైనా సరే, ఎందుకోసమైనా సరే… సంఘర్షణ లేని శాంతి… శవాలకు కాకుండా… సజీవులకు సాధ్యమా?

సంఘర్షణకు మూలం ప్రతి వస్తువులోని ‘వైరుధ్యం’. ‘వైరుధ్యం’ లేకుండా జీవితం లేదు. జీవితంలో ఏ శకలం లేదు. సజీవ, అజీవ వసువులన్నిటి సారం ‘వైరుధ్య’మే. ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లనే విరుద్ధాంశాలు కలిసి వుండే పరమాణువు నుంచి పుడుతున్న, చనిపోతున్న నక్షత్రాలు కలిసుండే విశ్వగోళం వరకు… తన లోపల ‘విరుద్ధాంశాలు’ లేకుండా ఏదీ లేదు.

జీవితంలో లేనిది దానిలోంచి పుట్టే సాహిత్యంలో ఎలా వుంటుంది? ఉండదు. జీవితంలో వైరుధ్యాల్ని, ఘర్షణను చిత్రించనిది సజీవ సాహిత్యం కాదు. 

కాలక్షేపానికి చదివే డిటెక్సీ నవలల్లో కూడా హంతకుడికి పత్తేదారుకు మధ్య ఘర్షణ కథను నడిపిస్తుంది. రక్తసిక్తం కావొచ్చు. నెత్తురొలకని గాయాలు కావొచ్చు. ఘర్షణ వుంటుంది. పాఠక నయనాలకు పగ్గమేసి లాక్కుపోతుంది. డిటెక్సీ నవలల్లో సంఘర్షణ ఏ పనికీ, ఆలోచనకూ చదువరిని కదిలించదు. అవి కాలక్షేపం పుస్తకాలు.

మరి, సాంఘిక వైరుధ్యాలకు సుదూరంగా సాగే సరుకు సాహిత్యంగా చెలామణి అవుతోంది, ఎందుకు?

దీనికి ఒకే ఒక కారణం:

చుట్టూరా సాంఘికార్థిక సమస్యలకు పరిష్కారం లేదు అనే నైరాశ్యం. చుట్టూరా లోకం ఏమాత్రం బాగోలేదు. ఎవడి నోట చూసినా అబద్ధం. అబద్ధం చుట్టూరా రంగురంగుల ఫోకసింగులతో డెకొరేషన్.

అబద్ధాన్ని అబద్ధమనడం అబద్ధమంటో గోబెల్సుల జులుం&జబర్దస్తీ ప్రచారం. 

ఈ స్థితి కలిగించే నొప్పిని తట్టుకోలేం. తట్టుకోలేనితనం నుంచి… ‘ఇక్కడి’ నించి… వెళ్లిపోవాలని బలమైన కోరిక. 

ఇక్కడి నుంచి వెళ్లిపోవడం ఎక్కడికి? 

తక్షణం కనిపించే ‘జైల్ బ్రేక్’ మార్గాలు… మందు కొట్టి నిద్దరోవడం, భంగు కొట్టి ‘హై’లో హైలెస్సా అని వూగిపోవడం. ఇవి మరీ తాత్కాలికం, అనారోగ్యం, అసాంఘికం, అవమానకరం.

మర్యాదగా వుండే సోషల్ ఎస్కేప్… దేవాలయం. మతం.

సాహిత్యంలోనయితే… నొప్పి నుంచి తప్పించుకునే ఒక మార్గం ‘బాల్యం’ ఆరాధన (ఫెటిష్). బుడుగు తరహా కథలు. 

బాల్యం నిజంగా అంత మహనీయమా?

అదీ మనమే కదా. 

ఒకప్పటి మనమే కదా. అప్పుడూ ఏడ్చాం కదా, గాట్ఠిగానో, లోలోపల కుళ్ళుకుంటూనో. 

మరి, ఎందుకంత మోజు బాల్యమంటే మనకు?

ఏ వయోజనుడికైనా అతడి బాల్యం అతడి గతం. జాతులకు వారి పురాణాలు ఎలా గతమో అలాగే. 

మనకు అన్ని గత విషయాలూ జ్ఞాపకం వుండవు. మనల్ని బాధించిన వాటిని చాల వరకు మరిచిపోతాం. ఆనందం కలిగించిన వాటిని, ఇతర్లకు చెప్పుకోడానికి ఇష్టపడే వాటిని గుర్తుపెట్టుకుంటాం.

అలా మరిచిపోయే/ గుర్తుపెట్టుకునే యంత్రాంగం (మెకానిజం) మనస్సులో వుంటుందని ఫ్రాయిడియన్లు బలంగా చెప్పారు. అదెలా జరుగుతుందో ప్రాక్టికల్ గా వివరించారు. 

మనస్సులో చేతన (కాన్షియస్నెస్), సుప్తచేతన (సబ్కాన్షియస్నెస్), అచేతన (అన్కాన్షియస్నెస్) అని… మూడు పొరలుంటాయి. 

చేతన స్థితి అంటే మెలకువ. ఆలోచనలు, సంకల్పాలు, అనుభూతులని వేటిని అంటామో అవన్నీ. 

‘సుప్తచేతన’ అంటే నిద్దట్లో మెలకువ. గాఢనిద్రకు ముందు రెప్పలకింద కనుగుడ్లు కదులుతూ వుండే దశ. అప్పుడూ ఆలోచనలు, సంకల్పాలనుభూతులు వుంటాయి. వాటి మీద మన నియంత్రణ ‘పూర్తిగా’ వుండదు. అసంకల్పిత ప్రతీకార చర్య (కండిషండ్ రిఫ్లెక్స్) గా కొంత కంట్రోల్ వుంటుంది. అది కలలు కదిలే స్థితి. 

‘రాత్రి నిద్దట్లో కారిన రేతస్సు తెల్లారే సరికి గుడ్ మార్నింగ్ అంటుంది’ అని శ్రీశ్రీ. (ఝంఝ). ‘రేతస్సు కారడం’ అనే వాస్తవ చర్య ఏదుందో అది సుప్తచేతనలో జరిగినదే. 

గాఢనిద్రలోని స్థితి… ‘అచేతన’ లేక చేతనరాహిత్యం. అప్పుడు మనస్సు మీద ‘మన’ కంట్రోల్ ఏమీ వుండదు. మనకు ‘తెలీదు’. ఒక కృష్ణబిల (బ్లాక్ హోల్) స్థితి. పెంజీకటి.

మనకు బాగా ఇష్టమైన పాత సంగతులు మెలకువలో గుర్తుకొస్తుంటాయి. వాటిని నెమరేసుకుంటాం. మెలకువలో కూడా కలలుంటాయి గాని, అవి పగటికలలు. వాటిని ఆబ్జెక్టివ్ గా (అవి మనవి కానట్టుగా) విశ్లేషించగలం. తప్పొప్పులు చెప్పగలం. ‘ఇతరు’లతో పంచుకోగలం. ‘గలం’ ఏమిట్లెండి, అవకాశమిస్తే వినే వాళ్ళకు బోరు కొట్టేలా కథలు కథలుగా, కవితలు కవితలుగా వల్లిస్తాం. 

సో కాల్డ్ ఆత్మకథలు. ‘ఫ్రాంక్ టాక్’ ఇంటర్వ్యూలు అన్నీ అవే. అవి నిజాలు కాదని కాదు. వక్త పనిగట్టుకుని అబద్ధాలు చెబితే తప్ప, అవి నిజాలే. కాని, పూర్తి నిజాలు కావు. కల్తీ నిజాలు.  కల్పన కలుస్తుంది. కాస్త వర్డ్ ప్లే చేరుతుంది. (‘అది అట్టా జరగలేదు కదా’ అని దగ్గరి వాళ్లు ఎవరేనా ఖండిస్తే ‘నా కట్టా గుర్తుందబ్బా’ అనే సెల్ఫ్ డిఫెన్స్ ఎప్పుడూ వుంటుంది)

ఇతర్లకు మన గురించి చెబుతున్నప్పుడు మనకు ఇష్టం లేనివి చెప్పం. ఎడిట్ చేసుకుంటాం. ఎడిట్ చేసుకోడం సరైనదని అనుకుంటాం. అదే నీతి అంటాం. 

దీనికొక మంచి ఉదాహరణ శ్రీశ్రీ ‘అనంతం’ మీద జరిగిన చర్చ.

‘అనంతం’ పుస్తకంలో శ్రీశ్రీ తను చేసిన ‘చెడ్డ’పనులను, తనకు వొచ్చిన ‘చెడ్డ’ ఆలోచనలను కూడా చెప్పాడు. అలా చెప్పాల్సింది కాదని… పుస్తకం వెలువడిన కొత్తలో ‘విమర్శ’ వినిపించింది. ఆయన తన గురించి తాను నిజాలు చెప్పాల్సింది కాదని వారి భావన. ఆ భావన సరైనదా కాదా… అనే చర్చ ఇక్కడ అక్కర్లేదు గాని, వాస్తవాలు ‘దాచడం’ అనే జెనెరల్ యాటిట్యూడ్ కు అదొక ఉదాహరణ.

మరెవరో తమలోని ‘చెడు’ చెప్పుకుంటే ఇష్టపడని మనం… మనలోని చెడు మనమే చెప్పుకుంటామా? మన వారిలోని చెడు మనమే చెప్పుకుంటామా? చెప్పుకోం. ఫలితంగా అబద్ధాలు చెబుతాం. ఆలోచనకు, ఆచరణకు తీరని హాని చేసి, మన పబ్బం మనం గడుపుకుని వెళ్లిపోతాం. 

ఈ అబద్ధాలే సాంఘిక, రాజకీయ జీవితంలో ప్రవర్ధిల్లే హిపోక్రసీకి, దానిలోంచి పుట్టుకొచ్చే ఫాసిజానికి  పునాది. 

జనం పక్షాన నిలబడతామని ప్రగల్భించే రచయితలు తమ పనిలో ఇమిడి వున్న ఈ దుర్గుణాన్ని గుర్తిస్తున్నారా? 

చాల మంది తమ గురించి, తమ ఇష్టుల గురించి మంచి తప్ప చెడు రాయరు. మంచి అని లోకం భావించని దాన్ని రాయరు. రాయకపోవడమే కాదు, ‘గుర్తు కూడా’ పెట్టుకోరు. అలాంటి వాటిని మనస్సు అట్టడుగు పొరల్లోకి తోసేస్తారు. అణిచివేస్తారు. ‘సప్రెస్’ చేస్తారు. అవి ‘అచేతన’ (అన్ కాన్షియస్నెస్) లో చేరి పోతాయి. 

గాఢనిద్రలో మనిషి మనస్సు కదలికల్ని చూడగలిగితే, అణచబడ్డ నిజాలు పడగలెత్తి ఆడుతాయి. అప్పుడప్పుడు పాములు మాయా రూపాలు ధరించి సుప్త చేతన లోనికి వొచ్చి పోతాయి. మెలకువలోని చేతనలోనికి కూడా వొచ్చి మనిషి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. (వాళ్లే పిచ్చోళ్ళు).

‘హిప్నాటిజం’ అనే ప్రక్రియతో నిపుణులు మనుషులను ‘నిద్రపుచ్చి’వాళ్లు అణిచేసుకున్న చేతనాంశాల్ని వెలికి తీస్తుంటారు. వాటిని ఆధారం చేసుకుని మనుషుల మానసిక జబ్బులను నిర్ణయిస్తుంటారు.

అదిగో ఆ మనసు లోతుల్లోని పడగల నాట్యాన్ని ప్రదర్శించేదే గొప్ప సాహిత్యం. హిప్నాటిజం ద్వారా వైద్యుడు ఒక రోగికి చేసే మంచిని సాహిత్యం ద్వారా కవి  మొత్తం జాతికి (సమాజానికి) చేస్తాడు.

దాన్ని రచయిత ఎంత లోతుగా చెప్పగలిగితే అంత మంచి రచన. లోతుగా చెప్పాలంటే మనస్సు అట్టడుగు పొర లోనికి, కనీసం రెండో పొర లోనికైనా వెళ్ళాలి. సమాజం లోపొరల్లోనికి వెళ్ళడమంటే సామాజికుడైన ఒక మనిషి తన సొంత మనస్సు లోపొరల్లోనికి వెళ్ళడమే. అలాంటి ప్రమాద కాంతారాలలో సంచారానికి మించి, వేరే దారి లేదు సృజనకు. అందుకే, సృజనాత్మక రచన ఒకేసారి వయ్యక్తికం, సామూహికం కూడా.

‘వైరుధ్యాల్ని’ (ఘర్షణ కారణాల్ని) పట్టించుకోని సాహిత్యం ‘కొండొకచో మోసకారి కూడా’. మోసకారి అనేది రచయిత చేసే సాముగరిడీ. స్వయంఅణచివేత. 

సాహిత్యంలో క్రాఫ్ట్, ఆర్ట్ అనేవి కాన్షియస్ ప్రయత్నాలకు సంబంధించిన మాటలు. వ్యక్తీకరణ రూపం కోసం అనుసరించే శిల్ప రీతులు సరే. పని గట్టుకుని వస్తువును అణిచివేయడంతోనే తంటా. 

ఒకప్పుడు, తమ ‘అచేతన’ల్లో అణిగి వుండిన మానసికాంశాల్ని వెలికి తీయడానికి రచయితలు సర్రియలిజం, డాడాయిజం వంటి సాహిత్య పద్ధతులను ప్రయత్నించారు. మనస్సుకు వొచ్చింది వొచ్చినట్టుగా, ఆటోమేటిగ్గా రాయడానికి ప్రయత్నించారు. 

ఆ పద్ధతిలో ఎంతో లోతులకు వెళ్లలేకపోయారు. 

‘ఆల్జీబ్రా చిహ్నాల జీబ్రాకు లాంకోటూ పాంకోళ్లూ తొడిగిస్తే అది వెర్రి కాదు సర్రియలిజం రా సోదరా” (శ్రీశ్రీ) అనడంలో చేతన సుస్పష్టం. ఇది సర్రియలిజానికి ఒక నిర్వచనం కావొచ్చు గాని, సర్రియలిజం కాదు. సింబాలిజం. ఆల్జీబ్రా, జీబ్రా, లాంకోటు, పాంకోళ్లు అన్నీ ప్రతీకలే. 

చేత్తో కాకుండా మనస్సుతో రాశామని చెప్పేవి కూడా చేత్తో రాసినవే. చెయ్యి లేకుండా… పనిగట్టుకుని రాయకుండా… ఎవరూ రాయలేరు. 

మనస్సు లోతులు ముట్టుకోవాలని రచయితలు చేసే మరొక యాంత్రిక ప్రయత్నం… బాగా తాగి ప్యాసౌట్ అయ్యే స్థితిలో ఏమనిపిస్తే అది రాయడం. మారిజువానా, గాంజా లాంటి మాదకద్రవ్యాల ప్రభావానికి లోనై రాయడం. ఇది ఒక మేరకు పని చేసే మాట నిజమే. (తాగినోడు అబద్ధం చెప్ప(లే)డనే లోకజ్ఞాన భావన తెలిసిందే). కాని, అది ఒక మేరకే.

నిజమే, రచయితలు… తాము కూడా భాగస్వాములైన సమాజం వైరుధ్యాల్ని, ఘర్షణను రచనల్లో నివారించడం కుదరదు.

కాని, ఘర్షణను నివారించగలిగినట్లు కొందరు కనిపించడానికి కారణమేమిటి?

కాన్షియస్ గా, కావాలని పక్కకు పెట్టడమే కారణం. అది కెరీరిస్టు క్రాఫ్టు లో భాగం. 

“ఆ పని మనసు చంపుకుని చేశామ’ని జనం అనడం అందరం వినివుంటాం.

ఈ రచయితలు బయటికి చెప్పరు గాని, వారి సంఘర్షణరాహిత్యాలు ‘మనసు చంపుకుని’ చేసిన రచనలే. 

వీరిలో కొందరు ( ముఖ్యంగా, భావకవులు) ప్రవచించే ‘తన్మయత్వం’ కేవలం తాగుబోతు తన్మయత్వం. తాగుబోతు అప్పటికి కొన్ని నిజాలు చెప్పొచ్చు గాని, వాటికి నిలబడడు. తాగింది దిగగానే తమను తాము ఎడిట్ చేసుకుంటారు.

నిన్న వీర విప్లవాలు గానం చేసిన కొందరు ఇవాళ పాలక పాదాక్రాంతులై తరించడం మరో కోవ. 

వీరు సర్రియలిస్టు ప్రక్రియలో రాసినా, డాడాయిస్టు ప్రక్రియలో రాసినా, అచేతనావస్థలోంచి తోడి పోసి’నట్టు’ రాసినా… అదంతా పనిగట్టుకుని, ఎడిట్ చేసుకుని, కెరీర్ కు పనికొచ్చేది మాత్రమే వుంచుకుని, కెరీర్ కు పనికిరానిదాన్ని కోసి మురిక్కాల్వలో పారేసి సాగించే పెయిడ్ ఆర్టిస్టు యాత్ర. 

ఇక్కడ రచయిత మనసు చచ్చిపోతుంది. ఉట్టి కట్టె వంటి  క్రాఫ్ట్/ఆర్ట్ మిగులుతుంది; అల్లిన నులకమంచం లా, చెక్కిన వ్రాతబల్లలా. ఆ వస్తువుల మొదటి తయారీదారుని సృజన వాటిలో వుండదు.

తప్పు మాట్లాడుతున్నానని నా సాహితీసహచరులు కోప్పడకపోతే, మన అద్యతన పయనం గురించి నిర్మోహంగా ఆలోచించదలిస్తే…   ఒక మాట: ఇవాళ తెలుగు సాహిత్యంలో లోపించింది ఆ ‘మొదటి తయారీ దారుని ‘సృజనా’త్మకతే. ఆ మౌలికతే. అలాంటి మౌలికతకు మన్నన దొరకనంత వరకు, మనకు 

కొయ్య బొమ్మల మెచ్చికోళ్ళే గాని, కోమలుల సౌరెక్కదు. 

27-2-2020

హెచ్చార్కె

9 comments

 • Superb. There is no use in positive attitude. For humans positive attitude is not possible but acts and speaks towards positive attitude. No poetry comes from positive attitude. Poetry should be come out from inner mind

  • థాంక్స్, గిరిప్రసాద్ గారు. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాల సార్లు రాజీబేరానికి మరో పేరు.

 • It’s an amazing article…U r the master in mass psychology as well as a great analyst and philosopher sir…

  Claps ..Claps…Claps…!!Hatsoff sir💐💐💐💐

 • చాలా నిజం .బయటి విషయాలపై ఎంత సాహసోపేతమైన ప్రకటనలైనా చెయ్యగలం కానీ మన లోపలికి చూసుకునేందుకు ఎంత భయం !దీన్ని దాటేందుకు చాతనయినంత ప్రయత్నమైనా చెయ్యందే సాహిత్య సృష్టికి బయల్దేరటం నేరమే .
  పోతే …శ్రీశ్రీ అనంతంలో నిజాలు చెప్పటంపై నాకైతే ఏ అభ్యంతరం లేదు .కానీ చెప్పిన టోన్ గురించి స్త్రీగా నేను నొచ్చుకోకుండా ఉండలేను .కవిగా ఆయనమీదున్న అభిమానం ఇక్కడ అక్కరకు రాదు .
  అలాగే ఆయన రాసిన ఆ ‘నిజాలను’పనిగట్టుకుని సంచలనాత్మకమైన శీర్షికన ప్రచారం చేద్దామనే లౌల్యానికి విరసాన్ని ఆమోదించలేను .

  • థాంక్స్ కాత్యాయని గారు. ఎవరి మీదా అభిమానంతో సాహిత్య విమర్శ చేయగూడదు. సాహిత్య విమర్శ నిర్మోహంగా వుండాలి. శ్రీశ్రీ దానికి మినహాయింపు కాదు. శ్రీశ్రీ టోన్ మీద విమర్శ పెట్టడం వేరు. కవి అలాంటివి రాయగూడదని, ఎడిట్ చేసుకోవలసిందని అనడం వేరు. నేను తప్పు అ(ంటు)న్నది ఈ ఎడిటింగ్ సూచనను. 🙂

 • కొయ్య బొమ్మ లమెచ్చుకోలే కానీ,కోమలులా,..lost word అర్ధం కాలేదు..సర్.. సంపాదకీయం బాగా రాశారు.. సర్!👍

  • థాంక్స్ పద్మ! కాస్త మార్చాను గాని, అది గురజాడ మాట.
   ‘మెచ్చనంటావు నీవిక మెచ్చకుంటే మించిపాయెను,
   కొయ్యబొమ్మల మెచ్చు కళ్లకు కోమలుల సౌరెక్కునే’

 • బాగుంది సార్!
  ప్రవచించే శాంతి మీద నాకూ విశ్వాసం లేదు. సంఘర్షణ లేకుండా మనిషి, సమాజం ఎలా సాధ్యం. అందరితో పాజిటివ్ గా ఉండడం ఎలా సాధ్యం.అలా ఉన్నాడంటే అతని మీద నాకు అనుమానమే.
  మీ ఎడిటోరియల్ చదివాక మళ్ళీ రాయాలనిపిస్తోంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.