బిందెశకునం

“పెంటిగొడ్డు డబ్బులు పోయాయటండీ!” కాఫీ అందిస్తూ చెప్పింది మాఆవిడ.”ఎప్పుడూ?” అన్నాను ఉలికిపడి.”రాత్రనుకుంటా” అని లోనికెళ్ళింది.త్వరగా తాగేసి పేపరు చూడకుండా పక్కన పడేసి

పెరట్లోకి వెళ్ళాను.రెండు కుంచాల స్ధలమది.చుట్టూ ప్రహారీగోడా, సుమారు పాతికకొబ్బరి చెట్లున్నాయి

ప్రతీ సంవత్సరం వేసవిలో గంగిరెద్దుల అమ్మోరు తన తమ్ముళ్ళు పెంటిగొడ్డు,అబ్బులతో మాపెరట్లో దిగుతాడు.ఇంచుమించు ఎండాకాలమంతా ఇక్కడే విడిది.

చుట్టుపక్కలున్న గ్రామాల్లో తిరుగుతూ,రాత్రిళ్ళు ఆయా పల్లెల్లో గంగిరెద్దుల ఆట వేస్తూ తిరిగి మకాం చేరుకుంటారు.

   అమ్మోరుకి,అబ్బులికి ఎద్దులు ఉన్నాయి.ఆబోతుల్ని చక్కగా అలంకరించి ఇల్లిల్లూ తిరిగి యాచన చేస్తారు.అబ్బులు సన్నాయి ఊదితే, అమ్మోరు డోలు వాయిస్తాడు.వాళ్ళ భార్యలు నల్లమ్మ,వెంకమ్మ సూదులు కరక్కాయలు అమ్ముతుంటారు. రెండోవాడైన పెంటిగొడ్డుకి ఎద్దులేదు. కొమ్మదాసుడి వేషంకట్టి ఒంటరిగానే ఊరు తిరుగుతాడు.జీవితంలో కూడా ఒంటరే.ఇప్పటికి మూడు పెళ్ళిళ్ళయ్యాయి.కానీ ఒక్క కాపురమూ నిలబడలేదు.ఇక సబంధాలు రాక ఆశ వదిలేసాడు.

వదినా,మరదలు ‘అతగాడిలోనే లోపం ఉంది.ఒట్టి పెంటిగొడ్డు’ అని చెవులు కొరుక్కునేవారు.అది క్రమేణా బైటికి పొక్కి అసలు పేరు మరుగున పడి ఈ వెక్కిరింత నామం స్ధిరపడిపోయింది.సంసారం లేక పోవటమూ,పైగా పిసినారి కావటంతో డబ్బులు బాగానే వెనకేసాడని ప్రతీతి.

   “ఏమైందిరా పెంటీ?”అడిగాను సానుభూతిగా చూసి.కొబ్బరిచెట్టు మొదలుకి ఆనుకుని రోదిస్తున్న పెంటిగొడ్డు చటుక్కున లేచి నాచేతులు పట్టుకుని “నా కంచికల్లు పోనాయండీ”అంటూ భోరుమన్నాడు

చుట్టూ చూసాను.ఎద్దుల్ని ముస్తాబు చేయలేదు.అసలు విప్పనే లేదు. వెలుగు రాకముందే బయలుదేరే వాళ్ళు బారెడు పొద్దెక్కినా మౌనంగా కదలకుండా కూర్చున్నారు.”ఎక్కడ దాచావురా?”అన్నాను ఆరా తీస్తూ.

“ఊపరు బొచ్చులోనండీ!” అంటూ మళ్ళీ ఏడుపు లంకించుకున్నాడు పెంటి.సూదులు.కరక్కాయ మూటల పక్కన పడి ఉందది.ఎద్దు మూపురానికి పెట్టే ఈతాకుల టోపీ.

దానిమీద రంగుల గుడ్డముక్కలు, రకరకాల పూసలు మెరుస్తున్నాయి. చప్పున వంగి దాన్ని అందుకున్నా. ఐతే అది మధ్యకి చీల్చబడి ఉంది.

    “ఓరి నీ అసాధ్యం కూలా?” అనుకుని అమ్మోరు వైపు చూసాను. అతడు తడబడి “అసలా సొమ్ము దాంట్లో దాచినట్ఠు నాకు తెలవదయ్యా!మొన్నామధ్య పాత ఊపరుబొచ్చు చిరిగి పోయిందంటే ఆడే కొత్తది అల్లి ఇచ్చాడు.డబ్బు సంగతి నేనెరగను”అన్నాడు చేతులు కట్టుకుని.”ఏమాత్రం ఉంటుందిరా?” అంటే “ఐదేలండీ!”అన్నాడు వెక్కుతూ.’అంటే వీడు బానే సంపాదించాడన్నమాట నిజమే, వదంతి కాదు”అనుకున్నాను.కానీ దొంగ డబ్బుతో పాటు టోపీని కూడా  మాయం చేయాలిగదా!ఇక్కడే ఎందుకు వదిలినట్టు?” అనుమానం వ్యక్తం చేస్తుంటే,పెంటిగొడ్డు”నేనే తెచ్చానయ్యా,ఉదయం బైటికెళ్తే తుప్పల్లో కనిపించింది”అన్నాడు. దానితో నాసందేహం పటాపంచలైంది

‘ఇదేదో ఇంటిదొంగ వ్యవహారమ’ని అర్ధమైపోయింది.

   పెంటి వైపు తిరిగి “నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందేంట్రా?” అడిగాను.వాడు కళ్ళు తుడుచుకుని చూపుడువేలుతో ఒక వ్యక్తిని చూపాడు.అతడి పేరు పాశాలు. వాడు తత్తరపడి “నాకేం తెల్వదు బాబోయ్ “అన్నాడు కంగారుతో. వాడి తల్లి మీసాల నూకమ్మకి తిక్కరేగింది.”ఏరా అల్లుడూ,అయిన వాళ్ళని మీకూడా వస్తే నా బిడ్డకి దొంగతనం అంటగడతార్రా”అని అమ్మోరు మీద విరుచుకు పడింది.

క్షణాల్లో గొడవ పెద్దదైంది.”పుచ్చం పగిలిపోద్ది”పాశాలుని తిట్టాడు పెంటిగొడ్డు.”కోసం ఇరిగిపోద్ద”ని పెంటిని దూషించింది నూకమ్మ. “మా మేనత్తా,బావమరుదుల”ని అమ్మోరు పరిచయం చేస్తే సరే నని ఒప్పుకున్నాను.ఈ ఏడాది వాళ్ళ జట్టులో కొత్తగా కలిసి మాదొడ్లో చేరారు.అమ్మోరు ఏమీ అనలేక పోయాడు.అందరూ కావలసినవాళ్ళే

నా మనసు ఎందుకో పాశాలునే శంకించింది.వాడివైపు తీక్షణంగా చూసి”మర్యాదగా నిజం చెప్ఫు. లేకపోతే నీశవం  ఈ కొబ్బరిచెట్లలో సమాధైపోతుంది”అని బెదిరించాను

పాశాలు బెంబేలెత్తిపోయాడు. నూకమ్మ గగ్గోలు పెట్టింది.అమ్మోరు ముందుకొచ్చి”అయ్యగారూ!తొందర పడకండి.దొంగతనం నిరూపించే దానికి మాకో పద్ధతుంది!”అన్నాడు. పాశాలుని కొట్టటానికి ఎత్తిన చేతిని దించి ప్రశ్నార్ధకంగా చూసాను.

   “బిందీ శకునం”అన్నాడు అమ్మోరు.”అదేం ఆచారంరా?” అన్నాను అయోమయంగా.”దొంగ ఎవరనేది మా దేవత తేలుస్తుంది” అని తమ్ముడు అబ్బులు వైపు చూసాడు.అర్ధమైన అబ్బులు పక్కన ఉన్న బిందెలోని నీళ్ళూ పారబోసి అందించాడు.నూకమ్మకేసి బిందె తిప్పి “అత్తా!నీకిష్టమేనా?”అన్నాడు అమ్మోరు.కట్టుబాటును కాదనలేక పోయింది నూకమ్మ.ఐనా అనుమానం వెలిబుచ్చి”మీరూ మేమూ కాదు.బయటి వాళ్ళకి అప్పగించు”అంది.వెంటనే నేనూ మాపాలేరు సిద్ధమయ్యాం.బిందెకి పసుపూ.కుంకుమా రాసి ఏదో పూజ లాంటి తంతు చేసాడు అమ్మోరు. మా ఇద్దరి చేతులు చాపించి ఒకరి నొకరు పట్టుకోమన్నాడు.పొడుగ్గా సాగిన మా చేతుల మధ్యలో ఆ బిందెని బోర్లించాడు.పావుగంట సేపు అలా కదలకుండా ఉండమని నిర్ధేశించాడు. బిందె కదిలి ఊగితే పాశాలు దొంగతనం చేసినట్టు,లేదా నిర్దోషి అయినట్టు.

  ‘ఇదేం సాంప్రదాయం రా బాబూ?” అనుకుంటూ నేనూ,పాలేరూ తెల్లబోయాం.అయినా వాళ్ళని నొప్పించలేక శాయశక్తులా బిగబట్టి పట్టుకున్నాం.క్షణాలు దొర్లుతుంటే అందరూ ఉత్కంఠగా చూసారు. ఈ విషయం తెలిసిన మా ఇరుగు పొరుగువారు గుమిగూడి వింతగా చూస్తున్నారు.అంతసేపూ అమ్మోరు కళ్ళు మూసుకుని ఏదో జపిస్తూనే ఉన్నాడు.కొన్ని నిమిషాలు గడిచే సరికి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ బిందెలో కదలిక వచ్చింది.

మొదట మెల్లగా ప్రారంభమై తర్వాత వేగం  పుంజుకుని చివరికి జారి పడేంతగా ఎగరసాగింది.ఆశ్చర్యం! మా చేతులు నిశ్చలంగానే ఉన్నాయి.

జనం విస్తుబోయి చూస్తుంటే. గంగిరెద్దులవాళ్ళు హాహాకారాలు చేస్తూ ‘సత్తెంగల తల్లీ’అంటూ బిందెకి చేతులెత్తి మొక్కసాగారు.అప్పుడో విచిత్రం జరిగింది.”నన్ను క్షమించు తల్లీ,నేనే దొంగతనం చేసాను”అంటూ పూనకం వచ్చినట్టు ఊగిపోతూ సాగిలపడ్డాడు పాశాలు.మరు క్షణమే బిందె ఎగరటం మాని నిదానంగా వేగం తగ్గి నిలకడైంది.నెమ్మదిగా కళ్ళు విప్పాడు అమ్మోరు.తక్షణమే పాశాలు కొబ్బరిచెట్టు మొదట్లోని తొర్రలో దాచిన మూట తెచ్చిచ్చాడు

లెక్కపెడితే నాలుగువేలే ఉన్నాయి. మరోసారి చేయి ఎత్తబోతే కాళ్ళు పట్టుకుని “తాగేసాను బాబయ్యా” అని బావురుమన్నాడు.

అంతలో జనంలోని ఇద్దరు పక్క ఊరి యువకులు “అది మనదే” అంటూ గావుకేక పెట్టారు.అందరి దృష్టి అటు మళ్ళింది.అక్కడో కొత్త హెర్కులస్ సైకిలు ఎండకాంతికి తళ తళలాడుతోంది.అమాంతం వచ్చి పాశాలుని తన్నబోతే ఒడుపుగా తప్పించుకుని పారిపోయాడు. నూకమ్మకి తలకొట్టేసినట్టయింది. అమ్మోరు చేతులుపట్టుకుంది, మన్నించమని.అమ్మోరు అత్తకి జరిమానా విధించకుండా వదిలేసాడు.మొహం చెల్లని నూకమ్మ రెండో కొడుకుని తీసుకుని ఎటో వెళ్ళిపోయింది.

ప్రజలు బిందెవైపు అబ్బురంగా చూస్తుంటే,నేనూ, పాలేరూ,అమ్మోరు చూపులు కలిపి ముసిముసిగా నవ్వుకున్నాం!

కౌలూరు ప్రసాద రావు

కౌలూరు ఫ్రసాద రావు వృత్తి: ఆర్టీసీ కండక్టర్,. ప్రవృత్తి: కథలూ కవితలు. చదరంగంలో ఇంటర్నేషనల్ రేటింగ్ వున్న క్రీడాకారుడు. చదువు: బి ఏ.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.