వాకిలిమూసి బీగమేసి బీగంచెవులు కొంగుకు ముడేసుకుంటాఉండా, అక్కా అనొచ్చె నా చెల్లెలు లచ్చిమి.
నేనుండుకోని ”మే నేను మిరప తోటలో గడ్డి పీకను పోతా ఉండా,నా జతకు కిట్టి పెద్దమ్మను కూడా పిలుసుకున్నా నాతో ఏమన్నా పనా” అంటి .
ఏమీ లేదక్కా చెవిటోడు పెండ్లాం మాటలిని వారగా సంగటి చేసుకుంటాఉండాడంట. వాలమ్మ నాతో చెప్పి కుమిలి కుమిలి ఏడిసింది. వాళ్ల నాయన పనీపాటా జేయలేడు. నిలిచి పోయినాడు. వాళ్ళమ్మ కూలీ నాలీ చేసి ఇంటికి ఎగేస్తా ఉంటే వానికి పొగురుబట్టింది. ”ఒక్కడే కొడుకని వొరికూడు పెట్టి ఒబ్బిడిగా సాకితే ద్యాన్నో దోడుకోని బాయినట్లు” వాడు వాళ్లను చెంగదోలేసినాడు, చూడక్కా ముసిలి ముప్పున వాళ్లకు ఎట్లా పని ఇచ్చినాడో ” అని బాధపడే నాతో.
నేనుండు కొని ”పేటదాని పీసికం వద్దురా అంటే ఇండ్ల. బాగా ఎర్రగా బుర్రగా ఉందని చేసుకున్నాడు. అది అదవను చేసుకుంది. మనమేంచేద్దాం గాని నేను పోతా పొద్దెక్కింది” అని మా కిట్టి పెద్దమ్మ ను పిలుచుకొని మిరప తోటలో గడ్డి పీకను వస్తిమి. ఇద్దరం గడ్డి పీకతా ”కాదు పెద్దమ్మ మన ఊర్లో చొవుటోడు పెండ్లయి సంవత్సరం తిరక్కనే పొయ్యి వారగా పెట్టాడంట. వాళ్ళమ్మ నాయనకు ఏంది వాడు కడి ఏసేది” అంటి.
ఆ మాటకు మా పెద్దమ్మ “కాదు నాయనా ఈకలూ తోకలూ వస్తే ఎగిరిపోతారు ఏం చేద్దాము అయినా అది పేటది, నోరుగల్లవి, అలంచన పలంచన లేకుండా బతికేటివి. ఆ సరుబడి మనకు వద్దురా అని వాల్లమ్మ నెత్తి నోరు కొట్టుకున్నా వాళ్ళ నాయన ఇనకుండా చేసినాడుకదా ఇంక ఆ మాసిన్నా బట్ట పని అగసాట్లే” అనే పెద్దమ్మ. ఇద్దరం గెడ్డి పీక్కుంటా ఉండాము. ఎండ ఒక పక్క అంటిస్తా ఉంది. ”పెద్దమ్మా పొద్దన్నా పానీ కతన్న ఒకటి చెప్పు”అంటే ఆయమ్మ ఉండుకోని మన చెవుటోని పెళ్ళానికి దోడుమైన కథ ఒకటుంది చెప్తా అని కత అందుకుండే !
తొండ ఒకూరిలో రెడ్డి తనం చేస్తా ఉందంట. ఆ తొండకి ముగ్గురు పెళ్ళాలంట. ఎరజీమ, కప్ప, చీగిటీగ. ఎరజీమ గర్భవతి అయింది. కాన్పు కోసం పుట్టింటికి పోయింది. కొడుకు పుట్టినాడు. కాన్పు చేసుకొని ఐదు నెలలకి బిడ్డను ఎత్తుకుని అత్తింటికి వచ్చిందంట.
ఒకరోజు ఎరజీమ తన సవతి చీగిటీగతో బాయినీల్లకు పాయినంట. పాతా పాతా దావలో చీగీటీగ ఉండుకోని ”అక్కా అక్కా అద్దుల ముద్దుల కొడుకుని కనుక్కుని అమ్మగారింటి నుంచి వచ్చినావు కదా. అబ్బోనికి అమ్మోల్లు ఏమి సొమ్ములు పెట్టిరి అని అడిగింది”.
దానికి ఎరజీమ ఏమన్నంటే “పొద్దు గుంకతనే కల్లలింటి తిరిగే కాపుదారి బుడ్డి నీకేంది నేను చెప్పేది పో” అనే. చూడు నన్ను ఎంత మాట అన్నో అని బాధపడతా కడవకు నీల్లు ముంచుకుని రెయ్ మని ఇంటికి వచ్చి అలిగి పనుకుంది.
కప్పలక్క పగలంతా పొలంలో పని చేసి ఇంటికి వచ్చింది. ఇంట్లో యాడ పని ఆన్నేఉంది. కప్పలక్క చీగిటీగ తో “ఏమే అమ్మ నేను పొగులంతా ఎర్రటెండల్లో పని చేస్తా ఉంటే అంత అన్నం కూడా తెచ్చి పెట్టలేదే” అని అడిగింది. ” దానికి చీగిటీగ ఏమన్నంటే ”కాదక్కా ఆ ఎర్ర జీమకు అందంగా ఉండాదని పొగురు. నేను”అప్పోని కి అమ్మోలు ఏం సొమ్ములు బెట్రి అని అడిగితే దానికి నన్ను కల్లలింటి పోయే కాపుదారు బుడ్డి నీకేం చెప్పేది” అంటుంది అని బాధపడే.
దానికి కప్పుండుకొని “మే నేను పనుకుంటే పద్మావతి, కృషి ఉంటే గుణవతి, లేస్తే నీలావతి. అట్లా దాన్ని నన్ను పట్టుకొని “వాన పడేముందు పడినాకా దిబ్బగుంటల్లో బెకబెక మంటు కుప్పిగంతులు వేసే పాసి తోలు దానా అనింది” అని ఒకరికొకరు చెప్పుకొని ఇద్దరూ కలిసి అలిగి పనుకున్నారంట.
తొండ రెడ్డి తనం చేసుకొని,బయట పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చింది. ఎవరేగాని కాల్లు కడుక్కోను చెంబుతో నీల్లు ఈలేదంట. ఇంట్లో దీపం కూడా పెట్టలేదంట. ఏం జరిగింది ఈ పొద్దు అని ఇంటిలోకి పొయ్యి దీపం పెట్టి ఇద్దర్నీ అడిగినంట. ఇద్దరూ ఏడుస్తా ఎర్రజీమ మమ్మల్ని ఇట్లా అనింది అని తొండకి మర చెప్పుకున్నారట.
అప్పుడు తొండ ఏమన్నంటే ”నేను ఊరికి రెడ్డి. నా కాడికి పది మంది వస్తుంటారు పోతుంటారు. అందరూ నన్ను గౌరవంగా చూస్తారు అలాంటిది నన్ను పట్టుకొని ‘ఊగిఊగి నడిసే ఊసు కాళ్ల వాసు దేవుడా’ అనింది. నేనవరికి చెప్పుకునేది. లేండి లేసి మీ మీ పనులు మీరు చేసుకోండి” అని పాయినంట.
ఆ పొద్దున్నుండి ఇంట్లో పెత్తనమంతా ఎరజీమదే అంట !”
అని కత ముగించి చెవుటోడి పెళ్ళాం కూడా ఇట్టాటిదే అనే మా పెద్దమ్మ. ఆ మాటకు నవ్వుకుంటిమి .
ఆ యాలకి పొద్దు తిరిగే !ఎండ చల్లబడే !
అర్థాలు
అలంచన =దగ్గర ,
పలంచన=పక్కన
పీసికం= సంబంధం
మర = మొర బెట్టుకోవటం
హహహ, కతనే కాదు, సంగటి గురిగెలో ఊరుమిండి వేసుకోని తిన్నెట్లు భాష బలేగుండాది.