నియో లిబరిలిజానికి
అతి పెద్ద సవాలు

ఇప్పుడు ప్రతి ఇల్లు ఒక జైలు. ప్రతి వీధిలో కర్ఫ్వూ. ప్రజల కదలికలపై ఆంక్షలు. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు. కంటికి కనిపించని కోవిడ్- 19 మహమ్మారితో ఇప్పుడు ప్రపంచం యుద్ధం చేస్తోంది. లక్షల మంది వ్యాధిగ్రస్తులవుతున్నారు. వేల మంది మరణిస్తున్నారు.

వైరస్ తో అంటువ్యాధులు ప్రబలడం ఇది మొదటిదీ కాదు. చివరిదీ కాబోదు. ఇది, తీవ్రత తగ్గువుంది గాని, కొన్ని రోజులకు అంతమయ్యేది కాదు. ప్రమాదకారి అయిన వైరస్ ఒకటి ఒకసారి మన మధ్యకు వచ్చిందా, అది మనతో సహజీవనం చేస్తుంది. వైరస్ లతో ప్రబలినవే… ఇన్ ఫ్లూయంజా, స్వైన్ ఫ్లూ, హెచ్. ఐ. వి, ఎబోలా…! చెప్పుకుంటూ పోతే మన మధ్య ఎన్నో అంటువ్యాధులున్నాయి.  ఇన్ ఫ్లూయంజా స్పెయిన్ లో, స్వైన్ ఫ్లూ అమెరికాలో, ఎబోలా ఆఫ్రికాలో పుడితే, ఇప్పుడు కరోనా చైనాలో పుట్టింది. 

చైనాలో పుట్టిన కరోనా కొన్ని రోజుల్లోనే దావానంలా ప్రపంచమంతా వ్యాపించింది. ఏ ఒక్కదేశాన్ని వదిలిపెట్టలేదు. దాని ధాటికి ప్రాణనష్టం జరక్కుండా ప్రజలను కాపాడుకున్న దేశాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. మొదటిది క్యూబా,ఆ తరువాత జర్మనీ, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, చైనా, రష్యా.  క్యూబా తనను తాను రక్షించుకోవడమే కాదు, ఇటలీ, బ్రెజిల్, మరికొన్ని లాటినమెరికా దేశాలకు తన వైద్య బృందాలను, మందులను, మాస్క్ లను, టెస్టింగ్ కిట్ లను పంపి సహాయపడుతున్నది. 

క్యూబా చాలా చిన్నదేశం, అమెరికా విధించిన ఆంక్షలను తట్టుకొని నిలబడిన దేశం. ఒక పక్క క్యూబా వైద్యరంగంలో సాధించిన ప్రగతిని చూసి ప్రపంచ ప్రజలు అబ్బురపడుతుంటే, మరో వైపు  కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వైద్య సౌకర్యాలు అందించలేని అమెరికా స్థితికి ఇవాళ ప్రపంచ ప్రజలు నిర్ఘాంతపోతున్నారు. 

ప్రజలకు నిత్యావసరాలైన తిండి, బట్ట, గూడు మాత్రమే కాదు విద్యా, వైద్యం కూడా అత్యవసరాలుగా ప్రభుత్వాలే అందించాలని కోవిడ్-19 గుర్తుచేస్తున్నది. సైన్సు, టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందితే అవి అంతగా ప్రజలకు ఉపయోగపడాలి. కాని అవి మార్కెట్ గుప్పిట్లోకి పోయి, ప్రజలకు అందకుండా పోతున్నాయి.    

ప్రజాస్వామ్య దేశమంటే ప్రజల సంక్షేమం  కోసం పనిచేసే ప్రభుత్వం మనుగడలో వుండడం. విద్యా, వైద్యం, రవాణా, బాంకింగ్… వంటి అత్యవసర సేవలు ప్రభుత్వ అధీనంలో కొనసాగాలి. 1980,90 లలో ఉనికిలోకి  వచ్చిన నియో లిబరలిజం కింద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి తిలోదకాలిచ్చే “సంస్కరణలు’’ చేపట్టాయి. బడా వ్యాపారులకు, బహుళ పరిశ్రమలకు సి.ఇ.ఓ.లుగా పనిచేసే స్థాయికి దిగజారాయి.  మార్కెట్ విధేయమయిన ప్రభుత్వాలు ప్రజలను గాలికి వదిలేశాయి. 

అవును, ఇప్పుడు ప్రజలు తమ నివాసాలను, గ్రామాలను వదిలి పెట్టి చెట్టు నుంచి రాలిపడిన ఆకుల్లాగా  గాలిలో కలిసి ఎక్కడికి పడితే అక్కడికి దారి తెన్ను లేక కొట్టుకపోతున్నారు. ఎవరికి మాత్రం వుండదు తను పుట్టిపెరిగిన చోటే తన వారితో కలిసి  చివరి వరకు జీవించాలని? ఎప్పుడు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి. అమ్మా, నాన్న, చదువుకునే పిల్లలు ఒకే కుటుంబంలా ఒక ఇంట్లో బతుకుతున్న వాళ్లు ఎందరు మనలో? 

అమెరికా తనది ప్రజాస్వామ్య దేశంగా,  కమ్యూనిస్టుల నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పెద్దన్నగా తనను తాను అభివర్ణించుకుంటుంది. కమ్యూనిజం, సోషలిజం వంటి మాటలు దానికి నిషిద్ధాలు. అవి తన దేశంలో వినపడకూడదని, తనకు సమీపంలో వున్న దేశాల్లో కూడా అలాంటి మాటలు వినపడకూడదని కక్ష కట్టి ఆంక్షలు విధిస్తుంది. అమెరికా ప్రజాస్వామ్య దేశమా? లేక మార్కెట్ దేశమా అని  తెలుసుకొనేలా అమెరికా ప్రజలకు, ప్రపంచ ప్రజలకు కోవిడ్-19 ఒక సవాలు విసిరింది. 

అమెరికా ప్రజా వైద్య రంగాన్ని ( పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్) ఒక పద్ధతిగా నాశనం చేసి ప్రయివేట్ పరం చేసింది.  ఆ దేశంలో నివసించే ప్రజలకు ఆరోగ్య భీమా (హెల్త్ ఇన్సురెన్స్) లేనిదే ఆసుపత్రి లోనికి ప్రవేశం వుండదు. ప్రజలు నెలనెలా వేలకు వేలు డాలర్లు చెల్లించనిదే ఆరోగ్య భీమా పొందలేరు. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే వారికి కంపెనీలే హెల్త్ ఇన్సురెన్సులు చెల్లిస్తాయి. చిన్న చిన్న కంపెనీల్లో పని చేస్తూ కనీస వేతనం పొందలేని వారు, రెక్కాడితే గానీ డొక్క నిండని లక్షలాది మంది అమెరికాలో ఉన్నారు. వీరు ఆరోగ్య భీమా చెల్లించలేరు. అంటే లక్షలాది నిరుపేద ప్రజలు ఆసుపత్రుల దగ్గరకు పోలేరు. ఇల్లు లేని వారు, ఫుట్ పాత్ ల మీద ఒక పెద్ద గొడుగు సైజులో ప్లాస్టిక్ తో కప్పిన గూడులాంటి వాటిలో  లక్షలాది మంది తల దాచుకుంటున్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టి ఇవ్వాలన్న స్పృహ లేనిది, దయలేనిది అమెరికా ప్రభుత్వం. పైగా అది చలిదేశం. 

అమెరికాలో హోమ్లెస్ జనాల ఇళ్లు ఇవి

న్యూయార్క్ మహా నగరం. అమెరికా గర్వించే నగరం. ఆకాశాన్నంటే పలు అంతస్తుల భవనాలు అనేకం. న్యూయార్క్ లో టైం స్క్వేర్ అనే ప్రాంతం మరింత ప్రసిద్ధి. కళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగుల కాంతుల్లో, అందమైన హోర్డింగుల మధ్య ఆ మార్కెట్ మాయజాలం చూస్తూ మైమరిచి పోని చూపు వున్నట్లయితే, క్రూరమైన దారిద్ర్యం తప్పక కనిపిస్తుంది. హోటళ్ల ముందున్న గార్బేజ్ డబ్బాల్లోంచి  ఏరుకుతినే వాళ్లను, గడ్డకట్టే చలిలో (డిసెంబర్లో క్రిస్ట్ మస్ సెలవుల్లో చాలా రద్దీగా వుండే టైం స్క్వేర్ ను చూడాలని పోతుంటారు జనం) ఒంటి మీద కట్ డ్రాయర్ తప్ప మరో పేలిక లేకుండా వళ్ళంతా రంగులతో లతలు, పూవుల డిజైన్లు వేసుకొని అడుక్కునే వాళ్లను చూడగలం. (ఒకప్పుడు హైదరాబాదులో నడిరోడ్డు మీద ఆంజనేయుడి బొమ్మనో, క్రీస్తు బొమ్మనో రంగులతో గీసి అడుక్కునే వాళ్లు).

అవును అమెరికాలో దారిద్ర్యాం చాలా క్రూరంగా వుంటుంది. చూస్తే భయం కలుగుతుంది. అమెరికా ఎన్ని నగీషీలు చేసుకున్నా అది పేద ప్రజల పట్ల చూపించే కాఠిన్యం మనం మాటల్లో చెప్పలేం. చాలా నిర్లక్యంగా, నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కరోనా దెబ్బకు ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు కోల్పొయిన వారి సంఖ్య 30 నుంచి 40 లక్షలు వుంటుంది.  ముందు ముందు అమెరికాలో ఆకలిచావుల వార్తలు కూడా వినాల్సి రావొచ్చు. గన్ వయలెన్స్ పెరుగనూ వచ్చు.  

ఇంత జరుగుతున్నా, శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా లాభాలు గడించడానికి ఇదే సమయమని వైద్య పరికరాల, మందుల, మాస్కుల రేట్లను పెంచుతున్నాయి కంపెనీలు. హెల్త్ ఇన్సురెన్స్ రేట్లను కూడా  పెంచుతున్నాయి. దీనిని ప్రోత్సహిస్తున్నట్లుగా వాల్ స్ట్రీట్ నుంచి ఫ్లైట్ ట్రావెల్, హోటల్ వంటి వాటికి అమెరికా ప్రభుత్వం బేల్ అవుట్ పాకేజీలు ప్రకటించింది. 

అమెరికా అంటే ఒక అసంబద్ధత (అబ్సర్డిటీ). అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి డెమొక్రటిక్ ప్రైమరీ రేసులో ఉన్న బెర్నీ శాండర్స్ అమెరికాలో ఇప్పుడున్నది “కార్పొరేట్ సోషలిజం” అంటాడు. అంటే కార్పొరేట్ కంపెనీలకు పనికొచ్చే సోషలిజం. కార్పొరేట్ రంగాన్ని కాపాడుకోవడమే అమెరికా పాలకుల లక్ష్యం. పాలకులంతా  బడా పారిశ్రామికవేత్తలుగా కోట్లకు పడగలెత్తిన వారే. డెమోక్రాట్లా, రిపబ్లికన్లా అనే తేడా లేదు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టుగా వుంది అమెరికా పాలకవర్గాల పనితీరు. 

అలాంటి చోట ప్రజల మనిషిగా ఒకే ఒక్కడు కనిపిస్తున్నాడు. అతడు వర్మాంట్ రాష్ట్ర సెనేటర్ బెర్నీ శాండర్స్. ప్రజలందరికీ ప్రభుత్వమే వైద్యం, విద్య అందించాలని, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని.. ఇలాంటివే మరికొన్ని  కోరుతున్నారు బెర్నీ. తాను అమెరికా అధ్యక్షుడయితే ప్రజలకు ఈ సౌకర్యాలు కల్పిస్తానని చెబుతున్నాడు. అందుకు ఆయన్ను బొల్షివిక్ అని, క్యూబా ప్రెసిడెంట్ కాష్ట్రో అనుయాయి అని మెయిన్ స్ట్రీమ్ మీడియా ముద్రలు వేస్తున్నది. 

నిజానికి  రూజ్వెల్ట్ “న్యూడీల్” ను మించి బెర్నీ శాండర్స్  ఎక్కువేమీ చెప్పడం లేదు. ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ తరహాలో మనం ప్రభుత్వాలను నడుపుకోలేమా, ఆ మాత్రంగా మన ప్రజల క్షేమం కోసం పనిచేయలేమా అని ఎన్నికల కోసం జరుగుతున్న డిబేట్లలో బెర్నీ తన అభిప్రాయాలు ప్రకటిస్తున్నాడు. 

ప్రజలు నాలుగైదేళ్లకొకసారి ఓటు హక్కు వినియోగించుకునే ( కొన్ని చోట్ల ఓటర్ల పేర్లు మాయమవుతాయి. కొన్ని చోట్ల ఓట్లు గల్లంతవుతాయి. కొన్ని చోట్ల రిగ్గింగులు జరుగుతాయి)  ఎన్నికలను ప్రజాస్వామ్యంగా కుదించిన విషాద సందర్భంలో మనమున్నాం. 

దురాశా పీడిత కార్పొరేట్ రంగానికి లాభం వినా మరేం తెలియని మార్కెట్ కావాలి. ఈ మార్కెట్ ప్రజాస్వామ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి కూడా శత్రువు. ప్రజల మనుగడకు, ప్రకృతి (పర్యావరణ) మనుగడకు ప్రమాదకారిగా పరిణమించింది. దీన్ని నిజమైన  ప్రజాస్వామ్యం మాత్రమే అదుపు చేయగలదు. దేశమంటే మార్కెట్ కాదు. దేశమంటే మనుషులు.. మార్కెట్ ను నడిపేవి కొన్ని చేతులు మాత్రమే. ఓటు వేయడానికి మీట నొక్కే చేతులు, శ్రమచేసే చేతులు అనేకం. ప్రజాస్వామ్యమంటే ప్రజలచే, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం.  ప్రజలు తమ సంక్షేమం కోసం తామే పిడికిళ్లెత్తాలి, తామ కోసం తాము ఒకటిగా నిలబడాలి. తిండి, బట్ట, గూడు, విద్య, వైద్యం.. ప్రపంచ మంతటా ప్రజలందరికీ కావాలని కోరుకుందాం. 

బెర్నీ శాండర్స్ లాంటి నాయకులు అన్ని దేశాల్లో ముందుకు రావాలి. అమెరికాలో బెర్నీ యుగం రావాలి.

 

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.