తామరాకులు

“హలో మెగాస్టార్ “అన్న పిలుపు వినబడి పేపర్లోంచి తలెత్తి చూశాను. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ సతీ సమేతంగా కనబడ్డాడు ఎన్టీఆర్. చప్పున కుర్చీలోంచి లేచి ‘రండి’అంటూ ఆహ్వా నించాను. లోపలికి తీసుకెళ్ళగానే మా ఆవిడ ఆప్యాయంగా పలకరించి టీలు తేవటానికి కిచెన్ లోకి వెళ్ళింది. ఎన్టీఆర్ “ఇప్పుడేమీ వద్దు” అని వారిస్తూ తన చేతిలో ఉన్న లేఖల కట్టనుండి పైనున్న శుభలేఖని తీసి నావైపు చాచాడు. నాలుగు పక్కలా పసుపు రాయబడి, కొత్త పేపరు వాసనతో వింత పరిమళాన్ని వెదజల్లుతోందది.

కార్డు అందుకుంటుంటే” మొదటి లేఖ మీకే అన్నయ్యగారూ!” అంది జమున. ఆ  విషయం నాకు తెలుసు. అతి తక్కువ కాలంలోనే అంత ప్రాణ స్నేహితులమైపోయాం మరి! కవరు తెరవబోతుంటే మా ఆవిడ టీ తెచ్చింది.కప్పు అందుకుంటూ “చూడక్కర్లేదు, అంతా నీ డిజైన్ ప్రకారమే జరిగింది. కాకపోతే చిన్న మార్పు. వేదిక మారింది” అన్నాడు ఎన్టీఆర్. నేను తికమక పడుతుంటే “అమ్మా నాన్నా పట్టుబట్టారు. ఇక తప్ప లేదు” అన్నాడు.

ఎన్టీఆర్ సొంతవూరు మారెళ్ళ మూడి. అదో మారుమూల పల్లెటూరు. వాళ్ళ బంధుమిత్రులంతా అక్కడే ఉన్నారు. పైగా వార్ధక్యంలో ఉన్న తల్లి దండ్రుల సమక్షంలో వేడుక. “చాలా బాగుంటుంది!” అనుకున్నాను. అంతలో ఎన్టీఆర్ టీ తాగి , “ఇక మేము బయలు దేరతాం. ఇంకా చాలామందికి కార్డులు పంచాలి గదా” అని లేచాడు. జమున మా ఆవిడ వంక చూసి “ఇంటికి తాళం వేసి, సుస్మిత, రామ్ చరణ్ లతో మొత్తం రావాలి” అని డిమాండ్ చేసింది. “అలాగే వదినగారూ!” హామీ ఇచ్చింది నాభార్య, వెళ్తూ”అక్కడ నీకో సర్ ప్రైజ్ ఉంటుంది” అన్నాడు ఎన్టీఆర్ ఊరిస్తూ

“ఏమిటా ఆశ్చర్యకరమైన అంశం” అని అయోమయంగా చూస్తుంటే “ఊరికే బుర్రబద్దలు కొట్టుకోవటమెందుకు? వెళ్ళాక ఎలాగూ తెలుస్తుందిగా, ముందు లీవుకి అప్లయ్ చేయండి” అని కప్పులు తీసుకుని లోనికెళ్ళింది. భయంకరమైన కాలనాగు ఒకటి తన పొడవైన తోకతో ”ఛెళ్ళున’ వీపుమీద చరిచినట్టనిపించి, అదిరిపోయాను. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులకి మూడు కాళ్ళున్న కుందేళ్ళు దొరుకుతాయి గానీ, సెలవు దొరకటం బహు దుర్లభం. మేమిధ్దరం బస్ కండక్టర్లం. అసలు మా పేర్లు అవికాదు. నేను చిరంజీవి వీరాభిమానిని. అతడు ఎన్టీఆర్ భక్తుడు.అది గుర్తించిన అందరూ మా సొంత పేర్లు వదిలేసి అలా పిలుస్తుంటారు. మేము కూడా మారు పేర్లకి అలవాటు పడిపోయాం.

మా ఆవిడ పేరు రేఖ,అది సురేఖగా మారింది. అమ్మాయిని సుస్మితగానూ, అబ్బాయిలిద్దరినీ రామ్ చరణ్ వన్, టూ గా మార్చేశారు. ఎన్టీఆర్ భార్య పేరు మంగతాయారు. అది జమునగా రూపాంతరం చెందింది. కుమార్తె హేమ పురంధ్రీ శ్వరి గాను, కుమారుడు సాయి బాలకృష్ణ గానూ నామాంతరం పొందారు. పిలిచే వాళ్ళకి సౌకర్యంగానూ, మాకు గర్వ కారణంగానూ ఉండటంతో మేము కూడా వ్యతిరేకించలేదు. ఇప్పడీ ఫంక్షను హేమ రజస్వల అయినందుకు.

అసలు మా పరిచయం విచిత్రంగా జరిగింది. ఆరోజు రాష్ట్ర బంద్ జరుగుతోంది. ఎక్కడి బస్సులక్కడే ఆగిపోయాయి. ఆందోళనకారులు చుట్టుముట్టి డిపోని దిగ్బధం చేసేశారు. నినాదాలతో రణగొణ ధ్వనులతో బస్టాండు ఆవరణంతా కోలాహలంగా ఉంది. సమ్మె కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఓ రాజకీయ నాయకుడు ప్రసంగిస్తుంటే కాసేపు విని నెమ్మదిగా స్టాఫ్ రూమ్ దిశగా అడుగులు వేశాను. ఎక్కడ చూసినా గమ్యం చేరకుండా ఆగిపోయిన ప్రయాణీకుల అగచాట్లు, ఖాళీగా అటూఇటూ తిరుగుతున్న ఆర్టీసీ సిబ్బంది గుంపులుగా కని పిస్తున్నారు.

కాసేపు నడుం వాలుద్దామని స్టాఫ్ రూముకి వెళ్తే ఆశాభంగం జరిగింది. కార్మి కులు గుమిగూడి ఏదో ఆటను ఆసక్తిగా తిలకిస్తున్నారు.ఆ ఆటని చూసి నేను మైమరచిపోయాను. అది చదరంగం. నాకు ఎంతో ఇష్టమైన, ప్రావీణ్యం కలిగిన, ఎన్నో పోటీలలో బహుమతులు సాధించి పెట్టిన ఆట. ఒక్క ఉదుటన అడ్డం ఉన్న వారిని తప్పించుకుని దగ్గరకెళ్ళి చూశా. గేము చివరి దశకొచ్చేసింది. కొద్దిపావులు మాత్రమే ఉన్నాయి. పరిస్ధితిని విశ్లేషించి తెలుపు బలగాలు గెలిచే స్ధితిలో ఉన్నాయని గ్రహించాను.

అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. కొన్ని క్షణాల తరవాత “ఎన్టీఆర్ నీదే ఎత్తు. అంత టైం తీసుకుంటే ఎలా?” అని హెచ్చరించాడు ప్రత్యర్ధి. ‘ఎన్టీఆర్ ‘ అని పిలవబడిన తెల్లపావుల ఆటగాడు తీవ్రమైన ఆలోచన నుండి బైటపడి, తన బంటుని చివరి గడిలోకి తోస్తూ ‘మంత్రి’ అనబోయాడు. అలా శత్రు రాజ్యంలో ప్రవేశించిన బంటుని రాజు తప్ప మిగిలిన ఏ పావుగానైనా మార్చవచ్చు. చదరంగపు బల్లమీద మంత్రి అతి శక్తి వంతమైనది గనుక సునాయాసంగా గెల వొచ్చు. ఎన్టీఆర్ ఇప్పుడదే చేయబోతున్నాడు. మంత్రి వస్తుందని ఉబలాట పడుతున్నాడు గాని దాని వల్ల కలిగే ప్రమాదాన్ని ఊహించలేక పోయాడు. నేను దాన్ని పసిగట్టాను. చేతిలోకి వచ్చింది నోటిదాకా రాక నేలపాలవు తుంది.

ఆందోళన నిండిన గొంతుతో ‘హోల్డాన్ ‘అన్నాను. అందరూ ఉలిక్కిపడి నావైపు ఆశ్చర్యంగా చూశారు. ఎన్టీఆర్ మంత్రిని చేయబోతున్న బంటుని వెనక్కి లాగేసి, నావైపు తెల్లబోయి చూశాడు. నాకు ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది నేను ఈ డిపోకి కొత్తగా ట్రాన్స్ ఫర్ మీద వచ్చాను. ఇంకా పరిచయాలు పెరగలేదు. అందరి మొహాల్లో ప్రశ్నార్ధకం కనిపించి కాస్త తేరుకున్నాను. ‘డిపో కొత్తగానీ ఆట పాతదేగా’ అని స్ధిమితపడ్డాను. “ఆ బంటుని మంత్రిగా మారిస్తే స్టేల్ మేట్ అవుతుంది” అన్నాను .”అంటే” అన్నారు తెలీని వారందరూ. “గేము డ్రా అవుతుంది” అన్నాను. అందరూ విస్తు పోయారు. అప్పటిదాకా వాళ్ళు మంత్రిని తెచ్చి ఎన్టీఆర్ గెలుస్తాడని భావించారు. “మరి గెలవాలంటే ఏంచేయాలి?” అడి గాడు ఎన్టీఆర్, నామీద ఆధారపడి పోతూ. నేను అవతలివైపు ఆటగాడి కేసి సందిగ్ధంగా చూశాను. అతడు నవ్వుతూ “ఫర్లేదు చెప్పండి! ఫ్రెండ్లీ మ్యాచే కదా!” భరోసా ఇచ్చాడు.

“బంటుని మంత్రిగా మారిస్తే ఎదుటి రాజు కదలటానికి గడి ఉండదు. పోనీ మంత్రి చెక్ చెప్పదు. దాడి చేయకుండా రాజు తప్పించుకునే మార్గం లేకపోతే దాన్ని ‘తట్టు’అంటారు .గేమ్ డ్రా ఔతుంది. అది తప్పించాలంటే బంటుని ఏనుగుగా మార్చాలి” అని అనాలిసిస్ చేశాను. ఎన్టీఆర్ అలా ఆడి రూక్ తో చెక్ అనగానే ప్రత్యర్ధి రాజు జరగటానికి ‘ఐమూల’ గడి దొరికింది. తరువాతి ఎత్తులో ఆటకట్టు అయింది. స్టాఫ్ రూమ్ చప్పట్లతో మార్మోగింది. నేను కూడా చప్పట్లు చరుస్తుంటే శుభలేక ఉన్న నా చేతిని నా భార్య గట్టిగా తట్టడంతో సృహలోకి వచ్చా.
*****

బస్సు దిగగానే పచ్చని పైర్లతో ఆహ్లాదకరమైన వాతావరణం పలకరించింది. చల్లని గాలి ఆత్మీయంగా మేనుని సృశించింది. ఊళ్ళోకి నడుస్తుంటే చెరువులోని కలువపూలు, గట్టున రామాలయం ఆహ్వానించాయి. ధ్వజస్తంభపు చిరుగంటల సవ్వడికి మైమరచి బాల్య స్మృతుల్లోకి జారుతుంటే “మీనాన్న టైం మిషను ఎక్కాడు రోయ్ ” అని పిల్లల్ని హెచ్చరించింది మా ఆవిడ. పెద్దాడు చేయి పట్టి కుదిపి “నాన్నా!” అన్నాడు గట్టిగా. నేను చప్పున బైటికొచ్చి గబగబా నడిచాను.

అక్కడ నాకు ఎంత మర్యాద చేశారంటే సొంత అల్లుడిలా చూశారు. “రామాలయం గోడ మీద ఆంజనేయ స్వామి బొమ్మ చూశాను, ఎవరో వేశారో గాని అద్భుతంగా ఉంది” తాదాత్మ్యం చెందాను. ఎన్టీఆర్ ముసిముసిగా నవ్వు తుంటే వాళ్ళమ్మ గర్వంగా చెప్పింది. “ఇంకెవరూ,మీ కండక్టరుగారే” అంది మురిపెంగా. నేను విస్తుపోతుంటే “మా వాడు వినాయకుడి మట్టి ప్రతిమలు చేయటం మొదలెట్టాక, ఊళ్ళో చవితికి విగ్రహాలు కొనటం మానేశారు” అంది. నేను అబ్బురపడుతుంటే నాచేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి గోడలవైపు చూపించింది. వాటిని చూసి సంభ్రమానికి గురయ్యాను. అన్నీ వర్ణచిత్ర పటాలే. వడ్డాది పాపయ్య స్ధాయిలో ఉన్నాయి.

అన్నీ నందమూరి బొమ్మలే. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, కర్ణుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఎన్టీఆర్ నటించిన పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలన్నీ సజీవంగా దర్శన మిచ్చాయి. ఎన్టీఆర్ తో “ఎంత అన్యాయం, ఇంతకాలం కనీసం మాట మాత్రమైనా చెప్పలేదు” అని బుంగ మూతిపెట్టి ‘ఇదేనా నాకు ఇస్తానన్న సర్ ప్రైజు’ అన్నాను. ఎన్టీఆర్ చిరునవ్వుతో “కాదు” అన్నాడు. “అటులనా సరి, చిత్ర రాజములన్నియూ జీవకళతో ఉట్టిపడుచున్నవి. ఇట్టి చిత్రములను రూపొందించిన కళాకారునికి శిరసు వంచి ప్రణామము లాచరించుచుంటిమి, అయినను వీటిలో మా అభిమాన నటుడి చిత్రం ఒక్కటైననూ లేకపోవుట మోపలేని లోపము” అన్నాను గంభీరంగా. నా గొంతుకి, హావభావాలకి మరింత నవ్వి, పక్కనున్న పాతకాలపు మానుపెట్టె తీసింది వాళ్ళమ్మ. అందులోంచి పెద్ద చిత్ర పటాన్ని తీసి నాచేతిలో ఉంచింది. అది చూసి నివ్వెరపోయాను. అది చిరంజీవి బొమ్మ. గూండా సినిమాలోని స్టిల్ అది. దాన్ని గుండెలకు అదుముకుంటూ “ఇదే నాకు ఇస్తానన్న విచిత్రం”అన్నాను ఉద్వేగంగా. ఎన్టీఆర్ చిరునవ్వును కొనసాగిస్తూ “కాదు” అన్నాడు స్ధిరంగా. నా ఆనందం ఆశ్చర్యపడింది. ‘మరేమిటి? “అనుకుంటూ ఓడిపోయినట్టు చూశాను. వెంటనే నన్ను చావిట్లోకి తీసుకెళ్ళి” అటు చూడు “అన్నాడు..క్షణంపాటు కొయ్య బారి పోయాను. అక్కడ మోపులుగా కట్టబడి ఉన్నాయి, తామరాకులు. చిన్నపుడు నేను భోజనం చేసిన ఆకులు. కోనేటిలో ఈతకొడుతూ ఆడుకున్న పత్రాలు. ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిన భోజనపు విస్తళ్ళు. పులకింతతో నా మిత్రుణ్ణి కుదిపేశాను.

ఎప్పుడో ఓసారి మాటవరసకి అన్నాను, చిన్నప్పటి ముచ్చట్లు చెబుతూ దాన్ని గుర్తు పెట్టుకున్నాడన్నమాట. ద్విగుణీకృతోత్సాహంతో చెలరేగిపోయాను. డెకరేషన్ చేశాను. అల్పాహార ఏర్పాట్లు చూశాను, వంటలు, షామియానాల్లో కూడా వేలుపెట్టాను. చివరికి చదివింపులు కూడా రాశాను. ఆఖరుగా నేను నా ఫ్యామిలీ తృప్తిగా తామరాకుల్లో తింటున్నాం.

అంతలో ఇద్దరు చెంచు యువతులు వచ్చి,అన్నం పెట్టమని యాచించారు. చిరిగిన బట్టల్లో మురికిగా ఉన్నారు. ఒకామె చంకలో పసిపిల్లాడున్నాడు. వారి కళ్ళలో ఆకలి స్పష్టంగా కనిపిస్తోంది. నేను గుబుక్కున లేవబోతుంటే ఎన్టీఆర్ ఆపి, వడ్డించే కుర్రాడిని పురమాయించి ఇంట్లోకెళ్ళాడు. ఆ కుర్రాడు వారివైపు చీదరగా చూశాడు. “ఎక్కడైనా భోజనాలు పెట్టటం పాపం, రాబందుల్లా పసిగట్టి వాలిపోతారు, ఊ..పట్టండి అన్నానికి గిన్నెలేమైనా తెచ్చారా?” అన్నాడు విసురుగా. వాళ్ళు కొంచెం బెదిరి చేతుల్లోని సత్తు చెంబులు చూపించారు. అతడు విసుక్కుంటూ వాటిలో సాంబారు పోశాడు. అన్నం పాత్ర తెచ్చి ” మీ చీర చెంగులు పట్టండీ”అన్నాడా కుర్రాడు. వాళ్ళు ఆనందంగా చిరిగిన చీర చెరుగుల్ని జాగ్రత్తగా పట్టుకుంటే వాటిలో అన్నం వేసి “ఇక పొండి”అన్నాడు. వాళ్ళు కదలకుండా”కొంచెం పలావు పెట్టు బాబూ” అన్నారు, పలావు పాత్ర వైపు ఆశగా చూస్తూ. వారి ఆబ చూపులు ఆ కుర్రాడి వంటి మీద తేళ్ళూజెర్రెల్ని పాకించాయి. వెంటనే ఉగ్రుడై వారిని తోసేంతలో ఒక పెద్దాయన చూసి వారించాడు.”ఫోన్లే పాపం కొంచెం పెట్టరా ఎలాగూ మిగిలిపోతుంది” అన్నాడు. అతడు కొంచెం తగ్గి కొరకొరా చూస్తూ చెరో కొంచెం పలావు, ఇందాకటి అన్నం మీద వేసి దూరంగా నిలబడ్డాడు. అన్నం పలావు బరువుకి చీరకొంగులు చిరిగి పోతాయేమోనని భయపడుతూ, జాగ్రత్తగా పట్టుకుని “చల్లగా ఉండు బాబూ”అని వెళ్ళిపోయారు.

లోపలికి వెళ్ళిన ఎన్టీఆర్ రెండు స్టీలు కేనులతో బైటికొచ్చాడు. వాటినిండా పిండివంటలూ,స్వీట్లు ఉన్నాయి. జమున నాభార్య చేతిలో రెండు పాకెట్లు పెట్టింది ఇద్దరికీ బట్టలు కొన్నారన్నమాట. నాకళ్ళు అనురాగంతో నిండిపోయాయి. కానీ శరీరం మాత్రం డస్సిపోయింది. పొద్దుట నుండీ ఎడతెరిపి లేకుండా కల్పించుకున్న పనుల వత్తిడి తాలూకు నీరసం. అది గమనించిన ఎన్టీఆర్ “పోనీ ఈ రాత్రికి ఉండిపోతారా?”అన్నాడు ఆపేక్షగా చూస్తూ. “లేదు వెళ్ళిపోతాం, రేపు డ్యూటీ ఉందిగా, ఉదయం ఇక్కడ నుండి వెళ్ళటం కష్టమవుతుంది” అన్నా అలసటగా. “సరే”నని బస్సు వరకూ వచ్చి సాగనంపాడు ఎన్టీఆర్. లగేజీ సర్ధి సీట్లలో కూర్చుని వీడ్కోలుగా చేతులు ఊపాం. పిల్లలకి ఈ ప్రయాణం బాగా నచ్చింది. సంతోషంగా మాట్లాడు కుంటున్నారు. చీరను చూస్తున్న మా ఆవిడ కళ్ళు మెరుస్తున్నాయి. నిజానికి కార్యక్రమానికి వచ్చిన బంధు మిత్రులూ రక్త సంబంధీకులకంటే, ఏ బంధం లేక పోయినా మమ్మల్నే బాగా చూసుకున్నారు. కిటికీ దగ్గర చల్లగాలి వీస్తుంటే హాయిగా అనిపించి సీటుకి జారబడ్డాను. మా ఆవిడ నావైపు అదోలా చూసి “ఏమిటీ ముభావంగా ఉన్నారు?” అంది. నేను కళ్ళుమూసుకుంటూ “ఏమీలేదే !” అన్నాను. ఆమె ఇక రెట్టించలేదు.

మూసిన నా కళ్ళముందు ఒక దృశ్యం ప్రత్యక్షమైంది. బక్కచిక్కిన దేహంతో ఉన్న ముసలి వాడు మెడకు తగిలించిన డోలు వాయిస్తూ ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తుతున్నాడు. తలపై పింఛం, చేతిలో పిల్లనగ్రోవితో బాలకృష్ణుని వేషంలో ఉన్న అతడి మనవడు, అడుక్కున్న వాటిని తన భుజానికి వేలాడుతున్న సంచిలో వేసుకుంటున్నాడు. సడెన్ గా పిల్లల గోల వినిపించి కళ్ళు విప్పాను. మా అబ్బాయిలు కీచులాడుకుంటున్నారు. “నాన్నా ఇంటికెళ్ళాక తిందామని తామరాకులు తెచ్చాను. తమ్ముడు వాటిని లాక్కుంటున్నాడు” అన్నాడు పెద్దాడు. వాళ్ళ దగ్గర్నుంచి తీసుకుని ఆ తామరాకుల కట్టవైపు కొన్ని క్షణాలు తదేకంగా చూసి కిటికీలోంచి బైటికి విసిరేశాను.

కౌలూరు ప్రసాద రావు

కౌలూరు ఫ్రసాద రావు వృత్తి: ఆర్టీసీ కండక్టర్,. ప్రవృత్తి: కథలూ కవితలు. చదరంగంలో ఇంటర్నేషనల్ రేటింగ్ వున్న క్రీడాకారుడు. చదువు: బి ఏ.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.