ముళ్ళ కంప

పరుపు మీద నుండి లేవగానే వీపు వెనకాల ఏదో తెలీని మంట. సూదులతో పొడుస్తున్నట్లుంది. స్థిరంగా ఉన్నప్పుడు నొప్పి తగ్గి, కదిలినప్పుడు ఎక్కువ అవుతూ ఉంది. ఏంటో చూద్దామని టీ షర్ట్ తీస్తుంటే, నొప్పికి తలలో నరాలు తెగుతున్నట్టుగా అనిపిస్తుంది. తల తిప్పి చూడడానికి ప్రయత్నించాను. భుజం మీద గడ్డం ఆనించి, చూపు వీపు వెనక్కి మళ్ళిస్తుంటే మెడ నరం పట్టేసింది. అద్దం వెనక్కి పెట్టి చూడడానికి ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. నొప్పి పెరుగుతూ ఉంది. ఇలా కాదని, మొబైల్ ను తల మీదుగా వెనక్కు తీసుకెళ్ళి వీపుకి ఫోటో తీశాను.

పాతిక ముళ్ళున్న ముళ్ళ కంప ఒకటి నా వీపంతా గుచ్చుకొని ఉంది. కొన్ని ముళ్ళు చిన్నవిగా ఉండి, తెలిసీ తెలియనట్టు గుచ్చుతున్నాయి. కొన్ని చాలా పెద్దవిగా, లోపలికి గుచ్చుకొని ఉన్నాయి. చేతిని నడుము దగ్గరకు తీసుకెళ్ళి, వీపు కిందనున్న ముళ్ళ కంప మొదలును పట్టుకొని నా శరీరం నుండి వేరుచేయడానికి ప్రయత్నించాను. మొదలు దగ్గర ముల్లు బాగా పెద్దదిగా ఉండడం వల్ల తీసేటప్పుడు చాలా నొప్పెట్టింది. బయట లాగుతూనే పాము బుస కొట్టినట్టు కళ్ళు మూసి “ఇస్..” అన్నాను. నొప్పికి ఓర్చుకుంటూ ఎలాగోలా మొత్తం కంపని బయటకు లాగాను.

కంపకున్న ముళ్ళన్నీ నీలం రంగు ద్రవంతో తడిచుండడంతో వీపుని చేత్తో తడిమి చూశాను. నీలం రంగులో ఉన్న నా రక్తం చూసి చాలా భయమేసింది. ఏం చేయాలో అర్థంకావట్లేదు. బయటకు వెళ్ళి ఏదైనా మెడిసిన్ తెచ్చుకుందాం అని టీషర్ట్ తొడుక్కొని, రక్తం మరకలు కనిపించకుండా దానిపైన స్వెటర్ వేసుకొని బయలుదేరాను.

రూమ్ తలుపు తీయగానే హాల్లో కూర్చున్న చెల్లెలు నన్ను చూసి, “హలో బర్త్డే బాయ్, అందరికీ సమ్మర్ మొదలవుతుంటే నీకింకా చలి తగ్గలేదా… స్వెట్టర్ వేసుకున్నావ్” అని అంది. నేను బయటకి వచ్చానని గ్రహించి అమ్మ, “వేడి నీళ్ళు పెట్టాను. రా తలస్నానం చేసుకుందువు” అంది. నాన్న వరండాలో కూర్చొని షేవింగ్ చేసుకుంటున్నారు. ఇంకో ప్రశ్న రాకముందే అక్కడ నుండి బయటపడ్డాను.

గేటు తీసి బయటకెళ్ళగానే ఎదురుగా చాలా మందులు షాపులు కనిపిస్తున్నాయి. ప్రతి షాపు బయట, “ముళ్ళ దెబ్బకి మందులు ఇవ్వబడును” అని రాసి ఉంది. ఇంతకు ముందున్న ఇల్లులు కానీ, చెట్లు కానీ ఏమీ లేవు. ఏ వీధి చూసినా మందుల దుకాణాలే. ఒక్కరు మాత్రమే పట్టేంత చిన్న వాటి నుండి, బంగ్లా అంత పెద్ద వాటి వరకూ ఉన్నాయి. కొన్నింటిలో కేవలం టాబ్లెట్లు, కొన్నింటిలో టానిక్కులు, కొన్నింటిలో ఇంజెక్షన్లు… ఇలా రకరకాల షాపులు కనిపిస్తున్నాయి.

ఏం అర్థంకాక  దిక్కులు చూస్తుంటే, కొంచెం దూరంలో, ఒక ఎనిమిదేళ్ళ కుర్రాడు నిక్కర్ టీషర్ట్ వేసుకుని, నలుపు బెల్ట్లున్న చెప్పులు తొడుక్కుని, నుదుటి మీద తిలకం బొట్టుతో, చేతిలో బ్యాటు పట్టుకొని, నన్ను క్రికెట్ ఆడడానికి పిలుస్తున్నాడు. వాడ్ని పట్టించుకోకుండా షాపుల వైపు నడిచాను.

ప్రతీ చిన్న షాపు బయట ఒక వ్యక్తి నిల్చొని వాళ్ళ దగ్గర మెడిసిన్ కొనమని పిలుస్తున్నారు. కనీసం అటువైపు కూడా చూడకుండా వాళ్ళందరినీ దాటుకుంటూ, బయటకి అందంగా అలంకరించబడిన పెద్ద షాపుకు వెళ్ళాను. అక్కడ చెప్పిన రేటుకి కావల్సినంత డబ్బు నా దగ్గర లేదు. అంతకన్నా తక్కువలో దొరకవన్నారు. వేరే దగ్గర ప్రయత్నిద్దామని ఇంకో పెద్ద షాపులోకెళ్ళాను. వాళ్ళు నన్ను చూడగానే బయటకి గెంటే ప్రయత్నంలో పడ్డారు. బయటకి వెళ్ళేముందు ప్రవేశం దగ్గర పెట్టిన అద్దంలో నేను, చెదిరిన జుట్టుతో, చిరిగిన బట్టలతో కనిపించాను. ఒంటిమీద చూస్తే ఇంట్లో తొడుక్కున్న బట్టలు అలానే ఉన్నాయి… అద్దంలో అలా ఎందుకు కనిపిస్తున్నానో అర్థంకావట్లేదు. ఏ పెద్ద షాపుకి వెళ్ళినా, అద్దంలో చినిగిన బట్టలతో నన్ను చూసుకొని లోనకు వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నాను.  ఏది దొరికితే అది తీసుకుందామని చిన్న షాపులు వైపు నడిచాను. 

చిన్న షాపుల బయటున్న అద్దాలలో నేను ఖరీదైన దుస్తులతో కనిపించాను. ఇక్కడ ఖచ్చితంగా నాకు కావాల్సిన మందు దొరుకుతుందని ముందుకు వెళ్తుంటే,  ఇందాక నన్ను క్రికెట్ ఆడడానికి పిలిచిన కుర్రాడు షాపుల వెనక నిల్చొని గ్రౌండ్ వైపు చూపిస్తూ సైగలతో నన్ను ఆడడానికి రమ్మంటున్నాడు. నా బాధ వీడికెలా అర్థమయ్యేది? నన్ను వదిలేలా లేడనుకొని, వాడి నుంచి తప్పించుకొని ఇంకో వీధిలోకెళ్ళాను. ఇక్కడ కూడా పెద్దషాపుల అద్దాలలో వికృతంగా కనిపించడం, చిన్న షాపులకెళ్తే కుర్రాడు అడ్డు రావడం… ఇలా చాలా వీధులు మారుతూ, నన్ను నాలా చూపించే అద్దమున్న షాపు కోసం వెతుకుతూ నడుస్తున్నాను. ఎక్కడా కనిపించట్లేదు.

అంతా నిర్మానుష్యంగా ఉంది. చుట్టూ బండరాళ్లు తప్ప ఎటువంటి అలికిడీ లేని పొడుగాటి దారిలో ఒక్కడినే నడుస్తున్నాను. ఇదంతా వృధా ప్రయాస అనిపించి కొన్ని సార్లు వెనక్కి వెళిపోదామనుకున్నా, కొంచెం నడిస్తే కావాల్సిన మెడిసిన్ దొరుకుతుందన్న ఆశ నన్ను ముందుకు నడిపిస్తుంది. గాయాలనుండి కారిన రక్తం చెమటతో కలిసి, లోపల టీ షర్ట్నంతా తడిపేసింది. చాలా దూరం నడవడం వలన, వీపు వెనకాల నొప్పి అలవాటై, శరీరంలో భాగమైపోయి, ఇంతకుముందంత బాధగా అనిపించట్లేదు.

ఎదురుగా ఎత్తైన కొండ. పైన కొన్ని షాపులు కనిపించాయి. బలం పుంజుకొని ఉత్సాహంతో ఎక్కడం ప్రారంభించాను. కొండ పైన అన్ని షాపులు పుస్తకాలతో నిండి ఉన్నాయి. ప్రతి షాపు మీద “ముళ్ళ గాయాలకి పరిష్కారం దొరుకును” అని రాసి ఉంది. లోపలికి వెళ్ళి ఒకొక్క పుస్తకం తిరగేస్తున్నాను. పుస్తకాల్లో విషయాలు నాకు దగ్గరగా అనిపించినా నొప్పిని మాత్రం తగ్గించలేకపోతున్నాయి. ఒక టేబిలు దగ్గర పుస్తకం చదువుతున్న వ్యక్తిపై పక్క రాక్ లోంచి పుస్తకాలు జారిపడి అక్కడికక్కడే చనిపోయేసరికి భయమేసి బయటకొచ్చేసాను. ఇంకో షాపులోకి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. 

చిన్న నవ్వులు వినిపించడంతో పైకి చూసాను. ఒక ఎత్తైన ఒంటి స్తంభం మేడ మీద నలుగురమ్మాయిలు నన్ను చూస్తూ వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటున్నారు. స్తంభం మీద నిలువుగా పెద్ద అక్షరాలతో, “ముళ్ళ బాధకి ఉపశమనం లభించును” అని రాసి ఉంది. పైకి వెళ్ళడానికి మెట్లు లేవు. స్తంభానికి కాళ్ళు చేతులు చుట్టి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నా మళ్ళీ కిందకి జారిపోతున్నాను. కొంత మంది చాలా సులువుగా ఎక్కి, పైకి చేరుకుంటున్నారు. ఎలా అయినా ఎక్కాలని ఉపాయం కోసం ఆలోచిస్తూ, ఆ ఒంటి స్తంభం మేడ చుట్టూ తిరుగుతున్నాను. అప్పటివరకూ గ్రహించలేదు కొండ చివరకొచ్చిన్నట్లు, లోయలోకి పడబోతుంటే ఎవరో లాగినట్టు అనిపించి వెనక్కి పడ్డాను. 

భయం వలన వచ్చిన ఆయాసంతో వేగంగా శ్వాస తీస్తుంటే నా చుట్టూ జనం గుమిగూడారు. కొందరు, వాళ్ళ దగ్గరున్న ఫోటోలు, విగ్రహాలు చూపిస్తూ, ఈ వ్యక్తే నన్ను వెనక్కి లాగి నా ప్రాణం కాపాడారని చెప్తున్నారు. కొందరు, వాళ్ళని తప్పు పడుతూ నా మెదడులో కలిగిన రియాక్షన్ వల్ల అప్రయత్నంగా నాకు నేనే వెనక్కి పడ్డానంటున్నారు. మరికొందరు ఇదంతా ఏమి జరగలేదనీ, అంతా నా భ్రమ అనీ అంటున్నారు. నా బాధని అర్థం చేసుకోకుండా వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకోవడం ప్రారంభించారు.  ఆ గుంపు నుండి బయటకొచ్చేసాను.

వీపు వెనకాల నొప్పి ఎక్కువవుతుంది. దాహంగా ఉంది. వెంటనే ఇల్లు గుర్తొచ్చింది. చెప్పకుండా బయటకొచ్చి చాలా సేపయ్యింది. ఇంతసేపు కనిపించకపోయే సరికి కంగారు పడుతుంటారు. కనీసం నాతో ఫోన్ అయినా తెచ్చుకోలేదు. ఒక్క మాట వాళ్ళతో చెప్పుంటే ఇంట్లోనే ఏదైనా మందు ఇచ్చేవాళ్లు కదా. ఇంత కష్టం ఉండేది కాదు. వెంటనే అక్కడనుండి లేచి, వేగంగా ఇంటికి నడవడం మొదలుపెట్టాను. ఒక రాయిని తన్నుకొని కింద పడడంతో దొర్లుతూ కొండ కిందకు చేరాను.

దారి మర్చిపోయి దిక్కులు చూస్తుంటే, బ్యాట్ పట్టుకొన్న ఎనిమిదేళ్ళ కుర్రాడు నాకు ఎదురుగా నిలబడి, నా ఇంటికి వెళ్ళే దారి చూపిస్తానన్నాడు. వేరే గత్యంతరం లేక తన వెనక వెళ్ళాను. ఎక్కడా ఆగకుండా, వచ్చిన దారుల వెంట, కలిసిన మనుషుల మధ్యలోంచి పరిగెడుతూ ఇంటికి చేరాను. 

ఇంట్లో ఎవరూ లేరు. సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటున్న చెల్లెలు, వంట చేస్తున్న అమ్మ, షేవింగ్ చేసుకుంటున్న నాన్న… ఎవ్వరూ కనిపించట్లేదు. హాల్లో, వంటింట్లో వస్తువులేం లేక ఇల్లంతా ఖాళీగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. బయటకెళ్ళి చూస్తే ఆ చిన్న కుర్రాడు నా ముందే అదృశ్యమైపోయాడు. భయమేసింది. నా బెడ్ రూమ్ కెళ్ళి తలుపేసుకున్నాను. ఇందాక పడేసిన ముళ్ళ కంప ఇంకా అక్కడే ఉంది. తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయ్. ఎడమ భుజం దగ్గర సూది గుచ్చినట్టు అనిపిస్తే కుడి అరచేతిని అమాంతం తీసుకెళ్ళి ఎడమ భుజానికి అంటించాను. 

కళ్ళు తెరిచి చూస్తే చచ్చిన దోమ ఒకటి నా చేతిలో ఉంది. దోమ తెర ఉన్నా లోపలికెలా దూరిందో… చాలా రక్తం తాగేసింది. పరుపు మీద కూర్చుని ఒళ్ళిరుస్తుంటే, వీపుకి ముళ్ళు గుచ్చుకున్న దృశ్యం మెదలడంతో వీపుని తడిమాను. నున్నగా ఎటువంటి నొప్పి లేకుండా ఉంది. అప్పటివరకూ వీపు మీద సుర్ సుర్రుమని మంట కొంచెం తగ్గింది.

శీతాకాలం ఆఖరి రోజులు కావడంతో పగలంతా ఎండ జిగ్గుమన్నా, రాత్రుళ్ళు ఇంకా చలి తగ్గలేదు. లేచి ఫ్యాన్ ఆపి అక్కడే నిల్చున్నా. సైలెంట్ మోడ్ లో పెట్టడం వల్ల రింగ్ వినిపించడం లేదు గాని, మొబైల్ డిస్ప్లేలో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాల్ ఆన్సర్ చేసిన వెంటనే చెల్లెలు, “హ్యాపీ బర్త్డే అన్నయ్యా” అని అరిచింది. తర్వాత అమ్మానాన్న “ఇరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు” అని చెప్పారు. తర్వాత మాట్లాడతానని పెట్టేసా. 

అప్పటికే చాలా మిస్డ్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ వచ్చాయి. మా ఫామిలీ గ్రూపులో చాలా మంది విషెస్ చెప్పారు. మా చిన్నాన్న నా చిన్నప్పుడు ఫోటో పెట్టి, దాని కింద ‘మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాని’ అని విష్ చేసారు. 

ఎనిమిదేళ్ళప్పుడు ఫోటో అది. కాలర్ టీ షర్ట్ ని నిక్కర్ లోకి టక్ చేసి, నుదిటి మీద చిన్న తిలకం బొట్టుతో, నలుపు రంగు బెల్ట్లున్న చెప్పులు తొడుక్కొని, బంతిని కొట్టడానికి సిద్ధమన్నట్లు చేతిలో బ్యాటు పట్టుకొని ఉన్నాను. అందరికి ఒకేసారి తర్వాత రిప్లై ఇవ్వొచ్చని, బెడ్ మీద వెల్లకిలా చేరబడి, ఆ ఫోటోని జూమ్ ఇన్ జూమ్ ఔట్ చేస్తూ, అలానే చూస్తూ ఉండిపోయాను.

హరీశ్

హరీశ్: వయసు 26. పుట్టి పెరిగింది శ్రీకాకుళం జిల్లా. హైదరాబాద్ లో MSc Physics చదివారు. ఇప్పుడు Indian Meteorological Department లో Scientific Assistant గా నిజామాబాద్ లో పని చేస్తున్నారు.

4 comments

  • Harish garu… Mee modati Katha maaku chaala baaga nachinadi..

    Harish chaala nishabdhatho, prasantham ga unde oka manchi manishi…

    Nenu Mee nundi oka chakkati feel good story… Adi chusi bullet train lanti busy life lo… Corona holidays lo vache rest feeling kavali..

    Meeru maakosam tappaka alanti kathanu andistarani korukuntunnam..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.