నిన్న పలకరించిన మనుషులు ఈ వేళ ఏరీ మనుషుల మధ్య మాటలు దోచేస్తున్నదెవరు నేల నుంచీ నీరు ఆవిరైపోతున్నట్లు కళ్ళముందే మొగ్గ తొడుగుతున్న పూలు రాలిపడుతున్నట్లు తిరిగి పలకరించకుండా ప్రేమలెటు పోతున్నై సందడితో హోరెత్తిన వీధులు ఎందుకిలా మూగబోతున్నై కన్నులిలా అగ్ని నక్షత్రాలెందుకౌతున్నై తీయని మాటలతో గారడీ ఆటను చూపుతూ ఆడిస్తూ కనుపాపలను దొంగిలిస్తున్న వీరెవరు ఎవరికి ఎవరూ కాకున్నా అందరికోసం ఏమీ కాలేక పోతూ మరో పార్శ్వపు సైనికులై తెగిన కలల రెక్కలతో వీరంతా భయదభూతాలౌతున్నదెందుకోసం సాలెగూటిలో చిక్కుకున్న ఈ అమాయకరెక్కల పురుగులకు దారేది చిన్నిచేపలను కబళిస్తూ సంద్రాలను ఆక్రమిస్తున్న తిమింగలంఎక్కడిది వూహకందని ఏ దేశపు సంద్రానిది మనసులు ఆవిరై పోతున్నై కలలు విరిగి పడుతున్నై వీథి చివరన భయం ప్రతి కంటిపాపలో పొంచి చూస్తోంది కనపడని సాలీళ్ళు నోళ్ళు తెరిచి వూపిరిని మింగేందుకు వచ్చేస్తున్నాయెందుకు నవ్వుతున్న మాటలతోనే కుతంత్రపు పంజరాల్ని అల్లుతున్న చేతులెవరివి ధనవ్యామోహంతో శాసించే మాయలపకీరుల ప్రాణాల్ని దాచుకున్న రంగు మాటల చిలకల గుహలెక్కడ మనిషిని చూసి మనిషే ఎందుకు ఉలికి పడుతున్నాడు ఈ భయపు వల విసిరెందెవరు పరమేశుడి మూడోకన్నో ఈశుడి రెండోరాకడో ఇంకా నిజమైతే కలి పురుషుడి ఖడ్గపుమెరుపో- తెరుచుకునేది జరిగేది తెలిసేది - ఎలా?ఎప్పుడు?

Add comment