సహకారమే అభివృద్ధికి ఆధారం

నాయకత్వం స్ఫూర్తినివ్వాలి; ఆధిపత్యం చెలాయించకూడదు; సహకారం పునాదిగా సాగాలి; 

బెదరింపులు కాదు.  

  • విలియం ఆర్థర్ వార్డ్ 

పనిచేసే ప్రదేశంలో సహకారం ఉద్యోగుల పనిలో నాణ్యతను పెంచుతుంది. బృంద స్ఫూర్తికి దోహదం చేస్తుంది. సహకారం చక్కని సమన్వయంతోను, చిన్న చిన్న పనులు చేయడంలో సహాయం చేయడంతోపాటు, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా దోహదం చేస్తుంది. రంగంలో పని చేస్తున్నా ఉద్యోగులు ఒకరికొకరు సహకరించుకోవడం వ్యక్తిగత ప్రగతికి, సంస్థ ప్రగతికి ఎంతగానో దోహదం చేస్తుంది. మరి సహకారం పని చేసే ప్రదేశంలో ఎలా ఉండాలో చూద్దాం

తోటి ఉద్యోగులతో భాగస్వామ్యం:  మీ తోటి ఉద్యోగులను మీరు చేసే పనిలో భాగస్వాముల్ని చేయడం సంస్థ విజయానికి తొలి మెట్టు. ‘ఒక వ్యక్తితో గాని, ఒక సంస్థతో గాని సన్నిహితంగా పనిచేయడమే భాగస్వామ్యం’ అని కేంబ్రిడ్జ్ నిఘంటువు నిర్వచిస్తుంది. యజమానులు, ఉద్యోగులు ఆధునిక పని ప్రదేశంలో పరస్పరం సహకరించుకున్నా వారి భాగస్వామ్యం హక్కులు, ఒప్పందాల పరిమితికి లోబడి ఉంటుంది. సహకారం, భాగస్వామ్యం ఇరువర్గాల అవసరాలు, పరస్పర గౌరవం, ఒకరినొకరు ఆమోదించుకోవడం మీదనే ఆధారపడి ఉంటాయి.  

సహకార దృక్పథం : ఉద్యోగులు పరస్పరం సహకరించుకునే వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత కంపెనీలమీదనే ఉంది. కంపెనీలు నియంత్రణ, ఆధిపత్య ధోరణిని విడనాడాలి. యజమానుల పట్ల ఉద్యోగులు పారిశ్రామిక యుగం నాటి అనుమానాస్పద ధోరణిని విడిచిపెట్టి, పరస్పర విశ్వాసాల పునాదిపై సహకార ధోరణిని పెంపొందించుకోవాలి. సహకార వాతావరణాన్ని సృష్టించడమంటే అవకాశాలను అందిపుచ్చుకుని పరస్పర సహకారధోరణితో పని చేయడమే.

వినడమే సహకారానికి విత్తనం:  పనిచేసే ప్రదేశంలో సహకారానికి సహకరించే ప్రధానాంశం ఒకరినొకరు వినడమే అంటే ఒకరికొకరు ఆచరణయోగ్యమైన పరిష్కారాలను కనుగొనే దిశగా పని చేయడమే. తిరస్కార ధోరణిలో సహకారం ఉండదు. ఎదుటివారి ఆలోచనలను కూడా ఆమోదించే బహిరంగ తత్వం (Openness) ఉండాలి. ఇరు వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆమోదయోగ్యమైన ధోరణిలో సహకరించుకోవాలి. సహకార సన్నద్ధత, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా సహకరించడం అందరి ప్రయోజనాలను కాపాడే సహకారం అనిపించుకుంటుంది. పనిచేసే ప్రదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా సహకార ధోరణి పెరగాలని, తద్వారా ఉత్పాదకత పెరిగి దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదపడుతుందని అన్ని రకాల సంస్థలు గుర్తించాయి

ఉద్యోగుల మధ్య సహకారం:  ఒక ఉద్యోగికి ఫొటోకాపీ మిషన్ ఉపయోగించడం తెలిస్తే, దానిని ఉపయోగించడంలో తక్కినవారికి సహకరించాలి. ఇటువంటి చిన్న చిన్న పనులనుంచి, సంస్థ ప్రగతికి దోహదం చేసే కీలక నిర్ణయాలు తీసుకునే సమయాల్లోను ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునే ధోరణి పెంపొందాలి. అప్పుడే పని చేసే ప్రదేశంలో సహకారానికి సార్ధకత ఉంటుంది. యజమానులు, ఉద్యోగుల మధ్య, మేనేజర్లు, కింది స్థాయి ఉద్యోగుల మధ్య, ఉన్నతాధికారులు, కింది స్థాయి ఉద్యోగుల మధ్య, మహిళా ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం ఉంటేనే ఒక సంస్థ సజావుగా సాగి యజమానుల, ఉద్యోగుల ప్రగతికి, తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తుంది. పెత్తనం చెలాయించే ధోరణినుంచి, నియంత్రించే ఆధిపత్య ధోరణినుంచి కంపెనీలు బయటపడి, ప్రపంచీకరణ నేపధ్యంలో పరస్పర సహకారమే యజమానులు, ఉద్యోగుల ప్రగతికి దోహదం చేస్తుందని భావించడం శుభ పరిణామంబెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్టుసహకారమే మానవాళి విమోచనకు దిక్కు’.   

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.