విపత్కర కాలంలో
రాజకీయ క్రీడ!

ఇదంతా మూడు వారాల కిందటి పంచాయితీ. ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో ఉంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు ఎక్కువై పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల గురించో , ఇంకా వేరే రాజకీయ నిర్ణయాల గురించో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం , ప్రజలు తమ దృష్టి మొత్తం ఈ మందు లేని ప్రాణాంతక వైరస్ పైనే పెట్టాలి. రెండు రాష్ట్రాల చొరవ బాగానే వుంది. అయితే ఇదే పని ఇప్పటికన్నా ఇంకో వారం ముందే చేసి ఉంటే మరింత మెరుగ్గా ఉండేది.  తొలుత నెగిటివ్ గా తేలి కొన్నాళ్ళకు పాజిటివ్ గా మారడం అనేది ఆందోళనకరం. ఎందుకంటే ఈలోపలే అది ఎంత మందికి పాకి ఉంటుందనేది అంచనాలకు అందనిది. స్వీయ నియంత్రణ ఒక్కటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయగిలిగినది. అధో పాతాళానికి దిగజారాబోతోన్న వ్యవస్థల నియంత్రణ మన చేతిలో లేదు. ప్రస్తుతానికి ప్రాణాలు నిలుపుకోవడమే ఎవరికి వారు చేయాల్సిన ఆలోచన. ఇప్పటికింకా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ప్రభుత్వం చేతిలోనే ఉంది. అది దాటితే మనకున్న వనరుల రీత్యా మరణాలే గతి. నిర్లక్ష్యం కారణంగా అమెరికా చెల్లిస్తోన్న మూల్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు ఆంప్ర ప్రభుత్వం చర్యలు బాగున్నాయి. వీటిలో కూడా రాజకీయ చేపలు పట్టజూచే జాలరుల యవ్వారం ఏం బాగోలేదు. పంచాయతీ ఎన్నికల రాజకీయం మూడువారాల కిందటిదైనా, కథ అంతటితో ముగియలేదు. చాల త్వరలోనే తిరిగి అజెండా మీదికి వస్తుంది. ఏ పక్షం దొరలు ఎలా ప్రవర్తిస్తున్నారనేది జనం చర్చ్ఇంచుకుంటారు. అందువల్ల వాటి గురించిన చర్చ అవసరమే.

ఎన్నికల పంచాయితి  

గత ఏడాది మార్చి లాగానే ఈ సంవత్సరం మార్చిలో కూడా పంచాయితీ ఎన్నికలతో కోలాహలం పెరిగింది.ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయితీల పదవీకాలం ముగిసి రెండేళ్ళు కావస్తున్నా ఇంతవరకు ఎన్నికలు జరపలేదు. ఇప్పుడు ఎలక్షన్లు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎం‌పి‌టి‌సి , జెడ్‌పి‌టి‌సి పదవులకు నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత , పంచాయితీ ప్రెసిడెంట్ ఎన్నికలకు ఇంకా నామినేషన్లు మొదలవకముందే  రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేశాడు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో  ఐఏఎస్ ఆఫీసర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం కూడా లేదు. ఉన్నట్టుండి ఓ రోజు సాయంత్రం మీడియా ముందుకు తన విచక్షణాధికారాన్ని వెంటపెట్టుకుని వచ్చి వాయిదా పత్రాన్ని చదివి వినిపించారు. అప్పటికే గ్రామాల్లో ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల వుపస్ంహరణ పర్వం ముగిసి జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు మొదలుకావాల్సి ఉంది. కనీసం ఏ కరోనా వ్యాధి కోసమని ఆయన ఎన్నికలను వాయిదా వేశానని చెప్పుకున్నాడో ఆ కరోనా యొక్క తీవ్రత గురించి , ముందుజాగ్రత్త చర్యల గురించి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులను ఎటువంటి సంజాయిషీ అడగలేదు. తాను చేసే పని మంచిదని తనకు తెలిసినా అంత గోప్యత పాటించడంలోని ఆంతర్యం ఏముంటుంది?  ప్రజల ఆరోగ్యరీత్యా నేను ఈ నిర్ణయం తీసుకోబోతున్నానని చెబితే పోయేదేముంది. ఒకవేళ ముందుగా  చెబితే ఎదో జరిగిపోతుందనే బెంగ ఎందుకు ?.విచక్షణాధికారం అన్న పదానికి అర్థం ఇదా. రాష్ట్ర ఎన్నికల అధికారిగా వున్న ఆయన యాదృచ్చికంగా కమ్మ కులస్తుడు కావడం వల్ల చంద్రబాబు మనిషి అని ఆరోపణ చేయడం అనైతికం అవుతుంది. ఆయన కూతురికి గత తెలుగుదేశం ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇచ్చిందని ఇప్పుడు గుర్తు చేయడం కూడా సరికాదు.ఆయన యొక్క  ఉద్యోగ ధర్మాన్ని , దాన్ని ఆయన నిర్వర్తించే తీరును గమనించి మాత్రమే ఆరోపణలు వుండాలి. అప్పుడే అవి రాజకీయ ఆరోపణలకు భిన్నమని అనిపించుకుంటాయి. 

ఏకగ్రీవాలు: బొమ్మా బొరుసూ 

ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఎక్కువ స్థానాలను బలవంతంగా ఏకగ్రీవం  చేస్కోవాలని ప్రయత్నం చేస్తోందంటూ ప్రతిపక్షం ఆరోపణ చేస్తోంది. దీనిలో నిజం ఎంత అబద్దం ఎంత? సార్వత్రిక ఎన్నికలు జరిగి పూర్తిగా ఒక్క సంవత్సరం కాలేదు. జనరల్ ఎన్నికల్లో కూడా ప్రస్తుత ప్రభుత్వ పక్షం బొటాబొటి సీట్లతో గెలవలేదు. అత్యధిక సీట్లతో గెలిచి అధికరంలోకి వచ్చింది. గెలిచిన తర్వాత ఈ పది నెలల కాలంలో ఒక్క అమరావతి ప్రాంతంలో కొందరి నుంచి తప్ప మరే జిల్లాల నుంచి కూడా వ్యతిరేకత లేదు. పంచాయీతీ ఎన్నికల్లో ప్రభుత్వం  ఓడిపోతామనే పరిస్థితేమీ లేదు. దానికి తోడు, పంచాయితీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వుంటే వారి మద్దతుదారులే అత్యధిక స్థానాలు గెలవడం ఆనవాయితీ. ఏకగ్రీవ పద్దతి ఇప్పుడు దాదాపు ఐదు వందల గ్రామ పంచాయతీలకు చేరుకోవడానికి కారణం… టీడీపీ ముఖ్య నేతల పార్టీ మార్పు. జనరల్ ఎలక్షన్లలోనే పార్టీ మారని కొందరు టీడీపీ నేతలు ఇప్పుడు పార్టీ మారారు. దాంతో ఎక్కువ చోట్ల పోటీకి మనుషులు లేకుండా పోయారు. గెలిచిన, ఓడిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల్లో తమ వారిని పోటీకి నిలిపి గెలిపించుకోగలమనే నమ్మకంతో లేరు. ప్రభుత్వం తమది కాదు కాబట్టి ఆర్థికంగా డబ్బు తగలెయ్యడానికీ మనసు రాదు. రెంటికీ చెడ్డ రేవడిలాగా ఇటు డబ్బు అటు పరువూ పోగొట్టుకోవడం ఎందుకని అనుకునే వాళ్ళు కూడా కొందరు వున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలలో ఎక్కువ శాతం ప్రతిపక్ష పార్టీ నేతల నిష్క్రియాపరత్వమే ఎక్కువగా కనబడుతోంది. అయినా ఈ ఏకగ్రీవ పద్దతి ప్రజాస్వామ్యనికి మంచిదేమీ కాదు. పోటీ జరగాలి. నిజానికి ఇప్పటి ఇక్కడి సందర్భంలో వైసీపీ ఏకగ్రీవం పట్ల అంత ఆసక్తి చూపాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ఏకగ్రీవాల పట్ల సదభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఎన్నుకునే పరిస్థితి వుంటే ఎవరి మీద ఎంత వ్యతిరేకత ఉన్నదీ తెలుస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకోవడం అనవసరం. 

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.