మరో ‘వైరస్’ కథ!

రోనాతో జగమంతా గజగజ వణుకుతోంది. దేశాలకు దేశాలు గృహనిర్భంధాల్లో ఉన్నాయి. అతి పెద్ద అణుశక్తి రాజ్యాలూ, కాబోయే ‘విశ్వగురు’వులూ ఈ మెడికల్ ఎమర్జెన్సీని తట్టుకోడానికి అగచాట్లు పడుతున్నాయి. అయితే సకాలంలో వైద్య సేవ అందితే కోవిద్-19 మరణాలు10 శాతానికి మించవు. కానీ 75% డెత్ రేట్ వుండే మరో భయంకర వైరస్ తో రెండేళ్ళ క్రితం కేరళ రాష్ట్రం చాలా విజయవంతంగా పోరాడింది. ఆ పోరాట పాఠాలు నేడక్కడ కరోనాపై సాగుతున్న యుద్ధంలో ఉపయోగపడుతున్నాయి.

2018 మే నెలలో కేరళ లోని కాలికట్, మల్లపురం జిల్లాల్లో భయంకర నిపా వైరస్ వ్యాపించింది. 17 మంది చనిపోయారు. వ్యాధి సోకిన ఇద్దరే బతికి బట్టకట్టారు. అయితే ఈ ఆపద కాలంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం, వైద్య సిబ్బంది, పురపాలక ఉద్యోగులు నిపాపై ఉమ్మడి పోరాటం చేసి నెల తిరక్కుండానే ఆ ప్రాంతాల్ని నిపా విముక్తం చేశారు. ఆ ఉద్యమం సామాన్యుల్లోంచి అసామాన్య హీరోలను తయారుచేసింది.  నిపా రోగికి సేవ చేస్తూ వ్యాధికి గురై అమరురాలైన లిని పుతుసేరి అనే నర్సును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా గుర్తించి గౌరవించింది. వీరందరికీ ఘన నివాళి అర్పిచే మలయాళ సినిమా ‘వైరస్’ (2019).

ఏడాది క్రితమే వార్తల్లో చాల చర్చకు వచ్చిన ఉదంతాన్ని, చిన్న వివరాలు కూడా ప్రజల స్మృతిపథంలో తాజాగా వున్న నేపథ్యంలో ఆసక్తికర సినిమాగా తీసేదేలా? ఏమాత్రం ఏమరపాటు పడినా డాక్యుమెంటరీ అయిపోయే ప్రమాదముంది. ఫిక్షన్ గా సాగుతూ కూడా వాస్తవంగా వుండాలి. థ్రిల్లర్ లా ఉంటూ సందేశం అందించాలి. ఎలా? ఈ ప్రశ్నలకు సరైన జవాబు చెబుతుంది ముహ్సిన్ పరారి, శర్ఫు, సుహాస్ ల స్క్రిప్టు. ‘మహేశింతే ప్రతీకారం’, ‘మాయానధి’ లాంటి సినిమాలతో లబ్ద ప్రతిష్టుడైన ఆశిక్ అబూ ఈ సినిమాకు దర్శకుడే కాక సహ నిర్మాత. మరో నిర్మాత ‘అఖిల’ అనే నర్సు పాత్రను వేసిన నటి రీమా కల్లింగాల్. మలయాళ సినిమాలోని పేరైన నటీనటులందరూ ఇందులో వున్నారు.  ఎవరికీ స్క్రీన్ టైం ఎక్కువగా వుండదు. ఎవరూ హీరో, హీరోయిన్లు కారు. పంచ్ డైలాగులసలే లేవు, పాటలూ లేవు. రోగంపై ఉమ్మడి పోరాటమే ఏకైక లక్ష్యంగా సాగిన ఒక మల్టీ-స్టారర్ మాష్టర్ పీస్ ఈ సినిమా.

కథా నేపథ్యాన్ని చెప్పిన తీరు:

జిల్లా కలెక్టర్ ఇంటి ఫోన్ మోగుతుంది – “సర్, మెడికల్ కాలేజ్ వెంటిలేటర్లన్నీ ఐపోయాయి. కొత్త పేషెంట్లు వస్తే ఏం చేస్తాం సార్?” అని అవతలి స్వరం. డీ ఎం మోహంలో ఆందోళన ! మొదటి దృశ్యమే ఉత్కంఠతో మొదలౌతుంది. కథ మూడు రోజులు వెనక్కి వెళ్తుంది. ఫుట్‌బాల్ స్టేడియంలో ఫుట్‌బాల్ ఆడుతున్న జూనియార్ డాక్టర్ అబిద్ (శ్రీనాథ్ భాసి) కన్పిస్తాడు. అక్కడి నుంచి జంప్ కట్. హై డ్రామాకు కేంద్రస్థానమైన కాలికట్ మెడికల్ కాలేజీ డ్రోన్ షాట్. మరో జంప్. తమ బకాయిలు చెల్లించాలంటూ కాలేజీ లోపల క్యాజువల్ వర్కర్ల నినాదాలు. సూపరింటెండెంట్‌తో వారి ప్రతినిధి బాబు (జోజు జార్జ్) మాట్లాడతాడు.  ఆ తర్వాత అబిద్ పాత్ర ద్వారా ఒక డాక్టర్ దినచర్యను, మెడికల్ కాలేజీ వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేసే టైటిల్స్ సన్నివేశం. రాజీవ్ రవి కెమేరా, సుషిన్ శ్యాం నేపథ్య సంగీతం మనల్ని ఆ వాతావరణంలోకి లాక్కుపోతాయి. రకరకాల క్రిటికల్ పేషెంట్లు ఒకరి తర్వాత మరొకరు వస్తూనే వున్నారు. ఇంత బిజీలోనూ మరో మెడికల్ స్టూడెంట్ షారా (మడోన్నా సెబాస్టియన్) కోసం సమయం కేటాయిస్తాడు అబిద్. ఆమెతో అతడి ప్రేమ వ్యవహారం కొంచెం ఇబ్బందుల్లో వుంది. ఆమెను కన్విన్స్ చేసి కావలించుకోబోతే తిరస్కారపు చెంపదెబ్బ ఎదురౌతుంది అతడికి.

కథలోకి వింత జబ్బు ప్రవేశం:

అది మే 5 వ తేదీ. మాములు పేషెంట్ల సందోహం మధ్యలో వింత జబ్బుతో స్పెషల్ పేషెంట్లు జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో జాయిన్ అవుతున్నారని తెలుస్తుంది.  పేరెంబ్రా తాలూకా ఆసుపత్రిలో సుహానా, కాలికట్ మెడికల్‌లో రోషన్, బేబీ మెమోరియల్ హాస్పిటల్లో రజాక్ – ఇలా చాలా మంది జాయిన్ అవుతున్నారు. జ్వరం, దగ్గు, ఏ ఆర్ డి ఎస్ (ఎక్యూట్ రేస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్)తో చేరిన వారు క్రమంగా ఊపిరిపీల్చడం కష్టమౌతూ, అపస్మారక స్థితి వచ్చి, బీపీ నార్మల్ లెవెల్ నుండి 230/180 కి పెరిగిపోయి చనిపోతున్నారు. అఖిల అనే నర్సును  పెరెంబ్రా తాలూకా ఆసుపత్రి నుండి కాలికట్ మెడికల్ కాలేజీకి తరలిస్తారు. చనిపోయిన రోగి నుండి తనకు రోగం సోకినట్టుందనీ, తనను ఇంట్యూబేట్ (శ్వాస గొట్టం అమర్చడం) చేయ్యండనీ ప్రాధేయపడుతుంది అఖిల. మెడికల్ స్టూడెంట్ గీత చనిపోతుంది. చివరికి మణిపాల్ సెంటర్ ఫర్ వైరస్ రీసెర్చ్ లో ఇది నిపా వైరస్ అని నిర్ధారణ అవుతుంది. శవాన్ని పోస్ట్ మార్టం చేసిన గదిని ఫ్యుమిగేట్ చేస్తారు. దాంతో మెడికల్ స్టూడెంట్స్, నర్స్ లకు భయం పట్టుకుంటుంది. వారు ప్రిన్సిపాల్ తో వాదనకు దిగుతారు. శవ దహనలకు కూడా ఎవరూ ముందుకు రారు. రోగవ్యాప్తి కాకుండా అంత్యక్రియలు చేయడమెలా? ఈలోగా వార్త మీడియాకు చేరుతుంది. ప్రజల్లోనూ భయాందోళనలు! మృతుల కుటుంబాల సామాజిక వెలివేతలు! ఈ పరిస్థితిని ఎలా అదుపుచేయాలి? అవసర వైద్య పరికరాలు, సదుపాయాలు సమకూర్చడం, రోగుల సంస్పర్శలోకి వచ్చిన వారిని వెదికి పట్టడం, వారిని క్వారెంటైన్ చేయడం యుద్ధ ప్రాతిపదికన జరగాలి. అసలు జబ్బు ఎవరి నుంచి మొదలైంది? అనగా ఇండెక్స్ పేషెంట్ లేదా జీరో పేషెంట్ ఎవరు? కథ చివరికి సుఖాంతమెలా అయింది? ఇది మిగతా సినిమా!

నిజ జీవిత కథానాయకులు – అద్భుత నటీనటులు:

బతుకు పోరులో నిజం హీరోలు

నిపాపై నిఘా వేసి ఆ ప్రాంతాన్ని రోగ విముక్తం చేయడంలో అహర్నిశలు శ్రమించిన నిజజీవిత త్యాగమూర్తులెందరో వున్నారు. వారందరికీ ఈ సినిమా నివాళి అర్పించింది.

టీచరమ్మ రేవతి

ఉదాహరణకు –

 1.     కేరళ ఆరోగ్య మంత్రి సి కే ప్రమీలగా రేవతి వేసిన పాత్రను కాలికట్ టీచర్ కే కే శైలజ ఆధారంగా రూపొందించారు. మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచి కేరళ ఆరోగ్య మంత్రిగా ఉన్న ఆమెను అందరూ ‘టీచర్’ అని ప్రేమగా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్నన్నాళ్ళూ ఆమె కాలికట్లో తిష్ట వేసి పర్యవేక్షించారు.
 2.     టోవినో థామస్ వేసిన జిల్లా కలెక్టర్ పాల్ వి అబ్రహం పాత్రను కలెక్టర్ యూ వి జోస్ ఆధారంగా చేశారు.
 3.     నర్స్ లిని సినిమాలో అఖిల అయ్యింది. ఆ పాత్రను నటి, నిర్మాత రిమ కల్లింగాల్ వేసింది. ఆమె భర్త సజీష్ పాత్రను నటుడు శరఫుదీన్ వేశాడు.

  నర్స్ లిని
 4. ఇంద్రజిత్ సుకుమరాన్ డా. బాబురాజ్ పాత్రను వేశాడు. నిజ జీవితంలో డా. ఆర్ ఎస్ గోపకుమార్ అనే కాలికట్ కార్పోరేషన్ హెల్త్ ఆఫీసర్ 12 మంది నిపా బాధితుల శవాల అంత్య క్రియలు జరిపించాడు.
 5. నటి పార్వతి వేసిన అన్ను పాత్రను పిజి స్టూడెంట్ డా. సీతు పొన్నునుండి తయారుచేశారు.  అప్రకటిత డిటెక్టివ్ లా ఈమె సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇండెక్స్ పేషెంట్ జకరియాకు (వాస్తవంలో సబిత్), తర్వాతి పేషెంట్లతో లింకు వెదికి అనవసర కుట్ర సిద్ధాంతాలకు కళ్ళెం వేస్తుంది అన్ను. ఈమె భర్తగా నటుడు జినూ జోసెఫ్ కన్పిస్తాడు సినిమాలో.  
 6. నిపాను ధ్రువీకరించిన డా. గోవిందాకర్నవార్ అరుణ్ కుమార్ పై ఆధారిత పాత్రను సినిమాలో కుంచాక్కో బోబన్ పోషించాడు.
 7. అటెండర్ బాబు అనే మరో ముఖ్య పాత్ర బి ఎం పి రాజీష్ అనే నిజజీవిత పారిశుధ్య కార్మికుడు ఆధారంగా తయారైంది.
 8. ‘సుడాని ఫ్రం నైజీరియా’ దర్శకుడు జాకరియా మొహమ్మద్ ఇండెక్స్ పేషెంట్ పాత్ర పోషించాడు. నిజజీవితంలో లానే జకరియా తండ్రి (నటుడు ఇంద్రన్స్), చెల్లాయి, అత్తమ్మ (ముస్లిం ఆచారం ప్రకారం మంత్రించి మొహం మీద ఊదడం వలన వ్యాధి సోకి) చనిపోతారు.  జాకరియా తల్లి పాత్రను సావిత్రి శ్రీధరన్ పోషించింది. ఆమెకు ఏమీ కాదు. (ఆసుపత్రి వాసన నచ్చక చీరతో ముక్కు మూసుకోవడం వలన)
 9. నటి పూర్ణిమ ఇంద్రజిత్ వేసిన డా. స్మ్రితి భాస్కర్ పాత్రకు ఆధారం డైరెక్టర్ అఫ్ హెల్త్ సర్వీసెస్ గా పనిచేసే ఆర్ ఎల్ సరిత.

ప్రేరణాత్మక దృశ్యాలు – ఆసక్తికర దృశ్యాలు:

శవాలను హేండిల్ చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు, అంబులెన్సు డ్రైవర్లందరూ  భయపడుతున్నారు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్ వారి మనోబలాన్ని పెంచే దృశ్యం చాలా అద్భుతంగా వుంటుంది. ఆయన ఎవరినీ బలవంత పెట్టడు. “ఈ వూరిలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ  వూరికి చెందిన ఒక విదేశీ పారిశ్రామిక వేత్త 80 లక్షల విలువున్న పిపిఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్లను తన సొంత విమానంలో తీసుకువచ్చాడు. ఎవరో అజ్ఞాత వ్యక్తీ ఎన్ 95 పేస్ మస్కుల డబ్బాను డా. శ్రీదేవి ఇంటి దగ్గర ఉంచేసి తన పేరు కూడా చెప్పకుండా వెళిపోయాడు. ఇవి అద్భుతాలు కావా? మీకు ప్రాణహాని జరగదు. కానీ బలవంతం చేయను. పనికి రెడీ అనుకున్నవారు కాగితంపై ఎస్ అని రాసి ఫోన్ నెంబర్లు ఇవ్వండి. ఇష్టం లేనివారు నో అని రాస్తే చాలు’’ – అని అయన చెప్పిన తర్వాత చాలామంది స్వచ్చందంగా ‘ఎస్’ రాస్తారు.

అటెండర్ బాబు

థ్రిల్లర్‌లా సాగుతున్న సినిమాలో మధ్య మధ్య ఫ్లాష్ బ్యాక్ ఉపకథలు మానవీయ అంశాల్ని అందిస్తూ ఆసక్తిని పెంచుతాయి. బాధిత కుటుంబాల సామాజిక వెలివేత దృశ్యాలు వారి పట్ల సానుబూతి పెంచేలా వుంటాయి. ఒకే వూరిలో వున్నా తను చేస్తున్న పనిని బట్టి భార్యాబిడ్డల్ని కలవలేని స్థితి అటెండర్ బాబుది. షారాకు తన కారణంగా వ్యాధి వచ్చిందేమో, తనకూ వ్యాధి ఉందేమోనని డాక్టర్ అబిద్ ఆందోళన. ఎన్ని ఆర్ధిక ఇక్కట్లు వున్నా తమ ప్రేమను చెక్కుచెదరకుండా ఉంచడానికి కష్టపడుతున్న విష్ణు – అంజలి పిట్టకథ అంజలి మరణంతో విషాదం కావడం, భార్య బెడ్డుపై మాస్కు లేకుండా పడుకుని ఆత్మహననం చేసుకోబోయిన విష్ణు చివరికి బ్రతకడం, అతడ్నీ, షారానూ టీచరమ్మ కావలించుకోవడం మనోఫలకంపై ముద్రితమైపోయే దృశ్యాలు. రోగుల్ని మోసే స్ట్రెచర్ పై నిద్రపోయివున్న కుంచాకో బోబన్ను సబార్డినేటు టీ గ్లాసుతో నిద్రలేపే దృశ్యం క్రైసిస్ సమయంలో ఆ నిస్వార్ధ డాక్టర్ అంకితభావాన్ని తెలియజేస్తుంది.

కుట్ర సిద్ధాంతానికి గోరీ – రోగ కారణ అన్వేషణ:

చైనా దేశం ఏదో బయో వెపన్ గా కరోనాను తయారుచేసిందనీ, ఇంకా ఏవేవో కుట్ర సిద్ధాంతాలు ఈ రోజు వింటున్నాం. నిపా కేసు పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రతినిధులు ఇద్దరు కాలికట్ వస్తారు. ఇండెక్స్ పేషెంట్ ముస్లిం కావడంతో దీనిలో బయో టెర్రరిజం లింకును వెదకాలని వారు మొదటి నుంచీ వత్తిడి చేస్తుంటారు. ఇందులో అలాంటిదేమీ లేదని బాధ్యతగల డాక్టర్ల దళం రుజువుచేస్తుంది. సి సి టీవీ చెక్ చేస్తూ, బాధితులతో ఇంటర్వ్యూలు చేస్తూ ప్రతి కేసుకూ ఇండెక్స్ పేషెంట్‌తో లింకు వెదికే పనిలో విజయవంతమౌతారు డాక్టర్లు. కేసు తేలిందని అనుకుంటుండగా, ఉన్నికృష్ణన్ (సౌబిన్ షాహిర్ అద్భుతంగా పోషించిన పాత్ర) అనే కొత్త పేషెంట్, ఆ వెనుక మరో పేషెంట్ రావడంతో, కొత్త పేషెంట్లకు జకారియాతో వున్న లింకును చేధించడం డా. అన్ను వంతవుతుంది. డిటెక్టివ్ లా సాగిన   ఈ సినిమాకు చక్కని క్లైమాక్సు అందిస్తుంది. కేంద్ర ప్రతినిధులు నిరాశ పడాల్సి వస్తుంది. తన అన్నయ్య కారణంగా నర్స్ ‘అఖిల’ చనిపోయింది కనుక వారింటి వారికి తమపై కోపంగా ఉండొచ్చనీ, అందుకే తను వారింటికి వెళ్లి వారి దూషణలన్నీ వినివస్తానని జకరియా తమ్ముడు డా. అన్నూతో అంటాడు. ఈ ఒక్క దృశ్యంతో కేరళలో మతసామరస్యం ఎందుకుందో మనకర్ధమౌతుంది.

నిజానికి నిపా వైరస్ మానవకృత్యం కానే కాదు. పళ్ళు తినే గబ్బిలాల వల్ల వస్తుంది. వాటి నుండి మనుషులకు సంక్రమిస్తుంది. జకరియాకు ఆ సంక్రమణ ఎలా జరిగిందన్నది సినిమాటిక్ గా టైటిల్స్ వేసే ముందు చూపించారు. ఈ దృశ్యం ‘హాంగ్ కాంగ్’ వైరస్ గురించి వచ్చిన ‘కాంటాజియన్’ (2011) సినిమా ఆఖరు దృశ్యంలానే వుంటుంది. తారా స్థాయికి చేరిన ప్రకృతి విధ్వంస ఫలాలే ఈ వైరస్ దాడులు అని నేడు మనం అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నాం. వ్యవస్థని ఇలా సాగనిస్తే మనిషికి మనుగడ ఉండదన్నది తథ్యం!

ఆశావహమైన ముగింపు:

ఉపన్యాసాలతో ముగిసే సినిమాల కోవలోకి వస్తుందీ సినిమా. “షారా, విష్ణుల నుంచి నేను ప్రేరణ పొందుతూనే వుంటాను. కొన్నాళ్ళ ముందు వరకూ మనం ఒకచోట కూర్చోడానికే భయపడేవాళ్ళం. ఈ రోజు ఈ హాల్లో కిటకిటలాడుతూ కూర్చున్నాం. ఒకర్నొకరు సహకరించుకునే క్రమంలోనే మనమీ రోగానికి గురయ్యాము. ఒకర్నొకరం సహకరించుకుంటూనే రోగంపై విజయమూ సాధించాం. ఈ పోరాటంలో 21 మందిని కోల్పోయాం. సిస్టర్ అఖిల జ్ఞాపకాలు మనకు ఆ పాఠాన్నే గుర్తుచేస్తుంటాయి. ఈ రోజు నుండి కాలికట్, మల్లపురం జిల్లాలు నిపా విముక్తం అయ్యాయని ప్రకటిస్తున్నాను” అంటూ అఖిల ఫోటోతో అలంకృతమైన ఆ వేదిక నుండి టీచరమ్మ ప్రసంగిస్తుంది. నిపా వ్యాధి నుంచి బ్రతికి బైటపడిన 19 ఏళ్ళ అమ్మాయి తను నర్స్ కావాలనుకుంటోందని తెరపై వస్తుంది. కేరళలో సరికొత్త వైరాలజీ సంస్థ నెలకొల్పారని కూడా మనకు తెలుస్తుంది. నేటి మన గృహ నిర్భందం కూడా ఆశావహంగా ముగియాలనీ, అల్ప ప్రాణనష్టాలతో ముగియాలనీ, మన గుణపాఠాలు మనం మరువకుండా ముగియాలనీ కోరుకుందాం.            

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

4 comments

 • సమీక్ష చాలా బాగుందండీ! ధన్యవాదాలు. ఈ సంక్షోభ సమయంలో అవసరమైన సినిమా

 • My cousin is currently living in Palakkad. He told me that, Kerala’s experience with NIPHA had helped in overcoming Corona.

  When National figure of Covid cases was 1000, Kerala had 180 (18%), just equal to Maharashtra. Both states were in 1&2 ranks.

  Today out of 5000 cases of the country, Kerala has below 300 (6%). At least Five states have surpassed Kerala.

  Closure of religious gatherings was also more effective there.

  • Our Defense Budget is 15%. We call it Investment. Our health budget is 1.3% only. We call it ‘public spending’. Communist countries have different priorities. Today, Cuba and Kerala are showing us the way. Today, amid lockdown due to Corona, the Central government’s priority is to amend law to impose 12 Hour Working Day. Bachchaa log, Thali Bajao, Mombattee Jalao!!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.