ఒక కడుక్కుందాం…

హ…

ఆహా…

‘కడుగుతూనే వుండు… కడుగుతూనే వుండు…’

‘బ్రేక్ టైం’ అంటూ టీవీలో బ్రేక్ టైంలో వచ్చే లైఫ్ బోయ్ హేండ్ వాష్ యాడ్లో అచ్చం బంటీలా మనం కూడా ‘కడుగుతూనే వుండాలి… కడుగుతూనే వుండాలి…’

‘నీ సబ్బు స్లోనా?’- కాదు, స్లోగానే యిప్పుడు కడగాలి!

వెక్కిరింతలు పడడానికి కడుగుతూనే వుండాలి! మావయ్య అన్నట్టు చేతి గీతలు అరిగిపోయేదాక! 

అమ్మ అన్నం పెడతాను- కాలుకడుక్కో- అంటే నోటితో తినేదానికి చేతులెందుకు కడుక్కోవాలి, తిన్నాక యేకంగా కడుక్కుంటాలే- అని సినిమా డైలాగులు చెప్పడానికి లేదు! చెమ్డాలు వొలిచేస్తారు… వూ!

కడుగుతూనే వుండాలి! ఇంటందరికీ యిప్పుడు అదేపని కదా?! కాని నీళ్ళు లేవు! అసలే నీళ్ళకు కష్టం! అందులో యెండా కాలం!

తాతయ్య అంటారు కదా… ‘యింట్లో వున్నవాళ్ళు మాటిమాటికి కడుక్కోవడమెందుకు’ అని!

నాన్నమ్మ అంటుంది కదా… ‘వొళ్ళు కడుక్కోవడం మానేసి, ఆ నీళ్ళతో రోజంతా చేతులు కడుక్కోవాలి’ అని!

నాన్న అంటారు కదా… ‘గవర్నమెంటు నిత్యవసరాల్లో నీళ్ళను కూడా చేర్చాలి’ అని!

ఉద్యోగాలకి అప్లయ్ చెయ్యడం మానేసి సానిటైజర్లు అప్లయ్ చేస్తూన్న మావయ్య డబ్బులు తగలబెడుతున్నాడని అమ్మ తిడితే, ‘లేదు నీళ్ళను పొదుపు చేస్తున్నాను’ అంటాడు!

బియ్యం పప్పులు కూరలు పళ్ళు అన్నీ కడగాలంటే కూడా నీళ్ళు కావాలి! కూరలు అంత పొదుపుగా కడగొద్దు- అని అమ్మ నాన్నమ్మ గొంతులు పెంచుకుంటారు!

కరోనాని యెదుర్కోవాలంటే నీళ్ళు కూడా కావాలి! ప్చ్… యెవరూ గుర్తించరు… అర్థం చేసుకోరు!

టిష్యూ పేపర్లతో చేతులు తుడుచుకొనే అలవాటు యిప్పుడు బేడ్ హేబిట్ అంట!

ఇప్పుడు మరింత జాగ్రత్తగా వుండాలి! జలుబు తెచ్చుకోకూడదు! జ్వరం తెచ్చుకోకూడదు! ఏదిపడితే అది తిని విరోచనాలు తెచ్చుకోకూడదు! ప్చ్.. అవి చెప్పి వస్తాయా?

అమ్మకు వూపిరి ఆడని ఆయాసం! నాన్నమ్మకు కదల్లేని కీళ్ళ నొప్పులు! తాతయ్యకు యెప్పుడూ ఖహ్హు ఖహ్హున దగ్గే! కూల్ డ్రింకులు తాగి తాగి మావయ్యకు గొంతునొప్పి! ఖాళీగా బోరుకోడుతోందని అవీ యివీ చేయించుకు తినే నాన్నకు బానే విరోచనాలు! మీ నాన్నకు మంచిగా యింట్లోనే వాకింగ్ అయిపోతోంది అని అమ్మ నవ్వుతుంది! అమ్మ ఫీలవడం లేదని నాన్న ఫీలవుతారు! వీళ్ళందరినీ యిలా చూస్తుంటే మాకు హెడ్డేక్… తలనొప్పి!

అన్ని లక్షణాలూ యింట్లో వున్నా అందరం చెరొకటి సర్దుకోవడం వల్ల నో కరోనా! అందుకే అంటారేమో యేదైనా పంచుకుంటే హేపీ అని?!

కళ్ళూ ముక్కూ నోరూ టచ్ చెయ్యకూడదట! కాని అంత ఎలర్ట్ గా ఎలా వుంటాం? తుమ్ము చెప్పి వస్తుందా? హాచ్ హచ్… అమ్మ తాలింపు పెడితే, ముక్కుని ఆటోమేటిక్కుగా టచ్చేస్తాం! చేశాం కదా, అని తిడతారు, వొక్కోసారి వొక్కో దెబ్బ వేస్తారు! ఏడ్చినప్పుడు పిల్లలం కళ్ళు పులుముకొని తుడుచుకుంటాం కదా? సరిగ్గా అప్పుడే మావయ్య వచ్చి చక్కిలిగింతలు పెడతాడు… నోరు మూసుకు నవ్వలేం కదా? నాకు కరోనా నచ్చలేదు! కరోనా రూల్స్ కూడా నచ్చలేదు!

అన్నట్టు ‘అటు కదలకు… యిటు కదలకు… నోర్మూసుకొని కూర్చో… వొక దగ్గర తిన్నగా కూర్చోలేవా… కుదురుగా కూర్చోని చక్కగా చదువుకోవడానికి యేమిటి నొప్పి… వొళ్ళు సలుపు… బలుపు… కొవ్వు…’ అని యెన్నో తిట్టిన ఈ పెద్దాళ్ళకు అలా కూర్చోవడంలో వున్న కష్టం యిప్పుడు తెలుస్తున్నట్టుగుంది! బుద్దిగా కూర్చోలేక అలా రోడ్డు మీదకు వెళ్ళి నాలుగు లాఠీ దెబ్బలు తింటున్నప్పుడు- మాకయితే మమ్మల్ని ఈ పెద్దాళ్ళూ టీచర్లూ కదిలితే బెత్తంతో కొట్టడం గుర్తుకువచ్చింది! ఎవరయినా యెవర్నయినా కొట్టి మార్చగలరా?

సరేగాని, మీకో విషయం తెలుసా? ఇప్పుడెవరూ మా పిల్లల్ని ‘నోటి మీద వేలేసుకొని కూర్చో’ అనరు! ముక్కు పట్టుకొని గుంజీలు కూడా తీయమనరు! స్కూల్ వున్నా సరే! ట్యూషన్ అయినా సరే! ఆ! యా! నో ఫనిష్మెంట్స్!

నో ఫనిష్మెంట్స్ అంటే గుర్తొచ్చింది! నో ఎగ్జామ్స్! టెన్త్ కి తప్ప! సో- నో ఎగ్జామ్స్! నో మార్క్స్!  నో రాంక్స్! నో కాంపిటీషన్! నో ఫనిష్మెంట్స్! నో కొట్టడం! నో తిట్టడం! నో సమ్మర్ కోచింగ్స్! యస్ కరోనా! థాంక్యూ!

ఇక యింట్లో- రిమోట్ బటన్స్ అరిగిపోయేలా ఆ ఛానెల్ నుండి ఈ ఛానెల్ కూ ఈ ఛానెల్ నుండి ఆ ఛానెల్ కూ న్యూస్ ఛానెల్స్ అన్నీ తిరిగేస్తూ నాన్న! కరోనా పాజిటీవ్ కేసులు పెరగడం చూసి ‘అంటించుకు చస్తున్నారు’ అని అమ్మ! ‘జలుబూ జ్వరమూ వొకరికి వొస్తే మరొకరికి రాకుండా వుంటాయా’ అని నాన్నమ్మ! ‘మరి మాకు మాత్రం అవి వర్తించవు’ అంటే ‘మనకా- యెవరి యెంగిలి తిన్నావో జ్వరమూ జలుబూ అంటించుకొచ్చావని అగ్గిఫైరయిపోరూ’ అని అనుకున్నాం!

కూరలూ సరుకులూ అని గుంపులుగా పోటీ పడి యెగబడుతున్నవాళ్ళని టీవీలో చూస్తే ఈ పెద్దాళ్ళకే బుద్దిలేదనిపిస్తుంది! తిరిగి మా పిల్లలకు లేదంటారు! మేం క్లాసుకు వెళ్ళినప్పుడు- బస్సు యెక్కినప్పుడు- డ్రిల్లుకు వెళ్ళినప్పుడు- యెప్పుడూ క్యూ పాటిస్తాం! మమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు కదా?

‘చూసిందే చూడలేక చస్తున్నాం’ అని అమ్మ విసురుగా వచ్చి రిమోట్ లాక్కుంది! ‘మేం మాత్రం చదివిందే చదవాలా’ అని మేం యిద్దరం నవ్వుకున్నాం! ‘మీ నవ్వులేంటే…’ అని యేడుపుగొట్టు సీరియళ్ళు పెట్టింది అమ్మ! చూసిందే చూసింది! ‘షూటింగులు ఆగిపోయాయి, సీరియళ్ళు బందు…’ అని నాన్న నవ్వుతుంటే ‘స్కూళ్ళు బందు’ అన్నట్టుగా ముఖా ముఖాలు చూసుకున్నాం!

స్కూలని ట్యూషన్లని టైంలేక టీవీ చూడడం లేదని చూడనివ్వడం లేదని చాలా బాధ పడ్డాం! కానీ టీవీ చూడడం యెంత బాధో యిప్పుడు చూసి అర్థం చేసుకున్నాం!

స్కూల్లో గంటగంటకూ బెల్లు మోగినట్టు- బెల్లు మోగకుండానే అమ్మ నాన్నా చేతులు కడుక్కోమన్నారు!

‘గవర్నమెంటు లాక్ డౌన్ ప్రకటించి చేతులు కడుక్కుంది’ అన్నారు తాతయ్య! మేమిద్దరం అర్థం కానట్టు ముఖాముఖాలు చూసుకున్నాం!

‘లేకపోతే విమానలమీద వైరస్ మోసుకురావడమేమిటి? కూలీ నాలీ రోడ్డున పడ్డమేమిటి?’ అని నాన్నమ్మ నొచ్చుకుంది!

‘చైనావాడు వాడింట్లో తింటే మనం మనింట్లో చెయ్యి కడుక్కున్నట్టు’ మావయ్య వాట్సప్ వదల్లేదు!

‘విమానం మీద వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఆపివుంటే…’ తాతయ్య చెప్పడం పూర్తీ కాలేదు, ‘పెసర మడిలో పడేసి పప్పుకుండలో దేవినట్టు వుంది’ అంది నాన్నమ్మ! ‘దేవినట్టు అంటే వెతికినట్టు’ అని అర్థం వివరించింది! ‘పెసరమడిలో పొలంలో పడేసి, వుడుకుతున్న పప్పుకుండలో వెతికితే అవుద్దా?’ అని మమ్మల్ని అడిగింది! 

‘ఏదయితేనేం అంటకుండా చేతులు కడుక్కొనే పీఠాలమీద వారున్నారు’ అని నాన్న!

‘చేతులు కడుక్కోండి’ అని అమ్మ!

అందరూ చేతులు కడుక్కోవడం వొక్కటి కాదని మాత్రం మాకర్ధంయ్యింది!!

– నీల, బాల (సిస్టర్స్)

అయిదవ తరవతి,

మండల ప్రాధమికోన్నత పాఠశాల.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.